Pages

Tuesday, August 30, 2011

రోశయ్య వ్యాఖ్యలపై రభసలో రాజకీయాలు


ముఖ్యమంత్రిగా వుండగా తెలంగాణా సమస్యకు సంబంధించి జరిగిన పరిణామాలపై రోశయ్య ఆలస్యంగా కొన్ని అభిప్రాయాలు బయిటపెట్టారు. వాటిపై ఆయనే రాష్ట్ర విభజనకు అడ్డుపడ్డారన్నట్టుగా కేశవరావు వంటి నాయకులు విరుచుకుపడుతున్నారు.ఇంతకూ పెద్ద బలీయమైన నేతగా పేరు లేని రోశయ్య కాంగ్రెస్‌ అగ్రనాయకులు ఆనుమతి ఆమోదం లేకుండా స్వంతంగా ఏమీ చేయగలిగింది వుండదు.డిసెంబరు 9 రాత్రి వెలువడిన ప్రకటన గురించి తనకేమీ తెలియదని రోశయ్య అప్పట్లో ప్రకటించారు. అయితే చలో అసెంబ్లీ వల్ల పరిస్థితి అదుపు తప్పిపోయే ప్రమాదమేమీ లేదని,(అలా అయితే రాజీనామా చేస్తాననీ) శాసనసభలో విభజన తీర్మానం పెట్టి నెగ్గించలేనని తాను చెప్పి వచ్చినట్టు ఆయన ఇప్పుడు వెల్లడించారు. ఈ విషయంలో చాలా పరిణామాలే జరిగాయి. ఇప్పటికీ కేంద్రం ఏమీ నిర్ణయం ప్రకటించకుండా చెలగాటమాడుతున్నది. అన్నా హజారే,జగన్‌ కేసుల దర్యాప్తు, సోనియా అనారోగ్యం, కాంగ్రెస్‌-తెలుగు దేశం దోబూచులు వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ప్రస్తుతానికి తీవ్ర రూపం తీసుకోనప్పటికీ నివురు గప్పిన నిప్పులానే వున్నది. ఇందుకు ప్రథమ ప్రధాన కారణం కేంద్రమే తప్ప రోశయ్య కాజాలరు. ఆయన కూడా కొన్ని విన్యాసాలు చేసి వుండొచ్చు గాని కేంద్రానికి అడ్డుపడే శక్తి అవకాశం రెండూ లేవు. రోశయ్యపై ధ్వజమెత్తే కెకె,జీవన్‌రెడ్డి వంటి వారికి అధిష్టానం ముందు ఆయన ఎంత పరిమితుడో తెలియని వారు కాదు. అయినా కావాలని అవకాశం ఉపయోగించుకుని కొద్ది రోజులు వివాదం నడిపించడానికే ఈ చర్చ ఉపయోగపడుతుంది.విభజన సమస్య వీధుల్లో తేలదన్న మాట మౌలికంగా నిజం. వీధుల్లో వీరంగాలు తొక్కుతూ(అది కూడారెండు చోట్ల రెండు విధాలుగా) పార్టీల ప్రయోజనాలు కాపాడుకునే నాయకులు రాజకీయంగా నికరంగా ముందుకు వచ్చే వరకూ ఇది తేలదు. ఈ మాట కటువుగా ధ్వనిచంఇనా నిజమని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఆ మాటలు ఉపసంహరించుకున్నట్టు చెబుతున్నారు గనక అసలే వదిలేయొచ్చు. నిజంగా రోశయ్య అధిష్టానం అభీష్టానికి ఆదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించి వుంటే ఇప్పుడు ఆయనను తమిళనాడు గవర్నర్‌ పదవి వచ్చి వరించేది కాదు. రాజ్యాంగ బద్దమైన పదవి గనక రాజకీయాలు మాట్లాడేది లేదంటున్న రోశయ్యకు అభినందనలు చెప్పొచు.అయితే మాటకారిగా పేరు గాంచిన ఆయన మౌన యోగం పాటించడం కష్టమేనేమో!

Monday, August 29, 2011

జగన్‌కు భాజపా మద్దతులో మతలబులు


సిబిఐ దర్యాప్తులు, దాడులతో అష్ట దిగ్బంధనంలో చిక్కిన జగన్‌కు భారతీయ జనతా పార్టీ నేతలు సంఘీభావం తెల్పడం వూరట కన్నా ఇబ్బందినే కలిగిస్తుంది. ఆయనపై రాజకీయ కక్షతో దాడులు చేస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడమే తమ ఉద్దేశమని బిజెపి చెప్పొచ్చు గాని దాన్ని ఎవరూ తీవ్రంగా తీసుకోరు.ఎందుకంటే ఏ సమయంలో ఏ మాట ఏ అర్థమిస్తుందో తెలియని అమాయకులు వుండరు. అవినీతి ఆరోపణల విషయంలో బిజెపి ఎప్పుడూ పెద్ద పట్టింపుగా వుండదు గనకే ఈ సమయంలో కూడా సూటిగా వత్తాసు పలికింది. పైగా ఉభయులకూ మధ్య అనుసంధాన కర్తగా గాలి జనార్థనరెడ్డి అటు సంఘ పరివారానికి ఇటు వైఎస్‌ పరివారానికి ఉమ్మడి మిత్రుదుగా వుండనే వున్నారు.అయితే కడప ఉప ఎన్నికల నుంచి సిబిఐ దర్యాప్తు తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల వరకూ జగన్‌ తాను బిజెపిని వ్యతిరేకిస్తానని,ఇంకా చెప్పాలంటే అదొక్కటే తనకు వ్యతిరేకమని(జాతీయ సా ్తయిలో అని జోడింపు) ఢంకా బజాయించి చెప్పారు. ఆయనే ఇప్పుడు బిజెపిని చూసి కాంగ్రెస్‌ సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నారు. అంటే బిజెపి మాటలను ఆహ్వానిస్తున్నారన్న మాట. ఆయన తరపున వాదించింది కూడా బిజెపి ఎంపి రామ్‌జెత్మలానీనే కావడం గమనించదగ్గది. సుడిగుండంలో ఆసరాగా బిజెపి ఆయనకు కనిపిస్తే ఆ పార్టీ స్థితి ఇంకా ఘోరం. ఎన్‌డిఎ అని గొప్పగా చెప్పుకునే కూటమిలో ఇప్పుడు శివసేన,జెడి(యు) తప్ప పెద్ద పార్టీలేవీ లేవు. అందుకే ఎక్కడ ఎవరు దొరుకుతారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నది. జనాదరణ గల జగన్‌తో జట్టు కడితే రాష్ట్రంలో మళ్లీ నాలుగు సీట్లు తెచ్చుకోవచ్చన్న ఆరాటం ఆ పార్టీది. కాకపొతే ఈక్రమంలో ఉభయులూ విశ్వసనీయత పోగొట్టుకుంటున్నారనేది నిజం.

అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సవాళ్లువేయి కోట్లు ఇస్తే తన ఆస్తి రాసిస్తానని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అనడం సమాధానపర్చడం కన్నా సమస్యల సృష్టికే ఎక్కువగా దారి తీసింది. తనపై ఆరోపణల దర్యాప్తు చేసుకోవచ్చని ఆయన చాలా సార్లు ప్రకటించారు. అంతటితోనే ఆరోపణలు ఆగిపోవు కూడా. ఆ పాలనా కాలంలో పొరబాట్లను ఏడేళ్లు అధికారంలో వున్న కాంగ్రెస్‌, ఎందుకు నిగ్గు తేల్చలేదో తెలియదు. ఎప్పుడూ సిపిఎం వేసిన పుస్తకాన్ని ప్రస్తావించడం తప్ప తమ ప్రభుత్వ నివేదికలను వారెందుకు ఉటంకించలేకపోతున్నారు? చంద్రబాబుతో సహా ఎవరిపైనైనా ప్రజాస్వామ్యంలో ఆరోపణలు రావచ్చు. వారు సంజాయిషీ ఇచ్చుకోవచ్చు కూడా. అయితే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకరి ప్రస్తావనలు అడ్డం వేయడం వల్ల ఉపయోగమేమిటి? సాక్షిలో రామోజీ చంద్రబాబుల గురించి పేజీల కొద్ది రాయడం ప్రచారానికే ఉపయోగపడుతుంది తప్ప ఆదుకునేది కాదని నేను చాలా సార్లు అంటుంటాను. చంద్రబాబు వీర విధేయులు కూడా అనుకోకుండానే ఈ వాదనలో కూరుకుపోవడంతో చర్చలు దారి తప్పుతుంటాయి. అయితే వేయి కోట్ల ప్రతిపాదన చేయడం ద్వారా బాబు కూడా అవతలి వారి దాడికి తనే సగం అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. తన ఆస్తి ద్వారా వెయ్యి కోట్లు వస్తే దాన్ని ట్రస్టుకు రాసిస్తానని ఆయన అన్నారు. ఈ మద్య వర్తులు మారుబేరాలు లేకుండా ఆయనే నేరుగా రాసేస్తే పోతుంది కదా అని ఒక చర్చలో అన్నాను. అదీ సంగతి!

Saturday, August 27, 2011

ప్రజాస్వామిక విజయంఅన్నా హజారే నిరాహార దీక్షతో లేవనెత్తిన కోర్కెలకు పార్లమెంటు ఆమోదం తెల్పడం ప్రజాస్వామిక విజయం. ప్రజల విజయం. అయితే పటిష్టమైన బలిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు చట్టంగా మారేంత వరకూ ఈ పోరాటం పూర్తయినట్టు కాదు.సగమే సాధించినట్టు భావించాలని అన్నా స్వయంగా చెప్పడంలో ఆంతర్యం అదే. అన్నా మొదటి సారి దీక్ష చేసినపుడు చాలా గౌరవంగా స్పందించిన కేంద్రం తీరా ఆయన గట్టిగా నిలళబడే సరికి రెండవ సారి నిజ స్వరూపం చూపింది.అరెస్టు చేసి అప్రజాస్వామిక స్వభావం వెల్లడించుకుంది. తర్వాత కూడా ఈ విషయంలో వ్యక్తిగతంగా మన్మోహన్‌ సింగ్‌, ఆయన ప్రభుత్వం కూడా విపరీతమైన తత్తరబాటు తడబాటు

బషీర్‌ బాగ్‌ బాటలో సమరశీల పోరాటాలుఆగష్టు 28. బషీర్‌ బాగ్‌ కాల్పుల అమరులకు జోహారులర్పించే రోజు. ఆ పోరాట స్పూర్తిని స్మరించుకునే రోజు. సరళీకరణ యుగంలో సమరాలకు అది పెట్టిన వరవడిని గుర్తు చేసుకుని నేటి ఉద్యమాలను ఉధృతం చేసేందుకు దీక్ష వహించాల్సిన రోజు. బషీర్‌బాగ్‌ ఘటనలను తమ తమ పాక్షిక కోణాలలో చూసి చూపించి ఉద్యమాల పాత్రను వక్రీకరించే వారికి సమాధానం ఇవ్వాల్సిన రోజు కూడా. 2000 సంవత్సరం వచ్చినపుడు నూతన సహస్రాబ్ది అంటూ ప్రపంచ వ్యాపితంగా మీడియా, పాలక వర్గాలు కూడా ఎక్కడలేని హడావుడి చేశాయి. అయితే ఆ నూతన సహస్రాబ్దిని సమరశీలంగా మార్చి రాబోయేది పోరాటాల యుగమని చేసిన తొలి హెచ్చరిక బషీర్‌బాగ్‌. వామపక్షాలు

