Pages

Saturday, January 29, 2011

నల్లబడిన గణతంత్రం- గాంధీ జపం తూతూ మంత్రం






ఓ మహాత్మా ఓ మహర్షీ
ఓ క్షమా పీయూష వర్షీ
ఎచట నీ అహింస
ఎచట నీ కరుణా రిరంస
చూడు దేశం ద్వేష మగం
క్షుర జిహ్వానల విభుగం


మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ వాక్యాలు గాంధీజీ ప్రబోధాలకు దేశంలో వాస్తవాలకు మధ్యన అంతరాన్ని కళ్లకు కడితే కాళోజీ మరింత సూటిగా-
బాపూజీ బతికిన యప్పటి
సత్యాహింసల దుప్పటి
ఘనతలు సాంతము చిరిగెను
అతుకుల బొంతగ మిగిలెను
అంటాడు. ఈ వ్యాస రచయిత ఒక సందర్భంలో
కుంభకోణ భారతాన
రోజుకొక్క రోత గాధ
గంగలోన కలిసెనులే
గాంధి తాత నీతిబోధ
అని రాశాడు. ఈ మాటలు ఎంత నిజమో తెలుసుకోవడానికి మొన్ననే ముగిసిన గణతంత్ర(రిపబ్లిక్‌) దినోత్సవం కన్నా మరో సందర్భం అవసరం వుండదు.
రిపబ్లిక్‌ దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ దేశానికి ప్రధానమైన బెడద అవినీతి అని ఆవేదన ఆందోళన వెలిబుచ్చారు. ఇంచుమించు అదే సమయంలో శక్తివంతుడైన ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి దేశాలు దాటిపోయిన నల్లడబ్బు ఆసాములు వివరాలు తెలిసినా వెల్లడించగల అవకాశం లేదని నిస్సిగ్గుగా చెప్పేశారు.ఈ రెండు మాటలకూ మధ్యన తేడా
ఒకటైతే మన గణతంత్రం ఘనత ఏమిటో స్పష్టమవుతున్న తీరు మరొకటి. మన దేశాన్ని ఆక్రమించి మనపై పెత్తనం చేస్తూ మన సంపద విదేశాలకు తరలించుకుపోతున్న వారికి వ్యతిరేకంగానే గాంధీజీ స్వాతంత్ర పోరాటం సాగించారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బయి ఏళ్లకు మన దేశం నుంచి మన ఆధ్వర్యంలోనే మన సంపద అక్రమంగా తరలించుకుపోతున్నవారి వివరాలు తెలిసి కూడా చెప్పలేమని విత్తమంత్రి చెప్పడం కన్నా విపరీతమూ విడ్డూరమూ మరేముంటుంది? గాంధీ జపాన్ని తూతూ మంత్రంగా మార్చివేసిన పాలకుల హయాంలో గణతంత్రం ఎలా నల్లబారి పోయిందో స్పష్టమవుతుంది.
గాంధీజి పట్ల ఎవరి భావాలు ఏమైనప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆయన పాటించిన నిరాడంబరత్వం, సేవా ధర్మం, దేశాభిమానం వంటివి అందరికీ ఆదర్శం. కొన్ని కోట్లమందిలో ఆ విలువలు పాదుకొల్పడానికి కారణమైన మహనీయుడు ఆయన. తను చెప్పిన విలువలు తన కాలంలోనే నాశనం అవుతున్న తీరును కూడా ఆయన గమనించాడు. స్వాతంత్రానికి ముందే రాష్ట్ర సా ్థయిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో ప్రబలిన అవలక్షణాలను అధికార లంపటాన్ని అవాంఛనీయ పోకడలను గమనించి ఆందోళన చెందాడు. వాటి గురించి ఫిర్యాదులు చేస్తుంటే ఆయన మాట పట్టించుకునే నాథుడే లేకపోవడం చూసి కలత చెందాడు. స్వాతంత్రం దగ్గర పడుతున్న కొద్ది అత్యున్నత స్థాయిలోనే ముఠాతగాదాలు వ్యక్తిగత పదవీ లాలసలు పరాకాష్టకు చేరడం ఆయననెంతో బాధ పెట్టింది. పరతంత్ర భారతంలో ఆఖరి కాంగ్రెస్‌ అద్యక్షుడుగా ఎవరిని నియమించాలన్నది