Pages

Friday, October 29, 2010

'విద్రోహ దినం' వివాదం విడ్డూరం

- తెలకపల్లి రవి 
ముఖ్యమంత్రి రోశయ్య ఈ వారం సిఐఐ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సు మాత్రమే తప్ప నిర్ణయాత్మకం కాదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. పైగా రాష్ట్ర విభజన అనేది వీధుల్లో తేల్చుకునే విషయం కాదని కూడా ఆయనన్నారు. ఇదే సమయంలో సోనియాగాంధీ కూడా కాంగ్రెస్‌ సమావేశంలో ప్రాంతీయ వేర్పాటు వాదాల వల్ల ప్రమాదాలను గురించి చేసిన హెచ్చరికపై పరిపరివిధాల వ్యాఖ్యలు వచ్చాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ చరిత్రను బట్టి చూస్తే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గాని తర్వాత వివిధ ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో గాని అవకాశవాదానికే పాల్పడటం గమనించవచ్చు.


రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ మరణాలు, రైతుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు, శాంతి భద్రతలు, స్థానిక సమస్యలు వగైరా ప్రజలను కడగండ్ల పాలు చేస్తుంటే అఖిల పక్ష సమావేశాలు అనేక వుద్యమాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అరకొర ఆర్డినెన్సు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయబడింది.ి మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు పత్రికల్లో పెద్ద ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు సంక్షోభ నివారణకు సరిపడే విధంగా సమర్థంగా సమగ్రంగా లేవు. ఈ సమయంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు మెమోరాండం సమర్పించాలంటూ చంద్రబాబుతో సహా తెలుగు దేశం సిపిఐ, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీల నేతలు ధర్నా నిర్హహించి అరెస్టయ్యారు. సిపిఎం నాయకులు ఇతర కార్యక్రమాల వల్ల ఈ ధర్నాకు హాజరు కాలేదు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తమకు సమయం ఇవ్వని ప్రధానిని శాడిస్టులా వ్యవహరించారని విమర్శించడం మరో వివాదానికి కారణమైంది. ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టి దీన్ని ఖండించడమే గాక వ్యక్తిగతంగా చంద్రబాబుపై విరుచుకుపడి ఔరంగజేబు స్థాయిలేదు అంటూ ధ్వజమెత్తారు. ఆ పైన చంద్రబాబు కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తూ అసమర్థ నేత అని , జాక్‌పాట్‌ తగిలి ఆఖరి దశలో పదవిలోకి వచ్చారని అనేక విధాల ఆగ్రహం వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు ఈ విధంగా నిందారోపణల్లో మునిగిపోవడం బాగాలేదన్న భావన సర్వత్రా వ్యక్తమైంది.
తర్వాతి దశలో చంద్రబాబు నాయుడు మైక్రో బాధితులను పరామర్శించేందుకై మెదక్‌ జిల్లా గజ్వేల్‌ వెళ్లారు. గతంలో వలెనే తెలంగాణా వాదుల పేరిట కొందరు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. రాళ్లు రువ్వడం, అరెస్టులు తర్వాత ఆయన పర్యటన కొనసాగింది. తర్వాత రోజున టిఆర్‌ఎస్‌ అధినేత కె.సిఆర్‌ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఇది ఇలా వుంటే తెలంగాణా తెలుగు దేశం నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తామని బయలుదేరారు. ఈ సందర్భంగా వారు ముద్రించిన కరపత్రంలో చంద్రబాబు ఫోటో పార్టీ గుర్తు లేవని విమర్శలు రావడంతో వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. కాకపోతే చంద్రబాబు పర్యటనను అడ్డుకునేట్టయితే కె.సిఆర్‌ను కూడా తిరగనివ్వబోమని కూడా నాగం జనార్ధనరెడ్డి వంటి వారు ప్రకటించారు.
టిఆర్‌ఎస్‌ టిడిపిల మధ్యనే గాక ఇతరత్రా కూడా తెలంగాణా విభజన వాదుల మధ్య విభజన ఈ వారం మరింతగా పెరిగింది. గద్దర్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ఫ్రంట్‌ నుంచి విమలక్క, దిలీప్‌ కుమార్‌ తదితరులు నిష్క్రమించి మరో జెఎసి ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రధానమైన జెఎసిలు అయ్యాయని ఎవరో లెక్కవేశారు. అయితే అందరూ ఉద్యమాలే తమ మార్గమని అంటూ అందుకోసం పల్లె బాట పడుతున్నట్టు ప్రకటించారు. ఈ పల్లె బాటలో పలుకులు మాత్రం పరస్పరం ములుకులవుతున్న సందర్బాలున్నాయి. డిసెంబరు 9 ప్రకటన కెసిఆర్‌ నిరాహార దీక్ష వల్లనే వచ్చిందని టిఆర్‌ఎస్‌ ప్రకటిస్తే ఉస్మానియా జెఎసి దాన్ని తీవ్రంగా సవాలు చేస్తూ తమ వల్లనే ఆ ఫలితం కలిగినట్టు పేర్కొన్నది. వీటన్నిటి మధ్యనా కోదండ రాం నాయకత్వంలోని జెఎసి ఎటు వైపు అన్నది చిక్కుముడిగా మారిపోయింది. కోదండ రాం, జయశంకర్‌లు ప్రధానంగా విద్యా వంతుల వేదికల్లో ఈ వారం ఎక్కువగా మాట్లాడటం కనిపించింది.