Wednesday, August 24, 2011

హజారే దీక్ష- వాస్తవిక వైఖరిఅన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్ష ఇటీవలి కాలంలో మరే ఉద్యమమూ కలిగించనంత ప్రభావం ప్రసరించింది. ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాకపోవడం వల్ల అందరూ బలపర్చే అవకాశం ఏర్పడింది. ఆ పైన అవివేకంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన మన్మోహన్‌ ప్రభుత్వ చర్య కూడా అందరికీ ఆగ్రహం తెప్పించింది. కేవలం ఆయనకే గాక ప్రజాస్వామ్య హక్కులు కోరేవారందరికీ సవాలుగా అనిపించింది.మొదటి సారి దీక్ష సందర్భంలో హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అని రాసిన ఈ బ్లాగు రచయిత కూడా ఈ తేడాను గమనించాడు. అయితే ప్రజాగ్రహం ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా అన్నాను వదలిపెట్టి ఆయన రామ్‌లీలా మైదానంలో దీక్ష చేసుకోవడాన్ని అనుమతించిన తర్వాతనే ఆయనపై విమర్శలు పెరగడం

జగన్‌ వర్గం.... కింకర్తవ్యం?


సుప్రీం కోర్టు జగన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చడం వూహించదగిన విషయమే.ఏ కారణాల వల్ల హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరించిందో అవే కారణాలు ఈ కొట్టివేతకు దారి తీస్తాయనేది పెద్ద న్యాయ పరిజ్ఞానం లేకుండానే చెప్పదగిన విషయం. అయినా ప్రయత్నం చేయాలి గనక వెళ్లి లేదనిపించుకున్నారు. అయితే దీనివల్ల ఆరోపణలు మరింత రూఢిగా అయినట్టవుతుందనే కోణం జగన్‌ వర్గం పట్టించుకోలేదు. పైగా వారికి వేరే మార్గాలు కూడా లేవు. ఎందుకంటే సామూహిక రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల అనిశ్చితిని పెంచడంలో కృతకృత్యమై వుండొచ్చు గాని నాటకీయ మార్పులను మాత్రం వెంటనే తీసుకురాగల పరిస్థితి,సంఖ్యాబలం లేవు.ఉన్నదైనా నిలబెట్టుకోవాలనే వ్యూహంతోనే హడావుడిగా రాజీనామాలిప్పించారన్నది వారే ఆంతరంగికంగా

Sunday, August 21, 2011

పెనం మీంచి పొయ్యిలోకి రాష్ట్ర పరిణామాలు


ఇంచుమించు రెండేళ్లుగా రాష్ట్ర రాజకీయావరణాన్ని ఆక్రమించేసిన రెండు అంశాలు- జగన్‌, తెలంగాణా విభజన. అహౌరాత్రులు ఆ రెంటి చుట్టే పరిభ్రమణం సాగింది. వాటిపై అనేక ఆవేశ కావేశాలు అతిశయోక్తులు, అవాస్తవాలు జోరుగానే సాగాయి. అయితే గత వారం పది రోజుల్లో ఈ రెండు అంశాలకు సంబంధించిన నిజానిజాలు, నిజ రూపాలు ప్రజలు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం ఉద్రిక్త వాదోవపాదాలకు ప్రచార పటాటోపాలలో ముంచెత్తే స్తితి వెనక్కు పోయి ఎవరు ఏమిటో ఎలా వున్నారో వుంటారో కూడా ప్రజలు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. వారు సరైన నిర్ధారణలకు రావడానికి ఇంత కన్నా కావలసింది వుండదు. ఈ రెండు అంశాలు కూడా రాజీనామాలవైపే నడవడం కూడా ఒక విచిత్రమైన సారూప్యం.

ముందుగా జగన్‌ విషయం తీసుకుంటే 2008లోనే ప్రతిపక్షాలు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు

Thursday, August 18, 2011

సిబిఐ దాడులు,, రాజకీయ వ్యాఖ్యలు


జగన్‌ ఆస్తులకు సంబంధించి సిబిఐ విస్త్రత స్థాయిలో సాగిస్తున్న దర్యాప్తు సాగించడం వూహించిన విషయమే.దానిపై రాజకీయ స్పందనలు కూడా అదే కోవలో వున్నాయి. హైకోర్టు ఆదేశం తర్వాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే లోపలే భూమిక సిద్ధం చేయాలన్న ఆలోచన సిబిఐకి వుందనేది స్పష్టం. అయితే ఇంత జరిగాక ఇది రాజకీయ కక్ష అని జగన్‌ వర్గీయులు విమర్శించవచ్చు గాని అంత మాత్రాన దర్యాప్తును తప్పు పట్టడానికి లేదు. ఈ దర్యాప్తులను గజం మిథ్య పలాయనం చందంగా కొట్టివేయడం కుదిరేది కాదు. ఆయన కాంగ్రెస్‌లో వుంటే కేసు ఇంత దూరం వచ్చి వుండేది కాదు. తనకు స్థానం కల్పిస్తే ఆయన కూడా తిరుగుబాటు చేసి వుండేవారు కాదు. ఎవరి కోణాల నుంచి ఎవరి ప్రయోజనాలను బట్టి వారు వ్యవహరించిన తర్వాత పరస్పర ఆరోపణలకు పెద్ద ప్రాధాన్యత వుండదు. కాకపోతే ఈ నిర్ణయాలను కుంభకోణాలను కేవలం వైఎస్‌ కుటుంబానికే పరిమితం చేసి తాము విశుద్ధ భంగిమలో కనిపించాలన్న కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు కూడా ఫలించవు. పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నిటినీ సోదా చేసినప్పుడు అందుకు దారి తీసిన నిర్ణయాలలో భాగస్వాములైన వారందరినీ విచారించక తప్పదు. వారు ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందలేదని గాని అలాటి వారు పెట్టుబడులు పెట్టలేదని గాని జగన్‌ కూడా చెప్పడం లేదు. ఆ రెండు ప్రక్రియలమధ్య సంబంధమేమిటనేది తేలాలంటే దర్యాప్తు ఏకైక మార్గం. (దీనిపై ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కూడా ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను.కొంత పునరావృతి వున్నా మళ్లీ ఎడిట్‌ చేయడం కుదరలేదు గనక అలా చదువుకోవాలని మనవి.)