ఆయనకు విషమ పరీక్షగా మారింది. ఉన్నంతలో మితవాద భావాలు గల సర్దార్‌ పటేల్‌ను గాక మధ్యేవాదిగా పేరొందిన నెహ్రూను ఎంపిక చేసి తద్వారా ఆయన తొలి ప్రధాని కావడాన్ని ఖాయం చేశారు గాంధీ. అయితే తర్వాత కూడా నెహ్రూ పటేల్‌ వివాదాలు నూతన ప్రభుత్వంలో ప్రతిష్టంభనకు దారి తీశాయి. వాస్తవంలో దేశ విభజన సమస్య, అనంతరం పాకిస్తాన్‌కు చెల్లించవలసిన పరిహారంపై పట్టుబట్టడం వంటివి గాంధీజీకి ఆయన పూర్వ శిష్యులకు మధ్య విభేదాలకు కూడా కారణమైనాయి. హిందూ మతోన్మాది గాడ్సే చేతుల్లో తాను హత్య గావించబడటానికి ముందు గాంధీజీ నెహ్రూ పటేల్‌ విభేదాలు పరిష్కరించడంలోనే తలమునకలై ఆలస్యంగా ప్రార్థనా స్థలికి చేరుకున్నారు. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్‌లో తర్వాత పొడసూపిన లక్షణాల బీజాలు ఈ ఘట్టంలోనే మనకు కనిపిస్తాయి. దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ఫ్రధాన పాత్ర వహించినప్పటికీ పాలక వర్గ పార్టీగా కాంగ్రెస్‌ కళంకాలు మూట కట్టుకోవదాన్ని ఆయన నాడే గుర్తించి పార్టీని రద్దు చేసి సేవాదళ్‌గా చేయాలని చేసిన సూచన అరణ్యఘోషగానే మారింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది లోగానే గాంధీజీని హత్య చేయడం ద్వారా హిందూ మతోన్మాదం భావి ప్రమాదాలను తనుగానే బయిటపెట్టింది.అయితే దాన్నుంచి తగు గుణపాఠాలు నేర్చుకోవడంలో కూడా కాంగ్రెస్‌ సఫలం కాలేదు. ఆ మతోన్మాదంతో సూటిగా పోరాడే బదులు రాజీ దోరణితో అవకాశవాద వైఖరి అనుసరించింది. తను మతతత్వ పార్టీగా మారకపోయిన మతతత్వాల పట్ల సమాయాన్ని సందర్భాన్ని బట్టి మెతక వైఖరి అనుసరిస్తూ వాటికి ప్రాణం పోసింది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం లౌకిక పాఠాలు చెప్పడం తప్ప దైనందిన పాలనా వ్యవహారాల్లో రాజకీయ విధానాల్లో సిసలైన లౌకిక సూత్రాన్ని పాటించడానికి సిద్దం కాలేదు. అందుకే దాన్ని అన్ని రకాల మతతత్వ వాదులు వాడుకోగలిగారు. మతకలహాలను అరికట్టడంలో గాని,వాటి నివేదికలను బహిర్గతంచేసి రాజకీయ ప్రచారోద్యమం నిర్వహించడంలో గాని కాంగ్రెస్‌ ఏ నాడూ శ్రద్ద చూపలేదు. మరోవైపున కమ్యూనిస్టులపైన ముఖ్యంగా బెంగాల్‌ కేరళలో ప్రధానంగా వున్న మార్క్సిస్టు పార్టీపైన మాత్రం దారుణ నిర్బంధం సాగించింది. చివరకు దేశంపైనే ఎమర్జన్సీ రుద్ది ప్రజాస్బామ్యం పీకనొక్కింది. ఇంకో వైపున తర వూగిసలాటలు అవకాశవాదాలతో జనసంఘం/బిజెపి పెద్దగా పెరగడానికి ఆ విధంగా తనే కారణమైంది. తన అధికార పరిరక్షణే ఏకైక సూత్రంగా పంజాబ్‌,కాశ్మీర్‌, అస్సాం వగైరా ప్రతిచోటా విచ్చిన్న శక్తులను పాలు పోసి పెంచి దేశ సమగ్రతకు ముప్పు తీసుకొచ్చింది.ఆ ఫలితాలను దేశమంతా అనుభవించడమే గాక ఆఖరుకు ఇందిరాగాంధీనే బలై పోయే స్తితి ఎదురైంది. ఆమె హత్య తర్వాత సిక్కులపై వూచకోతతో పరిస్తితి మరింత దిగజారింది. ఇందుకు కారకులైన కాంగ్రెస్‌ నేతలకు ఈనాటికి శిక్ష పడింది లేదు.