Pages

Saturday, September 29, 2012

ఢిల్లీ మాయాజాలంలో తాజా ఘట్టం?



ఇంతకు ముందే రాజకీయ మాయాజాలం గురించి, సాగర హారం నేపథ్యం గురించి రాశాను.  మరోసారి టీవీ చూస్తే ఢిల్లీలో కెసిఆర్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిసినట్టు అవగాహన కుదిరితే సోనియాగాంధీని కూడా కలిసే అవకాశం వున్నట్టు స్క్రోలింగ్‌లు కనిపిస్తున్నాయి. అంటే ఢిల్లీ మాయాజాలం ఇంకా కొనసాగుతుందన్న మాట.ఒకవేళ గతంలో అసెంబ్లీ మార్చ్‌ ఆఖరి నిముషంలో వచ్చిన ప్రకటన తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందీ చూశాం. అలా జరుగుతుందని నేను ఆ డిసెంబర్‌ 10 ఉదయం చర్చలోనే(ఎన్‌టివిలో టిఆర్‌ఎస్‌ విద్యాసాగరరావు, అప్పటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మరొకరు వున్నారు) చిదంబరం ప్రకటన పాక్షికమనీ, చివరి వాక్యం కాదని చెప్పాను. ఇప్పుడు కూడా అలాటి ఒక నాటకీయ ప్రకటన లేదా వివరణ వచ్చినంత మాత్రాన విలువేముంటుంది? నిన్న గాక మొన్న విభజన సాధ్యం కాదని చెప్పిన ఆజాద్‌తో ఇప్పుడు మరో విధంగా చెప్పినా నమ్మడమెలా సాధ్యం? ఒక రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం ఇలా ఎపిసోడ్ల స్థాయికి పడిపోవడం నిజంగా విచార కరం. అభ్యంతరకరం కూడా. ప్రజలకు కావలసింది సాధికారిక సమగ్ర ప్రకటన తప్ప మంతనాలు, మంత్రాంగాలు కాదు. మాయాజాలం అసలే కాదు.

రాజకీయ మాయాజాలంలో రాష్ట్రం - సాగరహార నేపథ్యం


ఎట్టకేలకు సెప్టెంబరు 30 వ తేదీ తెలంగాణా మార్చ్‌కు ప్రభుత్వం అంగీకరించడం ఆహ్వానించదగినది. స్థలం మార్చుకోవడానికి, శాంతియుత నిర్వహణపై హామీ ఇవ్వడానికి జెఎసి అంగీకరించడమూ మంచిదే. ఆ ప్రకారమే సాగరహారం లేదా మార్చ్‌ శాంతియుతంగా జరగాలని ప్రతివారూ కోరుతున్నారు. ఇక ఈ మార్పులకు ముందు సాగిన రాజకీయ పరిణామాలు మరింత రసవత్తరమైనవి. ఆ పూర్వాపరాలు. అవి నేర్పే గుణపాఠాలు. వాటి వెనక వివిధ శక్తుల ప్రయోజనాల ప్రాకులాటలు. ఆవేశకావేశాలలో ఔచిత్యాలేమిటి? అరోపణలు ప్రత్యారోపణలలో నిజానిజాలేమిటి? ఎవరి విశ్వసనీయత ఎంత?
మొదటి విషయం- ఈ మొత్తం పరిస్థితికి కారణమైన కేంద్ర కాంగ్రెస్‌ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోకుండానే పావులు కదిలించగలిగింది. తెలంగాణా సమస్య లేదా రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయవలసిన బాధ్యత దానిది కాగా ఆ పనిచేయకుండా ఇతరులపై నెపం మోపి తప్పించుకున్నది. కేంద్రం రాష్ట్ర విభజనకు అంగీకరించి తెలంగాణా ఏర్పాటు చేయబోతున్నదంటూ ముహూర్తాలు కూడా ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో వాయిలార్‌ రవి తదితర నేతలతో నిగూఢ మంతనాలు సాగిస్తుండగానే ఆ వ్యాఖ్యలను వమ్ము చేసే మాటలు కాంగ్రెస్‌ నేతల నుంచి వెలువడ్డాయి. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల తరపున కాంగ్రెస్‌ నేతలే మాట్లాడుతూ వివాదం పెంచేందుకు కారకులయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజనకు ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఇప్పుడు వున్నదని తన కృష్ణా జిల్లా పర్యటనలో పిటిఐతో చెప్పారు. అ తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు హైదరాబాదులో సమావేశాలు జరుపుతూ మార్చ్‌ వివాదం పరిష్కారం చేస్తామన్న హామీలు ఇస్తుంటే జిల్లాల్లో అరెస్టులు అడ్డుకోవడాలు జరుగుతూనే వచ్చాయి.
శాంతియుత ప్రదర్శనకు తమకు అనుమతి ఇవ్వాలని జెఎసి నేతలు కోరుతుంటే ఒక పోలీసు అధికారి హింస జరుగుతుందన్న సూచనలు తమ దగ్గర వున్నాయని ఆందోళన పెంచే విధంగా మాట్లాడారు. విధ్వంసం చేస్తామంటూ మీడియాలో వచ్చిన కొన్ని ప్రకటనలు ఇందుకు తోడయ్యాయి. గత మార్చ్‌ సందర్భంలో ఘటనలూ వున్నాయి. ఏమైనా ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలన్న భావం బాగా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రితో తెలంగాణా మంత్రులు ఆయనతో మాట్లాడుతుండగానే డిజిపి మీడియా గోష్టి నిర్వహించి

Friday, September 28, 2012

మార్చ్‌కు అనుమతి మంచి పరిణామం



సెప్టెంబర్‌ 30న తెలంగాణా మార్చ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ అనుమతి లభించడం ఆహ్వానించదగిన విషయం. అన్ని పక్షాలూ పట్టువిడుపులు ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైంది. అదే సమయంలో తెలంగాణా సమస్యపై వివిధ పార్టీల ధోరణులేమిటో కూడా స్పష్టమై పోయింది. కనుక ఇప్పుడు జరగాల్సింది ప్రజాస్వామికంగా ఎవరి విధానాల మేరకు వారు ఉద్యమాలు చేయడమే. రాష్ట్ర విభజన వద్దని చెప్పే సిపిఎంతో సహా అందరూ ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలనే కోరారు. బహుశా మంత్రులు కూడా ఇంత సూటిగా బయిటకు రావడం ఇదే మొదటి సారి కావచ్చు. నిజానికి ఇలాటి కసరత్తు గతంలోనే జరిగివుంటే ఇంతటి ఉద్రిక్తత అవసరమై వుండేది కాదు. చివరలో కుదిరిన ఈ పరిష్కారం ఏ ఒక్కరి విజయమని భావించడం గాక తెలంగాణాతో సహా రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక సంప్రదాయాలకు మన్ననగా భావించాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని విధాల వివాదాలు సృష్టించినా విద్వేషాలు రగిలించినా రెచ్చిపోవడానికి ప్రజలు సిద్ధం కాలేదు. గతంలో చెప్పుకున్నట్టు ఈ దశలోనూ పలువురు నేతలు(పాలక పక్ష ఎంపిలతో సహా) కవ్వింపు వ్యాఖ్యలు చేయకపోలేదు. రెచ్చగొట్టేందుకు యత్నించక పోలేదు. అయితే చివరకు శాంతియుత వాతావరణం కాపాడుకోవలసిన అవసరాన్ని అందరూ గుర్తించడం ఆహ్వానించదగింది. తెలంగాణాపై కేంద్రం నుంచి ప్రతికూల ప్రకటనలు వచ్చినప్పటికీ దాన్నిబట్టి ఉద్యమాన్ని చిన్నబుచ్చే మాటలు మాట్లాడటం మంచిది కాదు. అలాగే తమ ప్రజాస్వామిక ఆకాంక్షను ఇతరులు గౌరవించాలంటే తాము కూడా సంయమనం పాటించాలని ఉద్యమ నేతలు గుర్తించాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే వారికి లభించిన ప్రజాస్వామిక మద్దతు సార్థకమవుతుంది. మొదటినుంచి మార్చ్‌కు అనుమతినిచ్చి శాంతియుతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న వ్యాఖ్యాతగా ఈ పరిణామాన్ని ప్రత్యేకంగా హర్షిస్తున్నాను.(చూడండి:ఆంధ్రజ్యోతి గమనం, 27.9.12)