జగన్‌ టు హజారే!ఇప్పటి మీడియాలో ప్రత్యేకించి టీవీ మీడియాలో ఏ ఎజెండా కూడా వారం రోజుల పాటు కొనసాగదు. ఇరవై నాలుగ్గంటల ఛానళ్లలో ఏ రోజు తాజా చర్చలు ఆ రోజే. జగన్‌ ఆస్తులపె,ఎమ్మార్‌ కుంభకోణంపై ౖ దర్యాప్తుకు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వు చేయడంతో గత బుధవారం చర్చలన్ని దానిపైనే కేంద్రీకృతమైనాయి. ఈ బుధవారం నాటికి అన్నా హజారే అరెస్టుపై చర్చ అన్నిటినీ ఆక్రమించేసింది. రెండు సందర్బాల్లోనూ అవినీతి వ్యవహారాలే వేర్వేరు కోణాల నుంచి ముందుకు రావడం యాదృచ్చికం కాదు.
జగన్‌ ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిజానిజాలు తేలడానికి ఏకైక మార్గంగా వున్నాయి. వీటిని స్వాగతిస్తున్నామంటూనే జగన్‌తో సహా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలలో సమర్థనే ఎక్కువ. వైఎస్‌ హయాంలో లాభ పడిన వారు

Tuesday, August 16, 2011

అరెస్టు అప్రజాస్వామికం.. ఆందోళన కరంఅవినీతిని ఒక్కసారిగా అరికట్టే మంత్రదండమేదీ తన వద్ద లేదన్న ప్రధాని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేపై రాజదండం ఝళిపించారు. నిరాహారదీక్ష సంకల్పాన్ని అడుగడుగునా అడ్డుకోవడమే గాక ఆఖరుకు ఆయనను దీక్షకు ముందే అరెస్టు చేసి అసహసనం ప్రదర్శించారు. అదే సమయంలో ఆయన నిరాహారదీక్ష మొదలైతే ఎలాటి పర్యవసానాలు కలుగుతాయో అన్న భయం కూడా ప్రభుత్వాన్ని పీడిస్తున్నది. అందుకే అన్నాపై దండకాలు చదివి దండయాత్రకు దిగారు. శాంతియుతంగా నిరాహారదీక్ష తలపెట్టిన ఆయనను ముందుగా అరెస్టు చేయడమంటే ప్రజాస్వామిక హక్కును కాలరాయడమే.దీనిపై దేశవ్యాపితంగా వ్యక్తమైన స్పందన చూసి(దాన్ని పరీక్షించడం కూడా ఒక ఉద్దేశం కావచ్చు)ఇప్పుడు విడుదల చేశారు గాని ఇందులో పెద్ద ఔదార్యం ఏమీ లేదు. అనివార్యంగా చేసిన నిర్ణయమే అది.ఏమైనా అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారే స్థానం మరింత బలపడటానికి ఈ చర్య దారి తీయడం తథ్యం. దాంతో పాటే ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకోవాలన్న సృహ కూడా ఇనుమడిస్తుంది. అన్నా తో ఏ విధమైన తేడాలున్నా ఈ సమయంలో ఆయన ఇచ్చిన స్పూర్తికి అందరూ అభినందనలు అందజేస్తారు.

Monday, August 15, 2011

ముఖ్యమంత్రి తడబాటు... దిద్దుకోవలసిన పొరబాటు ...


ఆగష్టు పదిహేను ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగం అన్ని తప్పులు తడబాట్లతో సాగడం భాషాభిమానులకు మాత్రమే గాక ప్రతివారికీ ఇబ్బంది కలిగించింది. ఇక్కడ సమస్య పదాలు చదవ లేకపోవడం కాదు,ఉచ్చారణ దోషాలు నేరమనీ కాదు. ఒక రాష్ట్రాధినేత మాతృభాష విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. మహౌపన్యాసకుడైన చర్చిల్‌ అంతటి వాడు ప్రసంగాన్ని ముందుగా అకళింపు చేసుకుని బయిలు దేరే వాడని చరిత్ర చెబుతున్నది. రాజకీయ విధానాలు పాలనా సమస్యలు పరిష్కరించడం సంగతి ఎలా వున్నా వ్యక్తిగతంగా ఇలాటి చిన్న చిన్న అంశాలనైనా సరిచేసుకోకపోతే ఎలా? నిజానికి రాజకీయంగా కొన్ని కీలకమైన సానుకూల ఫలితాలు సాధించిన ముఖ్యమంత్రి ప్రసంగ పఠనంలో ఇలా అపహాస్యానికి అవకాశం ఇవ్వడం దిద్దుకోగలిగిన దిద్దుకోవలసిన పొరబాటే.వాగ్ధాటి ఒక్కటే నాయకులకు కొలబద్ద కాదు గాని వాక్శుద్ధి మనుషులను అంచనా వేయడంలో చాలా పాత్ర వహిస్తుంది. ఈ సారి అగష్టు 15 దాకా ఆగకుండా ఆ లోపలే ఈ లోపాన్ని ఆయన సరిదిద్దుకుంటారని ఆశించాలి.

