Pages

Friday, February 22, 2013

ఆత్మస్తుతి ఆర్భాటాల మధ్య అభద్రాంధ్ర ప్రదేశ్‌


హైదరాబాదు దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయింత్రం సంభవించిన విధ్వంసక విస్పోటనం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఒక పరోక్ష వ్యాఖ్యానం. సహకార ఎన్నికల విజయాలపై శ్రుతిమించిన ఉత్సాహంలో మునిగి ఆత్మ స్తుతి అవధులు దాటిన అధినేతలకు ఒక కుదుపు. మరొకరికి పని లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరస్పరం అభిశంసించుకుంటున్న అరుదైన ఘట్టం! ఆ క్రమంలో రెండు చోట్లా పాలిస్తున్న పార్టీ అపహాస్యం పాలవుతున్న వైపరీత్యం.
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు అకస్మాత్తుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలు కాదు. హైదరాబాదుకు బాంబు దాడులు ముప్పు పొంచి వున్నదని గత నెలరోజులుగా హెచ్చరికలు వినిపిస్తూనే వున్నాయి. ప్రజాశక్తి కూడా గత నెల 13వ తేదీన పతాక శీర్షిక నిచ్చి ప్రచురించింది. ఇతరత్రా కూడా బాంబు హెచ్చరికలు వచ్చి శాసనసభను డిజిపి కార్యాలయాన్ని తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు చోట్ల బాంబులను నిర్వీర్యం చేసిన ఘటనలూ వున్నాయి. అన్నిటినీ మించి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల రాజకీయ శక్తులు పాచికలు వేస్తున్న తీరు విదితమవుతూనే వుంది. మతోద్రిక్తతలు పెంచేందుకు దేశ విదేశాలలో పొంచి చూస్తున్న సంస్థలు పక్షాల గురించి చెప్పనవసరం లేదు. భాగ్యలక్ష్మి వివాదంతో మొదలై అక్చరుద్దీన్‌ అరెస్టు విడుదల వరకూ జరిగిన పరిణామాలు సహజంగానే ఉద్రిక్తత పెంచాయి. ప్రాంతీయ వివాదాలపై వాదోపవాదాలు కూడా అనిశ్చితిని పెంచి ఆందోళన కలిగించాయి. గత నెలలో బాంబులు పట్టుపడటం, డిజిపి కార్యాలయం శాసనసభలతో సహా బెదిరింపులు రావడం తెలిసిన విషయమే. వీటిపై ప్రజాశక్తి పతాక శీర్షికలు ఇచ్చింది కూడా. సామాన్య ప్రజలు కూడా సందేహిస్తున్న ముప్పు సూచనలు ఏలిన వారికి మాత్రం కనిపించలేదు. కేంద్రం హెచ్చరికలు పంపితే అవి మామూలే అనుకున్నారట!(వారిని కాపాడ్డం కోసం ఇప్పుడు కేంద్ర హౌమంత్రి కూడా మామూలు పల్లవి ఎత్తుకున్నారు) అలసత్వం లేదా అసమర్థత ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ప్రస్తావించకుండా వుండటం ఎలా సాధ్యం?
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక తక్కిన దేశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా
హైదరాబాదులో పేలుడు ఘటనలు పెరిగాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చర్చిల్లో పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌ నగర్‌లోనూ ఇలాటి ఘటనలు జరిగాయి.( హౌం మంత్రి మాధవ రెడ్డి హత్య,ఆఖరుకుఆయనపైనా హత్యా ప్రయత్నం జరిగింది గాని అవి
