Pages

Friday, February 1, 2013

గడువులు, గండాలుదూషణలు దుర్బాషల్లో తెలుగు నేతలంతా ప్రాంతాతీతమైన సమైక్య భావన ప్రదర్శించడం సమకాలీన రాజకీయాల్లో ఒక విలక్షణత. భావం భాష కన్నా ఎప్పుడూ ముఖ్యమైంది. కాని కావాలని భాషను విశృంఖలంగా ఉపయోగించినప్పుడు అసలు కన్నా కొసరు అన్నట్టు దానిచుట్టూనే పరిభ్రమించే విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంటుంది. మాటల మాంత్రికుడుగా మీడియా నామకరణం చేసిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్ర తెలంగాణాలకు చెందిన గత ప్రస్తుత కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపైన ఆయన ఉపయోగించిన భాష పదజాలంపై పెద్ద దుమారం సాగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. కొన్ని కేసులు కూడా నమోదైనాయి. ఇవన్నీ చివరకు ఎలా పరిణమిస్తాయో తెలియదు గాని ఇప్పటికైతే దీని వల్ల చర్చ తీరు మారిపోయింది. నెల అంటే రెండు నెలలు కావచ్చని ప్రజల ఇంగిత జ్ఞానాన్నే ప్రశ్నించిన కేంద్రం నిర్వాకం వెనక్కు పోయింది.
కెసిఆర్‌ ఇలా మాట్లాడ్డం ఇదే మొదటి సారి కాదు, బహుశా చివరి సారి కూడా కాబోదు! ఇస్తే వరం పెడితే శాపం అన్నట్టు ఆయన వ్యూహాత్మక బాషణాలన్ని విపరీతమైన మలుపులు తిరుగుతుంటాయి. వివాదంలో అవతలి పక్షాన్ని హీనాతిహీనంగా తీసిపారేయడం ద్వారా తనను తాను ఉన్నతంగా ప్రతిష్టించుకుని తన వాళ్లకు భరోసా ఇవ్వడం రాజకీయాల్లో ఒక బాణీ అనుకుంటే కెసిఆర్‌ దానికి ప్రతిరూపమనొచ్చు. అయితే శ్రుతిమించితే ఎలాటి వ్యూహమైనా బెడిసికొడుతుందనడానికి ఇప్పటి పరిస్థితి ఒక ఉదాహరణ.కాంగ్రెసేతర పార్టీలపై ఆయన దాడి సాగినంత కాలం వీణారవంలాగా వున్న ఈ మాటలే ఇప్పుడు విషతుల్యమై పోయాయంటే
ఇప్పుడు కాంగ్రెస్‌ను లక్ష్యం చేసుకోవడమే కారణం.అయతే ఈ క్రమంలో తెలుగు ప్రజలతో చెలగాటమాడుతున్న కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం కౌటిల్యం మరుగున పడిపోయి మాటల మంటలే ప్రధానంగా ముందుకొచ్చాయి.
తెలంగాణాపై కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్‌, సుశీల్‌ కుమార్‌ షిండేలు చేసిన ప్రకటన కాంగ్రెస్‌పై అవిశ్వాసాన్ని మరోసారి ఖరారు చేసింది. కెసిఆర్‌తో సహా దానిపై భ్రమలు పెంచిన వారిది ఎంత పొరబాటో స్పష్టమైంది. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల కేంద్రానికి ఎలాటి ఆసక్తి, బాధ్యత లేవని కూడా తేలిపోయింది. ఇదే ఆఖరి అఖిల పక్షం నెలలోగా అటో ఇటో తేల్చేస్తామని ప్రజ్ఞలుపలికిన హౌంమంత్రి షిండే చర్చలకు ఇంకా వ్యవధి కావాలనే అస్పష్ట ప్రకటన మాటున దాకున్నారు. అంతకు ముందే ఈ గడువునూ ప్రహసనంగా మార్చేసిన గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా తమ వాళ్లతో మాట్లాడ్డానికి వ్యవధి కావాలని నిరవధిక నిలుపుదల చేశారు. నాలుగు పార్టీలు అభిప్రాయం చెప్పాలంటూ గతంలో గత్తర చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తమ వాళ్లతో మాట్లాడ్దమే పూర్తి కాలేదని చెప్పడం ఎలాటి చిత్రమో దగాకోరులకే తెలుస్తుంది. ముఖ్యమంత్రి పిసిసి అద్యక్షుడు తదితరుల ప్రమేయం లేకుండానే సంప్రదించకుండానే ఇన్ని పిల్లిమొగ్గలు వేశారంటే రాష్ట్రాధినేతల పట్ల వారికి వున్న గౌరవం అదన్నమాట. తమలో తామే తేల్చుకోలేనప్పుడు మరెవరో బాధ్యులైనట్టు చిత్రించడం ఎంత నయవంచన కాదా? అఖిపక్షం తర్వాతా అటూ ఇటూ రెండు వైపులా రభస చేసింది ప్రధానంగా కాంగ్రెస్‌ వారే.