Pages

Sunday, January 15, 2012

సరళీకరణా? గరళీకరణా?
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని అమాంతం అభివృద్ధి మార్గంలో దూసుకుపోయేలా చేశాయని నమ్మే వారికి లోటు లేదు. కావాలని ఆ ప్రచారం చేసే కార్పొరేటీధీశులు, కపట వచనాలకు మారుపేరైన పాలక వర్గ నేతలు చెబితే పర్వాలేదు. అమాయకులూ అవగాహన లేని వారు నమ్మినా ఆశ్చర్యం లేదు. కాని విద్యాధికులూ విషయజ్ఞులమని భ్రమించే వారు కూడా అదే నిజమని నమ్ముతూ ఆ పైన నాలాటి వారు విమర్శిస్తే విరుచుకుపడుతుంటారు. అలాటి వారంతా భారతీయ శిశువుల పౌష్టికాహార లోపంపై మొన్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలకు ఏమంటారో చూడాలి. ఇరవై ఏళ్ల సరళీకరణ తర్వాత - దానికి ప్రవక్త మన్మోహన్‌ నోటనే సిగ్గుచేటు వంటి మాటలు విన్న తర్వాతనైనా ఆలోచించుతారా? పేద కుటుంబాలకు ఆహార భద్రత లేదు సరే కసి గందులకు గర్భిణిలకు కూడా సరైన తిండి పెట్టలేని అభివృద్ధి రేట్లు ఎవరికి గాట్లు? 42 శాతం మంది పిల్లలు ఆహార లోపంతో బాధపడుతుంటే భావి భారతం ఏమవుతుందని బాధపడే బదులు గతం గొప్పలు చెప్పుకునే వారు లేదా కొద్ది మంది గొప్పవారిని చూసి మురిసిపొమ్మనే వారు ఎవరికి ప్రతినిధులు? ఈ లోపం ఎవరి పాపం? వెలిగే భారతం రగిలే భారతం వీటి మధ్య అంతరాలను తొలగించేందుకు పోరాడాల్సిన ప్రత్యామ్నాయాలు చెప్పాల్సిన బాధ్యత బుద్ధి జీవులకు లేదా? సరళీకరణ నిజానికి గరళీకరణ అని స్పష్టంగా గుర్తించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆర్థికాభివృద్ధి పేరుతో అసమానతలు పెంచడం ఒకటైతే అన్నం కూడా లేకుండా చేయడమా, హత విధీ!

తరతరాల భాష్యాలను ప్రశ్నించిన కవిరాజుఏమంటివి, ఏమంటివి మట్టికుండలో పుట్టితివి కదా నీది ఏ కులము? అంటూ ఎన్టీఆర్‌ డైలాగులు మార్మోగుతుంటే తెలుగు వారు హాయిగా ఆస్వాదించగలుగుతున్నారు. అద్వానీ అయోధ్య కాండ అనంతర వాతావరణంలో దేశంలో చాలా చోట్ల ఏ చిన్న మత విషయమైనా ప్రస్తావించడానికి భయపడే దశలోనూ తెలుగు నాట యమలోకం గురించి ఎన్నెన్నో తమాషా చిత్రాలు వస్తూనే వున్నాయి. కాని యమగోల ఇక్కడ పెద్ద విజయం సాధిస్తే హిందీలో లోక్‌ పర్‌లోక్‌ అన్న పేరిట చేసిన రీమేక్‌ వివాదాస్పదమై విజయం సాధించలేకపోయింది.రాజకీయ పాలనాధికారాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తున్న పలు హిందీ రాష్ట్రాలలో మత సామరస్య పరిరక్షణ పెద్ద సవాలుగా వుంటే దక్షిణాదిన దాదాపుగా లౌకిక భావాలదే ప్రధాన స్థానంగా వుంది. అతి ముఖ్యమైన ఈ సామాజిక వ్యత్యాసానికి మూలాలు తెలుసుకోవాలంటే తెలుగు సాంసృతిక రంగ చరిత్రలో వున్నాయి. వాటిని పరిశీలిస్తే పెద్ద పరిశోధన అవసరం లేకుండానే ఎందరో మహామహులు ఇక్కడ సంఘ సంస్కరణ కోసం సాగించిన సమరాలు కనిపిస్తాయి. మూఢనమ్మకాలపై వారు మోగించిన ఢమరుకాల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. వేమన నుంచి గురజాడ, కందుకూరి వీరేశలింగం వరకూ సాగిన ఆ సంస్కరణ కృషికి హేతువాద దృష్టికి కొనసాగింపు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి.ఇది ఆయన 125 వ జయంతి సంవత్సరం.
కవిరాజు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన శంభూక వధ నాటకం. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు చేస్తున్న శంభుకుణ్ని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా

Monday, January 9, 2012

ఉపయోగం లేని ఉద్రిక్తతలు: వరంగల్‌ పాఠాలు
తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతు పోరు బాట పేరిట నిర్వహించిన యాత్ర సందర్భంగా ఓరుగల్లు పోరుగల్లుగా మారిపోయిందిన్న కథనాలు మీడియా యావత్తూ పొంగిపొర్లాయి. ఆయన యాత్ర పాలకుర్తి దగ్గర జరిగింది. వరంగల్లు ప్రత్యేకించి పాలకుర్తి వీర తెలంగాణా పోరాట కాలం నుంచి భూస్వామ్య వ్యతిరేక పోరాట చైతన్యానికి ప్రసిద్ధి గాంచాయి. అసలు దొడ్డి కొమరయ్య బలిదానంతో తెలంగాణా పోరాట అగ్నికణం రగిలిందే అక్కడ. మరి ఇప్పుడు చెబుతున్న ఈ పోరుకూ ఆ వీరోచిత వారసత్వానికి ఏమైనా సంబంధం వుందా అంటే బొత్తిగా లేదు. తెలంగాణా ప్రాంతంలో రాజకీయ ఆధిక్యత కాపాడుకోవడానికి ఒకరు, అస్తిత్వం నిలబెట్టుకోవడానికి మరొకరు సాగించిన సంఘర్షణగానే ఇదంతా సాగింది. ఇందులో చంద్రబాబు యాత్రను అడ్డుకోవడానికి జెఎసి పిలుపునిచ్చిందంటూ టిఆర్‌ఎస్‌ నాయకులు కదలి రావడంతో మొదట ఉద్రిక్తత పెల్లుబికింది. ఖమ్మం నుంచి కరీం నగర్‌ వరకూ జరిగిన చంద్రబాబు యాత్రను లాంఛనంగా అడ్డుకుంటున్నా వరంగల్‌లోనే అది పరాకాష్టకు చేరింది. ఈ లోగా ఉప ఎన్నికలూ దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ అడ్డుకోవడాన్ని అడ్డుకోకపోతే రాజకీయ అస్తిత్వమే వుండదన్న అభిప్రాయం తెలుగు దేశంలోనూ ఏర్పడింది.ఆ వైరుధ్యాల ప్రజ్వలనానికి ప్రతిబింబమే వరంగల్లు ఘటనలు. ఈ గుణపాఠం నేర్చుకునే బదులు ఇప్పుడు ఆర్మూర్‌లో జగన్‌ దీక్షలనూ అడ్డుకోవడం గురించిన హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇదంతా ప్రజల నిజమైన సమస్యలతో సంబంధం లేని ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనివ్వని విన్యాసం మాత్రమే. ఇలాటి చర్యలను ప్రజలు హర్షించరు సరికదా తమ యాత్రలు విజయవంతమైనాయంటూ దాన్నే ఒక వ్యూహాత్మక కార్యక్రమంగా మార్చుకునే అవకాశం అవతలివారికి లభిస్తుంది. టిఆర్‌ఎస్‌ కూడా ఏ ఉపయోగం లేని ఈ అర్థరహిత ప్రహసనమే గొప్ప ప్రజా కార్యక్రమం అని ప్రచారం చేసుకోవడానికి అవకాశమేర్పడుతుంది.అంతే. ఒకప్పుడు ఎడతెగని అభద్రతతో తెలుగు దేశం ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించకుండా దాటేస్తూ వచ్చింది. ఇప్పుడు దాని కార్యక్రమాలు జరిగాయి గనక టిఆర్‌ఎస్‌ అభద్రతకు గురి కావలసిన అవసరం లేదు. ఎవరిని ఎంత విశ్వసించాలో ప్రజలకు తెలుసు.
మరోసారి రానున్న ఉప ఎన్నికల రణ నాదాలుగానే ఈ రాజకీయ పరిణామాలను చూడవలసి వుంటుంది.కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రంతో రాజకీయ చెలగాటమాడుతుంటే పోటాపోటీ వీరంగాలతో పరిస్థితిని ఇంకా కలుషితం చేసుకోవడం వల్ల ఉపయోగం శూన్యం. ఇందుకు ి బదులు ప్రజలను వేధించే తక్షణ సమస్యల పరిష్కార సాధనకై ఉద్యమాలలో పోటీ పడితే మంచిది. తెలంగాణాతో సహా వివిధ విషయాలలో ఎవరిని ఎంత వరకు నమ్మాలో ప్రజలకు అర్థమైంది గనకే ఇన్ని పరిణామాల తర్వాతా ఈ రాష్ట్రం ఇలా వుంది. ఎవరెన్ని పిలుపులు ఇచ్చినా రాజకీయ ప్రక్రియ సాగుతూనే వుందంటే కారణం అదే. మరి వరంగల్లు ఘటనల తర్వాతనైనా సంబంధిత నాయకులు పునరాలోచించుకుంటారా అన్నది ప్రశ్న. ఎందుకంటే తమ అంతర్గత తగాదాలే పరిష్కరించుకోలేని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ప్రాంతీయ సమస్యపై పరిష్కారం చూపడమనే ప్రసక్తి అసలే లేదు. పైగా గత చరిత్రను బట్టి చూస్తే ప్రాంతీయ వివాదాలను ముఠా తగాదాల కోసం వినియోగించుకునే సంప్రదాయం కాంగ్రెస్‌కు వుంది. అదే జరిగితే పరిస్థితి పెనం మీంచి పొయిలోకి పడినట్టవుతుంది.సరిగ్గా చంద్రబాబు పర్యటన రోజునే అదే జిల్లా మహబూబాబాద్‌లో సిపిఎం బహిరంగ సభ, రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు పర్యటన జరిగిన సంగతి కూడా గుర్తు చేసుకోవలసి వుంది.కనక సూత్ర బద్ద విధానాలు ప్రజా సమస్యలపై కేంద్రీకరణ మాత్రమే అవకాశవాద రాజకీయాలకు సమాధానమవుతాయి.