కాగా ఆ కల్లోల నేపథ్యంలో గొప్ప మెజార్టితో గద్దెక్కిన రాజీవ్‌ గాంధీ తల్లి కాలంలో పెరిగిన అవినీతి మరింత పెరగడానికి కారకుడైనాడు.పైగా ఆ దశలోనే షాబాను కేసులో రాజ్యాంగ సవరణ, బాబరీ మసీదు/ రామజన్మభూమి తలుపులు తెరిపించడం వంటి చర్యలతో బిజెపి నెత్తిన పాలు పోసి తను ఓడిపోయాడు. అయినా విపిసింగ్‌ నాయకత్వంలో లౌకిక ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కూలదోయడంలో బిజెపితో చేతులు కలిపారు. ఈ విధంగా ప్రజాస్వామ్యంపై దాడి, అవినీతి, మతతత్వంతో రాజీ వంటి కాంగ్రెస్‌ విధానాలు దేశానికి ఉపద్రవంగా పరిణమించాయి. పివినరసింహారావు హయాంలో బాబరీ కూల్చివేతను అనుమతించడం, నూతన ఆర్థిక విధానాల పేరిట స్వావలంబనకు తిలోదకాలివ్వడం , అవినీతి కేసులో ప్రధానికి తాఖీదులు జారీ కావడం మన రాజ్యాంగ రాజకీయ విలువలనే మొదలంటా కదిలించాయి. వీటికి కాంగ్రెస్‌ తర్వాత మూల్యం భారీగానే చెల్లించింది.తర్వాత ఏకంగా బిజెపి నాయకత్వంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడ్డం తదనంతర పరిణామాలు బాగా తెలిసినవే. ఇవన్నీ గాంధీజీ వారసత్వం నుంచి నిష్క్రమణలే.గాంధీ ఎంతటి భక్తుడైనా మతతత్వ వాది కాదు. మత పరమైన దాడులను సహించిన వ్యక్తీ కాదు.ఆయన ప్రాణబలికి కూడా అదే కారణమైంది.ఆనాడు ఆయన ప్రాణాలను కాపాడ్డానికి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చూపిన వారే తర్వాత ఆ లౌకిక సంప్రదాయాలనూ బేఖాతర్‌ చేసి బిజెపికి కొమ్ములు తెచ్చారు.ఆ బిజెపి నాయకుడే పాకిస్తాన్‌ వెళ్లి జిన్నా లౌకిక వాది అని కితాబునిచ్చి రావడం వింతల్లో కెల్లా వింత.
రాజకీయాలు పక్కనపెట్టి వ్యక్తిగతంగా చూస్తే గాంధీజీ పుట్టిన గుజరాత్‌ ముఖ్యమంత్రిని నేడు దేశానికే ఆదర్శమని బిజెపి ప్రచారం చేస్తున్నది. 2001లో మహా భయనకమైన జాతి హ త్యాకాండకు కారణమైన మోడీ దేశానికి ఆదర్శ నాయకుడని మీడియాతో పాటు ప్రధాన పాలక పార్టీలు ఆమోదించడం దేశంలో నెలకొన్న వికృత పరిస్తితికి మత మార్కెట్‌ చాందసాల కలగాపులగానికి నిదర్శనం. ఆ హత్యాకాండకు సంజాయిషీ చెప్పకుండా సమర్తించుకునే మోడీ గాంధీజీ వారసత్వాన్ని కూడా అప్పుడప్పుడూ వుటంకించడం దుర్భరంగా గోచరిస్తుంది. మామూలుగానే పారిశ్రామిక రాష్ట్రమైన గుజరాత్‌కు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి గనక మోడీ మహాదర్శ నాయకుడు సమర్థతకు మరోపేరు అన్నట్టు చిత్రిస్తే గాందీజీని కన్నగడ్డ క్షోభించకమానదు.
