- తెలకపల్లి రవి
మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ లండన్‌లో చేసిన ప్రసంగాన్ని వక్రంగా నివేదించడమే గాక దాని ఆధారంగా రెచ్చిపోయి విషం కక్కడంలో కొన్ని పత్రికలు,మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. అవగాహన చేసుకోవడానికి అరక్షణమైనా యత్నించకుండా అవహేళన చేయడానికి అధ్వాన వ్యాఖ్యలతో అల్పానందం ప్రదర్శించడానికి మహా విజ్ఞులైన సదరు సంపాదకీయ రచయితలు చూపించిన ఆరాటం అన్యులకు అసాధ్యమైన పని!కరత్ ప్రసంగంలోని కీలకమైన రెండు అంశాలను మళ్లీ చెప్పుకుంటే- భారత దేశంలో సిద్ధాంత పరంగానూ ఆచరణ
రీత్యానూ వర్గ వ్యవస్థ అనేక దొంతరలతో ప్రభావితమై కలగలసిపోయి వ్యత్యాసాలతో వివక్షతలు అణచివేతలతో ప్రభావితమైంది. ఇవి భారతీయ సమాజానికి మాత్రమే ప్రత్యేకం. కులం ఇందుకొక ఉదాహరణ. భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రధాన బలం 1940లలో బెంగాల్‌లో సాగిన తెభాగ, కేరళలో పున్నప్రా వారులర్, త్రిపుర, తెలంగాణా వంటి చోట్ల భూస్వామ్య వ్యవస్థకు సామ్రాజ్యవాద వ్యవస్థకు వ్యతిరేకంగా సమ్మిళిత రూపంలో సాగిన ప్రజా ప్రభంజనాల ప్రభావమే ఇప్పటికీ ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి జీవగర్రగా వుంది. మూడో విషయం - సరళీకరణ ప్రపంచీకరణ ఆర్థిక విధానాల ప్రభావాన్ని అర్థం చేసుకుని పురోగమించడానికి మరింత అధ్యయనం అవసరమవుతుంది. ఎందుకంటే వామపక్షాలు మాత్రమే ఈ విధానాలకు ప్రత్యామ్నాయం చూపగలుగుతున్నాయి.
లండన్ నుంచి వచ్చిన వార్తా కథనాలు మొదట దీన్ని తప్పుగా చిత్రిస్తే ఆయా పత్రికలు ఛానెళ్లు తమ తమ శక్తికొద్ది దానికి రంగులద్దాయి. ఒక కామ్రేడ్ ఆత్మావలోకనం అంటూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బాక్సు కట్టి లీడ్ రాసింది. లోపల కూడా స్వకీయ వ్యాఖ్యానం సుదీర్ఘంగా రాసిన తర్వాత కరత్ ప్రసంగ భాగాన్ని ఇచ్చింది. అవన్నీ అక్కర్లేని ఆ పత్రిక కార్టూనిస్టు మరుసటి రోజున కమ్యూనిస్టులు పనిచేసేదే కులాన్నిబట్టి కదా అని చౌకబారు హాస్యం కురిపించి మురిసిపోయారు. తన ప్రయాణం ఎక్కడ మొదలై అక్కడకు చేరిందో కాస్తయినా గుర్తుంటే ఈ వెకిలి గీతలకు సిద్ధమయ్యేవాడు కాదు. శతవత్సరాలకు చేరువలో వున్న ప్రవృద్ధ కమ్యూనిస్టు పరకాల పట్టాభిరామారావు ఒక్కరోజైన ఆలస్యం కాకూడదని చరిత్ర తెలియని కరత్ అని లేఖాస్త్రం సంధించి సంతోషపడిపోయారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలగలసి పోయి చిరునామా వదులుకోకపోవడమే కమ్యూనిస్టుల మహాపరాధమని రోజుకు వందసార్లు బాధపడి పోయే పరకాల ధోరణి ఎప్పటికీ మారదు. సోవియట్ విచ్చిన్నానంతర ప్రపంచంలో కూడా రాజకీయ ప్రాధాన్యత నిలబెట్టుకున్న అతికొద్ది కమ్యూనిస్టు ఉద్యమాల్లో భారత దేశ ఉద్యమం ముఖ్యమైంది. ఆ తర్వాత కూడా అప్రతిహతంగా ఇరవయ్యేళ్ల పాటు ఎన్నో పోరాటాలు ఎన్నికల విజయాలు కొనసాగించడమే గాక ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించగల గణనీయ శక్తిగా నిలిచి వుంది. ఈ పరిణామాలకు నాయకత్వం వహించిన వారిలో ప్రధాన పాత్రధారయిన ప్రకాశ్ కరత్ లండన్ వెళ్లి వైఫల్య గీతాలాలపిస్తారని అనుకోవడమే అవివేకం.