రాజమండ్రిలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో సహా హాజరైన సభ జరిపిందీ వారే, దానిపై తెలంగాణాలో ధ్వజమెత్తిందీ అంతా అధిష్టానం ఆశీస్సులతలోనే జరిగివుంటుందని ఇప్పుడు తేలిపోతున్నది. ఈ ద్వంద్వ వైఖరికి ద్విపాత్ర పోషణకు నిర్దేశకత్వం ఢిల్లీ పెద్దలదే. ఆ పెద్దలు మూడు తరాలుగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తిన కె.సి.ఆర్‌ మూడు మాసాల కిందట వారిపైనే విపరీత విశ్వాసం ప్రదర్శించి విలీనం అంచుల దాకా వెళ్లడం,మూడు వారాల కిందట కూడా సానుకూల సంకేతాల గురించి ఆయన కుటుంబ సభ్యులే చెప్పడం అందరికీ గుర్తుండిపోయింది. కనకనే ఇప్పుడు ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడినా రాజకీయ వైరుధ్యం వెన్నాడుతుంటుంది. ఇప్పుడు కూడా విభజనకు షరతుగా విలీనం లేఖ ఇవ్వడానికి సిద్ధమని హరీష్‌ రావు తాజాగా మధుయాష్కీకి సమాధానంగా చెబుతున్నారు. ఇస్తే సంబరం ఇవ్వకపోతే సమరం వంటి పదబంధాలు బాగుంటాయి గాని విలీనం లేఖ చేతిలో పెట్టుకుని విమర్శలు ఎంత తీవ్రంగా చేసినా విశ్వసనీయత ప్రశ్న వుండనే వుంటుంది.
నిజాంకు ఆయన తైనాతీలైన దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటం సాగించి దేశాన్ని ప్రపంచాన్ని కూడా కదిలించిన తెలంగాణా అస్తిత్వం ఇప్పుడు రెండు పాలకవర్గ పార్టీలకే పరిమితమైన రాజకీయాంశంగా మారడం ఆందోళన కలిగించే అంశం. అందులో ఒక పార్టీ అప్పట్లో నిజాం రాజవైభోగాలు కొనసాగించినది కాగా మరొకటి ఇప్పటికీ ఆయనను కీర్తించే నేత నాయకత్వాన వుండటం పాలకవర్గ కోణంలో పరిశీలించవలసిన అంశం. కొంత మంది ప్రాంతీయ మేధావుల సంగతి అటుంచి దేశ వ్యాపితంగా ఇప్పుడు అమిత ప్రచారం పొందుతున్న చరిత్ర కారుడు రామచంద్రగుహ బుధ వారం ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో కూడా నవ తెలంగాణా నిర్మాతలైన కమ్యూనిస్టు యోధుల ప్రసక్తి లేదు. వారి భయంతోనే నాడు నెహ్రూ ప్రభుత్వం అనేక విన్యాసాలు చేసిన వివరం లేదు. అప్పుడూ ఇప్పుడూ కూడా కాంగ్రెస్‌కు స్వీయలబ్ది కోణం తప్ప సమస్య పరిష్కారం పట్ల సూత్రబద్దత శూన్యం. కనకనే ఎప్పటికప్పుడు ఏవో మాటల గారడీలతో నాన్చివేత నాటకం నడిపించడం!
