Pages

Saturday, April 2, 2011

ఇంగ్లీషు కాలంలో తెలుగు 'న్యూ ఇయర్‌!' శుభాకాంక్షలతో...









.


మిమ్మల్ను ఎవరన్నా ఆదివారం ఎన్నో తేదీ అని అడిగితే ఏమంటారు? ఏప్రిల్‌ 3 అని చెప్పేస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజు అంటారా?బహుశా అనకపోవచ్చు. అదే ఇంగ్లీషు కాలంలో తెలుగు సంవత్సరం.
ఇంతకూ భారతీయులకు పండుగలకు కొదవ లేదు. కొన్ని దేశ వ్యాపితమైనవైతే కొన్ని ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఉత్తరాదిని ధూం ధాంగా జరిగే పండుగలు కొన్ని దక్షిణాదిన మరోలా జరుగుతాయి. దక్షిణాదిన కూడా రాష్ట్రాల వారిగా మారేవి వుంటాయి. అలా చూస్తే తెలుగు కన్నడ మహారాష్ట్ర ప్రాంతాల వారికి పరిమితమైన పండుగ ఉగాది. తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజు గనక
ఇలా అంటున్నారు గాని కన్నడికులు, మహా రాష్ట్రులు యుగాది అంటారు.యుగం అంటే ఇప్పుడు రకరకాల అర్థాలలో వాడుతున్నా వాస్తవానికి యుగం అంటేనే సంవత్సరం అని కాలానికి సంబంధించిన ఒక లెక్క అని అంటారు. అలా కొత్త ఏడాది మొదలవుతుంది గనక ఉగాది.ఇంతకూ మొదలయ్యే ఏడాది అచ్చంగా తెలుగేదా అంటే చెప్పడం కష్టం. ఆ పేర్లన్నీ సంసృతంలోనే వుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సంప్రదాయాల ప్రకారం అనుసరించే సంవత్సరం అని మాత్రమే దీన్ని తీసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఈ సంప్రదాయ సంవత్సరాలను కూడా కేవలం భక్తి విశ్వాసాల అమలుకోసం ఇంకా చెప్పాలంటే ముహూర్తాలు వగైరా చూసుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు.
కాలం తెచ్చిన మార్పు
మిగిలిన పండుగలన్ని పురాణాలతో ముడి పడినవి. ఉగాది మాత్రం కాలానికి సంబంధించింది గనక శాస్త్రీయమైందని అంటుంటారు. సంవత్సరం మొదలవడం, కాలం గురించిన లెక్కలు వుంటాయి గనక ఇది నిజమే అనుకోవచ్చు. కాని వాస్తవంలో ఏ పండుగ కన్నా ఎక్కువగా ఉగాదిలోనే కాలం తెచ్చిన మార్పులు బాగా తెలుస్తాయి. ఎక్కడిదాకానో ఎందుకు? జనవరి 1న హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ జరిగే హడావుడి ఉగాది రోజున వుంటుందా? ఎందుకుండదంటే ఇది దైనందిన జీవిత వ్యవహారాలలో ఉపయోగించడం లేదు గనక. లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార పాలనా వ్యవహారాలు అన్ని ఇంగ్లీషు క్యాలెండర్‌ ప్రకారమే నడుస్తుంటాయి. ప్రపంచమంతటా అమలవుతున్న కాలం అదే. మనమూ దాన్ని బట్టే ఆలోచిస్తుంటాము. ప్రణాళికలు వేసుకుంటాము. మార్చి నుంచి జూన్‌ వరకూ పరీక్షలు వగైరా వుంటాయి, మార్చి 31 కి వాణిజ్య సంవత్సరం పూర్తవుతుంది.. ఇలా..అనేకం వున్నాయి.ఇందులో ఏదీ తెలుగు ఏడాది లెక్క ప్రకారం జరగదు.పత్రికలు కూడా ఈ ప్రకారమే వస్తాయి. కాకపోతే ఈ మధ్యనే తిధి వారాలు రాహుకాలం వగైరా కూడా వేస్తున్నారు. కాని వీటిని బట్టి ఒక రోజు పత్రికను మనం గుర్తించలేము. తేదీని బట్టి పట్టుకోవలసిందే. ఇదే కాలం తెచ్చిన మార్పు.