1920లలో గాంధీజీ రంగ ప్రవేశం తర్వాతనే భారత స్వాతంత్ర పోరాటం ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకెళ్లింది. ఇంచుమించు అదే సమయంలోనే ఆరెస్సెస్‌, కమ్యూనిస్టులు కూడా రంగంలోకి వచ్చారు.ఇందులో ఆరెస్సెస్‌కు ఏనాడూ సామ్రాజ్యవాద వ్యతిరేక సంప్రదాయాలు లేవు. కమ్యూనిస్టుల వలె సూటిగా వ్యవహరించకపోయినా కాంగ్రెస్‌ కూడా అనేక విధాల సామ్రాజ్యవాద వ్యతిరేకతకు శాంతి కాముక విధానానికి మద్దతు నిస్తూవచ్చింది. స్పెయిన్‌ అంతర్యుద్ధంలోనూ, చైనా ప్రజల పోరాటాన్ని బలపర్చడంలోనూ నెహ్రూ ప్రత్యక్షంగా చొరవ చూపించారు.ఈ ప్రకారమే స్వాతంత్రానాంతరం కూడా ఆయన అలీన విధానాన్ని పెంపొంచారు. ఇందిరాగాంధీ కూడాచాలా కాలం దాన్ని కొనసాగించినా తర్వాత కాలంలో పరస్థితి పూర్తిగా మారిపోయింది.ఈనాటికి మన దేశం అమెరికా సామ్రాజ్యవాదానికి అనుంగు అనుయాయిగా మారిపోతున్నది.ఇది స్వాతంత్రోద్యమ లక్ష్యాలకు మరో అపప్రధ.
గాంధీజీ కాస్త అవాస్తవికంగానే అయినా దేశీయ పరిశ్రమలను మరీ ముఖ్యంగా కుటీర పరిశ్రమల వృద్ధిని కాంక్షించారు. చేనేతను బతికించుకోడానికి విదేశీ వస్త్ర దహనం చేశారు.ఇప్పుడు ఇన్నేళ్లతర్వాత అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన ఈ దేశంలోకి ఇన్నేళ్ల తర్వాత విదేశీ రెడీ మేడ్‌ వస్త్రాలు వెల్లువగా వస్తున్నాయి! మన జౌళి ఎగుమతులకు మాత్రం వారు అనేక ఆంక్షలు విధించి వేధిస్తున్నారు.దేశీయ పరిశ్రమల అభివృద్ది అటుంచి విదేశీ సరుకుల సంతగా దేశం మారిపోతుంటే చిన్న పారిశ్రామిక వేత్తలు వ్యాపారస్తులు చితికి పోతున్నారు. ఇన్నేళ్ల తర్వాత నేతన్న ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.
భారత దేశం గ్రామాల్లో జీవిస్తుంది అన్న గాంధీ మాట తిరగబడి రైతన్నల ఆత్మహత్యలు ఆక్రోశాలు దేశాన్ని కలచి వేస్తున్నాయి. ఆడది అర్థరాత్రి స్వతంత్రంగా తిరగడం అనే పగటి కల అలా వుంచితే పట్టపగలు దేశాధినేతలు కూడా పహారా లేకుండా పదం కదపలేని పరమ దుర్బాగ్యం దేశానికి దాపురించింది. ఇదో వ్యామోహంగా మారి కమాండాలో భద్రత ఘరానాగా పరిగణించే విడ్డూర దశ వచ్చింది. నిరాడంబరత్వమనే విలువ విలుప్తమై ఆడంబరాలు పటాటోపాలు తప్పనిసరని ఎదురు చూసే అల్సత్వం అధినేతల్లో తిష్ట వేసింది. స్వంత పిల్లలను నియమాలతో వేధించిన గాంధీజీ ఒకటైతే పిల్లల దుశ్యర్యలను కాపాడ్డం కోసం ఎంతకైనా తెగించే పెద్దలూ వారసత్వం హక్కుగా భావించే కుటుంబాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి.
గాంధీజీ బలిదానాన్ని స్మరించుకునే సందర్భంలో ఆయన నమ్మిన విలువలు నడిచిన మార్గాలనైనా బలి కానివ్వకుండా కాపాడుకోవలసిన బాధ్యత దేశాభిమానులపై వుంటుంది. దురదృష్టవశాత్తూ నేటి ప్రపంచ సరుకుల సంతలో గాంధీజీని కూడా అసభ్యంగా అవమాన కరంగా లోగోలపైనో మరో విధంగానో వాడుకునే పేటెంటు తీసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడానికి సమయం పట్టింది. జాతిపితగా చెప్పుకునే గాంధీ తాత గౌరవానికే దిక్కు లేకపోయాక మీరూ నేను ఏమనుకుని ఏం లాభం? ఈ సమయంలో గాంధీజి నిరంతరం నడిపించిన సామాన్య ప్రజలే సమరశీల చైతన్యం చూపిస్తే తప్ప ఈ దేశానికి మోక్షం వుండదు.