కొత్తదనం లేని జగన్‌వాదనలుహైకోర్టు తీర్పుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలలో కొత్తదనం ఏమీ లేదు. ఉండే అవకాశం కూడా లేదు. ఈ వాదనలన్ని హైకోర్టులో ఆయన లాయర్లు అనేక సార్లు వినిపించారు. ఆఖరుకు చెప్పిందే చెప్పొద్దని కోర్టు మందలించింది కూడా. ఆ తర్వాతే ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది. దీని పూర్వాపరాలు గత ఎంట్రీల్లో పరిశీలించాము. ఇప్పుడు కొత్తగా చెప్పిన దాంట్లో కూడా ప్రతి ఎకరా కేటాయింపునకూ వైఎస్‌తో పాటు మంత్రులందరూ బాధ్యులని ఆయన అన్నారు.అదే ఘనత పథకాల విషయంలో ఇవ్వడానికి సిద్దంగా లేరు. ఆ సంగతి అలా వుంచితే చనిపోయిన వైఎస్‌ను తప్పు పట్టకూడదని ఒక వైపున చెబుతున్న జగన్‌ బతికున్న మంత్రుల బాధ్యత గురించి ఎలా ప్రశ్నించగలరో అర్థం కాదు.తప్పే లేకపోతే ఎవరిదీ లేనట్టే. వుంటే అందరిదీ. అందులో మృతులను మినహాయించి జీవితులైన ఉపగ్రహాలనే జవాబు దారి చేయడం ఎలా సాధ్యం? ఇక ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభం పొందిన వారు పెట్టుబడులు పెట్టారనేది ప్రాథమిక నిర్ధారణ. ఈ రెంటికీ సంబంధం లేదని ఆయన నిరూపించుకుంటే మంచిదే. రాష్ట్రానికి రాజకీయాలకు సంబంధించిన ఈ సమస్యను కేవలం రామోజీ పత్రిక ఈనాడుకూ తమ సాక్షికి మద్య వివాదంగానే చూపించడం మాత్రం వాస్తవికత అనిపించుకోదు. సుప్రీం కోర్టుకు వెళ్తారు గనక అక్కడ ఏమైనా తీర్పు వస్తే అదే అందరికీ సమాధానమవుతుంది. ఇక బిజెపికి వ్యతిరేకమని ఆయన చేసిన ప్రకటన ఆహ్వానించదగిందే గాని ఆ వూపులోనే మిగిలిన ఎవరికీ వ్యతిరేకం కాదనడం కొత్త వ్యాఖ్యానాలకు ఆస్కారమిస్తున్నది.ఇది చేసిన ప్రకటనలో వున్న అస్పష్టత తప్ప వ్యాఖ్యానించేవారి పొరబాటు కాదు.

మన్మోహన మంత్రదండం ?అవినీతి భాగోతాల గురించి దేశం గగ్గోలు ఎత్తి పోతుంటే ప్రధాని మన్మోహన్‌ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తన దగ్గర అవినీతిని నిర్మూలించే మంత్రదండం లేదనడం ఒక అపశ్రుతి. అవినీతి పరుల దగ్గర మాత్రం అనేక మంత్రదండాలున్నాయి. వాటిని తీసి పారేస్తే చాలు. మిశ్రమ ప్రభుత్వం గనక అవినీతి పరులైనా చేర్చుకోక తప్పదని గతంలో చెప్పిన ప్రధాని ఈ కాలంలో చాలా విన్యాసాలే చేశారు.ఇన్ని అక్రమాలకు ఆలవాలమైన ప్రభుత్వానికి ఆధ్యర్యం వహిస్తున్న నేతగా ఆయన కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు లోక్‌పాల్‌ ముసాయిదా కూడా నిస్సారంగానూ లోప భూయిష్టంగానూ రూపొందించారు. మొన్న నెత్తిన పెట్టుకున్న అన్నాహజారేను ఇప్పుడు ప్రత్యర్థిగా పరిగణించి వాగ్యుద్ధాలతో ఆంక్షల హద్దులు పెడుతున్నారు. హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అంటూ గతంలో దీనిపై చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా అమెరికా ఆయనకు మద్దతుగా మాట్లాడటం అనుచిత జోక్యమే. అయినా సరే ప్రజాస్వామికంగా నిరశన తెలిపే హక్కును నిరాకరించడం సమర్థనీయం కాదు. ఆరోగ్య రీత్యా అవసరమైతే అప్పుడు ఎలాగూ పోలీసులు రంగంలోకి రానే వస్తారు. ఈలోగానే ఇంత అసహనం తగని వ్యవహారం.

Saturday, August 13, 2011

హైకోర్టు తీర్పు- వైఎస్‌ఆర్‌ పార్టీ వాదనలు

జగన్‌ ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశలు ఆహ్వానించదగినవి. అయితే వీటిని స్వాగతిస్తున్నామంటూనే జగన్‌తో సహా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలలో సమర్థనే ఎక్కువగా కనిపిస్తున్నది. గజం మిథ్య పలాయనం మిథ్య అన్న చందంగా ఏమి వాదించినా ఇంత దూరం వచ్చిన సమస్య వూరికే సమిసి పోదని అందరికీ తెలుసు. న్యాయపరమైన కోణం నుంచి చూస్తే ఇదంతా హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నది. కోర్టు సిబిఐ సహాయం తీసుకున్నది. ఇంకా తీసుకోబోతున్నది. మొదట కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ శంకరరావు, తర్వాత తెలుగు దేశం నాయకుడు ఎర్రం నాయుడు వేసిన పిటిషన్ల ఆధారంగా విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్లు ప్రజా ప్రయోజన వాజ్యాలు గనక వాటిని విచారణకు చేపట్టవలసిన ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయా లేదా అన్న అంశానికి పరిమితమైనట్టు కోర్టు పేర్కొంది.ముందు ఆ విషయం తేల్చుకోవడానికి తొలి విడత విచారణ,వాదనలు, సిబిఐ నివేదికల పరిశీలన పనికివచ్చింది.వీటి ఆధారంగా కోర్టు ప్రాథమిక ఆధారాలు వున్నట్టు అభిప్రాయపడిుంది. అవినీతి నిరోధక చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, మనీ లాండరింగ్‌ చట్టం అనే మూడు విభాగాల కింద అక్రమాలను పరిశోధించాలని కోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు తమ తీర్పులో అనేక ఆరోపణలనూ , సంస్థలనూ ఉటంకించారుే. . వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా భూముల పందేరంలోనూ, ప్రాజెక్టుల కాంట్రాక్టుల లోనూ, సెజ్‌ల కేటాయింపులోనూ అపారంగా లాభపడిన కార్పొరేట్‌ సంస్థలే ఆయన కుమారుడైన జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనే

Friday, August 12, 2011

14 ఎఫ్‌ రద్దు సానుకూల పరిణామంఎట్టకేలకు ఎడాదిన్నర ఆలస్యంగానైనా కేంద్రం సూచనపై రాష్ట్రపతి 14 ఎఫ్‌ను రద్దు చేయడం హర్షణీయం. గత రెండేళ్ల ప్రతిష్టంభనలో వినిపించిన మొదటి స్పష్టమైన సానుకూల పరిణామం ఇది.ఇందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రిని అభినందించవచ్చు. ప్రాంతాల మధ్య ప్రజ్వలనానికి దీన్ని కూడా సాధనంగా చేసుకోవాలని అఖరి నిముషం వరకూ ప్రయత్నించిన కేంద్రం ఆలోచనలు విఫలమయ్యాయంటే ప్రజల సంయమనమే కారణం.దానిపై వేడి పెంచేందుకు అటూ ఇటూ కూడా ప్రయత్నాలు జరిగాయి.ఇంకా జరుగుతాయి కూడా. 14 ఎఫ్‌ కు చారిత్రిక నేపథ్యం ప్రత్యేకతలు ఏమిటి అన్న చర్చ అప్రస్తుతం. మిగిలిన వుద్యోగ నియామకాలు వేటికీ లేని మినహాయింపు నగర పోలీసు శాఖకే కొనసాగించడంలో తర్కం ఏమీ లేదు. దీని వల్లచుట్టుపక్కల జిల్లాలకే లాభం కలగడం వగైరా వాదనలన్ని చట్టం ముందు నిలిచేవి కావు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు జోన్స్‌ సమస్యపై ఏ వైఖరి తీసుకున్నాయో దాని ప్రకారం 14 ఎఫ్‌ వుండటానికి అవకాశం లేదు. ఇంత కాలం తర్వాతనైనా రద్దు చేసినందుకు హర్షిస్తూ రేపటి పరీక్షలు ప్రశాంతంగా ముగిసిపోతాయని ఆశించాలి. ఇతర ప్రాంతాలలో నేతలు కూడా దీనిపై ప్రతిష్టంభన లేదా సంఘర్షణ పెరగకుండా చూడాలి. ఇంతకూ ప్రభుత్వ ఉద్యోగాలే తగ్గిపోతున్న నేటి తరుణంలో కొన్నివందల వుద్యోగాల కోసం ప్రాంతాలు ప్రజలు వివాదపడాల్సిన అవసరమే లేదు. ఇది దేశ వ్యాపిత సమస్య కూడా. కనక యువత విద్యా ఉద్యోగావకాశాల కోసం ఉపాధి విస్తరణ కోసం అందరూ కేంద్రీకరించి పోరాడటం మంచిది.

Wednesday, August 10, 2011

జగన్నాటకంలో రసవద్ఘట్టం హైకోర్టు తీర్పువై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం వూహించిన పరిణామమే. నిజానికి జగన్‌ పార్టీ వారు ఇంతకంటే తీవ్రమైన పరిణామాలకే సిద్ధమై వున్నట్టు చెబుతూ వస్తున్నారు. మేకపాటి రాజమోహన రెడ్డి ఆ సంగతి బహిరంగంగానే వెల్లడించారు కూడా.అయితే వెనువెంటనే అంత తీవ్రమైన మలుపు వుండకపోవచ్చు గాని నిస్సందేహంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వుంటుంది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష ప్రయోజనం పొందిన కంపెనీలు జగన్‌ స్థాపించిన సంస్థల్లో పెట్టుబడి పెట్టాయనేది కాదనలేని సత్యం. జగన్‌ కూడా అలా అనడం లేదు. గతంలో వైఎస్‌ కూడా అనలేదు. కాకపోతే వారంతా తమ వ్యాపార దక్షతనూ లాభాల అవకాశాలను చూసి పెట్టుబడి పెట్టారని చెబుతూ వస్తున్నారు. అంతేగాక రామోజీ రావు,చంద్రబాబులపై ఎదురుదాడి సాగిస్తూ సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ప్రాథమిక ఆధారాలు వున్నాయని నిర్ధారించింది గనక అనివార్యంగా ప్రజలకు వివరణ సంజాయిషీ ఇచ్చుకోవలసిన స్థితి వచ్చినట్టే. రాజకీయ కక్ష కేసు వేసిన వారికి ఆపాదించవచ్చు గాని తీర్పు నిచ్చిన న్యాయస్థానాన్ని ఏమీ అనడానికి లేదు. ఏమైనా ఇది కక్ష సాధింపు గనకనో, జగన్‌కు జనాదరణ వుంది గనకనో ఆరోపణలను ప్రశ్నించకూడదంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.తాము కూడా ఎవరిపైనైనా కేసు వేయదల్చుకుంటే లక్షణంగా వేసుకోవచ్చు ఈ కేసులో మ్యాట్రిక్స్‌, నవభారత్‌, పివిపి వెంచర్స్‌, హెటిరో గ్రూపు,రాంకీ వగైరా చాలా సంస్థల బినామి పెట్టుబడులున్నాయనేది ఆరోపణ.ఇక జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ కార్పొరేషన్‌, జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, కార్నయిల్‌ ఆసియా వాటన్నిటికి మారిషన్‌ నుంచి పెట్టుబడులు సమకూర్చిన 2 ఐ క్యాపిటల్‌, ప్యూర్లీ ఎమర్జింగ్‌లకు కూడా బినామి పెట్టుబడులే వచ్చాయన్నది అభియోగం. ఈ సంస్థల్లో చాలా భాగం బహిరంగంగానే ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందాయి.కనక జగన్‌కు ఏ పదవి లేనందును అధికార దుర్వినియోం కాదనే వాదన చెల్లదు. ఈ వ్యవహారం ఏఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక ఎమ్మార్‌ వ్యవహారం మరో విపరీతం. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్పొరేషన్‌ ప్రైవేటు చేతుల్లో పెట్టి వారు తమ వాటా తగ్గించడాన్ని అనుమతించి ఆ పైన నామకార్థఫు ధరకు ఖరీదైన విల్లాలు బినామీ కంపెనీలకు కట్టబెడుతుంటే వత్తాసు నిచ్చిన ఎపిఐఐసి అధికారుల నిర్వాకం కూడా తీవ్రమైనదే. ఇంత జరుగుతున్నా ఎమ్మార్‌ నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు చట్టరీత్యా ఆగలేదంటే అంతకన్నా దారుణం ఏముంటుంది?
ఈ అంశం మరింత వివరంగా ఇంకో సారి మాట్లాడుకోవచ్చు.