నితిన్‌ గడ్కరీ నీతి బోధలకు మచ్చ



బిజెపి జాతీయ సమావేశాల్లో అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ అవినీతిపై పోరాటం గురించి బ్రహ్మాండమైన ప్రసంగం దంచుతున్నా ఒక మహిళా స.హ కార్యకర్త దానికి తూట్లుపొడించిందని చెప్పాలి.ఎందుకంటే మహారాష్ట్రలో బయిటపడిన 70 వేల కోట్ల ఇరిగేషన్‌ కుంభకోణం(మన జలయజ్ఞం వంటిది)పై పోరాడటానికి ఆయన వెనుకాడాడని ఒక ఆరెస్సెస్‌ అనుయాయి కూతురైన అంజలీ దమానియా వెల్లడించడం బిజెపిని చాలా ఇరకాటంలో పెట్టింది. దీనిపై బిజెపి నేతలే మొదట దుమారం లేవనెత్తినా తర్వాత రాజీ పడుతున్నారని తెలిసి ఆమె ఆయనను ఆగష్టు 14న కలిసి మాట్లాడారు. ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ అనే సంస్థకు చెందిన ఆమె సూచనలకు గడ్కరీ స్పందించకపోగా తనకు కూడా ఎన్‌సిపి నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయని వెల్లడించారు.దీంతో హతాశురాలైన అంజలీ దమానియా ఆ రోజునే ఆయన వైఖరిని ఖండిస్తూ ఒక ఎస్‌ఎంఎస్‌ పంపించారు. దేశం దేశ సేవ అనే మీరు ఇలా ఎలా చేయగలరని ఆమె ప్రశ్నించారు.ఆరెస్సెస్‌ దేశభక్తి సందేశం ఏమై పోయిందని నిలదీశారు. ఇదంతా జరిగి చాలా కాలమైనా పట్టించుకోని గడ్కరి తమ జాతీయ సమావేశాల సంందర్భంలో బయిటకు రావడంపై మాత్రం చాలా ఆగ్రహించారు. అంతా బయిటపెట్టింది తమ వారైతే ఈమె అనవసరంగా ఆరోపణలు చేస్తున్నదంటూ పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు బిజెపి నేతలు. చాలా కుంభకోణాలలో కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వాలు ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే వుంటాయి గాని అద్యక్షుని స్థాయిలో ఇది తీవ్రమైన అంశమే. గతంలో ఒక అద్యక్షుడు ముడుపులు తీసుకుని జైలుశిక్షకు గురయ్యారు గనక మామూలే అనుకంటే అది వేరే సంగతి!

Thursday, September 27, 2012

ప్రవీణ్‌ కుమార్‌ తిరుగుబాటు వెనక...



చంద్రబాబు లేఖపై తొలుతగా కినుక వహించి తిరుగుబాటు స్వరం వినిపించిన తంబళ్లపల్లి ఎంఎల్‌ఎ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి చర్య వూహించిందే. ఆయన మొదటి నుంచి రాష్ట్ర విభజనకు గట్టి వ్యతిరేకిగా వున్నారు. డిసెంబర్‌ 9 తర్వాత రాజీనామాలను సేకరించడంలోనూ ముఖ్యపాత్ర వహించారు.ఈ విషయంలో అవసరమైతే పార్టీని వదులుకోవడానికి కూడా వెనకాడబోనని తరచూ అంటుండే వారు. దానికి తగ్గట్టే లేఖ వచ్చిన వెనువెంటనే ధిక్కారానికి దిగారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు చంద్రబాబు లేఖ వల్ల తెలంగాణా ప్రాంతంలో విశ్వాసం కలిగించడానికి అక్కరకు రాదు గాని తక్కిన చోట్ల అసంతృప్తుల తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా వున్నాయి. దానికి తోడు జగన్‌ పార్టీ ఈ విషయంలో ఎప్పటి నుంచో కాచుకుని కూచున్నది. ఆ పార్టీ కూడా స్పష్టమైన వైఖరి తీసుకోకపోయినా ఉప ఎన్నికల విజయాలు సామాజిక సమీకరణాలు కలసి వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి కొంతమంది ఇలాగే వ్యవహరించే అవకాశం వుంది.

దామోదర రాజ నరసింహావతారం!



ఇప్పటి వరకూ తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల ప్రతినిధులుగా కాంగ్రెస్‌ తరపున చాలా మంది మా ట్లాడుతూ వచ్చారు. జానారెడ్డి నివాసంలో సమావేశమైన మంత్రులు కూడా సానుకూలస్వరం వినిపించినా సాత్వికంగానే మాట్లాడారు.అయితే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ మాత్రం వాళ్లందరిని మించిన తీవ్ర భాషణం చేశారు. తెలంగాణా నేతలు 56 ఏళ్లలో ఎనిమిదేళ్లు మాత్రమే పాలించారన్న వాస్తవాన్ని చెబుతూ ఈ కారణం చేత అన్యాయం జరిగిందనుకోవడం సహజమేనని సమర్థించారు. అయితే ఇది కేవలం పదవుల పంపకంలో మల్లగుల్లాల ఫలితమే తప్ప ప్రజలకు సంబంధించింది కాదని చెప్పాలి. తెలంగాణాకే చెందిన పి.వి.నరసింహారావు రాయలసీమలోని నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించినా రెండు ప్రాంతాలకూ వొరిగిందేమిటి? ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపిగా వున్నా జరిగిందేమిటి? నిజానికి లెక్క వేస్తే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులే అత్యధిక కాలం పాలించారు. అయినా ఇప్పటికీ ఆ ప్రాంతం వెనకబడే వుంది. కనక మారాల్సింది విధానాలే గాని విగ్రహాల మార్పుతో ఒరిగేది వుండదు.అయితే సమభావన రావాలన్నప్పుడు అన్ని కోణాలు కొలబద్దలూ కూడా పరిగణనలోకి తీసుకోవలసిందే. దామోదర రాజ నరసింహ కూడా భావి ముఖ్యమంత్రుల జాబితాలో వున్నారు గనక ఆయన మాటలలో చాలా అర్థాలు కనిపిస్తాయి. మిగిలిన వాటికన్నా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించడం ప్రాదాన్యత లేకుండా పోదు. ఏమైనా అందరూ కోరుతున్నట్టుగా తగు కట్టుదిట్టాలతో అనుమతినిచ్చి ప్రశాంతంగా మార్చ్‌ముగిసిపోవడంపై దృష్టి పెడితే మంచిది. లేకపోతే ఇది కూడా అసంతృప్తికి ఆజ్యం పోసి పరిస్తితి మరింత దిగజారడానికి కారణమవొచ్చు.

లేఖతో స్పష్టత కాదు, క్లిష్టతే!



తెలంగాణా సమస్యపై చంద్రబాబు లేఖ రాసి స్పష్టత ఇస్తారన్న ప్రచారాన్ని నేనెప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. నిజానికి దానివల్ల క్లిష్టత, నష్టతలే ఎక్కువని కూడా సరదాగా అనేవాణ్ని. ఇటీవల కేంద్రం అఖిలపక్షం గురించి సంకేతాలు వదిలిన తర్వాత అది వుండకపోవచ్చని తెలుగు దేశం నేతలతో గట్టిగానే వాదించాను. ఒక మాజీ మంత్రి అయితే మరుసటి రోజు కలుసుకున్నప్పుడు బాబు నిజంగానే స్పష్టమైన లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మరీ మరీ చెప్పారు. ఆ మరుసటి రోజున మరో ప్రాంతానికి చెందిన మరో ప్రజా ప్రతినిధి లేఖ వల్ల లాభముంటుందా అని అడిగారు. నిజంగా ఏదీ స్పష్టంగా చెప్పే స్తితి లేనప్పుడు ఈ లేఖల ప్రహసనమంతా దేనికని కూడా అన్నాను. నిన్న రాత్రి పొద్దుపోయాక ఇంకా చెప్పాలంటే ఆజాద్‌ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత చంద్రబాబు విడుదల చేసిన లేఖ ప్రతి నేను వూహిస్తున్నంత వరకైనా వెళ్లలేదు.అఖిలపక్ష సమావేశం వేస్తే చెబుతామని చెప్పడం తప్ప ఇందులో చెప్పిందేమీ లేదు. నిజానికి అఖిలపక్షం అనవసర కాలయాపన గనక వెంటనే కేంద్రం నిర్ణయం ప్రకటించాలన్నది ప్రతిపక్షాల సాధారణ కోర్కెగా వుండింది. చంద్రబాబు లేఖతో ప్రధాన ప్రతిపక్షమే అందుకు అభ్యర్థించినట్టయింది. (బహుశా ప్రధాని ఎదరు దాడి లేఖ రాసేందుకు ఇది అవకాశమైనా కావచ్చు) అప్పటికి అక్కడ ఏం చెబుతారనేది అస్పష్టంగా అట్టిపెట్టేశారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించడం పెద్ద విసయమేమీ కాదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన సంగతే. ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడి వుంటామని అంటే అదో తీరు గాని అదీ లేదు. గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు విలువేమీ లేదు. అసలాయనే రాష్ట్రపతి భవన్‌లో కూచున్నారు. దాన్ని వెనక్కు తీసుకోలేదని పదే పదే చెప్పుకోవడం కూడా అర్థం లేనిదే. ఎందుకంటే ఆ అవకాశం ఎలానూ వుండదు. రాజకీయంగానూ దాన్నుంచి వెనక్కు మళ్లినట్టు చెప్పుకునేట్టయితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది గనక అదీ అసంభవమే. ఈ లేఖ వల్ల తెలంగాణాలో తెలుగు దేశం పుంజుకొంటుందని విశ్వసనీయత పొందుతుందని అనుకోవడం అతిశయోక్తి అంచనా అవుతుంది. ఆ లాభం సంగతి ఎలా వున్నా రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ దాడికి తెలుగుదేశం గురి కావలసి వుంటుంది. స్పష్టమైన విధానం చెప్పి లాభనష్టాలను ఎదుర్కోవడం ఒక పద్ధతి. ఇక్కడ స్పష్టత లేకుండా వున్నట్టు కనిపించాలనుకోవడమే సమస్యలకు దారి తీస్తున్నది. తమపై కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు అంటారు. అయితే అస్పష్టతకు అది సమర్థనమెలా అవుతుంది? ప్రత్యర్థుల కుట్రలునూ దాడులను ఎదుర్కోవడం ప్రతిపార్టీకీ వుండే సమస్యే. ఆ మాటకొస్తే వారు కూడా ఆ పార్టీల పట్ల అభిమానంగా ఏమీ వుండబోరు కదా.. ఇప్పుడు చంద్రబాబు స్వంత జిల్లాలో ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో మొదలైన నిరసనలు ఆయనతోనే ఆగకపోవచ్చు. అలాగే తెలంగాణాలోనూ అసంతృప్తి ఆగకపోవచ్చు.

