Pages

Wednesday, March 7, 2012

అనర్హత ఘట్టం- వైరుధ్యాలు తీవ్రం



వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు ప్రహజనం పూర్తయింది. నిజానికి వారు దీన్ని ఎప్పటినుంచో ఆహ్వానిస్తున్నందున వేటు అనడం కంటే స్వీటు అనే అభివర్ణించాల్సి వుంటుంది.అయితే భవిష్యత్‌ రాజకీయ పరిణామాల రూటు ఎటో ఘాటు ఎంతో మాత్రం చెప్పడం సులభం కాదు. ప్రధాన పాలకపక్షాల,వర్గాల నేతలు ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం వెలగబెడుతున్నా ఎవరి భయాలు వారిని వెన్నాడుతున్నాయి. రకరకాలైన రాజకీయ వైరుధ్యాలతో రాష్ట్ర రంగ స్థలం గజిబిజిగా మారింది. ప్రాంతాల వారీగా పార్టీలు పరి పరి విధాల విన్యాసాలు చేస్తున్నా పెద్ద మార్పులేమీ వచ్చిన దాఖలాలు లేవు. గత మూడేళ్ల కాలంలోనూ రాష్ట్రాన్ని వెన్నాడుతూనే వున్న అనిశ్చితి మరింత అధ్వాన్నమవడమే తప్ప పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవు. కమ్యూనిస్టేతర పార్టీలు ప్రజా సమస్యలతో నిమిత్తం కన్నా స్వీయ అస్తిత్వం ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆరాటపడుతున్న తీరే ఇందుకు కారణం.

ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదార్ల అనర్హత వ్యవహారమే చూద్దాం. జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యవస్తాపించడమే వారి ప్రధాన ఎజెండా. వైఎస్‌ మరణించిన వెనువెంటనే జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించి సంతకాలు చేయించినప్పటితో పోలిస్తే ఇలా కోరుకునే వారి సంఖ్య కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎల పరంగా బాగా తగ్గిపోయిందనేది నిజం. అప్పుడు 150 మంది సంతకాలు చేశారంటే ఇప్పుడు మిగిలింది అందులో
పదో వంతుకు కొంచెం ఎక్కువ మాత్రమే. ఇందులో కాంగ్రెస్‌ కేంద్ర రాష్ట్ర నాయకుల వ్యూహాలతో పాటు జగన్‌ శిబిరం వైఫల్యం కూడా వుండకుండా పోదు. వైఎస్‌ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ ఓదార్పు యాత్రలు మధ్య మధ్య నిరాహారదీక్షలు మినహా ఈ శిబిరం తనదైన విధానాలను గాని కార్యాచరణను గాని ప్రకటించలేకపోయిన మాట నిజం. కడప ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ జగన్‌ ఆస్తులపైన సిబిఐ దర్యాప్తు వగైరాలు కూడా ఆ వర్గానికి ఇబ్బంది కరమైన స్థితి కలిగించాయి. వైఎస్‌ పొగడ్తలు, సంక్షేమ పథకాల జపం వారి ప్రధాన ప్రాతిపదిక గనక అర్థం చేసుకోవచ్చు. మేము కాంగ్రెస్‌లో