Thursday, January 5, 2012

ఉప ఎన్నికల వీరంగాలు
మాది తెలంగాణా కోసం పోరాటం తప్ప రాజకీయం లేదు అని ప్రతివారూ చెబుతుంటారు.ఆ పేరుతో తమ రాజకీయం తాము చేస్తుంటారు.ఇంతకూ తెలంగాణా సమస్య రాజకీయాలతో సంబంధం లేనిది కాదు. ఆ జపం చేసే పార్టీలకూ రాజకీయాలు లేకపోలేదు. అదే ఏకైక రాజకీయంగా వున్న పార్టీ టిఆర్‌ఎస్‌ , తమ రాజకీయాల్లో దాన్నీ ఒక భాగంగా చేసుకున్న కాంగ్రెస్‌ తెలుగుదేశం( బిజెపి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు కూడా) తీరు తెన్నులు భిన్నంగా వుండటమే దానికి నిదర్శనం. తెలంగాణా రంగస్థలంగా టిఆర్‌ఎస్‌ టిడిపిల మధ్య సాగుతున్న ఎడతెగని రాజకీయ రగడ ఒక ప్రాంతీయ పార్టీకి, ఒక ఉప ప్రాంతీయ పార్టీగా మధ్యన అనివార్యమైన రాజకీయ ఘర్షణ మాత్రమే. ఇందులో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనే మీమాంస అర్థరహితం. కాకపోతే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించకుండా అడ్డుకుంటామని చాలా కాలం చేసిన ప్రకటనలు, ఘటనలు ఎవరు బలపర్చలేరు. దీన్ని అధిగమించి చంద్రబాబు యాత్ర నిర్వహించడాన్ని సహేతుకంగా కొనసాగించుకునే బదులు మోత్కుపల్లి నరసింహులు వంటి నాయకులు ఉరితాళ్ళ ప్రహసనంగా మార్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సవాళ్లు బొత్తిగా అనుచితమైనవి. ఆయనపై టిఆర్‌ఎస్‌ నేతలు విరుచుకు పడిన తీరూ డిటోనే. దీనంతటితో వినోద కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్‌ రాజకీయం ఇంకా విపరీతమైంది.
ఎవరి రాజకీయాలు వారివి అని వదిలేయవచ్చు గాని ఈ మొత్తం వ్యవహారంలో పదే పదే తెలంగాణా ప్రాంతం ప్రజల ప్రస్తావన వస్తుంది. తెలంగాణా విభజన సాధించాలన్న ఉద్యమంలో ఎవరు మొనగాళ్లన్న సవాళ్లు