Wednesday, September 26, 2012

ఆజాద్‌ వ్యాఖ్యల అంతర్యం?



తెలంగాణా మార్చ్‌పై ప్రభుత్వం, జెఎసి తలో వైపునుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల నిపుణుడు గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడింది.గతంలో చత్తీస్‌ఘర్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌లను మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల నుంచి విడదీసినప్పటి స్థితికీ తెలంగాణా విభజన కోర్కెకూ పోలిక లేదన్నది ఆయన వాదన సారాంశం. అది మొదటి నుంచి తెలిసిన విషయమే. నిజానికి అవి ఫ్రధానంగా గిరిజన లేదా పర్వత ప్రాంతాలతో కూడిన చిన్న రాష్ట్రాలు. ఒక దశలో లాలూ యాదవ్‌ వ్యతిరేకత తెలిపినా తర్వాత తన పునాది బలహీనపడిందని గ్రహించి తలవొగ్గారు. మిగిలిన చోట్ల ఆ మాత్రం ప్రలికూలత కూడా లేదు. జార్ఖండ్‌ కోసం వంద ఏళ్ల ముందు నుంచి ఉద్యమం వుంది. వాటితో పోలిస్తే తెలంగాణా సమస్య భిన్నమైందే కావచ్చు. అయితే ఈ విషయాలన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు చెప్పడమే హాస్యాస్పదం. డిసెంబర్‌ 9 ప్రకటన తరుణంలోనూ తర్వాత కూడా కేంద్రానికి ఇవన్నీ తెలియదా?తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఇక్కడ ఏకాభిప్రాయం లేదన్న పల్లవి చాటున దాక్కోవడం ఎందుకు? పోనీ ఇదైనా తుది ప్రకటనగా స్పష్టంగా చెప్పేస్తారా అంటే అదీ వుండదు. ప్రజల స్పందన తీరు తెన్నులు గమనించి మళ్లీ సవరణలూ సన్నాయినొక్కులు మొదలెడతారు. నిజానికి కేంద్రం నుంచి ఏవో సంకేతాలు వస్తున్నాయన్న ప్రచారాలు అంచనాలు ఆదార రహితాలని నేను చాలా సార్లు రాశాను. ఇప్పుడు నేరుగానే చెప్పేశారు. అయితే కావలసింది ఇలాటి అరకొర వ్యాఖ్యలు కావు. అధికారిక నిర్ణయాత్మక ప్రకటన. అప్పుడే ప్రజలు ప్రాంతాలు తమ భావాలను బట్టి స్పందిస్తారు. అనిశ్చితి బెడద పోతుంది.

ప్రశాంతంగా మార్చ్‌- ప్రభుత్వం, జెఎసిల బాధ్యత



29న వినాయక నిమజ్జనం, మొదటి తేదీ నుంచి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వున్న దృష్ట్యా వాయిదాను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదే సమయంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అవరోధాలు కల్పించడం జరుగుతున్నది. పోలీసులూ అనుమతి నిచ్చేది లేదని తేల్చేశారు. నిజానికి ఈ సమస్యల సాచివేత, సమాధానాల దాటవేత, సమీకరణల అణచివేత అవాంఛనీయ పరిణామాలకు దారి తీసిన అనుభవాలు గతంలో వున్నాయి గనక అంతకంటే విజ్ఞతతో ప్రభుత్వం వ్యవహరించాల్సి వుంటుది. అనుభవాల నేపథ్యంలో ఈ మార్చ్‌ను నిరాటంకంగా శాంతియుతంగా జరగనివ్వడమే మంచిది. అదేసమయంలో నిర్వాహకులు కూడా తమవైపునుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. గణేష నిమజ్జనం సమయంలో మామూలుగానే హైదరాబాదులో ఉద్రిక్తత అందరికీ తెలుసు. జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తాము గాంధేయ పద్ధతులలో జరుపుతామని అంటున్నా గతంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంస ఘటనలు, ఇటీవలి కొన్ని వ్యాఖ్యలు సందేహాలకు అవకాశమిస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, హైదరాబాదులో జరిగిన కొన్ని విధ్వంసక ఘటనలు, కొందరు నేతల ప్రకటనలు ఉద్రిక్తత పెంచేవిగా మారాయి. కేంద్రం ఉద్దేశపూర్వకంగా చెలగాటమాడుతున్నప్పుడు సంయమనం పాటించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుంటుంది. ప్రత్యేకించి తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక వారసత్వానికి మచ్చ తెచ్చే ఎలాటి చర్యకు లేదా మాటలకూ ఎవరూ పాల్పడకూడదు. ఈ సమయంలో ఎంతో బాధ్యతగా వుండాల్సిన మంత్రులతో సహా కాంగ్రెస్‌ నాయకులు తలో వైపున మాట్లాడుతూ ఉద్రిక్తల వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. ప్రాంతాల వారిగా వర్గాల వారిగా సమావేశాలు,ఢిల్లీ యాత్రలు జరుపుతూ తామే వివాదం పెంచుతున్నారు. నిజానికి ఒకే ప్రాంతం వారు కూడా వేర్వేరు శిబిరాలుగా విడిపోతున్నారు. తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.ఈ సంకుచిత వ్యూహాలు కట్టిపెట్టి ప్రజా శ్రేయస్సు ప్రశాంతత కోణంలో వ్యవహరిస్తే చాలా మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్రను సవ్యంగా నిర్వహిస్తే అన్ని ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు.

Tuesday, September 25, 2012

కేంద్రం దాటవేత- పెరుగుతున్న ఉద్రిక్తత



మంగళవారం సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణా సమస్యను చర్చించలేదని అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది ప్రకటించారు. నిన్న మరో ప్రతినిధి మనీష్‌ తివారి కూడా ఈ సమస్య ఇప్పుడే తేలేది కాదని అన్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వాయిలార్‌ రవిని కలుసుకున్న తర్వాత ఆయన కూడా అదే రీతిలో మాట్లాడారు. కనక కేంద్రం నుంచి ఏదో కీలకమైన ప్రకటన రాబోతున్నదనే అంచనాలు నిజం కాదని అర్థమవుతున్నది. ఈ సమయంలో 30 వ తేదీ మార్చ్‌పై ఉత్కంఠ పెరుగుతున్నది. వాయిదా వేయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిర్వాహకులైన జెఎసి నేతలు, చైర్మన్‌ కోదండరాం మరింత గట్టిగా దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తామంటూనే అనేక అస్త్రాలున్నాయని ప్రకటిస్తున్నారు. ఏ పార్టీ అయినా తమ యాత్రకు మద్దతు తెలియజేయకపోతే వూరుకోబోమని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఢిల్లీ దృశ్యం మాత్రం కోదండరాం మాటల తీవ్రతకు తగు రీతిలో కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రదర్శకులు పోలీసులలో ఎవరు పై చేయి సాధిస్తారేది ఎలా వున్నా పరిస్తితి మాత్రం అనవసరంగా ఉద్రిక్తమవుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాలు తెలిసిపోతున్నప్పుడు ప్రజలు ప్రాంతాల మధ్య వివాదం రగిలించే ప్రకటనలు బెదిరింపులకు పాల్పడే వారి పట్ల కోదండరాం కఠినంగా వుండాలని చెప్పాల్సి వుంటుంది. తను చెబుతున్న శాంతియుత వాగ్దానాలను వమ్ము చేసే వారి వారి పట్ల ఉపేక్ష వహించడం అలాటి వ్యాఖ్యలకు ఆస్కారమివ్వడం పొరబాటు సంకేతాలు పంపిస్తుంది. నా ఉద్ధేశంలో ఏ ప్రాంత ప్రజలూ అవాంఛనీయమైన ఉద్రిక్తత కోరుకోవడం లేదు. పైగా హైదరాబాదుకు చాలా సమస్యాత్మకమైన గణేష నిమజ్జనం సందర్భం గనక ఉభయ పక్షాలూ చాలా అప్రమత్తంగా బాధ్యతగా వుండక తప్పదు.