అయితే ఈ అన్ని రకాల నేతలు సంఘాలు కూడా నవంబరు ఒకటవ తేదీన ఆంద్ర ప్రదేశ్‌ అవతరణ దినాన్ని విద్రోహదినంగా జరపాలని ప్రకటించడం మాత్రం చారిత్రిక వాస్తవికతకు అనుగుణంగా లేదు. తమతమ కారణాల వల్ల ఇప్పుడు రాష్ట్ర విభజన కోసం వారు పోరాడటం వేరు, ఆ పేరుతో గతాన్ని కూడా ఇప్పటి సులోచనాలతో చూపిస్తామంటే కుదిరే పని కాదు. తెలుగు ప్రజల తరతరాల పోరాట ఫలితం ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ. నిజాం నవాబు ఆంగ్ల పాలకుల స్వార్థ రాజకీయాల కారణంగా చెల్లాచెదురైన తెలుగు ప్రజలందరినీ ఒక్కతాటి మీదకు తేవాలన్న కోర్కెతో దాదాపు ఏభై ఏళ్ల పాటు జరిగిన పోరాట ఫలితమది. ఎవరో కొద్ది మంది భూస్వామ్య వర్గాల ప్రతినిధులు తప్పిస్తే అత్యధిక ప్రజానీకం నేతలు కోరుకున్నారు గనకనే ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది. నాటి హైదరాబాదు రాష్ట్ర శాసనసభ అత్యధిక మెజారిటితో అందుకు ఆహ్వానం తెలిపింది. స్వాతంత్రోద్యమ వారసత్వం రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామిక సంప్రదాయాలు శాస్త్రీయ దృక్పథం వీటన్నిటి భూమికపై నవంబరు ఒకటిన రాష్ట్రం అవతరించింది తప్ప ఇందులో ఎలాంటి విద్రోహాలు లేవు. తర్వాతి కాలంలో దానిపై అధికారాన్ని అనేక విధాల అనుభవించి ప్రజలపై పెత్తనం చేసిన దోచుకున్న దొరలే తమ తమ అవసరాలను బట్టి విభజన నినాదాలిస్తూ విరమిస్తూ వచ్చారు. అంతే తప్ప ఒక ప్రాంతం ప్రజలను మరో ప్రాంతం ప్రజలు దోచుకోవడం వంటివి లేవు. దోచుకునే దొరలు పెత్తందార్లు తరతమ తేడాలతో రెండు చోట్లా వున్నారు. ప్రాంతాల సరిహద్దులకు అతీతంగా దోచుకుంటూనే వున్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా. రేపు కూడా రాష్ట్రం కలిసి వున్నా విడిపోయినా దోపిడీ కొనసాగించడానికి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ పథకాలు రూపొందించుకుంటున్న వైనం జనం చూస్తూనే వున్నారు. విద్రోహాలన్న మాటనే వినియోగించాలంటే స్వార్థ ప్రయోజనాల కోసం జనం మధ్య చిచ్చు పెట్టే వారికే ఎక్కువగా అది వర్తిస్తుంది .
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రోశయ్య ఈ వారం సిఐఐ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సు మాత్రమే తప్ప నిర్ణయాత్మకం కాదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. పైగా రాష్ట్ర విభజన అనేది వీధుల్లో తేల్చుకునే విషయం కాదని కూడా ఆయనన్నారు. ఇదే సమయంలో సోనియాగాంధీ కూడా కాంగ్రెస్‌ సమావేశంలో ప్రాంతీయ వేర్పాటు వాదాల వల్ల ప్రమాదాలను గురించి చేసిన హెచ్చరికపై పరిపరివిధాల వ్యాఖ్యలు వచ్చాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ చరిత్రను బట్టి చూస్తే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గాని తర్వాత వివిధ ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో గాని అవకాశవాదానికే పాల్పడటం గమనించవచ్చు. ఇప్పుడు కూడా విద్రోహ దినంగా జరపాలని పిసిసి అధికార ప్రతినిధి కమలాకరరావు చెబుతుంటే మరో శాసనసభ్యుడు శ్రీకాంత్‌ రెడ్డి దాన్ని ఖండిస్తున్నాడు.మంత్రి జూపల్లి కృష్ణారావు వంటివారు దాటవేత వైఖరిలో మాట్లాడుతున్నారు. టిఆర్‌ఎస్‌ లేదా ఇతర విభజనవాదులు నవంబరు ఒకటిని విద్రోహ దినం అంటే అదో తీరు. అధికార కాంగ్రెస్‌ నేతలు కూడా దీనిపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆఖరుకు మంత్రులు కూడా దాటవేతకు పాల్పడుతున్నారు. తాము ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులుగా వుండి దాని ఉనికినే విద్రోహంగా చెబుతుంటే కాదనకపోవడం రాజ్యాంగం వారికి అప్పగించిన బాధ్యతలకే కళంకం. ఎలాంటి తటపటాయింపులు లేకుండా నవంబరు ఒకటి చారిత్రిక ప్రాధాన్యతను పాటించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. వాస్తవంలో ఏం జరిగేది చూడాల్సిందే.