5 comments:

  1. Nice Sir.
    గమ్యం మాత్రమే కాదు, ఆ గమ్యానికై సాగించే పయనం కూడా నిజాయితీ గానే ఉండాలని జీవితాంతం ప్రబోధించడమే కాకుండా, ఆచరించి చూపిన అభినవ ప్రవక్త - గాంధీజీ. ఆయనతప్ప మిగతా గాంధీలందరు ఆయన ఆశయాలకు తూట్లుపొడిచినవారే. సెక్యులరిజాన్ని అర్థం చేసుకోవడంలో ఈ మిగతా గాంధీల వైఫల్యాలే 'సూడో సెక్యులరిజానికి' దారితీసి, ఈ సూడో సెక్యులరిస్టులకి వ్యతిరేకంగా యాంటీసూడో సెక్యులరిస్టులరిస్టుల రూపంలో, అతివాద మతతత్వ పార్టీలు అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఈ సూడోలు,యాంటీసూడోలు తప్ప మరో ఆప్షన్ దేశ ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ప్రస్తుత విషాదం.

    ReplyDelete
  2. రేపు ఏ అమెరికావాడో ఇండియాపై దాడి చేస్తే అప్పుడు కూడా అహింసా మంత్రం జపించుకుంటూ కూర్చుంటామా? ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచినందుకు సంతోషం. బ్రిటిష్ పోలీసులు నిరాయుధులపై కాల్పులు జరుపుతున్నా అహింస పేరుతో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించిన గాంధీ ఒక మహాత్ముడా? గాంధీ గురించి మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. మొదటి ప్రపంచ యుద్ధం టైమ్‌లో గాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఓపెన్‌గా సమర్థించాడు. అదేమని అడిగితే యుద్ధాన్ని ఆపడం తన చేతులలో లేదని చెప్పి తప్పించుకునేవాడు. 1917 అక్టోబర్ విప్లవం వచ్చిన వెంటనే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తప్పుకుంది. కానీ గాంధీ అలా కాదు. ఆ టైమ్‌లో పూర్తిగా బ్రిటిష్‌వాళ్ల పక్షానే ఉన్నాడు. అది ప్రజల కొరకు జరుగుతున్న యుద్ధం కాదు, సామ్రాజ్యవాద దేశాల మధ్య వ్యాపార గొడవలతో వచ్చిన యుద్ధం అని తెలిసినా గాంధీ ఆ యుద్ధంలో బ్రిటిష్‌వాళ్లపై రాజభక్తిని ప్రదర్శించాడు. చరిత్ర చదివితే అంతా తెలుస్తుంది. గాంధేయవాదం ప్రజలకి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెపుతుంది కానీ ప్రజా హక్కుల గురించి చెప్పదు.