చంద్రబాబు యాత్రసన్నాహాలు - తెలుగు దేశం అంచనాలు



రాజకీయాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు పరాజయాలు వెంటాడుతున్నప్పుడు నాయకుడు అస్తిత్వ సవాలును ఎదుర్కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అలాటి స్థితి అందరూ ఏదో ఒక దశలో ఎదుర్కొన్నవారే. కాకపోతే పుట్టిన వెంటనే అధికారంలోకి వచ్చి తర్వాత కూడా గణనీయమైన కాలం పాలించిన తెలుగు దేశం రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే గాక ఆ తర్వాత వరుసగా వచ్చిన అరవై ఉప ఎన్నికల్లోనూ ఒక్కసారి కూడా విజయం చూడలేక పోవడం పెద్ద సవాలే. ఇదే గాక తెలంగాణా సమస్యపై తర్జనభర్జనలు కూడా కాదనలేని నిజమై ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. అటు కాంగ్రెస్‌ ఇటు టిఆర్‌ఎస్‌ కూడా దాడిని తనపై కేంద్రీకరిస్తుంటే ఇదమిద్దంగా చెప్పలేని స్తితిలోనే ఎక్కువ కాలం వుండిపోయింది.ఈ క్లిష్టతకు విరుగుడుగా స్పష్టత ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నా పరిస్తితి మరింత క్లిష్టమవుతూనే వుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా ఇప్పుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర ప్రకటనతో పాటే ఆ స్పష్టతా ఇచ్చేస్తామంటున్నారు. అయితే అంత మాత్రాన విశ్వసనీయత వస్తుందా విఘాతమే కలుగుతుందా అన్నది ఆ పార్టీ నేతలలో సందేహంగానే

Monday, September 24, 2012

ఊహించినట్టే ఉద్రేకాల వ్యాప్తి వ్యూహం



ఊహించినట్టే ఉభయ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ నేతలే ఉద్రేకాల వ్యాప్తికి సిద్ధమయ్యారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అనేకసార్లు చేతులు కలిపిన వారే ఇప్పుడు హఠాత్తుగా రెండు శిబిరాలమన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోటాపోటీగా అధిష్టానాన్ని కలుస్తూ సమావేశాలు జరుపుతూ తామే రెండు పాత్రలూ జయప్రదంగా పోషిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క పక్షం వారు బెట్టుచేసినా అధిష్టానం ఇంతకాలయాపన చేసే అవకాశమే వుండేది కాదు. మమతా బెనర్జీ ఉపసంహరణ తర్వాత అస్తుబిస్తుగా మారిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం వీరికి చాలా వున్నా ఎందుకు చేయలేదు? కుండలో అన్నం కుండలోనేవుండాలి కుర్రాడు భీముడు కావాలన్నట్టు ప్రభుత్వాలు పదిలంగా వుండాలి ప్రాంతాలు మాత్రం పంతాలతో రగిలిపోవాలన్నది కాంగ్రెస్‌ నేతల పాచికగా కనిపిస్తుంది. నిన్న మొన్న సంకేతాల భాషలో మాట్లాడిన వారు ఇప్పుడు సమరశంఖాలు పూరించుతున్నారంటే దాని వెనక మతలబులేమిటో ప్రతివారూ ఆలోచించాలి. ఇందులో ఒక పక్షం నిజాయితీ ఎక్కువ మరో పక్షం తక్కువ అనే మీమాంసకు అస్కారమే లేదు. ఇది ఈరోజునే వచ్చిన సమస్యా కాదు. తమలో తాము కలహించుకున్నట్టు కనిపించి ప్రజల మధ్య చిచ్చుపెట్టడం గందరగోళ పర్చడం తర్వాత చేతులు కలపడం గతంలో చాలా సార్లు జరిగింది. ఇప్పుడూ జరుగుతుంది. ఈ మాయాజాలం కన్నా కేంద్రంపై నిజంగా వత్తిడి చేసి ఏదో ఒక నిశ్చితమైన ప్రకటన చేయిస్తే గాని వీరి విన్యాసాలను విశ్వసించడానికి లేదు. తన గజిబిజిలో తానున్న తెలుగు దేశం గాని, జగన్‌ జైలు వ్యవహారంలో మునిగివున్న వైఎస్‌ఆర్‌ పార్టీ గాని,సంకేతాల సంధిగ్ధంలో చిక్కిన టిఆర్‌ఎస్‌ గాని ఇప్పుడు చేయగలిగింది పరిమితం. ఈ సమయంలో ప్రజలే ప్రభుత్వాలను నిలదీయాలి. తమ మధ్య తంపులు పెట్టాలని చూసే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. ప్రాంతాలు విడిపోవాలన్న కోర్కె వుండొచ్చు గాని ప్రజలు విడిపోతారని విడగొట్టగలమని అనుకునే వారికి పాఠం నేర్పేలా ప్రశాంతతను కాపాడుకోవాలి. గతంలో అనేకసార్లు అనేక మంది దుందుడుకుగా మాట్లాడినా ఏ ప్రాంత ప్రజలూ స్పందించకుండా అన్ని ప్రాంతాల ప్రజలూ సహనం చూపించారు. ఇప్పుడు కూడా అదే సంయమనం పాటించితే స్వార్థపర శక్తుల కుటిలత్వాలు కుప్పకూలక తప్పదు. కోదండరాం కూడా ఒకటికి రెండు సార్లు శాంతియుతంగా గాంధేయ మార్గంలో అని చెబుతున్న జెఎసి అద్యక్షుడు ప్రొపెసర్‌ కోదండరాం అందుకు భిన్నంగా వెలువడే వివాదాస్పద విధ్వసంకర వ్యాఖ్యలతో ఘటనలతో విడగొట్టుకోవాలి. ప్రభుత్వం కూడా మరింత చొరవగా వ్యవహరించి పరిస్థితి చేయిదాటిపోకుండా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన కోసం కేంద్రం వెంటపడి వెంటనే తెప్పించాలి. పాలక పక్ష ఎంపిలు ఆ దిశలో కేంద్రంపై దృష్టి కేంద్రీకరించే బదులు పరస్పరం దూషించుకుంటూ పక్క దోవ పట్టించడం తగని పని.

Sunday, September 23, 2012

వేదాంతం వెనక వేయి వెతలు



తెలిసేట్టు చెబితే సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం అని రాశాడెప్పుడో ఆత్రేయ. మాది జాతీయ పార్టీ సిద్దాంతాల ప్రకారం నడుస్తుందని కాంగ్రెస్‌ నాయకులంటుంటారు గాని నిజానికి ఢిల్లీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో వారెవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే మా లాటి వాళ్లను కూడా మీకున్న సమాచారమేమిటని కొందరు అడుగుతుంటారు. ఇప్పుడు తెలంగాణా సమస్య, ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం అలానే వున్నాయి. ఏదో జరుగుతుందని వీరందరికీ తెలుసు గాని ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏది ఎంత కాలం వుండేదీ అస్సలు అస్సలు తెలియదు. ఇలాటప్పుడే వేదాంతం పుట్టుకొస్తుంది. అందులోనూ మెట్టవేదాంతానికి పెట్టింది పేరయిన భారత దేశంలో సమస్యేముంది? శనివారం నాడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో వేదాంత ధోరణిలో మాట్లాడారంటే ఇలాటి పరిస్థితులే కారణం అనేది స్పష్టం.

The Temerity Of A Prime Minister and One who took of the shirt



        Manmohan sing is right. Money won’t grow  on trees.But it do on corporate trees. 2G’S and coal gates for instance. Don’t forget even for a second that half the population of this country sweating day and night to make both ends meet. Middle class and even those considered rich have to face many a challenge to protect their savings. It is only the super rich that is exemted and even pampered.  Yet our PM has the temerity to comment like that and in the process enlisted many half truths and untruths. Statistics galore to prove that but not necessary. May be one is over enthusiastic inserving the cause of corporate India and MNC’S abroad. But there are limits of hypocrisy.  If a lawyer registered his protest in an unusual way it is not surprising but a consequence of non sensitive regime. One may note the comments made in THE HINDU,INDIAN EXPRESS  and also by eminent economists like Prabhat Patnayak , C.P.Chandra sekhar and others. If a govt is unmoved by nation wide protest  … then  somebody  may take  off  his shirt.. in fact it is the govt that is caught pants down!  Bravo..

Saturday, September 22, 2012

తేలిపోయిన తృణమూలాలు!

.
ఏదో ఒక విధమైన సంచలన చర్యతో దేశాన్ని ఆకర్షించాలని ముఖ్యంగా స్వరాష్ట్రంలో పునాది నిలుపుకోవాలని తంటాలు పడే తృణమూల్‌ అధినేత్రి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం తేలిపోయింది. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐల ప్రవేశానికి వ్యతిరేకంగా మంత్రివర్గం నుంచి తప్పుకోవడం గొప్పగా చెప్పుకుంటున్న ఆమె పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో అదే అనుకూలంగా వాగ్దానం చేసినట్టు వెల్లడైంది. ప్రణాళిక 43 వ పేజీలో 42 పేరాగ్రాఫులో ఈ అంశం పొందుపర్చి వుంది. చిల్లర వ్యాపారంలోకి దేశ విదేశీ పెట్టుబడులు రప్పించడం జరుగుతుంది అని ఆ ప్రణాళికలో తృణమూల్‌ వాగ్దానం చేసింది. నాటి వారి మిత్రపక్షం కాంగ్రెసూ, నేటికీ ప్రధాన ప్రత్యర్థి మాజీ పాలకపక్షం సిపిఎం వామపక్ష ఫ్రంట్‌ ఈ వాస్తవాన్ని బయిటపెట్టిన తర్వాత- ఖచ్చితంగా చెప్పాలంటే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తృణమూల్‌ వెబ్‌సైట్‌లో ఈ పేరాగ్రాఫు మాయమైంది! దీనికి మమత వివరణ మరింత తమాషాగా వుంది. ముసాయిదాలో వున్న ఆ భాగాన్ని తర్వాత మార్చామని మొదట పాఠమే వెబ్‌సైట్లో పెట్టేశామని అతకని సమర్థనకు దిగారు. అసలు కేంద్ర మంత్రివర్గంలో ఈ నిర్ణయానికి ఆమెపార్టీ వారు ఆమోదం తెలిపారని కేంద్ర ప్రతినిధులు ప్రకటించారు. డీజిల్‌ ధరల పెంపు కూడా పలుసార్లు జరిగింది తప్ప కొత్త కాదు. అందువల్ల మమతా బెనర్జీ నిర్ణయానికి ఇతరేతర కారణాలున్నాయి. ముఖ్యమైంది త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికలు. గతంలోనూ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల కోసం 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి ఏదో సాకుతో వైదొలగి ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత మళ్లీ వెళ్లిచేరారు. ఇప్పుడు కూడా అదే జరగదని గ్యారంటీ ఏమీ లేదు.