మావోయిస్టులు చేసినవి) దేశంలోనూ రాష్ట్రంలోనూ ఐఎస్‌ఐ ప్రేరిత మతతత్వ ఉగ్రవాద సంస్థలు పెరగడం అనేక చోట్ల అమానుష దాడులు జరపడం రివాజుగా మారింది.దీన్ని గట్టి నిఘాతో అరికట్టే బదులు మత కోణంలో చూపించడం కూడా పెరిగింది.వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయం ఎదురుగా వున్న లుంబిని పార్కులోనూ కిక్కిరిసి వుండే గోకుల్‌చాట్‌లోనూ భయానక పేలుళ్లు సంభవించాయి. అంతకు ముందు టెర్రరిస్టు నిరోధక కార్యాలయం కూడా పేలిపోయింది! హైదరాబాదు ఐఎస్‌ఐ అడ్డాగా మారిపోయిందనే ప్రచారం పెంచిన హిందూత్వ శక్తులు తామూ యథాశక్తి ఉద్రిక్తత పెంచడానికి కారణమైనాయి. దీనికి తోడు తెలంగాణా ఉద్యమం సందర్భంగా కొంతమంది పని గట్టుకుని హైదరాబాదుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తమ మనుగడకు దాన్నే పునాదిగా చేసుకోవాలని చూడటం అత్యధిక ప్రజానీకంలో ఆందోళన సృష్టించింది.దొరికిన ఏ అవకాశాన్ని పోగొట్టుకోని అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు అదను చూసి వేటు వేయడం తత్పలితమే. నిజంగా కేంద్ర హౌం శాఖ నుంచి సమాచారం వున్నా అరికట్టే చర్యలు తీసుకోలేకపోయారంటే అంతకన్నా వైఫల్యం ఏముంటుంది?
పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం, నియామకాల్లో పక్షపాతం ఇందుకు కారణమనే వారున్నారు. డిజిపిల నియామకం ఇప్పటికీ మూడు సార్లుగా వివాదాస్పదమై కోర్టుల కెక్కింది. అనేక సార్లు రాజకీయ కారణాల వల్ల పోలీసులు తమ పని తాము చేసుకోలేని స్థితి ఎదురవుతున్నది. ఒక సందర్భంలోనైతే దొరికిన ఉగ్రవాది పారిపోయాడు! అచ్చంగా ఉగ్రవాద నిరోధానికే ఆక్టోపస్‌ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పరిస్తే దానికి సరైన బాధ్యులను యంత్రాంగాన్ని సృష్టించే ధ్యాస లేకుండా పోయింది. పోలీసు ఉన్నతాధికారుల మధ్య బహిరంగ వివాదాలు ప్రతిష్టకు మచ్చగా మారాయి. ఉన్న కొద్ది మంది పోలీసులు విఐపిల హంగామాకు సరిపోగా కేంద్రం సృష్టించిన అనిశ్చితి ఫలితమైన ఆందోళనల్లో మరింత మంది నిమగమైనారు. సంఖ్య రీత్యానే గాక సాంకేతిక పరిజ్ఞానం సాధన సంపత్తుల రీత్యానూ మన పోలీసులు వెనకబడి వున్న మాట నిజం. అంతర్జాతీయ వత్తాసు, అంతులేని ఆర్థిక శక్తి అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం వున్న ఉగ్రవాదులకు ఇవన్నీ కలసి వచ్చిన అవకాశాలవుతుంటాయి. కొంతమంది ఈ దాడులను మత కోణంలో చూపించవచ్చు గాని గాని నిజానికి ఉగ్రవాద హంతక శక్తులకు మతం కులం దేశం ఏమీ వుండవు. వారిని ఆ విధంగా మాత్రమే చూడాలి. బిజెపి నేతల్లో తరచూ కనిపించే ఈ ధోరణి ఎంత పొరబాటో వారిచ్చిన బంద్‌ పిలుపు వైఫల్యంలో అర్థమవుతుంది. అలాగే మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఘటనకు సంబందించి ఇండియన్‌ మొజహద్దీన్‌ వంటి సంస్థల పేరు ప్రస్తావించడంపై అభ్యంతరం తెల్పడంలోనూ ఔచిత్యం కనిపించదు.