    ReplyDelete
  3. ఈ షాడో సూడోల గజిబిజి ఏమిటో నాకు అర్థం కాలేదు చీకటి గారూ! ఇంతకూ మీకు సూడో హిందూత్వ వాదులు మాత్రం కనిపించినట్టు లేదు.
    ఇక ప్రవీణ్‌ శర్మ గారు తనకు గాంధీ గురించి ఎంత తెలుసో తెలియజేసి నాకు సరిగ్గా తెలియదని తెలిపినందుకు గొప్ప ధన్యవాదాలు. గాంధీజీ అహింస సిద్దాంతం చాలా గొప్పదని, ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ప్రతిరూపమని ఎక్కడ రాశానో చూపిస్తే కృతజ్ఞుడుగా వుంటాను. గతంలో కూడా చెప్పాను- నేను రాయనిది నాకు అంటగట్టి ఆగ్రహావేశాలకు గురి కాకండి. అన్నిటి కన్నా ముఖ్యం చారిత్రికంగా ఎప్పుడు ఏది ఎలా చూడాలన్న విచక్షణే. వైరుధ్యాలనూ వాస్తవాలనూ కూడా చూడటమే పరిపక్వత అవుతుంది తప్ప యాంత్రికంగా మాట్లాడ్డం కాదు. నేను రాసింది గాంధీపై విశ్లేషణ కాదు- ఆయన చెప్పిన మేరకైనా నిలబడని ప్రస్తుత పాలక వర్గాల తీరు. విప్లవ కర అవగాహన వున్న వారికి ఆయన పరిమితులు ఎలాగూ తెలుసు.అయితే కనీస చారిత్రిక దృష్టి వున్నవారైనా సరే ఆయన వారసత్వంలోని సానుకూల పార్వ్శాన్ని గుర్తిస్తారు.

    ReplyDelete
  4. మొన్నటి వరకు పాలక వర్గం గాంధీ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునేది. ఇప్పుడు అణ్వాయుధాలు భారీగా ఉన్న దేశాలలో ఇండియా ఒకటి. ఒకవైపు అహింసావాదం వల్లిస్తూ ఇంకో వైపు అణ్వాయుధాలు భారీగా కలిగి ఉండడం కష్టమనిపించి గాంధీ నామస్మరణ తగ్గించేశారు. ఏ పాలక వర్గం వాళ్లైనా తమ ప్రభుత్వం పడిపోకుండా తమ జాగ్రత్తలలో తాము ఉంటారు. గాంధీ విషయంలో వాళ్లు చేసినది ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్లకి తప్పు అనిపించదు.

    ReplyDelete
  5. గాంధీల(గాంధీ బొమ్మ ఉన్న నోట్లు)కోసం,గాంధీల(సోనియా,రాహుల్,రాజీవ్,ఇందిరా)జపం చేసే రోజులివి.గాంధీ మనమరాలు విజయవాడ వచ్చిందంటే ఏ గాంధీ అని నేనే అడిగాను నా చెల్లెలను .ఒబామా,మండేలా లాంటి వ్యక్తులు గాంధీ గురించి మాట్లాడితేనే,అసలు గాంధీ గురించి మాట్లాడుతున్నారనుకోవాల్సిన రోజులొచ్చాయి. చెప్పే సిధ్ధాంతాలను తాను ఆచరించే నాయకుడు మచ్చుకొకడైన లేని దేశంలో మీలాంటి విజ్ఞుల ఘోష చెవిటివాడిముందు శంఖం ఊదినట్లే.అన్ని వస్తువులను దిగుమతి చేసుకున్నట్లే గాంధీ లాంటి నాయకుణ్ణి కూడా దిగుమతి చేసుకోవాలేమో!

    ReplyDelete