తెరచాటు వ్యూహాలు- తెగని వూహాగానాలు



పాలక పార్టీలు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీ ఏ విషయాన్నయినా వ్యూహాత్మకంగా గందరగోళ పర్చడంలో ఎంతగా ఆరితేరిందీ తెలంగాణా రాజకీయాలు మరోసారి కళ్లకు కట్టి చూపిస్తున్నాయి. తెలంగాణా దాంతో పాటు మొత్తం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయనేదానిపై సూటిగా పారదర్శకంగా వ్యవహరించేబదులు తెరచాటు మంతనాలు జరుపుతూ ఎడతెగని వూహాగానాలకు ప్రజలను ప్రాంతాలను గురి చేయడమవుతున్నది.టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సెప్టెంబరులోగా రాష్ట్ర విభజన జరిగిపోతుందన్నట్టు అంచనాలు ఇచ్చి ఆ పైన సుదీర్ఘ మంతనాలలో మునిగిపోయారు. ఇందుకు భిన్నంగా మధుయాష్కి వంటి తెలంగాణా ఎంపిలు తాము అలాటిదేమీ ఆశించడం లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే తెలంగాణా ప్రాంత మంత్రులు ఎంఎల్‌ఎలు సోనియా గాంధీకి లేఖలు రాయడం ద్వారా ఇంకా ఏమీ తేలలేదన్న భావనకే అస్కారం ఇస్తున్నారు. దీనిపై ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే లగడపాటి రాజగోపాల్‌ వంటి వారు పరిపరివిధాల మాట్లాడి ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కెసిఆర్‌ను కలుసుకున్న తర్వాత సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా తెలంగాణా ఇప్పుడే వస్తుందన్న నమ్మకం కలగడం లేదని అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పైరవీల ద్వారా వచ్చే అవకాశం కూడా లేదని ఆయన పరోక్షంగా కెసిఆర్‌ శైలితో విడగొట్టుకున్నట్టు విశ్లేషణలు వినిపించాయి.ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శాసనసభలో తెలంగాణా తీర్మానం పెట్టే అవకాశం లేదని తేల్చిచెప్పడమే

ధర్మాన చర్చలేమిటి? మంత్రుల వొత్తిళ్లేమిటి?



నైతిక కారణాల వల్ల సిబిఐ ఛార్జిషీటు దాఖలైన వెనువెంటనే రాజీనామా చేశానన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం ఇంకా కొనసాగుతున్నతీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన వుండబోనని గట్టిగా అంటే ఎవరూ కొనసాగించలేరు. తను రాజీనామా చేయడం, అది ఆమోదించకపోవడం ఇదంతా ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం జరగాలని ఆయన భావించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఆయనపై ప్రత్యేక ఆసక్తి లేకున్నా అధిష్టానం అనుమతి లేనందున ఆమోదించకుండా అనిశ్చితంగా అట్టిపెట్టారు.అసలు రాష్ట్రమే అనిశ్చితంగా వున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు కదా... అంతవరకూ బాగానే వుంది గాని ఇప్పుడు కోర్టు సమన్లు విచారణ మొదలవుతున్న తరుణంలోనైనా నిర్ణయం ప్రకటించకపోవడం ఆయన కలసి లేఖ సమర్పించడం దానిపై పరిశీలన ఇదంతా మరీ ప్రహసనంగా మారింది. మరో మంత్రి పార్థసారథి రాజీనామాకు తిరస్కరించితే తాను సిద్ధమైనట్టు ధర్మాన చెప్పుకోవచ్చు గాని నిజానికి రెండూ ఒక్కటే. పైగా నోటీసులు అందుకున్న మంత్రి వర్యులు వాటి లోతుపాతులు తేల్చేందుకు న్యాయ విచారణ ఉత్తర్వులివ్వాలని ముఖ్యమంత్రిపై వత్తిడి తెస్తున్నారన్న కథనాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే స్వయంగా న్యాయస్థానమే పిలిస్తే వెళ్లి న్యాయం కోరే బదులు మరో విచారణ తతంగం దేనికి? ఆఖరి క్షణం వరకూ అనివార్యంగా తొలగించబడే వరకూ పదవులలో కొనసాగడానికి తప్ప! కాగా వారి విషయంలో అధికారికంగా ఏమీ అనలేని ముఖ్యమంత్రి అసహాయత కూడా దాచేస్తే దాగనిదే.

Friday, September 21, 2012

టిఆర్‌ఎస్‌ విలీనం వార్తల నేపథ్యం



కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనమవుతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా బలంగా చలామణి అవుతున్నాయి. వీటి వెనక ఎవరున్నారనేది ఒకటైతే రెండు పార్టీలూ వీటిని ఖండించేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే ఆసక్తి కలిగించే అంశం. మాది తెలంగాణా సాధన అనే ఏకాంశ పార్టీ గనక అందుకు అంగీకరిస్తే విలీనానికి అభ్యంతరమేమిటన్నది టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలే చాలా సార్లు అన్నారనడానికి ఈ బ్లాగరు కూడా సాక్షి. ఇటీవలి పది రోజులలోనూ కాంగ్రెస్‌ నేతలే అనేక ప్రతికూల ప్రకటనలు చేసినా కెసిఆర్‌ మాత్రం ఆ పార్టీపై అంతులేని విశ్వాసం వెల్లడిస్తూనే వున్నారు. నమస్తే తెలంగాణా పత్రికలోనూ ఆ విధమైన కథనాలే నిత్యం ప్రత్యక్షమవుతున్నాయి. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, వాయిలార్‌ రవి, షిండే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి అందరి వ్యాఖ్యలూ ప్రతికూల దిశలో వున్నప్పుడు టిఆర్‌ఎస్‌ ఆశాభావానికి ఆధారాలు తెలియదు. ఇక పోతే కెసిఆర్‌ తనను కలిసిన విషయంలోనూ విలీనంపైనా కూడా వాయిలార్‌ రవి కాస్త పలచనగా మాట్లాడినా స్పందన కరువైంది. ఆ తర్వాత ఏకంగా అఖిలపక్ష సమావేశం సంకేతం మళ్లీ మొదటికి తెచ్చింది. ఏదో జరగబోతుందని కావాలని కథనాలు గుప్పించడం వెనక 30 వ తేదీ మార్చ్‌ ని మెత్తబర్చేప్రయత్నమే వుందన్నది స్పష్టమవుతుంది. ఇలాటి చిట్కాలు గతంలో చాలా జరిగాయి. డిసెంబర్‌ 9 ప్రకటన గురించి ముఖ్యమంత్రిని అడిగితే 1969లో కూడా ఇందిరా గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు.తెలంగాణా విభజనపై జరుగుతుందనే నమ్మకం లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శిసురవరం సుధాకరరెడ్డి కెసిఆర్‌తో మాట్లాడిన తర్వాతనే చెప్పారు. హైదరాబాదులో నన్ను కలిసిన టిఆర్‌ఎస్‌ నేతలు, మీడియా మిత్రులు కూడా కెసిఆర్‌ ధోరణిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే వున్నారు.ఒక చిన్న భాగం మాత్రమే ఆయన విశ్వాసంలో పాలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌ మరోసారి మాయచేస్తే మన గతి ఏమిటని గులాబీ నేతలు అడుగుతున్నారు. హరీష్‌ రావు వంటి ప్రముఖ నాయకుడు కొంత వరకూ స్వంత వ్యూహంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. ఈ మల్లగుల్లాల మధ్య గురువారం ఎన్‌డిటివి విలీనం వార్తను విడుదల చేసింది.శుక్రవారం ఫ్రధానంగా హెచ్‌ఎం టివీ నా వ్యాఖ్యలు కోరితే వాటిలో ఆశ్చర్యం లేదన్నాను. ప్రజారాజ్యం ను కలుపుకొన్నట్టే ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను కూడా కలిపేసుకోవాలన్న కాంగ్రెస్‌ పాచిక పారుతున్నట్టే చాలా మంది భావిస్తున్నారు. వాస్తవంగా ఏమవుతుందో చూడాలి.

వాల్‌ మార్ట్‌ - అక్కడ మూత.. ఇక్కడ మోత!