నెల్లూరులో ఓదార్పు యాత్ర
నెల్లూరు జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్ర విజయవంతమైనా వివాదాలు కూడా తీవ్రంగానే సాగాయి. ఆ జిల్లాలో కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర వహించే నేదురుమల్లి, ఆనం వర్గాలు ఈ యాత్రను వ్యతిరేకించగా మేకపాటి సోదరులు తెలుగుదేశం నుంచి సస్పెండైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,కొందరు పిఆర్‌పి నేతలు పాల్గొన్నారు. రాజకీయాలతో సంబంధం లేనిదని చెబుతున్నా ఈ యాత్రలో జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్న కోర్కె బహిరంగంగానే వినిపించారు. అధిష్టానం ఈ వారం పదిహేను సూత్రాల అమలు కమిటీలో జగన్‌ను నియమించడం ద్వారా ఆయనను తాము శత్రువుగా చూడటం లేదన్న భావన కలిగించేందుకు ప్రయత్నించింది. మీడియాలోనూ ఈ వారం జగన్‌ విషయమై మరో సారి చర్చ జరిగింది. కేంద్ర క్యాబినెట్‌ విస్తరణ జరుగుతుందన్న వూహాగానాలు పిసిసి కొత్త అధ్యక్షుని ఎంపిక వంటి విషయాల నేపథ్యంలో జగన్‌ పైకి చర్చ మళ్లింది.
రాజకీయ రక్తచరిత్ర
అనంతపురంలో పరిటాల రవి తదితరులతో ముడిపడిన రాజకీయ ముఠాతగాదాలపై హత్యలపై రాం గోపాల్‌ వర్మ అందించిన రక్తచరిత్ర చుట్టూ ఈ వారం బోలెడు చర్చ నడిచింది. చివరకు 22 వ తేదీన విడుదలైన ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ను పోలిన పాత్రను చూపించడం మినహాయిస్తే సాదాసీదా ఫ్యాక్షన్‌ కథలాగే వుంది. పైగా ఫ్యాక్షన్‌ తగాదాల వెనక వుండే ఆర్థిక ఆధిపత్య కారణాలు పట్టించుకోకుండా కేవలం పగలు ప్రతీకారాలు ఆవేశాలకే పరిమితం చేయడం వర్మ అవగాహన పరిమితులను తెలియజేస్తుంది. అందులోనూ ఇది మొదటి భాగం అని చెప్పడం వల్ల కీలకమైన కొన్ని పాత్రలు ఈ భాగంలో రంగంలోకి రాకపోవడం వల్ల దీన్ని ఒక విధమైన ట్రయలర్‌లా భావించాల్సి వుంటుంది. ఏది ఏమైనా పాలకవర్గాల ముఠా తగాదాలను సామాజిక దృష్టితో నిమిత్తం లేని ఉద్రిక్త కథనాలుగా తీయడం వ్యాపారానికే ఎక్కువగా పనికి వస్తుంది. ముఠా కక్షల వల్ల కలిగే హానిని చెప్పే బదులు ఉద్రిక్తతలను పెంచడం కూడా క్షుద్ర ప్రచార వ్యూహమే. ఏ వర్గాన్ని ఎక్కువ చేశాడు లేదా తక్కువ చేశాడు అన్న ఆసక్తి పెంచి ఆ పైన వివాదం ఎన్టీఆర్‌ పాత్రపై కేంద్రీకరింపచేయడం కూడా ప్రచార వ్యూహమే కావచ్చు. దీనిపై చంద్రబాబుతో సహా తెలుగుదేశం నేతలు భగ్గుమన్న తర్వాత ఆ దృశ్యాలను తొలగిస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.(పూర్తి సమీక్ష సోమవారం సంచికలో)
కర్ణాటకం మరింత జుగుప్సాకరం
కర్ణాటకలో యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందుకు గాను సభ్యత్వం రద్దు చేయబడిన ఎంఎల్‌ఎల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం విరుద్దమైన తీర్పులు ఇవ్వడంతో మూడో న్యాయమూర్తికి నివేదించారు. ఆయన కూడా విచారణ జరిపి తీర్పు అట్టిపెట్టుకున్నారు. దానిపై కూడా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం వుంటుంది. అయితే ఈ లోగా కర్ణాటక వ్యవహారాలు మరింత జుగుప్సా కరంగా తయారైనాయి. కాంగ్రెస్‌ జెడిఎస్‌లు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయని గగ్గోలు పెట్టిన బిజెపి ఇప్పుడు మరోసారి ఆ పార్టీల ఎంఎల్‌ఎలకు గాలం వేయడం మొదలు పెట్టింది. కొంత వరకు సఫలీకృతమైంది కూడా. కాకపోతే చట్టం ఒప్పుకోదు గనక వారిని రాజీనామా చేయించి ఇతర విధాల సత్కరిస్తున్నది. దీన్ని ఆ పార్టీ అఖిలభారత నాయకత్వం కూడా నిస్సిగ్గుగా ఆశీర్వదిస్తున్నది.