Sunday, January 1, 2012

జన్మస్థలాల కన్నా విధానాలే కీలకం..కె.సి.ఆర్‌ విజయనగరం జిల్లాలో పుట్టారని తెలుగు దేశం నేతలు చేస్తున్న వాదన నిజానికి చాలా కాలం నుంచి వున్నదే గాని ఇప్పుడు అధిక ప్రచారం లభించింది. కాదు తాము ఏడు తరాలుగా కరీం నగర్‌ వాసులమని కెటిఆర్‌ వాదన. నా వరకు నాకు ఈ రెండు వాదనల్లో ఏది నిజమైనా పెద్ద పేచీ లేదు. ఎందుకంటే ఎవరి తాతలు ముత్తాతలు ఎప్పుడు ఎక్కడ పుట్టి ఎక్కడకు చేరారన్న దాన్ని బట్టి ఇప్పటి రాజకీయాలను నిర్ణయించలేము. పుట్టిన స్థలాన్ని బట్టి చట్టరీత్యా వుండే అంశాలు తప్ప ఇతర అనర్హతలు అర్హతలు ఏవీ సంక్రమించవు. వాటిపై తలలు పగలగొట్టుకోవడం కూడా అనవసరం. నల్లజాతి రచయిత ఎలెక్స్‌ హేలీ తన పూర్వీకుల గురించి శోధించి రాసిన రూట్స్‌ సంచలనం సృష్టించింది. పాలకుల విధానాలను బట్టి అవసరాలను బట్టి ప్రకృతి పరిస్థితులను కుటుంబ పరిస్థితులను బట్టి దారి వెతుక్కుంటూ పోవడం సహజంగా జరిగేదే. ఏడు తరాలు కాకుంటే అంతకు ముందు ఏం జరిగిందనేది చెప్పాలంటే మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి వుంటుంది. ఇప్పుడున్న కుల మత ప్రాంత హద్దులు కొన్నిసార్లు జాతీయతులు కూడా నిలవక పోవచ్చు. ఎవరి రాజకీయం దేనిపై నిర్మింబచడిందన్నదే సమస్య. 2000 తర్వాతనే తెలంగాణా విభజన నినాదం కెసిఆర్‌ ఎత్తుకున్నారు. అంతకు ముందు చెన్నారెడ్డి వంటివారున్నారు. ప్రజల ఆదరణ ఏ మేరకు ఎంత కాలం పొందగలిగితే అంత కాలం వారు రాజకీయ ప్రాధాన్యత పొందుతారు. అంతే . తమిళ దురభిమానం బాగా ఉపయోగించుకున్న కరుణానిధి, ఎంజిఆర్‌ ఇద్దరూ జన్మతా తమిళులు కాదని అంటుంటారు. మహారాష్ట్రలో శివసేన జాతి దురహంకార పోకడలను దేశ ప్రజలు హర్షించలేదు. హైదరాబాద్‌ సంస్థానంగా వున్నప్పుడు నిజాం అనుసరించిన విధానాల కారణంగా ్ల ప్రాంతాలు విడిపోయి వాటి మధ్య అసమానతల వల్ల అభివృద్ధిలో ముందు వెనకల వల్ల అటూ ఇటూ రాకపోకలు చాలానే జరిగాయి. ఇందులో ఎవరిదీ తప్పు కాదు. అయితే సమస్యల్లా ఒకే రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడాన్ని వలస అంటూ తప్పు పట్టడం, రాజకీయ అవసరాలను బట్టి వారిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడ్డం , హెచ్చరికలు గుప్పించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ విషయంలో కెసిఆర్‌ వంటి వారి వైఖరి మారవలసిందే. అంతేగాని జన్మభూమి వివాదాలు అవసరం లేదు. ఇక ఉద్యమ ఉధృతి తగ్గుముఖం పట్టిందనే అంచనాతో కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే తెలుగు దేశం వైఖరి అర్థమవుతున్నా ఇక్కడ తెలంగాణా కోసం సరిగ్గా పోరాడటం లేదని ఇక్కడ, పోరాడుతున్నందుకు అక్కడా ఏకకాలంలో ఒకే పార్టీ వారు విమర్శిస్తుంటే విశ్వాసం వుంటుందా అనేది వారు ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ వైరుధ్యం వారికీ ఇబ్బంది కరంగా మారే అవకాశం చాలా వుంది.ఇప్పుడు తాజాగా జగన్‌ కూడా ఈ వ్యూహాత్మక విన్యాసాల్లోకి ప్రవేశించారు గనక తెలంగాణా రాజకీయం మరింత రసవత్తరంగా సాగొచ్చు.