తన పాలక కూటమి భాగస్వాములే సమర్థించలేకపోతున్న నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిస్సంకోచంగా ఆకాశానికెత్తేస్తున్నారు. బలహీనుడని చాలా మంది పొరబాటుగా అభివర్ణించే ప్రధాని నిజానికి అమెరికా ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి వీర కేసరిగా విజృంభిస్తాడని అణు ఒప్పందం సమయంలోనే రుజువైంది. ఎప్‌డిఐ వ్యవహారం దానికి కొనసాగింపే.
విచిత్రమేమంటే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని ప్రకటించి వాల్‌మార్ట్‌ వంటి వాటికి ఆహ్వానం పలికిన రోజునే న్యూయార్క్‌లో అతి పెద్దదైన వాల్‌మార్ట్‌ దుకాణానికి తాళం పడింది.అట్లాంటా సిటీస్‌ అనే ప్రముఖ వెబ్‌పత్రిక ఆ రోజున ఇలా శీర్షిక ఇచ్చింది:'మృత్యు విహారం: వాల్‌ మార్ట్‌ తాకిడికి చిల్లర దుకాణాలు దుంప నాశనం' అని పేర్కొంది
జూన్‌ 30న అమెరికాలోని మరో సంపన్న నగరం లాస ్‌ఏంజల ్‌్సలో వేలాది మంది ప్రజానీకం ' వాల్‌మార్ట్‌ అంటే దారిద్య్రం అని నినాదాలిస్తూ పెద్ద ప్రదర్శన చేశారు.అంతకు ముందు రాజధాని వాషింగ్టన్‌ డిసిలో మరో ప్రదర్శన జరిగింది. వాల్‌మార్ట్‌ వద్దు వద్దు అన్నది ఇప్పుడు అక్కడ పెద్ద నినాదంగా మార్మోగుతున్నది. వాల్‌మార్ట్‌

Monday, September 17, 2012

అఖిలపక్షం పేరిట మళ్లీ అనిశ్చితమే!


తెలంగాణా సమస్యపై కేంద్రం పరిష్కారం ప్రకటిస్తుందని ఇప్పటి వరకూ వినిపించిన కథనాలకు అఖిలపక్ష సమావేశం జరపాలని ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి పొంతన లేదు. ఈ పేరిట కాలయాపన చేయడానికి పాచికలు వేస్తున్నట్టు కనిపిస్తుంది. కెసిఆర్‌ సెప్టెంబర్‌ గడువు ఎలాగూ దాటి పోతుంది. ఆ లోగా సమావేశం జరుపుతారా అన్నదే సందేహం. నాలుగు ప్రధాన పార్టీలు అభిప్రాయం చెప్పలేదని మాజీ హొం మంత్రి చిదంబరం చెప్పిన నాటి పరిస్థితికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఏకాభిప్రాయం లేదని మొన్న మొన్న ప్రధాని చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనే వుంది.ఇవన్నీ సర్దుబాటై అన్ని పక్షాలు ఒక్క మాట చెప్పడం ఆచరణలో జరిగేది కాదని అందరికీ తెలుసు. అందుకే నెపం రాష్ట్రంలో పార్టీల పైన పెట్టి రాజకీయం నడిపేందుకే ఈ అఖిలపక్ష ప్రహసనం పునరావృతం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా కమిటీ జరిగినప్పుడు ఇంకా పార్టీలు కొత్తగా చెప్పేది వుంటుందని ఆశించలేము. తెలుగు దేశం లేఖ ఇస్తుందని చాలా ప్రచారం జరిగినా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మాట్లాడి చెబుతాననే అంటున్నారు. రెండు కాంగ్రెస్‌ల వైఖరి డిటోగా వుంది. మజ్లిస్‌ వ్యతిరేకంగానే వుంది. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎలాగూ ఎవరి వైఖరి వారు ప్రకటిస్తారు. కనక గత అనుభవాలను బట్టి చెప్పాలంటే అఖిలపక్షం అన్నది లాంచనమే తప్ప పరిష్కారానికి దారి తీసేది కాదు. సత్వర పరిష్కారానికి మార్గం అంతకన్నా కాదు. తమకు డెడ్‌లైన్లు చెల్లబోవని వాయిలార్‌ రవి బల్లగుద్ది చెప్పడం నిజానికి వాటిని ప్రకటించిన వారికి సమాధానమే. విలీనంపైన ఆయన వ్యాఖ్యలు కూడా టిఆర్‌ఎస్‌నే ఇరుకున పెట్టేవిగా వున్నాయి.

Sunday, September 16, 2012

సెప్టెంబరు 17- విమోచన దిన పాఠాలు, విపరీత వాదనలు



సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరా మూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. పదిహేనేళ్ల కిందట బిజెపి విమోచన దినానికి తనదైన మతభాష్యం తెచ్చింది.బిజెపికి బొరుసు లాటి మజ్లిస్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలుగు దేశం నాయకులూ పరిణామ క్రమం గురించిన చారిత్రిక స్పష్టత లేకుండా రాజకీయ అవసరాల మేరకు మాట్లాడుతుంటారు. చరిత్ర కారులమని చెప్పుకునే మరికొందరు కూడా గజిబిజి పెంచడానికి కారకులవుతుంటారు. సెప్టెంబర్‌ 17కు ి ముందు వెనక వీర తెలంగాణా పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన యోధుల కన్నా ఇలాటి వారి హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటన్నిటి మధ్యనా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఎప్పటిలాగే సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం. ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన ఆ పోరాట విజయాలను కొత్తగా చెప్పనవసరం లేదు. పది లక్షల ఎకరాల పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్తాపన వగైరా ఎప్పుడూ స్మరించుకునేవే. కాకుంటే ఈనాటి రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య తెలంగాణా పోరాట సందేశం కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ పోరాట కార్యక్షేత్రం తెలంగాణానే అయినా పోరాటంలో పాల్గొన్నవారిని ప్రాంతీయ రేఖలతో,కుల మతాల కొలబద్దలకు అతీతమైంది. సెప్టెంబర్‌ 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన పోలీసు చర్యకు ఆరు నెలల ముందు - ఫిబ్రవరి26న నిజాం ప్రభుత్వ డిఐజి నవాబ్‌ దీన్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌ తమ ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు:
'' గత కొంతకాలంగా ప్రజల దృష్టి నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కల్లోలిత పరిస్తితులపై కేంద్రీకృతమై వుంది. నిజాం స్టేట్‌ ఆంధ్ర మహాసభ(మరో విధంగా చెప్పాలంటే ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీగా పరిచితం) రావినారాయణ రెడ్డి అనే కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఫలితమే ఇది. ఆయనకు 1940 నుంచి భారత కమ్యూనిస్టుపార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి.1945 తర్వాత నెమ్మదిగా

Saturday, September 15, 2012

సిఎం కిరణ్‌ మార్పు కథనాలు కథలేనా?




శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఢిల్లీ మీడియాలో వచ్చిన కథనాలు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలలో ఆసక్తి పెంచాయి. గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మార్పు గురించి వినిపిస్తున్న వూహాగానాలకు ఎన్‌డిటివి నుంచి వత్తాసు దొరకడంతో తెలుగు ఛానళ్లు కూడా దానిపై కేంద్రీకరించాయి. కొత్తగా మొదలైన సివిఆర్‌ ఛానెల్‌కు మరేదో అంశం కోసం వెళ్లినప్పటికీ ఈ అంశం ముందుకు రావడం తొలుత దానిపైనే చర్చ జరిగింది. తిరిగి వచ్చేప్పుడు సాక్షి ఛానెల్‌ ఫోన్‌ ఇన్‌ కూడా దీనిపైనే నడిచింది. ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ మాట్లాడితే ఇవన్నీ కావాలని సృష్టిస్తున్న కథలని కొట్టిపారేశారు.మహబూబ్‌ నగర్‌లో ముఖ్యమంత్రి పర్యటన అత్యంత విజయవంతంగా సాగడం సహించలేకనే ఇవన్నీ పుట్టిస్తున్నారని కూడా విశ్లేషించారు. పైగా సదరు ఛానల్‌ ముఖ్యులు కూడా ఈ కథనాన్ని బలపర్చడం లేదని ఆయన అన్నారు. అనేక సార్లుముఖ్యమంత్రి మారిన మహారాష్ట్రను కూడా ఈ జాబితాలో చేర్చడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతేగాక

దేశ ప్రజలపై దాడి: విదేశీ కార్పొరేట్లకు దాసోహం

 కుంభకోణాల తాకిడికి తల్లడిల్లిపోతున్న మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం సెప్టెంబరు 13,14 తేదీలలో తీసుకున్న నిర్ణయాలు తెంపరి తనానికి దుస్సాహసానికి పరాకాష్టగా వున్నాయి. డీజిల్‌ ధర ఎన్నడూ లేనంతగా లీటరుకు అయిదు రూపాయల పైగా పెంచడం, గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించిన షరతులను కఠినతరం చేసి సబ్సిడీకే గాక సరఫరాలకు కూడా ఎసరు పెట్టడం ఆందోళన కలిగించే అంశాలు. డీజిల్‌ పెంపు వల్ల రాష్ట్రంపై 4300 కోట్ల రూపాయల వరకూ భారం పెడితే అదనపు వ్యాట్‌ కారణంగా ప్రభుత్వానికి 730 కోట్ల ఆదాయం వస్తుందట!ఆర్టీసిపై 325 కోట్ల భారం పడుతుంటే ప్రజలపై రుద్దడానికి సిద్ధమవుతున్నది. గ్యాస్‌ డీజిల్‌పై సబ్సిడీలు రద్దు చేయాలని ప్రపంచ బ్యాంకుకు అనుబంధమైన గ్లోబల్‌ సబ్సిడీ ఇన్షియేటివ్‌ సంస్థ(జెనీవా) మంగళవారం నాడు మూడు నివేదికలు విడుదల చేసింది. ఈ నిర్ణయాలన్ని దానికి అనుగుణంగానే వున్నాయి.చమురు రంగంలో ప్రైవేటు శక్తులు ప్రవేశించిన తర్వాత ధరల పెంపు వేగం పెరిగింది. అసలు నియంత్రణే ఎత్తివేయబడింది.ఇక గ్యాస్‌ సిలిండర్లయితే రెట్టింపు రేట్లు పెరగనున్నాయి. పైగా ఏడు కోట్ల సిలిండర్ల కొరత రానున్నది ప్రజలపై ఇంత నిర్దయగా వ్యవహరించిన యుపిఎ2 దేశ విదేశీ కార్పొరేట్లకు మాత్రం దేశాన్ని దోచుకోవడానికి తలుపులు బార్లా తెరిచింది.గతంలో ప్రజాగ్రహానికి వెరచి పక్కన పెట్టిన చిల్లర

నిరతి మజ్జనం..నిమజ్జనం!