ఆయోధ్యపై ఆరెస్సెస్‌ అసలు రంగు
అయోధ్య వివాదాస్పద స్థలంలో ఎలాటి విభజనను అంగీకరించే ప్రసక్తిలేదని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. సంప్రదింపులకు సిద్ధమే గాని అవి రామమందిరానికి అడ్డంకులు లేకుండా చేసేందుకు మాత్రమే పరిమితం కావాలని సంఘ పరివార్‌ పదే పదే చెబుతున్న దానికిది అధికార వాణి. అలహాబాదు హైకోర్టు తీర్పు హిందూత్వ వాదనలకు అనుకూలంగా వుందని వొకవైపు విమర్శలు మార్మోగుతుంటే దాన్ని కూడా గౌరవించబోమని చెప్పడం హిందూత్వ కూటమి నిజస్వరూపాన్ని వెల్లడిస్తోంది. ఈ వారం ముస్లిం పర్సనల్‌ లాబోర్డు, నిర్మొహి అఖారా కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్టు వెల్లడించాయి.అయోధ్య కాండ న్యాయ పర్వంలొ ఇది మరో ఘట్టం.
ఒబామా రాకకు ఓపలేని హడావుడి
అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా నవంబరు నెలలో రావడంపై కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వ హడావుడికి అంతు లేకుండా వుంది. అత్యంత హానికరమైన అణు ఒప్పందాన్ని ఆఘమేఘాల మీద ఆమోదించుకున్నా అమెరికా దొరలకు అంగీకారం కాలేదు.పూర్తిగా లొంగిపోవలసిందిగా హుంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామా రాకకోసం పార్లమెంటుకు కూడా భారీ మరమ్మత్తులు చేసి తీర్చిదిద్దడం పదేళ్ల కిందట వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో బిల్‌ క్లింటన్‌ వచ్చినప్పటి ప్రహసనాన్ని గుర్తు చేయకుండా వుండదు. ఆ సందర్భంలో పాలకవర్గ ఎంపీలు క్లింటన్‌ కరస్పర్శ కోసం తహతహలాడి పోవడం, ఆయన కుమార్తెకు సహాయంగా విదేశాంగమంత్రి జస్వంత్‌ సింగ్‌ వెళ్లడం వంటి విపరీతాలను చూశారు. ఇప్పుడు యుపిఎ ఆ రికార్డును బద్దలు కొట్టేట్టు వుంది.
పాకిస్తాన్‌కు తాయిలం
మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఎంత విధేయత చూపించినా అమెరికా అధినేతలు మాత్రం పాకిస్తాన్‌ పట్ల తమ ప్రత్యేక ప్రేమాభిమానాలను దాచిపెట్టుకోడం లేదు.మామూలుగా అమెరికా నేతలు వచ్చి వెళ్లేప్పుడు ఇస్లామాబాద్‌లో ఆగి వెళ్లడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఒబామా చెప్పడం పెద్ద విజయమైనట్టు భారత ప్రభుత్వ ం గొప్పలు పోయింది. అయితే ఇంతలోనే అమెరికా పాకిస్తాన్‌కు 200కోట్ల డాలర్ల ప్రత్యేక సహాయం ప్రకటించి తమ అనుబంధం ఎంత గట్టిదో చాటుకున్నది. టెర్రరిజంపై పోరాటం వగైరా షరతులు కూడా వినిపించినా వాస్తవంలో అవన్నీ పై పూతలేనని అందరికీ తెలుసు.

No comments:

Post a Comment