Pages

Tuesday, February 7, 2012

మంత్రిపై ఆరోపణ: తీవ్ర ప్రభావం తథ్యం



లిక్కర్‌ మాఫియాపై దాడులు ఎంత సమర్థనీయమో దొరికిన ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకపోవడం అంత పొరబాటని చర్చల్లో చాలా సార్లు చెప్పాను. మాఫియాల వివరాలు దొరికినా సమయం ఇవ్వడమంటే వారిని కాపాడేందుకు సమయం ఇచ్చినట్టే అనుకోవాలి. ఇది అంతర్గతంగా వత్తిడి తేవడానికి ఉపయోగించడం తప్ప కఠిన చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని లోగడనే తేలిపోయింది. మాఫియాల మాఫీకే ఇది దారి తీస్తుందని స్పష్టమైంది.ఇలాటి తరుణంలో ఎక్సయిజ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణకే ముడుపులు ఇచ్చినట్టు మాఫియా కింగ్‌ నున్నా వెంకట రమణ చెప్పినట్టు ఎసిబి డైరీలో పేర్కొన్న వార్త పెను సంచలనమే.షరా మామూలుగా మంత్రి దీన్ని ఖండిస్తున్నా అంత సులభంగా తీసుకోవడానికి లేదు. పైగా మంత్రి మొదటి నుంచి లిక్కర్‌ వేలం రేట్లు ఎక్కువగా వున్నందుకే అధిక ధరలకు అమ్ముతున్నారని సమర్థిస్తూ వచ్చారు. ఒక విధంగా ఆయన వాదన లిక్కర్‌ సిండికేట్‌కు సమర్థనలాగానే సాగింది. పైగా ఎవరిపైనా చర్య తీసుకోవడం గాక విధానాన్ని మార్చడం ముఖ్యమని మాత్రమే ఆయన చెబుతూ వచ్చారు. ఆ దశలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై ఇప్పుడు నేరుగా ప్రస్తావన వచ్చాక రాజకీయ ప్రభావం పడకుండా వుండదు.ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణతో కాస్త వూపిరి పీల్చుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీని వల్ల తన ప్రభుత్వానికే కళంకం రాకుండా జాగ్రత్త పడతారని కూడా అనుకోవచ్చు. ఇది కళంకిత మంత్రులందరికీ హెచ్చరికగానూ వుంటుంది.ఇప్పటికే అవినీతి వ్యవహారాలలో ఐఎఎస్‌లనే పట్టుకుంటూ అమాత్యులను వదిలేస్తున్నారన్న విమర్శలకు బలం చేకూరుతుంది.అధినేతలనూ అధికారులను ఆడించే అక్రమార్జనా పరులను కూడాపట్టుకుంటేనే అవినీతిని కాస్తయినా అరికట్టడం సాధ్యపడుతుంది.

3 comments:

  1. హ్మ్.. రాజకీయాల్లో అవసరాలే ముఖ్యమేమో కదండి

    ReplyDelete
  2. ఇప్పట్లో ఈ ముఖ్యమంత్రికి అంత ధైర్యం ఉంటుందని నేననుకోను.

    ReplyDelete
  3. మద్యం శాఖ నుంచి మోపిదేవి ACB బాస్‌గా హోమ్ శాఖకు బదిలీ అవుతారేమోగాని అంతకన్నా గొప్ప చర్యలు వుండకపోవచ్చు.

    ReplyDelete