వినాయక చవితి పండగ అనగానే విగ్రహాల తయారీపై చర్చ మొదలవుతుంది. మట్టి వినాయకుల గురించి ఎంత చెప్పినా పర్యావరణ హానికర కాలుష్యాలతో భారీ విగ్రహాలను సిద్ధం చేయడం జరుగుతూనే వుంది. సైన్సు, పర్వావరణం వంటి వాటిని పక్కన పెట్టి పురాణాల ప్రకారం చూసినా నిమజ్జనం అంటే బాగా కలిపేయడం. మజ్జిగ అన్న మాట అ విధంగా వచ్చిందే. నిరతి మజ్జనం నిమజ్జనం అంటే బాగా కలిపేయడం. మట్టితో చేసిన విగ్రహాన్ని మట్టితోనే కలిపెయ్యడం ఇందులో పరమార్థం.కాని విగ్రహాలను చేసిందీ మట్టితో కాదు, అవి కలిసేదీ నీటిలో కరిగేదీ లేదు. పెద్ద పెద్ద క్రేన్లతో వాటిని లాంఛనంగా నీళ్లలో దింపడం, కాస్సేపట్లో ఒడ్డుకు చేరడం జరుగుతుంది. ఆ విగ్రహాల్లో వాడిన ఇనుప చువ్వలను తీసుకునిపోవడానికి వీధి పిల్లలు అప్పటికే సిద్దంగా వుంటారు. మురికి మయంగా వున్న హుస్సేన్‌ సాగర్‌లో విగ్రహాలను వేయడమే ఒక విడ్డూరమైతే నిమజ్జనం కాకున్నా అక్కడే కలపాలని పట్టుపట్టడంలో ఏ విధమైన విశ్వాసాలు లేవు. నగర రాజకీయాలపై ప్రాబల్యం కోసం పాకులాట మాత్రమే వుంది. పురాణాలన్నిటిలోనూ చెరువులు బావులు తవ్వించడమే పుణ్య కార్యమని చెబుతున్నాయి తప్ప విష పూరితం చేయమని చెప్పవు. సప్త సంతానాలనే వాటిలో జలాశయాలను భాగంగా చెబుతాయి.మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు గాని , భగవద్గీతలో కృష్ణుడు గాని ఈ విషయమే చెప్పారు.వట పత్ర శాయి అని విష్ణు వును తాటాకుపై పడుకున్నట్టు చూపించడంలోనూ మూషికాన్ని వినాయక వాహనంగా చేయడంలోనూ ప్రకృతి ముద్ర ప్రస్పుటంగా వుంది. పర్వత రాజ పుత్రి పార్వతి అనడంలోనూ ప్రకృతి భావన వుంది. ఇన్ని విధాల ప్రకృతితో ముడిపడినవినాయక విగ్రహాలను ప్రకృతి సూత్రాలకు హాని కలిగించే విధంగా కాలుష్య భరితం చేయడం ఎక్కడి ధర్మంఅంటే సమాధానం వుండదు.
ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయడమే పురాణ దర్మం కాదు. ముందే చెప్పినట్టు ఒక సామాజిక నేపథ్యంలో మూల విరాట్టు ప్రతినిధులుగా వుత్సవ విగ్రహాలు తయారైనాయి.జనం మధ్యకు వచ్చే విగ్రహాలు చిన్నవిగా కదిలించడానికి వీలుగా వుండాలి. మరీ పెద్దవైతే ప్రజా భద్రతకు ప్రమాదం గనకే పల్లకీలోనో పారువేటలోనో వూరేగించేందుకు వీలైన పరిణామంలోనే చేస్తారు. అసలు ఉత్సవ విగ్రహాలుఎంత వుండాలో

Monday, September 10, 2012

మూడు పార్టీల ఇక్కట్ల ముచ్చట్లు



కాంగ్రెస్‌, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీలు తమవైన రాజకీయ సంకటాలలో చిక్కుకున్న కారణంగా ఒకరిని చూసి ఒకరు పెద్దగా ఆనందించే పరిస్థితి కనిపించడం లేదు. నైతిక కారణాల పేరిట రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును బాధ్యతలు చేపట్టవలసిందిగా కేంద్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ చెప్పడం ఆ పార్టీ అభద్రతా భావానికి నిదర్శనం. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేదన్న మాట అంత బలంగా చెప్పకపోయినా ఏదో మేరకు సూచించారు గనక కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కొంత వూరట అయినా సానుకూలంగా ఏమీ చెప్పక పోవడం కూడా గమనించక తప్పదు
తెలుగు దేశం తెలంగాణాపై స్పష్టత ఇస్తానని చెబుతున్నా లేఖ మళ్లీ అందిస్తానని అంటున్నా దాని వల్ల లాభమా నష్టమా అని ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ల పాత్ర కీలకం గనక దీనివల్ల వారికే ప్రయోజనం కలిగి ఇతర ప్రాంతాలలో తాము నష్టపోతామా అని వారిలో చాలామంది అడుగుతుంటారు. పార్టీలు లాభనష్టాల లెక్కలు పక్కన పెట్టి విధానాలు నిర్నయించుకోవాలన్నది నిజం. అయితే తెలుగుదేశం ఇప్పుడు పరాజయ పరంపరలలో మునిగివున్నందును ఈ లేఖ మరింత నష్టం తెస్తుందా అన్న సందేహం వారిలో చాలా మందిని వదలడం లేదు. లేఖ కారణంగా ఇతర ప్రాంతాలలో కొంతరు నేతలు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

కాంగ్రెస్‌కు దగ్గరయ్యేది లేనిది కాలమే చెబుతుందని విజయమ్మ చేసిన వ్యాఖ్యను ఆగమేఘాల మీద ఖండించినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రాజకీయంగా రావలసిన గందరగోళం రానే వచ్చింది. ఎందుకంటే సంబంధిత పార్టీ ఖండించినంత మాత్రాన సమస్యలు వెనక్కు పోవు.ఇటవలి కాలంలో రెండు కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్న తీరుతో తలెత్తిన సందేహాలను ఆమె వ్కాఖ్యలు అధికారికంగా ధృవీకరించినట్టయింది.బిసిలకు వంద సీట్లపై చంద్రబాబుకు లేఖ రాయడం కూడా ఈ కోవకు చెందినదే. మొత్తంపైన జగన్‌ జైలు నుంచి విడుదల కాలేకపోవడం పార్టీలో నిస్తబ్దతకు దారి తీస్తున్నదని, ఆయన కూడా చాలా నిస్ప్రహకు గురవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.బంద్‌ పాక్షికంగా జరగడం, వైఎస్‌ మూడో వర్ధంతి గతంలో వలె జరక్కపోవడం, పైన చెప్పిన రెండు గందరగోళాలు కూడా పార్టీకి ఇరకాటమే తెచ్చిపెట్టాయి. తెలంగాణపై తెలుగుదేశం లేఖ ఇచ్చేట్టయితే అప్పుడు జగన్‌ పార్టీ దాటవేత సాధ్యం కాని స్థితి అనివార్యమవుతుంది.

సంకేతాలు తలకిందులు?



సెప్టెంబరు 10 వ తేదీలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరుగుతుందనే సంకేతాలు వున్నాయని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ గతంలో ప్రకటించారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఢిల్లీకి కూడా వెళ్లారు. జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌తో సహా అందరూ సంకేతాలు లేవని అంటే సన్నాసులకు ఎందుకొస్తాయి నాకే వస్తాయని ఎగతాళి చేశారు. అయితే 9వ తేదీన హైదరాబాదులోనే గులాం నబీ ఆజాద్‌ మరిన్ని సంప్రదింపుల తర్వాత గాని ఏమీ తేలదని స్పష్టంగా చెప్పారు. అంతకు ముందే ప్రధాని ఏకాభిప్రాయం లేదన్న పాత పాట వినిపించారు.తాజాగా హౌం మంత్రి షిండే మావోయిస్టుల కోణంలో సందేహాలు ప్రకటించారు. ఇవన్నీ జరుగుతుండగానే కాంగ్రెస్‌ ఎంపి మధు యాష్కి కూడా ఈ నెలలో ప్రకటన వచ్చే అవకాశం కనిపించడం లేదంటూ అందుకు ఇతర ప్రాంతాల ఎంపిలను తప్పు పట్టారు. సమస్య కేంద్ర దగ్గర అధిష్టానం దగ్గర పెట్టుకుని అందుకు ఇతరులను తప్పు పట్టడం ఒక విచిత్రమైతే వారిమీద ఆశలను కొనసాగించే సంకేత భాష మరీ విపరీతం.(దీని ఆధారంగా ఆ పార్టీకి సన్నిహిత భావన కలిగించడం మరింత విడ్డూరం) ఉద్యమ పార్టీలుగా ఇవన్నీ చెయ్యడం తమ ధర్మమన్నట్టు మాట్లాడేవారు ఉత్తుత్తిఆశలతో వూరించడం ఉద్యమ కారుల లక్షణం కాదని అంగీకరించరు. అంతేగాక కొత్త ఆశలను అల్లుతుంటారు. మామూలు విషయాలైతే అదో రీతి గాని ప్రజల ప్రాంతాల మనోభావాలతో మనో వేదనలతో ముడిపడిన సమస్యపై ఇదొక తంతుగా మార్చుకోవడం మాత్రం అసహజం, అవాంఛనీయం.ఇంతకూ కెసిఆర్‌ కంటే కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతల వైఖరి మరింత ఆందోళన కలిగిస్తుంది.

