Pages

Friday, January 18, 2013

సమీక్షా లేశం లేని శత చంద్ర దినోత్సవం


తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకోవడం సహజంగానే ఆ పార్టీ ముఖ్య నాయక గణానికి సంబరంగా మారింది. ఈ క్రమంలో ఆయన గతంలో వైఎస్‌రాజశేఖర రెడ్డి నడిచిన దూరాన్ని అధిగమించాడన్నది కూడా ప్రచారంలో ప్రధానాంశమైంది. కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో వెనక రాజశేఖరరెడ్డిని వేసి చంద్రబాబు ఆయనను మించిపోయినట్టు చిత్రాలు ప్రచురించాయి. సజీవంగా వున్నప్పుడు ఈ ఇద్దరు నాయకుల మధ్యనే రాజకీయ పోటీ అన్నట్టు చిత్రించింది చాలక ఆయన మరణానంతరం కూడా దాన్నే కొనసాగించడం కొంత విడ్డూరంగానే వుంది. వాస్తవానికి రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల జగన్‌ పార్టీ తరపున పోటీ యాత్ర నడిపించిందనే వాస్తవం గుర్తు చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కొంటున్నది ఆయన సంతానాన్ని అని అర్థమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మీమాంస బొత్తిగా అనవసరం. ఈ పాదయాత్రలేవీ పేద యాత్రలు కావని నేను చాలా చర్చల్లో సరదాగా అన్నాను. బలమైన పాలక పక్ష నేతలు అధికారం కోసం జరుపుతున్న యాత్రలు ఇవి. వీటికి స్పష్టమైన నేపథ్యం వుంది. హంగూ ఆర్భాటాలు కూడా వున్నాయి. చంద్రబాబు వయస్సు అరవై దాటిపోయింది గనక కాస్త శ్రమ అధికంగా వుండొచ్చు గాని దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక మందినాయకులు అనేక విధాల శ్రమదమాదుల కోర్చి ప్రజల కోసం పోరాడిన సందర్బాలున్నాయి.
ఇటీవలి కాలంలో తెలుగు దేశం ఎదుర్కొంటున్న ఇరకాటాలు, సంక్షోభాలు తగిలిన ఎదురుదెబ్బల దృష్ట్యా పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు శ్రేణులలో విశ్వాసం నింపేందుకు చంద్రబాబు యాత్ర ఉద్దేశించిందని అందరికీ తెలుసు.ఆ విషయంలో కొంత వరకూ ఫలితాలు సాధించివుండొచ్చు గాని విస్తార జనాలలో విశ్వసనీయత పొందగలిగారా అన్నది ముందు ముందు గాని తేలదు. బయిటి జనం విశ్వాసం మాట ఎలా వున్నా పార్టీ ఎంఎల్‌ఎలు, నాయకులు అవతలి పార్టీలలోకి వెళ్లకుండా ఆపడంలో కూడా ఆయన కృతకృత్యం కాలేకపోయారన్నది వాస్తవం. ఎందుకంటే ఈ యాత్రకు సమాంతరంగా అలాటి వలసలు సాగుతూనే వున్నాయి.ఇప్పటికీ ఆగిన దాఖలాలు లేవు.అలాగే తెలంగాణాపై స్పష్టత అన్న విషయం తీసుకుంటే పార్టీపై దాడిని తట్టుకోవడానికి కాస్త ఉపయోగపడే వైఖరి ప్రకటించగలిగారే తప్ప పూర్తిగా సుస్పష్టత ఇచ్చారని ఎవరూ అనలేరు.రాసిన లేఖలో అస్పష్టత, అఖిలపక్షానికి హాజరైన ప్రతినిధి చెప్పిన దాంట్లో స్పష్టత వుందనేది అత్యధకుల
అభిప్రాయం. అయినా తెలంగాణాలో యాత్రకు ఆటంకాలు లేకుండా చేసుకోవడం వరకూ అది ఉపయోగపడిందనేది నిజం.కాని తెలుగు దేశం గట్టిగా అనుకుంటే ఎప్పుడైనా చంద్రబాబు తిరగలేనంత పరిస్థితి వుండేది కాదు. తమ వూగిసలాటను కప్పిపుచ్చుకోవడానికి వారు ఈ ఉద్రిక్తతలను సాకుగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. ఇప్పుడు తీసుకున్న వైఖరి కూడా ఆచరణలో ఎంత విశ్వాసం కలిగిస్తుందో ఇంకా తెలియదు.