ఇతరుల సంగతి అలా వుంచి ప్రభుత్వం విషయానికి వస్తే దిల్‌సుఖ్‌ నగర్‌లో గతంలోనూ మూడు ఘటనలు జరిగాయి. నిత్యం కిటకిటలాడుతూ నగరానికి ఒక విధంగా టర్మినస్‌లాగా పేరు పొందింది. అన్ని ప్రాంతాలవారూ వుండే చోటు. అలాటి చోట గతానుభవాల రీత్యా ప్రత్యేక నిఘా వేయడం ప్రభుత్వం పోలీసులు చేయవలసిన కనీస కర్తవ్యం. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా నిఘా హెచ్చరికలు పంపించనవసరం లేదు. అయితే అలాటి హెచ్చరికలు వచ్చినా స్పందించకపోవడం ఎంత బాధ్యతా రహితం? ఆ వచ్చిన హెచ్చరికల తీరు తెన్నులపై ఇప్పుడు మీమాంస లేవదీయడం తప్ప అప్రమత్తం కాలేకపోయామన్న పశ్చాత్తాపం గాని ఆత్మ విమర్శ గాని అణుమాత్రం లేని వారు రేపైనా మెళకువగా వుంటారని ఎలా నమ్మడం? అవినీతి అవకాశవాదాల ఫలితంగానూ అధిక ధరల వేటుతోనూ ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు. అవన్నీ చాలక అభద్రతకు వారిని బలిచేసి ఆత్మస్తుతిలో మునిగితేలడం కన్నా హాస్యాస్పదమైన విషయం వుండదు. జరగాల్సిన ఘోరం జరిగిపోయాక ఇప్పుడు అధైర్యపడవద్దని, అంతా అదుపులో వుందని ఎంత చెబితే విశ్వాసం కలుగుతుంది? బలైపోయిన వారి కుటుంబాలకు గాని, బాధితులకు గాని సహాయం అందించడంలోనూ అలసత్యం ఆలస్యం రివాజుగా మారాయి. గోకుల్‌చాట్‌ బాధితులకే ఇప్పటికీ పరిహారం అందలేదు. ఇప్పుడు బలైన వారి మృతదేహాలు తీసుకుపోవడానికి కూడా వారి దగ్గరే పైసలు వసూలు చేశారు. ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది?
రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పార్టీల ఘర్షణలు వైరుధ్యాలు అవకాశవాదాలు అన్ని విధాల అనిశ్చితిని ఘనీభవింపజేశాయి. ఇలాటి నేపథ్యంలో ప్రజల ఆత్మస్థయిర్యాన్ని సామరస్యాన్ని దెబ్బతీయాలని దుష్ట శక్తులు పొంచి చూస్తున్నాయి. రాష్ట్రంలోనూ వెలుపలా జరిగిన అనేక ఘటనలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. ఏడాది చివరలో ఎన్నికలు రానుండటం అదనపు అంశంగా వుంది. ఇవన్నీ గమనంలో వుంచుకుని చూస్తే రానున్నది మరింత సంక్లిష్టమైన కాలం అనడంలో సందేహం లేదు. సమైక్యంగా నిలిచి ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసం సర్వతోముఖ వ్యూహంతో వ్యవహరించాల్సిన బాధ్యత దేశ భక్తులు లౌకిక వాదులందరిపైనా వుంటుంది. కుటిల శక్తుల పట్ల ప్రచారాల పట్ల అప్రమత్గంగా వుండటం, ఎట్టి పరిస్తితుల్లోనూ ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా కాపాడటం, పరస్పరం అండగా నిలవడం ఇప్పుడు జరగాల్సింది. వెదంతులు వ్యాప్తి చేసే వారు, అసలు సమస్యలనుంచి దారి తప్పించే దగాకోరులు, రహస్యంగా కాటేసే దుర్మార్గ శక్తులు అందరి ఆటకట్టించడానికి అదే మార్గం. ఆత్మసమర్థన మానుకుని సందర్భోచితమైన సమర్థ చర్యలతో శాంతి భద్రతలను కాపాడేందుకు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసేలా ఒత్తిడి తేవాలి. సహకార విజయాల సంబరం నుంచి బయిటపడి సవాళ్లకు దీటుగా స్పందించవలసిన అవసరం ఏలిన వారి తలకెక్కేలా చూడాలి. తరతరాలుగా చరిత్రలో మత సామరస్యానికి లౌకిక ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా నిలిచిన మినీ భారత్‌ హైదరాబాద్‌ ఘన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి.

No comments:

Post a Comment