Sunday, September 9, 2012

గురజాడ వెలుగుజాడ






తెలుగు సాహిత్యంలో నూత యుగావిర్భావాన్ని సూచించే వేగుచుక్క గురజాడ అప్పారావు. పంథొమ్మిదో శతాబ్దపు వ్యక్తిని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ చెప్పుకుంటున్నామంటే అందుకు కారణాలు అనేకం.


పెరిగి విరిగితి
విరిగి పెరిగితి
కష్టసుఖముల
సారమెరిగితి

కొత్తమిన్కుల
తెలివితేటల
మంచి చెడ్డల
మార్చితిన్‌! అని స్వయంగా చెప్పుకున్న గురజాడ నిజంగానే సమాజంలో మంచి చెడ్డల గురించి పాతుకుపోయిన అభిప్రాయాలను ప్రశ్నించి సమూలంగా పరిష్కరించేందుకు కలం పట్టాడు.
ఎప్పుడైనా యుగకర్తలైన వారు సాహిత్య ద్రష్టలుగానే గాక సామాజిక ద్రష్టలుగా కూడా వుంటారు. వారి భావనలు కాలరేఖలను దాటి తదుపరి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. వారి మాటలు కొత్త బాటలు వేస్తాయి. గురజాడ అక్షరాలా తెలుగువారి వెలుగుజాడ. గురజాడ అప్పారావు అగ్రస్థానం కేవలం ఏ ఒక్క కోణం నుంచో, ఒక్క కారణం నుంచో లభించింది కాదు.
గురజాడ సనాతన కుటుంబంలో పుటిyనా దైవభ'క్తిని బోధించడానికి పరిమితం కాలేదు. పైగా దైవభావనకు మానవతాపూరితమైన వ్యాఖ్యానం ఇచ్చాడు. తను రాజుగారి కొలువు చేసినా రాజభ'క్తికే పరిమితం కాలేదు. ఈ రెంటినీ మించిన దేశభ'క్తిని చాటి చెప్పాడు. అది కూడా సంకుచితమైన, దురభిమానపూరితమైన దేశభ'క్తి కాదు. ఏ దేశంలోనైనా అనుసరించగల విశ్వజనీనమైన దేశభ'క్తి, ఆ గీతానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తి వుందని మహాకవి శ్రీశ్రీ అందుకే అంటాడు.
దేశభ'క్తిని బోధించడమే కాదు - దేశం అంటే ఏమిటో కూడా తొలిసారి గురజాడ చెప్పారు. అంతకు ముందు కాలంలో దేశం అంటే నదులు, పర్వతాలు అని కీర్తించే భౌగోళిక దృష్టి మాత్రమే వుంది. లేదా రాజుల విజయాలనే చెప్పే ధోరణి వుంది. గురజాడ ఆ దృక్పథాలను మార్చేశారు. దేశమంటే మట్టికాదు, మనుషులన్నాడు. మనుషులంటే ఎవరనే ప్రశ్న ఆ వెంటనే వచ్చింది. తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మని'ోరు అన్నాడు. 'మనిషి చేసిన రాతి బొమ్మకు మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బాలా' అని ప్రశ్నించాడు.
అప్పటిదాకా అంతా రాజులు, మతాధిపతులు, ఆచార్యులు చెప్పినటేy జరిగింది. అలాగాక సామాన్యమైన మనిషిని కేంద్రబిందువుగా చేసుకోవాలన్న దృషిy పునర్వికాసయుగంలో వచ్చింది. మానవతా వాదం అన్నమాటను ఈనాడు మనం మరో అర్ధంలో వాడుతున్నాం గాని అది మొదట వాడుకలోని వచ్చిన సందర్భం అదే. దాన్ని తెలుగునాట శక్తివంతంగా

Saturday, September 8, 2012

చిరు బాణాల లక్ష్యమెవరు?




ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావు వైఎస్‌రాజశేఖర రెడ్డి డైరీని ఫోటోలను అధిష్టానం ఆశీస్సులతో ఆవిష్కరించడం ఒకటైతే దానిపై హైదరాబాదులో వ్యక్తమైన ప్రతిస్పందన మరొకటి. గతంలో గాంధీ భవన్‌లో వైఎస్‌ ఫోటో లేకపోవడంపై అసందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా కెవిపి తమ బంధాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటే కాంగ్రెస్‌ నాయకులు వైఎస్‌ను కూడా ప్రచారానికి వాడుకుంటారన సందేశం అందించారు. ఢిల్లీ సభ దానికి కాస్త విస్తరణ. పైగా ఈ కాలంలో జగన్‌ పార్టీతో అధికార పక్షానికి కాస్త సఖ్యత పెరిగినట్టు కనిపిస్తుంది. అందుకు తగినట్టే విజయమ్మ రెండు పార్టీల విలీనం ప్రస్తావనకు స్పందించి తర్వాత సర్దుకున్నారు. ఇదంతా రాబోయే రాజకీయ పరిణామాల సూచిక కావచ్చు
ఈ సమయంలో చిరంజీవి విహెచ్‌ పోటీ సభకు హాజరవడమే విశేషం కాగా అక్కడ అధికార పార్టీ దురవస్థపై అస్త్రాలు సంధించడం మరింత విశేషం. గోడలు విచ్చిపోయిన పాలకపార్టీ తనకు అభద్రత కలిగిస్తోందని ఆయన అనడం నిజంగా అసాధారణం. ఇవన్నీ ఇప్పటి నాయకత్వాన్ని మార్చాలన్న సందేశానికి సంకేతాలు కావచ్చు. దీనిపై ఇతరులు ఏమంటారో ఇప్పుడు చూడాలి. మెగాస్టార్‌ ఈ మాత్రం మాట్లాడ్డం ఇప్పుడే గనక దీని ప్రకంపనలు తీవ్రంగానే వుండొచ్చు.

విషాద మూర్తిపై వివాదమేల?


ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను విషాదమూర్తి(ట్రాజిక్‌ ఫిగర్‌) అని వాషింగ్టన్‌పోస్టు వార్త రాసినందుకు కాంగ్రెస్‌ వాదులే గాక కొంతమంది ఇతరులు కూడా తీవ్ర అభ్యంతరాలు వెల్లడిస్తున్నారు.ఇదేదో దేశ గౌరవానికి సంబంధించిన అంశంగా చిత్రిస్తున్నారు. నిజానికి ఈ బ్లాగులో అనేక సార్లు చర్చించినట్టు విధాన పరంగా అమెరికాకు సాగిలబడినప్పుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, భారత రాయబారి నిరుపమా రావు, షారుక్‌ఖాన్‌లతో సహా మన దేశ ప్రముఖులు అనేకమందిని అవమానించినప్పుడు మనం గట్టిగా ప్రతిఘటించింది లేదు. ఇటీవల ఒబామా చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించాలంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడినా మౌనంగానే వున్నాము.ఇన్నిటి తర్వాత మన్మోహన్‌పై ఆ పత్రిక ఢిల్లీ విలేకరి సైమన్‌ డెన్యర్‌ ఏదో రాస్తే వేశారని ఎందుకు ఉలిక్కిపడటం? గ్లోబల్‌ విలేజి అంటూ ప్రపంచీకరణను ఆకాశానికెత్తేవారు ఇలా చేయడం సబబేనా? అమెరికా విదేశాంగ ప్రయోజనాలను అక్కడి కార్పొరేట్‌ పత్రికలు ప్రతిబింబిస్తాయని ఇంతకు ముందు తెలియదా? 2అవినీతి పరులను కూడా మంత్రులుగా కొనసాగించక తప్పడం లేదని మన్మోహన్‌ స్వయంగా చెప్పుకుంటే, వరుసగా కుంభకోణాల పరంపరలో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆయనను అపహాస్యం చేయడంలో అసహజత ఏముంది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.గతంలో అమెరికా అద్యక్షుల ప్రశంసలకు పరవశించిన వారు, ఆ పత్రికల వర్ణనలకు పొంగిపోయిన వారు ఇప్పుడు విమర్శించినందుకు గింజుకుంటే ఎలా కుదురుతుంది?ఇంట గెలవకుండా రచ్చ గెలవడం ఎప్పుడూ సాధ్యమవుతుందా?