ఎన్నెన్నో జాతీయ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ విధానాల్లో ఉద్యమాలను విమర్శలను కూడాేఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించే అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రాంతీయ సమస్యలో మాత్రం ఎటూ చెప్పకుండా ఇంతగా సాగదీస్తున్నదంటే ఖచ్చితమైన కారణాలుండాలి. ఏం చేస్తే లాభం నష్టం అన్న లెక్క తేలడం లేదు. ఏం చేసినా లాభం లేదన్న అంచనాలూ భయపెడుతున్నాయి. కాబట్టే కాంగ్రెస్‌ నాయకత్వం ఇన్ని కపట నాటకాలు నడిపిస్తున్నది. తేల్చేస్తామంటూనే నాన్చేస్తున్నది. రాష్ట్ర విభజన వుంటుందా లేక సమైక్యంగా కొనసాగుతుందా అన్నది ఎప్పటికప్పుడు త్రిశంకు వ్యవహారంగా మారి పోయింది. అవాంచనీయమైన అనిశ్చితికి అంతులేని వాద వివాదాలలు నిరర్థకమైన ఉద్రేకాలు నిత్యకృతమైనాయి. భిన్న సంకేతాలతో ప్రజల ఐక్య పోరాటాలను చిన్నాభిన్నం చేయడం ద్వారా తన ప్రైవేటీకరణ విధానాలనూ భారల మోతనూ కొనసాగించుకోవచ్చన్న ఆలోచనా ఇందులో దాగివుంది.
ఈ నేపథ్యంలో విద్యుచ్చక్తి సమస్యపై శక్తివంతమైన పోరాటావశ్యతను నొక్కి చెబుతూ పది వామపక్షాలు అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖ ప్రాధాన్యతను గుర్తించవలసి వుంటుంది. విద్యుచ్చక్తి రేట్లు ఇంకా పెరక్కముందే ఆందోళన దేనికని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి ఆగ్రహించారు. అయితే మార్చి 31 తర్వాత ఏకంగా 12 వేల కోట్ల బాదుడుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు మరో 1100 కోట్లు పడనున్నాయి. గతంలోనూ ఇప్పుడూ కలిపి మొత్తం 34 వేల కోట్ల రూపాయల వరకూ ప్రజలపై విద్యుచ్చక్తి భారాలు వచ్చిపడుతున్నాయి. దీనిపై వామపక్షాలు ఉమ్మడిపోరాటానికి సిద్ధమవుతున్నా తక్కిన వారు మాత్రం పాక్షిక వాదోపవాదాలకే పరిమితమవడం పాలక పక్షం నెత్తిన పాలు పోయడమే అవుతున్నది. బి.వి.రాఘవులు అన్నట్టు తెలంగాణా సమస్యపై కేంద్రం సృష్టించిన గడువుల గజిబిజిని విద్యుచ్చక్తి భారాలకు వర్తించేది కాదు. మార్చి 31తో గడువులోగానే వాటిని అడ్డుకోవాలి. గతంలో విద్యుచ్చక్తి ఉద్యమం పదేళ్ల పాటు మళ్లీ చార్జిలు పెరక్కుండా అడ్డుకోగలిగింది. రాజకీయ సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేయగలిగింది. కెసిఆర్‌ ఆ సమయంలోనే తెలుగు దేశం ప్రభుత్వం నుంచి బయిటకు వచ్చి ఉత్తరోత్తరా తెలంగాణా ప్రాంతీయ పార్టీని స్థాపించి అసంతృప్తిని అటు మరల్చగలిగారు.ఇప్పుడు అదే ఘట్టాన్ని ఇటు మరల్చవలసిన సమయమిది. ఇప్పుడు పార్టీలు మాట్లాడే తీరు, వ్యూహ ప్రతివ్యూహాలు సంఖ్యాబలాలు సందర్బాలు గమనిస్తే తెలంగాణా సమస్యను ఎన్నికలలో ఉపయోగించుకోవడమే ప్రధానాంశంగా మారనున్నది. అవి ఎలాగూ చాలా దూరంలో వున్నాయి. కనక ఈ లోగా విద్యుచ్చక్తి భారాలనైనా నిరోధించగలిగితే మన ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కలుగుతుంది. ఇరకాటంలో వున్న ప్రభుత్వాన్ని ఓడించినట్టూ అవుతుంది. అందుకు మారుగా అనవసరమైన వాదవివాదాలు దూషణలు దుర్భాషణలకు ప్రాధాన్యతినిస్తే ప్రజా వ్యతిరేక విధానాల కొనసాగింపునకు దోహదం కలుగుతుంది. ప్రాంతాల తేడా లేకుండా ప్రజలందరూ నష్టపోతారు. అలాటి విశాల పోరాటాలకు అవసరమైన విజ్ఞత పార్టీల నుంచి ఆశించవచ్చునా?

ఆంధ్రజ్యోతి, గమనం 31.1.13

No comments:

Post a Comment