ఈ అబద్దపు కథనాలనే సాక్ష్యాలుగా స్వీకరించి సంపాదకీయ కరవాలంతో చెలరేగి సిపిఎంపై తన కక్షను వెళ్లగక్కింది సాక్షి. కరత్ కాలజ్ఞానం అన్న సంపాదకీయంలో అక్షకాక్షరం అందుకు సాక్ష్యం. కరత్ కరుడుగట్టిన సిద్ధాంత వాదిగా పేరు పొందాడంటూ మొదలుపెట్టి అలాటి వ్యక్తి తాము జీవితాలనే అంకితం చేసిన సిద్ధాంతానికే కాలం చెల్లిపోయిందంటే ఎవరైనా ఉలిక్కిపడతారని పారవశ్యంలో మునిగిపోయింది. విన్నవారు విస్తుపోతారని, విచిత్ర భావనలకు లోనవుతారని, 1940 మైండ్‌సెట్ మారలేదని ఒప్పుకున్నాడని, 70 ఏళ్ల వామపక్ష చరిత్రనే జీరో చేశారని రాసి తమ జ్ఞాన శూన్యతను వెళ్లడించుకుంది. వామపక్షాలు 21 వ శతాబ్దంలోకి ఇంకా రాలేదని ఒప్పుకుంటూనే ప్రత్యామ్నాయాన్ని చూపించగల శక్తి వుందని చెప్పడమేమిటని కొక్కిరాయిలా వెక్కిరించింది. అధ్యయనాలు పూర్తి చేసుకునే సరికి మరో వందేళ్లుపూర్తవుతాయని, వామపక్షాల చరిత్ర అంతా తప్పిదాల చరిత్రేనని గొప్ప చారిత్రిక తీర్పునిచ్చింది. అమెరికాతో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యుపిఎకు మద్దతు ఉపసంహరించుకోవడం చారిత్రిక తప్పిదం అని కొన్ని వామపక్షాలు నిర్ధారణకు వచ్చాయట. ఆ నిర్ధారణకు వచ్చినవారెవరో చెప్పకుండా దాటేయడం ద్వారా అది కూడా ప్రకాశ్ కరత్‌కు ఆపాదించే దుర్బుద్ధి ఇక్కడ స్పష్టం. ఏమైతేనేం ఇన్ని విడ్డూర విన్యాసాల విభ్రమకు లోనైన విజ్ఞ సంపాదకుల సౌకర్యార్థమే పైన ఉటంకించిన భాగాలు ఉపకరిస్తాయి. కాని ఇవన్నీ ఉద్దేశ పూర్వక వక్రీకరణలు గనక
కళ్లు తెరవడం కల్ల. అమెరికా శక్తి తగ్గింది గనక దానికి వంతపాడితే ముప్పులేదని సూత్రీకరిస్తున్న ఈ సంపాదకీయపు లోకజ్ఞానానికి శోచనీయం చెప్పడం తప్ప చేయగలిగిందేముంది? అవినీతి సంపదలతో విధేయ మేధావులతో కిరాయి రాతగాళ్లతో క్రొనీ రాజ్యాలు వెలిగిపోగలవుగానీ కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోదు గనకే కరత్ సైద్ధాంతిక అధ్యయనం పెరగాల్సి వుందన్నారు.