Saturday, August 6, 2011

'సావధాన' చర్చలో సత్యాసత్యాలు- బిజెపి


లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు,బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ తెలంగాణా సమస్యపై ఇచ్చిన సావధాన తీర్మానం చర్చ వర్తమాన రాజకీయ వాస్తవాలు మరోసారి బహిర్గతం కావడానికి కారణమైంది. మతతత్వ రాజకీయాలకు పేరుమోసిన బిజెపి ప్రాంతీయ ఉద్యమాలను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి వువ్విళ్లూరుతున్న తీరును కళ్లకు కట్టింది. సహజ శైలిలో సుష్మా ఎంత నాటకీయంగా ఎంత ఉద్రేకపూరితంగా మాట్లాడినా ఈ విషయంలో బిజెపి ద్వంద్వ నీతి కూడా అనివార్యంగా అభిశంసనకు గురైంది. అదే సమయంలో రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలో ముంచిన హౌంమంత్రి చిదంబరం తెలుగు వాళ్లే తేల్చుకోవాలని హితబోధ చేయడం రాజకీయ కేంద్రం బాధ్యతా రాహిత్యానికి అద్దం పట్టింది. అనిశ్చితి ఇప్పట్లో తొలగేది కాదనీ తేలిపోయింది.

బిజెపి విషయానికి వస్తే తెలంగాణా విషయంలో వారి వైరుధ్యాలు విన్యాసాలు దేశమంతటికీ తెలిసినవే. స్వతహాగా చిన్న రాష్ట్రాల పేరిట  అద్యక్ష తరహాను ప్రతిష్టించాలనేది బిజెపి చిరకాల వాంఛ. కాంక్ష. తమ పాలన కాలంలో ఈ మేరకు సన్నాయి నొక్కులు నొక్కడమే కాక రాజ్యాంగాన్ని తిరగదోడటానికి విపల యత్నాలు

Friday, August 5, 2011

పార్లమెంటు చర్చ - పాఠాలు


తెలంగాణా ఏర్పాటుకు బిల్లు పెట్టాలంటూ బిజెపి నేత ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ ప్రవేశపెట్టిన సావధాన తీర్మానం దేశంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ద్వంద్వ నీతులను బహిర్గత పరిచింది. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు అన్ని రకాల ప్రాంతీయ తత్వాలను వాడుకుంటూనే అధికార పరిభ్రమణం చేస్తున్న తీరు వెల్లడైంది. మీరు అధికారంలో వున్నప్పుడు ఏం చేశారని కాంగ్రెస్‌ వారు ప్రశ్నిస్తున్నారు. మేము మద్దతు నిస్తామన్నా ఎందుకు బిల్లు పెట్టడం లేదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. పాత్రలు అటూ ఇటూ అయినా ప్రయోజనాల పాకులాట మారలేదన్నదే రెంటికీ సమాధానం. ప్రతిపక్షంలో వున్నప్పటి సులోచనాలు వేరు, ప్రభుత్వంలో వున్నప్పుడు వేరు.

ఇంతకూ ఇప్పుడైనా సుష్మా స్వరాజ్‌ స్పష్టంగా చెప్పడం బాగానే వుంది గాని ఒక ఉపప్రాంతీయ నేతగా జాతీయ ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడనవసరం లేదు. అన్నిటినీ మించి ఒక అసహాయ అయోమయావస్థలో ఆత్మహత్యకు పాల్పడిన అభాగ్య యువకుని ఆఖరు లేఖను చదివడంలో ఇది పరాకాష్టకు చేరింది.( దాని వాస్తవికతనే ప్రశ్నించిన కావూరి సాంబశివరావు మరో అనవసర వివాదానికి కారకులైనారు.) ఆత్మహత్యల ఆదర్శీకరణ గురించి కిందటి ఎంట్రీలో వివరంగా చర్చించాము. 500 మందికి పైగా రాజకీయ వేత్తలున్న అత్యున్నత సభలో ఇలాటి లేఖ చదవడం ఏ సంకేతాలిస్తుందో సుష్మాజీకి తెలియదా?అంతా అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలుగులో చెబితే జరిగే నష్టం ఆగుతుందా? సుష్మా స్వరాజ్‌ తెలంగాణా నుంచి పోటీ చేస్తారన్న కథనాలు కూడా వస్తున్నందున బిజెపి ఈ అంశంపై గట్టిగానే ప్రచారం చేపడుతుందని భావించవచ్చు.
సిపిఐ నాయకుడు గురుదాస్‌ గుప్తా కూడా విభజన కోర్కెెను సమర్తించినప్పటికీ ఒక్క తెలంగాణా గురించే మాట్లాడుతూ ఇతర ప్రాంతాల మనోభావాలను విస్మరించడం తగదని చెప్పవలసి వచ్చింది. ఇది ఒక విధంగా ఆ పార్టీ వైఖరికి కూడా దిద్దుబాటు అనుకోవచ్చు.సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివరాలు తమ తమ నెలవులను బట్టి మాట్లాడారు. చిదంబరం సమాధానం షరా మామూలే, తెలుగు దేశం కాంగ్రెస్‌,ఎంఐఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు స్పష్టంగా చెప్పాలని అయనన్నారు. ముందు తమ తరపున చెబితే ఆ తర్వాత మిగతా వారి సంగతీ చూసుకోవచ్చు. తమలాగే తెలుగు దేశం కూడాచర్చలు జరపాలని చెప్పడం బాగానే వుంది గాని ఆ చర్చలను డ్రామాలని కేశవరావు వర్ణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏది ఏమైనా మూడు మాసాల గడువు కనీసంగా వుంటుందన్నాడు కాబట్టి ఆలోగా అసహనాలు ఆవేశ కావేశాలు పెరక్కుండా చూసుకోవడం అందరి బాధ్యత.