వుంటే దర్యాప్తు జరిపేవారా అన్న వారి ప్రశ్నలో వాస్తవం లేదనీ ఎవరూ అనడం లేదు. అవన్నీ నిజమైనా రాష్ట్రంలో చాలా తీవ్ర స్తాయిలో జరిగిన అవినీతి దర్యాప్తును కేవలం కక్ష సాధింపు కింద కొట్టేసే వాతావరణం మాత్రం లేదు. నిజానిజాలు బయిటకు రావాలనే ప్రజలు కోరుతున్నారు. వైఎస్‌ మొదటి సారి గెలిపించినందువల్ల గాని, స్థానిక పరిస్థితులను సామాజిక కోణాల రీత్యా గాని ఆయన వెనక నిలబడిన ఎంఎల్‌ఎల సంఖ్య గణనీయంగానే వున్నా తక్షణమే దానివల్ల ప్రభుత్వం తక్షణమే పడిపోయే స్థితి లేకుండా చేసుకోవడంలో కాంగ్రెస్‌ కృతకృత్యమైంది. ప్రజా రాజ్యం విలీనంతో పాటు ఇటు వైపు వున్న కొందరు వెనక్కు వెళ్లిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అధికారం కోసం సాగే అంతర్గత కలహం వల్ల ఉత్పన్నమైన ఈ పరిణామంలో ప్రజలకు సంబంధించిన మౌలికాంశాలు విధానపరమైన తేడాలు ఏవీ వుండవు. అయితే ఇప్పటికే అధికార పక్షాన్ని ఆవరించిన అస్థిరత్వం మరింత పెరగడానికే ఇది కారణమవుతుంది.
ఈ స్థానాలకు ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా తెలియదు గనక ఫలితాలపై వూహాగానాలు అవసరం లేనిపని. వివిధ పార్టీల వైఖరులు, పోటీల తీరు,అభ్యర్థుల ఎంపికలు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. జగన్‌ కేసుల పర్యవసానాలు కూడా చూడాల్సి వుంటుంది. దాంతో నిమిత్తం లేకుండా ప్రజలు తమ వెంటే వుంటారని వారంటున్నా అన్నీ గమనంలోకి తీసుకున్నాకే ప్రజలు తీర్పునిస్తారు. ఎందుకంటే ప్రచారంలో అనివార్యంగా ఈ అంశాలన్ని ముందుకొస్తాయి. వివిధ చోట్ల గతంలో మొహరించిన పార్టీలు ఓట్ల విభజన వగైరాల ప్రభావం కూడా వుండొచ్చు. అప్పుడున్న ప్రజారాజ్యం ఇప్పుడు లేదు. మహా కూటమి కూడా లేదు. ఒకసారి ఉప ఎన్నికలంటూ వచ్చాక అది కేవలం కాంగ్రెస్‌ వర్గాల మధ్య పోటీగానే వుండదు. ఇతర పార్టీలు కూడా తమ వ్యూహాలను బట్టి రంగంలోకి దిగుతాయి. కడపలో జగన్‌,విజయమ్మల పోటీకి మిగిలిన చోట్ల కూడా తేడా వుంటుంది. అయితే అధికార పక్షంపై అసంతృప్తి, సామాజిక సమీకరణలు స్థానిక పరిస్థితులు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం పెద్దఎత్తునే జరుగుతుంది. ఏమైనా అనర్హత వరకూ కేవలం కాంగ్రెస్‌ తగాదాగా వున్నది పోయి ఇప్పుడు మరింత విస్త్రత రాజకీయ పోరాటంగా మారుతుంది. అధికార పక్షంలో వైరుధ్యాలు కూడా లోపాయికారిగా పనిచేయవన్న హామీ ఏమీ లేదు. అదే పరిస్థితి ఇటు వైపున కూడా వుండొచ్చు.

ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికలేవీ పాలక పక్షానికి ఇవి పెద్ద అనుకూలంగా వుండే అవకాశం దాదాపు లేనట్టే. ముఖ్యమంత్రి ముందుచూపుతో చాలా వారాల కిందటే ఈ ఎన్నికలు రెఫరెండం కాదని కూడా చెప్పేశారు. అనర్హతను ఆలస్యం చేయడంలోనూ ఆ అసౌకర్యమే కనిపించింది. తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికలను మాత్రం విడదీసి ఇవి మరోసారి వచ్చేట్టు చేసుకోవడంలో ఆంతర్యం అదే. అయితే అది ఎన్నికల ఫలితాలలో పెద్ద మార్పు తెస్తుందనుకోలేము గాని జగన్‌ కేసులో నిరాఘాటంగా వ్యవహరించడానికి ఉపకరించవచ్చు.ఆయనను అరెస్టు చేసేట్టయితే పార్టీ సేనాని లేని సేన అవుతుందన్న భావన అధికార పక్షానికి వుంది. వారు కూడా అందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. వీటన్నిటి తుది మలుపులు రాబోయే కొద్ది రోజుల్లో చూడగలుగుతాము
ఇప్పుడు జరుగుతున్న కోవూరు ఉప ఎన్నిక జగన్‌ శిబిరానికి తొలి పరీక్ష.ఇక్కడ కాంగ్రెస్‌,తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ, సిపిఎం పోటీ చేస్తుండగా మీడియా కథనాలు మిగిలిన మూడు పార్టీలకే పరిమితమై పోతున్నాయి. గతంలో ఇక్కడ సిపిఎం 18 వేల ఓట్లకు పైగా స్వంతంగా తెచ్చుకున్నది. సిపిఐ కూడా మద్దతు నిస్తున్నది. సిపిఎం పోటీ ఇప్పటిలాగే అప్పుడు కూడా తెలుగు దేశంకు రుచించకపోయినా అన్ని ఓట్లు వచ్చాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఓట్ల చీలిక మరింత ఎక్కువగా వుండొచ్చు గాని సిపిఎం వుండటం వల్ల పోటీకి రాజకీయ స్వభావం ఏర్పడుతుంది. పాలక వర్గాల స్వార్థ వివాదాల మధ్య ప్రజల సమస్యలను వినిపించే అవకాశం కూడా కలుగుతుంది. లేకుంటే తక్కిన మూడు పార్టీలూ పరస్పర నిందారోపణలలోనే జనాన్ని ముంచెత్తుతాయి.
తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికే తెలుగు దేశం టిఆర్‌ఎస్‌ల మధ్య దుర్భాషల యుద్ధాన్ని తిలకిస్తున్న వారికి ఈ విషయం స్పష్టమవుతుంది. సిపిఎం పోటీ వల్ల ప్రాంతీయ చిచ్చుకు మూల కారణమైన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి చాలా కాలంగా మరుగుపడుతున్న ఈ ప్రాంత సమస్యలు వినిపించడానికి అవకాశమేర్పడుతుంది. లేకుంటే ద్రోహుల దొంగల పేరిట తిట్లతోనే సరిపోతుంది. సిపిఎం పోటీ విరమించుకోవాలంటూ ఆంధ్రజ్యోతిలో అరుణతార పేరిట వ్యాసం రాసిన వామపక్ష శ్రేయోభిలాషి ఎలాగైనా తెలుగు దేశంను గెలిపించి తరించాలని సలహా ఇవ్వడం విడ్డూరమైన విషయం. తెలుగు దేశం ప్రతినిధి వర్గం అభ్యర్థన తర్వాత కూడా సిపిఎం పోటీలో కొనసాగడానికే నిర్ణయించుకోవడం సహజమే గాక సముచితం కూడా. ఒక కమ్యూనిస్టుపార్టీ పూర్వాపరాలు ప్రజల శ్రేయస్సు లోతుగా ఆలోచించకుండా రంగంలోకి దిగదు. దిగిన తర్వాత తేలిగ్గా నిర్ణయాలు మార్చుకోదు. నిజానికి తెలంగాణా సమస్యపై ఎలాటి వూగిస లాట లేని సిపిఎం అక్కడ పోటీ చేయడానికి వెనుకాడవలసిన అవసరమే లేదు. అవకాశవాద పార్టీలకు అధికార దాహులకే సందేహాలు సంకోచాలు వుండాలి. ప్రజా రాజకీయాలకు ఆ శషభిషలు అక్కర్లేదు. సిపిఐ కూడా తన కోణం నుంచి తెలుగు దేశం అభ్యర్థతనను బాధతోనైనా తోసిపుచ్చి రాజీనామా చేసిన అభ్యర్థులనే బలపర్చాలని నిర్ణయించింది.అయితే మహబూబ్‌నగర్‌లో మాత్రం నేరగా టిఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నది. శాసనసభలో ఆ పార్టీతో బిజెపితో సమన్వయం చేసుకున్నారన్న వార్తలను కార్యదర్శి నారాయణ తోసి పుచ్చారు.అయితే మద్దతు కోరుతూ కెసిఆర్‌ బృందం వెళ్లి వచ్చిన తర్వాత సిపిఐ ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణా రాజకీయాలలో కొత్త పొందికలకు దారి తీస్తుందేమో చూడాలి.
ఏమైనా రకరకాల ఉప ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు వాటి చుట్టూనే పరిభ్రమించడం వాంఛనీయం కాదు. సంబంధిత శక్తులకు అవే సర్వస్వం కావచ్చు గాని ప్రజా సమస్యల సమగ్ర పరిష్కారం కోరేవారు అలా భావించలేరు. పైగా రెచ్చగొట్టే మాటలతో చిచ్చు పెట్టడాన్ని అసలే ఆమోదించరు. ఇటీవల జరిగిన ఫిబ్రవరి 28 సమైక్య సమ్మె సమరశీల పోరాటాలకు కొత్త బాట చూపింది. అనేక ఆర్థిక భారాలు, అవినీతి భాగోతాలకు వ్యతిరేకంగా ఒక్కుమ్మడిగా పోరాడవలసి వుంది. వైఎస్‌ వర్గీయుల అనర్హత వ్యవహారాన్ని కూడా ఈ పరిమితులలో చూడాల్సిందే తప్ప శ్రుతిమించిన ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం వుండదు. ఒకే తాను ముక్కల వంటి వారి సిగపట్ల గోత్రాలతో ప్రజలకు ఒరిగేది లేదు. కాకపోతే ఆ వైరాలు వైరుధ్యాల మధ్య వామపక్షాల ఐక్యత స్వతంత్ర పోరాటాలు ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల ముందుంచడమే ప్రధాన కర్తవ్యం.

No comments:

Post a Comment