కులతత్వ సూర్య ప్రభలు తప్ప వర్గ సమర సత్యాలతో నిమిత్తం లేని మరో పైత్య పత్రికకు కరత్‌ది కుల జ్ఞానంగా కనిపించింది! ఆ జ్ఞానమంతా తమ దగ్గరే పోగు పోసుకున్న సంపాదకీయ రచయిత దాన్ని కరత్‌కు అంటగట్టడం అపహాస్య భాజనం. తమ యజమాని రంగు మార్పిడిని బట్టి పార్టీలకు సామాజిక న్యాయ భుజకీర్తులు తగిలించి భజన చేసే పొద్దు తిరుగుడు పూల వంటి పత్రికా రత్నాల వంకర చూపు మరో విధంగా వుండటం వూహకందని విషయం... వర్గ పోరాటం ద్వారా దోపిడీని అంతమొందించితే ప్రజల సమస్యలు తొలగిపోతాయని చెప్పడం నయవంచనగా ఈ పత్రికకు కనిపిస్తుంది... ''అణగారిన కులాలకు చెందిన శ్రామిక జనం మూపుల మీద కూర్చుని కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అగ్రవర్ణ కమ్యూనిస్టులు'' కుల వ్యవస్తను నిర్మూలించవలసిన అవసరాన్ని గుర్తించలేదట! నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ గురించి ఇంత బాహాటంగా మార్క్సిస్టులు ఎన్నడూ ప్రస్తావించలేదట! హతవిధీ! లండన్
ప్రసంగం దాకా ఎందుకు హైదరాబాదు ఆ చుట్టు పక్కల కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)సాగించిన అసంఖ్యాక పోరాటాలు సాధించిన విజయాలు కూడా ఈ అపర సూర్య ప్రభాసన్నిభులకు తెలియకపోవడం ఎంత విడ్డూరం? పోరాడే వారిపై బురద జల్లే ఆదుర్దాలో అసలు సత్యాలెక్కడ బుర్రకెక్కుతాయి? ఇంతకాలమైనా ఖమ్మం జిల్లా ముదిగొండ కాల్పులకు కారణమైన కర్కోటక సర్కారును పల్లెత్తుమాట అనకుండా అమరుల శవ పంచనామాను కులపంచాయితీగానే కొనసాగిస్తున్న సంపాదక సంస్కారానికి జోహార్లు అర్పించవలసిందే. ఇంతకూ ఇదే ప్రకాశ్ కరత్ ముదిగొండ సృతిచిహ్నం ఆవిష్కరణ సభకు వెళ్లినప్పుడు అమరుని భార్య తన బిడ్డను ఆయనచేతుల్లో పెట్టి ఎర్రజండాకు జై కొట్టిన ఉదంతం ఇలాటి ఉష్ట్ర పక్షులకు కనిపించదు!
ఇక ఆంధ్ర ప్రభ సంపాదకీయంలో ఆణిముత్యాలు దొర్లిపడ్డాయి. కమ్యూనిజానికి కాలదోషం పట్టిందని నోరుపారేసుకున్న కుర్ర గాంధీ కుటిల వాక్కులకూ ప్రకాశ్ కరత్ మాటలకూ ఒకే అర్థం కనిపించిందీ సంపాదక వ్యాఖ్యాతకు! వామపక్ష పాలిత రాష్ట్రాల పరిణామాలను అరకొరగా అర్థరహితంగా వ్యాఖ్యానించిన తదుపరి ముగింపులో ఆంధ్ర ప్రభ సంపాదకీయం సోవియట్ విచ్చిన్నం తర్వాత మనదేశంలోనే గాక ఇతర దేశాల్లోనూ కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న పొల్లు రాతలనే గుమ్మరించింది.1991 ఆగష్టు 19న సోవియట్ అంతర్థానమైతే తర్వాత ఇరవయ్యేళ్లకు కూడా ఈ దేశంలో మూడు వామపక్ష ప్రభుత్వాలుండటం చూడలేని దివాంధతకు ఇంతకన్నా ధాఖలాలెందుకు? ఒకవేళ ఈ ఎన్నికల విజయాలు లేకున్నా పరాజయాలు ఎదురైనా ఈ మహత్తర ప్రజా పునాది ఏమై పోతుంది?
ఇలాటివే మరికొన్ని కువిమర్శలు వున్నా వాటిని పక్కన పెట్టి అనేక సందర్భాల్లో సిపిఎం వ్యతిరేకత చూపిన టెలిగ్రాఫ్ పత్రిక దగ్గరకు వద్దాం.ఈ పత్రిక లండన్ విలేకరి అమిత్ రారు పంపిన కథనంలో ప్రకాశ్ కరత్ ప్రసంగంలో మేధా సంపన్నత ప్రశంసనీయమైందని మమతా బెనర్జీ వంటి వారికి కనువిప్పుగా వుందని పేర్కొన్నారు. అక్కడ వాతావరణాన్ని హృద్యంగా వర్ణించడమే గాక కరత్‌తో ముఖాముఖి మాట్లాడిన వివరాలను కూడా పొందుపర్చారు. కమ్యూనిస్టులు సరే కాలం కన్నా వెనకబడి పోయారనుకుంటే బాగా ముందున్న మన బడా పత్రికా వ్యాఖ్యాతలు ఎరువు కథనాలపై ఆధారపడే బడులు ఇంటర్‌నెట్ ఒక్కసారి క్లిక్ చేసి వుంటే కరత్ ఏం చెప్పారో ఎంత విశ్వాసంగా మాట్టాడారో తెలిసేది. కాని కావాలని కట్టుకథలు వ్యాపించ చేయాలని కాలకూట విషం కక్కాలని కంకణం కట్టుకున్న వారు అలా చేస్తారని ఆశించడం కూడా అత్యాశే కదా? ఇవన్నీ ఎలా వున్నా అరుణ పతాకం వన్నె తగ్గదు, శ్రామిక జనం పోరాటాలూ ఆగవు.
No comments:
Post a Comment