రాహుల్‌ అధినాయకత్వానికి అరంగేట్రం


రాజ్యాంగ పరంగా ప్రతిభా పాటిల్‌ ప్రథమ మహిళ అయినప్పటికీ రాజకీయ వాస్తవాల రీత్యా అతి శక్తివంతమైన ప్రథమ మహిళ సోనియా గాంధీ. ఆమెకు అనారోగ్యం ప్రాప్తించి ఆపరేషను దాకా వెళ్లడం అనూహ్య వార్తగా వచ్చింది.అయితే మీడియాలో ఇలాటి సూచనలు వస్తూనే వున్నాయి.నేడున్న వైద్య పరిజ్ఞానంతో ఆమె చికిత్స జయప్రదం కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే ఈ లోగా పార్టీ వ్యవహారాల కోసం నలుగురితో వేసిన కమిటీ రాహుల్‌ నాయకత్వ శకానికి నాంది పలుకుతున్నట్టు కనిపిస్తుంది. ప్రణబ్‌, చిదంబరం వంటి వారిని కాదని తన తనయుడినే నియమించడంలో సోనియా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఇది ప్రస్తుత దశలో చూపించే ప్రభావం కంటే భవిష్యత్తుకు ఇచ్చే సూచనలే ప్రధానమైనవి. నిజానికి రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌ వందిమాగధులు ఎప్పటినుంచో హడావుడి చేస్తున్నారు.సోనియా గాంధీ ప్రధాని పదవి తిరస్కరించినప్పటి నుంచి ఆమె లక్ష్యం రాహుల్‌ రాజ్యమేనని కూడా రాజకీయ పరిశీలకులందరికీ తెలుసు. ఆ క్రమంపై అధికార ముద్ర పడటానికి ఈ సందర్భం ఉపయోగపడింది.అంతే.

Thursday, August 4, 2011

అసహజ వాక్కులతో ఆత్మహత్యల ఆదర్శీకరణచాలా కాలం తర్వాత ఇటీవల ఒక ఛానెల్‌లో రాజకేయేతరమైన చర్చకు వెళ్లాను. ఆత్మహత్యలను నివారించడానికి సంబంధించిన ఆ చర్చలో నాతో పాటు మానసిక వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు. రాజకీయేతరమనుకుంటున్నా పదే పదే ఉద్యమాలలో ఆత్మహత్యల గురించిన ప్రస్తావనలకు దారి తీస్తూ వుంటే నియంత్రించడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది.బహుశా .వీటినే టిఆర్‌ఎస్‌ నాయకులు అసహజ పరిణామాలు అంటుంటారు. ఆ నాయకులతో సహా మనుషులకూ వారి ప్రాణాలకూ విలువనిచ్చే వారెవరైనా ఈ అసహజ పరిణామాలను కోరుకోరు. అయితే మా చర్చ ప్రసారమైన రోజునే టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఏ కారణం వల్లనైనా తెలంగాణా రాకపోతే తాను విషం తాగుతానని ప్రకటించారు. ఈ మాట్లాడిన

Monday, August 1, 2011

ప్రాంతాల మధ్య చిచ్చు కోసమే 14(ఎఫ్‌)పై మడత పేచీరాష్ట్రంలో ప్రాంతాల మధ్య ప్రజ్వలన పెంచడమే కేంద్రం ఉద్ధేశమని 14(ఎప్‌)పై చిదంబరం ప్రకటన మరోసారి స్పష్టం చేస్తున్నది. ఏకాభిప్రాయం అవసరమని రోజూ పల్లవి ఆలపించే కేంద్రం అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ఎందుకు మన్నించడం లేదు? ఒకే సమస్యపై మళ్లీ తీర్మానం చేయాల్సిన అవసరమేమొచ్చింది? అసలు హైదరాబాదులో వివిధ ఉద్యోగాలకు సంబంధించి వున్న నిబంధనలలో పోలీసు శాఖకు మాత్రమే మినహాయింపు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ పని చేసిన వారు ఆలస్యంగానైనా సరిదిద్దుకోకపోగా మరింత సాగదీయడం కేవలం అనిశ్చితి పెంచడానికి తప్ప మరెండుకు ఉపయోగపడదు. 14(ఎఫ్‌) రద్దు రాజ్యాగ రీత్యా కుదరదని లగడపాటి రాజగోపాల్‌ వంటి వారంటారు గాని తమ ప్రభుత్వమే శాసనసభలో ఎలా ఏకగ్రీంగా ఆమోదింపచేసి పంపిందో చెప్పరు. అలాగే గతంలో ఇవన్నీ సమస్యలే కాదన్న తెలంగాణా విభజన వాద నాయకులు ఒక్కసారిగా దానికి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందో చెప్పరు. ఈ ఉభయుల విన్యాసాలకు కేంద్రం పాచికలు మరింత దోహదం చేయడమే దురదృష్టకరం.సమస్య రాష్ట్రంలో లేదని కేంద్రమే దోషి అని ఈ తాజా వైఖరి నిరూపిస్తున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనిపై రాసిన లేఖను కేంద్రం మన్నిస్తుందని ఆశించడం కష్టం.ఇంత ఉద్రిక్తత పెరిగిన తర్వాత ప్రాంతీయ రాగాలు అలపించే పార్టీలు గతంలో వలె వ్యవహరిస్తాయా అన్నది సందేహం.