Pages

Friday, February 22, 2013

కుట్రలు వమ్ము చేయాలి



మానవ లక్షణాలే కోల్పోయిన ముష్కర హంతకుల ఉన్మాద హత్యాకాండకు అమాయకులూ అసహాయులే అత్యధికంగా బలవుతుంటారు. గురువారం సాయింత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో హఠాత్‌ హంతక విస్పోటనాలకు విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారంతా ఈ కోవకు చెందిన వారే. నాగరికతకూ ఆధునికతకూ మానని వ్రణంలా తయారైన రకరకాల ఉగ్రవాదాల విచక్షణా రహిత హత్యాకాండతో వర్తమాన ప్రపంచం అందులో భాగంగా భారత దేశం కూడా తల్లడిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదు నగరం కూడా ఉగ్రవాద మారణహౌమాలకు ఒక కేంద్రబిందువుగా మారడం అత్యంత ఆందోళన కరం. ఈ విషయం గత కొన్నేళ్లలో అనేక సార్లు రుజువైనా అలసత్వం వీడని పాలకుల పోలీసుల అలసత్వం మరింత అపాయకరం. గత నెలరోజుల్లోనూ పొంచి వున్న ముప్పు గురించిన ప్రజాశక్తి కథనాలతో సహా అనేకానేక హెచ్చరికలు వెలువడ్డాయి. ఆఖరుకు ఆ పార్టీకే చెందిన కేంద్ర హౌంశాఖ మంత్రి కూడా ముందస్తు సమాచారం పంపించానంటున్నారు. అయినా సరే అప్రమత్తం కాని అధికార యంత్రాంగాన్ని అధినేతలను ఏమనాలి? ఏమన్నా అది రాజకీయం చేయడం అంటారు గాని మరెవరిని అనాలి?
లుంబిని గోకుల్‌చాట్‌ పేలుళ్ల తరుణంలోనే రాజధాని గుండె చెదిరింది. ఆ తర్వాత సాగిన ఆక్టోపస్‌ వ్యవహారం అదో పెద్ద ప్రహసనం. గత మూడేళ్లలోనూ రాష్ట్రంలో తిష్ట వేసిన అనిశ్చితి నడుమ హైదరాబాదులో పోటాపోటీ మత తత్వాల మధ్య పొంచి వున్న ప్రమాదంపై ప్రమత్తత వూహకందని విషయం. అఫ్జల్‌ గురు ఉరితో సహా అనేకానేక కారణాలు ఏకరువు పెట్టొచ్చు గాని అన్నిటికన్నా కీలకం అలసత్వమే. ఉగ్రవాద కుట్రలను ఛేదించడం నూటికి నూరు పాళ్లు సాద్యం కాకపోవచ్చు గాని విశృంఖల మారణ వ్యూహాలన అరికట్టడానికి పటిష్టమైన నిఘా నియంత్రణ అవసరం. దురదృష్టవశాత్తూ పదే పదే ఉగ్రవాదం పంజా విసురుతున్నా పోలీసు బాసులు గాని ప్రభుత్వ నేతలు గాని మేల్కొనడం లేదు. ఘటన జరిగిన తర్వాత గంభీర ప్రకటనలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఇప్పుడు కూడా ఘటనా స్థలంలో సిసి కెమెరాల వైఫల్యం, ముందు
కమిషనర్‌ ఆలయ సందర్శన తరుణంలో విఫల యత్నం, వంటివన్నీ దేన్ని ముందు జాగ్రత్త లోపాన్నే సూచిస్తున్నాయి. జన సమ్మర్దంగా వుండటమే గాక గత ఘటనలనూ రంగస్థలమైన దిల్‌సుఖ్‌నగర్‌ వంటి చోట్ల ప్రత్యేక నిరంతర నిఘా ఏర్పరిస్తే ఇలాటివి నివారించే అవకాశం వుండేది.
కనక ఇప్పుడైనా సమర్థనలు మాని సమర్థమైన చర్యలు తీసుకోవడం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వ కర్తవ్యం.ఇంతటి ఘాతుకానికి కారకులైన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలి. లేకపోతే ఇలాటివి మళ్లీ మళ్లీ ఇలాటి మారణహౌమాలు జరపడానికి వారు వెనుకాడరు. సీమాంతర ఉగ్రవాదం గనక దీన్ని ఎదుర్కోవడంలో కేంద్రం కూడా అన్ని విధాల అన్ని దశల్లో సహకరించవలసి వుంటుంది. దొరికిన ఏ ఒక్క ఆదారాన్ని పోనివ్వకుండా కొసదాకా వెంటాడాలి. ఇందుకు సంబంధించిన సమాచారంపై ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకపోతే అనేక కట్టుకథలతో పుకార్లతో అలజడి సృష్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. కనక త్వరితంగా హంతకులను పట్టుకోవడం,పెరుగుతున్న సవాళ్లకు దీటుగా పోలీసు యంత్రాంగాన్ని నిఘా విభాగాన్ని వినియోగించి విద్రోహాలను పసిగట్టి అరికట్టే చేవ చూపించాలి. ఇందుకు సంబంధించి ప్రజలకు భరోసా కల్పించడం జరగాలి. దాంతో పాటే మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ప్రకటించిన సహాయం సత్వరం సక్రమంగా అందేలా చూడాలి. నష్టపోయిన వారందరికీ పరిహారం ఇవ్వాలి. గత పేలుళ్ల బాధితులకే ఇప్పటికీ సహాయం అందని అనుభవం పునరావృతం కానివ్వరాదు.
ఇలాటి సంక్లిష్ట సమయంలో రాజకీయ విభేదాలకు కుల మత ప్రాంతీయ తేడాలకు అతీతంగా ప్రతివారూ భుజం కలిపి నిలవాలి. స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల ప్రచారాలతో పక్కదోవ పట్టించే శక్తులకు ఏ మాత్రం అవకాశం రాకుండా జాగ్రత్త పడాలి. వరుసగా విరుచుకుపడుతున్న విద్రోహ దాడుల నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీలు మనోధృతిని మతసామరస్యాన్ని నిలబెట్టుకుని కుటిల శక్తుల కుట్రలను వమ్ము చేయాలి. నాలుగు వందల ఏళ్లకు పైబడిన హైదరాబాదు ప్రశాంత ప్రజాస్వామిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. చారిత్రాత్మకమైన రాజధాని నగర వాసులు ఆ విధమైన స్పూర్తి ప్రదర్శించడం తథ్యమనే విశ్వాసం మృతులకు ఇదే మా సాశ్రు నివాళి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుతాపం. ఈ ఘటనలో క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి సేవ చేస్తున్న వారందరికీ ఈ సంక్లిష్ట సమయంలో విధి నిర్వహిస్తున్నవారందరికీ అభినందనలు.

1 comment:

  1. ఆర్టికల్ క్లుప్తంగా-సమగ్రంగా ఉంది. సమర్ధింపులు కాకుండా సమర్ధవంతమైన చర్యలు ఇకనైనా తీసుకుంటారని ఆశిద్దాం.

    ReplyDelete