నిజానికి ఈ అంశాల కన్నా చంద్రబాబు పాదయాత్రలో ప్రధానంగా ఆయన పాలనా దక్షతపైనే ప్రచారం కేంద్రీకృతమైంది. విధానాలతో నిమిత్తం లేకుండా ఏ నాయకుడైనా ఎలా పాలనా దక్షత గురించే చెప్పుకుంటారు? తెలుగుదేశంకు ఆ విధమైన పట్టింపులు లేవు గనకే బిజెపి నాయకుడు నరేంద్రమోడీతో తమ నాయకుణ్ని ఆ పార్టీ వారు పోల్చుకుని మాట్లాడుతున్నారు. తనను తాను సిఎంగా కన్నా సిఇవోగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానన్న చంద్రబాబు నాయుడు గతాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రెండు ఎన్నికల్లోనూ అనేక ఉప ఎన్నికల్లోనూ ఆయన పార్టీ వరుసుగా దెబ్బతింటున్నది. ఇవన్నీ గమనించకుండా కేవలం తమ పాలనా దక్షతకు తామే కితాబులిచ్చేసుకుని అది సర్వాంగీకృత సత్యమైనట్టు మాట్లాడ్డం అర్థరహితం.
ఈ ధోరణికి పరాకాష్ట తనకు ఆరు నెలలు అధికారమిస్తే అంతా సరిచేసి చూపిస్తానని సవాలు చేయడం. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు ఎన్నడూ పాలన చేయని వారు ఆ మాట అంటే అదో తీరు. ఒకే ఒక్కడు చిత్రంలో ఒక్క రోజు అవకాశం ఇచ్చినట్టుగా ఆరు నెలలు చాలుననిస్వయంగా తొమ్మిదేళ్లు పాలించానని గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎలా నప్పుతుంది? ఆ రోజుల్లో చేసుకున్న స్వర్ణాంధ్ర ప్రచారాన్ని తెలుగుదేశం నేతలు ఇంకా నమ్ముతున్నారా? అప్పట్లో తలెత్తిన వ్యవసాయ సంక్షోభం, పెరిగిన రుణభారం, అన్నిటినీ మించి విద్యుచ్చక్తి ఉద్యమం వగైరాలను తమలాగే ప్రజలూ మర్చిపోయారనుకుంటున్నారా? ఇప్పుడు విద్యుత్‌ రంగంలో ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు బీజాలు నాడే పడ్డాయన్నది నిజం. అలాగే వైఎస్‌ హయాంలో శ్రుతిమించిన కుంభకోణాలకు మూలాలు కూడా మొదలైనాయి. పెద్దగీత పక్కన చిన్నగీతలా తర్వాతి కాలంలో అవి తక్కువగా కనిపిస్తుండవచ్చునేమో గాని ఆరోపణలు నాడూ లేవని కాదు. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ వాటిపై వివాదాలు వాజ్యాలు నడిపిస్తూనే వున్నారు కూడా. దేశానికి రెండు మూల సమస్యలు మతోన్మాదం, సరళీకరణ గరళీకరణ అనుకుంటే ఈ రెండు విధాలా చంద్రబాబు విమర్శకు అతీతులు కాదు. దేశంలో తొలి బిజెపి ప్రభుత్వం ఆయన చలవ లేకుండా ఏర్పడేది కాదు. రెండవసారి ఆ బిజెపి పొత్తులేకుండా ఆయన గెలిచేవారూ కాదు.ఇక్కడ ఆ పార్టీ విస్తరించేదీ కాదు. ఇక ప్రపంచ బ్యాంకు విధానాలు అనుసరించడంలో చంద్రబాబు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చెప్పనవసరం లేదు. ఆయనను చూసి ముచ్చటపడి ప్రపంచ స్వప్న మంత్రివర్గం(డ్రీమ్‌ క్యాబినెట్‌)లో చోటు కల్పించామన్నారు!
ఐటి అభివృద్దికి చంద్రబాబు పాలన దోహదం చేసి వుండొచ్చు గాని ఆ రంగం విస్తరిస్తున్న దశ అది అని కూడా గుర్తుంచుకోవాలి. మనకన్నా ముందున్న రాష్ట్రాలు అప్పట్లోనూ వున్నాయి. డ్వాక్రా గ్రూపుల వంటివి కూడా ప్రపంచ బ్యాంకు నమూనాకు భిన్నమైనవి కావు. ఇంకుడు గుంతల నుంచి ఇజ్రాయిల్‌ సేద్యం వరకూ చంద్రబాబు చేసిన ప్రయోగాలు అనేకం ఆచరణలో అపహాస్యం పాలైన తీరు మర్చిపోరానిది. ఎందుకంటే దారుణమైన సంక్షోభం గ్రామసీమాలను అతలాకుతలం చేసింది. ఇందుకు కేవలం వానలు కురవకపోవడమే కారణమైనట్టు, తాము అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ చెప్పుకుంటారు గాని జయతి ఘోష్‌ కమిషన్‌ నివేదికను ఒక్కసారి చూడటానికి ఇష్టపడరు! బషీర్‌బాగ్‌ కాల్పులే కాదు, ప్రజా ఉద్యమాల పట్ల అసహనం అప్రజాస్వామికత తాండవించాయంటే అది బ్యాంకు బంధం ఫలితమే. వాటిపై సాగిన పోరాటంలోంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా ఆ విధానాలనే కొనసాగించడం, ముదిగొండ ఘటనల వంటివాటికి కారణమవడం యాంటీ క్లైమాక్స్‌. వైఎస్‌ మరణం, జగన్‌ తిరుగుబాటు, తెలంగాణా సమస్య వంటి పరిణామాలలో తెలుగు దేశం ప్రధాన ప్రతిపక్షంగా సూత్రబద్దమైన పాత్ర నిర్వహించలేకపోయింది. నిజానికి చాలా కాలం పాటు ఈ సమస్యలను కాంగ్రెస్‌కే పరిమితమైనవిగా చూస్తూ తనకు లాభం కలుగుతుందని ఉపేక్ష వహించింది. అయితే అవన్నీ ఆఖరుకు తన చాపకిందకే నీళ్లు తెచ్చి తాను కళ్లుతెరిచే సరికి పీకల లోతు సమస్యల్లో కూరుకుపోయింది. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఎప్పుడూ ఆరోపిస్తుంటారు గాని రాజకీయాల్లో ఆ విధంగా ఆక్రోశించినా ఆగ్రహించినా పలితం ఏముంటుంది? సరైన విధానాలతో ప్రజల మధ్య నిలబడి ఎవరి స్తానాన్ని వారు కాపాడుకోవాలి. విశ్వసనీయత నిలబెట్టుకోవాలి. గతమంతా అలా వుంచి ఈ సమయంలో కూడా ప్రాంతీయ సమస్యలో గాని ప్రభుత్వం పట్ల వైఖరిలో గాని ఆఖరుకు తన దాడి ఎవరిపై ఎక్కుపెట్టాలనే దానిలో గాని తెలుగు దేశం తడబడుతూనే వుందంటే అందుకు అభద్రతా భావనే కారణం. తనకు తానే అభద్రతలో వున్న పార్టీ అనిశ్చితితో నష్టపోతున్న ప్రజలకు ఎలా భరోసా కలిగించగలుగుతుంది?
ఇలాటి ప్రశ్నలకు జవాబు లభించాలంటే తెలుగుదేశం ఇతరులపై విమర్శలకే పరిమితం కాకుండా ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. దీర్ఘకాలం సాగిన తమ పాలనను నిష్కర్షగా సమీక్షించుకుని స్పష్టంగా కనిపించే తప్పులనైనా సవరించుకోవడానికి సిద్ధం కావాలి.ముఖ్యంగా తన పాలనా కాలంలో అనుసరించిన ఆర్థిక నమూనా జన సామాన్యానికి రాష్ట్రాభివృధ్ధికి దోహదకారి కాలేకపోయిందన్న వాస్తవాన్ని గుర్తించాలి. అవినీతికి సారవంతమైన భూమిక ఏర్పర్చడానికి కూడా ఆ విధానాలు దోహదపడ్డాయనే వాస్తవాన్ని ఏదో ఒక రూపంలో ఆమోదించాలి. ఆ కాలంలో కష్టనష్టాలకు గురైన ప్రజలలో విశ్వాసం కలగాలంటే విధానాలు మార్చుకుంటాననే నమ్మకం కలిగించాలి. అంతేగాని అశ్వద్ధామ హత: కుంజర: అన్నట్టు గొప్పలు డప్పు వాయించుకుని తప్పులుంటే క్షమించండని చెవిలో చెప్పడం వల్ల ఫలితముండదు. నాటి తన విద్యుత్‌ విధానాన్ని కీర్తించుకుంటున్నంత కాలం ఇప్పటి పరిస్థితిపై చేసే విమర్శలకు విలువుండదు. బడా మీడియా మద్దతు, భారీ ప్రచారార్భాటాలు వున్నా ఎందుకు ప్రజల విశ్వాసం పొందలేకపోతున్నామంటే అందుకు ఖచ్చితమైన కారణాలుండాలని చంద్రబాబు నాయుడు గాని ఇతర తెలుగు దేశం నేతలు గాని అర్థం చేసుకోవాలి. పాద యాత్ర సాగుతుండగానే వలసలు, రాజ్యసభ గైర్‌ హాజర్లు సాగుతుంటే విశ్వాసం ఎలా నిలబడుతుంది? దశాబ్ది గడిచిపోయినా నాటి పాలనా దక్షతనే పొగుడుకుంటూ కాలం గడిపితే ఎలా కుదురుతుంది?
ప్రాంతీయ పార్టీగా మౌలికంగా లౌకికత గల పార్టీగా తెలుగుదేశం భవిష్యత్తులో ఎలాటి రాజకీయ పాత్ర పోషించగలదనేది దాని విధానాలను బట్టి నిర్ణయమవుతుంది గాని కేవలం చంద్రబాబు పాలనాకాలాన్ని పొగుడుకుంటే ఫలితం వుండదు. ఈ వయసులోనూ ఇంత దూరం నడుస్తున్న ఆయన పట్టుడలను హర్షించడం ఒకటైతే దాని ద్వారా ఆయన అందించే సందేశం సరిగ్గా వుందా అన్న ప్రశ్న అంతకంటే కీలకమైంది. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు దొరకనందునే పార్టీ నేతలతో సహా సాధారణ ప్రజానీకం సందేహాస్పదంగా చూడటం అనివార్యమవుతున్నది.


No comments:

Post a Comment