ప్రకృతి పరిణామం
నెలలు సంవత్సరాలు మాత్రమే కాదు. ప్రకృతి పరంగానూ అనేక మార్పులు వచ్చాయి. పల్లె జీవితంతో ముడిపడిన కాలగణన అదైతే ఇప్పుడు అది వూసుల్లోనూ కవితల్లోనూ మాత్రమే మిగిలి పోయింది. ఉగాది అంటేనే మామిడి చిగుళ్లు కోకిల కూతలు వగైరా వగైరా మదిలో మెదులుతాయి. కవితలూ పాటలన్నిటా అవే ప్రత్యక్షమవుతుంటాయి.దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాటి వారు అచ్చంగా చిగుళ్లు కోయిలలచుట్టూనే అనేక పాటలు కట్టారు.సంప్రదాయ కవులైతే ఉగాది వూహ రాగానే పద్యాలు గుమ్మరించి వదులుతారు.అందులో అతి ప్రధానమైంది వసంత రుతు వర్ణణ. వసంతం అనగానే వలపుల తలపులు గుప్పుమంటాయి. కాని ఇప్పుడు మారిన పర్యావరణంలో జీవావరణంలో వసంతం అంతగా కనిపించేది లేదు, కనిపించినా పట్టించుకునేదీ లేదు. దాదాపు 70 ఏళ్ల కిందటనే అత్యాధునిక కవి పఠాభి రుతువులు మారుతున్న వైనాన్ని అక్షరీకరించారు.చెల్లారామ్స్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ను బట్టి పండుగలు తెలుస్తున్నాయని, చైనా బజార్‌(చెన్నరు)పై చంద్రుడు వేళ్లాడుతున్నాడని రాశారు. ఇన్ని దశాబ్దాల్లోనూ పరిస్థితి మరింతగా మారిపోయింది. ఇప్పుడు రుతు పరిణామం గమనించేందుకు పిల్లలకు అవకాశమే లేదు,అవధానమూ లేదు.

వసంత కాలం వచ్చేనోచ్‌!
వసంతం అనగానే యువతీ యువకుల సరాగాలు సరస సంరంభాలు పాత కావ్యాల్లో పరుచుకుని వుంటాయి. ఇప్పటికీ హొలీ వేడుకలు తప్పిస్తే ఆ వసంత శోభకు ఏ స్థానమూ వుండటం లేదు.అలా అని జీవితంలో ప్రేమ శృంగార రసాలు తగ్గు ముఖం పట్టాయా అంటే అదీ తప్పే. వలంటీన్స్‌ డేలు ఆ స్థానాన్ని అలవోకగా ఆక్రమించేశాయి. వలంటీన్స్‌ డే కార్డులు వేడుకల హంగామా ముందు వసంత ఉత్సవాలు కనిపించకుండా పోయాయి. అసలు ప్రేమ అనే మాట విలువ కోల్పోయి లవ్‌ అన్నదే దాని సార్వత్రిక భాషాతీత వ్యక్తీకరణగా స్థిరపడింది. ఇది సామాజిక కోణం కాగా మరో వైపునుంచి చూస్తే ప్రకృతి పరంగానూ పట్టణీకరణ మొక్కలు పూలు వనాలకు చోటు లేకుండా చేసింది. అంతస్తులపై అంతస్తులుగా కొలువు తీరిన అపార్ట్‌మెంట్‌ సంసృతిలో మొక్కలు కనపించే అవకాశమే మృగ్యం. ఇలాటప్పుడు కొత్త చిగుళ్లను వూహల్లో తప్ప వాస్తవంలో చూడగలిగే అవకాశం కొద్ది మంది వృక్ష ప్రేమికులకే పరిమితమై పోయింది. కొత్త చిగురు అలా వుంచితే కొత్త కుండలో నీళ్లు .. నీటి బాటిళ్ల రోజుల్లో కుండలన్నవి కనుమరుగవుతున్న స్థితి. ఇలా అనేక రీతుల్లో ఉగాది వూసులు వూసులుగానే మిగిలిపోవడం కద్దు.
కానరాని కోయిలలు...
కోయిల పాటకు పర్యాయపదం కాని ఇంటింటా అల్లుకుపోయిన టీవీ నెట్‌ వర్క్‌లలో పాటల సంసృతి ఎంత పెరిగినా కృత్రిమ వాయిద్యాలు తప్ప కోయిలల కుహూ రవాల వంటివాటికి చోటు వుండటమే లేదు. ఇది కూడా పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది. పాటలు పాడటం, ఆడియో విడియోలు కొనడం వినడం, వాహనాల్లోనూ రణగొణధ్వనులు చేయడం అన్నీ పెరిగాయి. కాని ప్రకృతి సహజమైన పక్షలు కిలకిల రావాలు, కోయిలు కుహూ రవాలు మాత్రం మన చెవికెక్కడం లేదు. ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న చిగుళ్లనూ కోయిలనూ కలిపి పోతనామాత్యుడు భాగవతంలో 'మందార మకరండ మాధుర్యమున తేలు కోయిల చేరునే కుటజములకు' అని పద్యం కట్టాడు. పద్యం మిగిలింది గాని భావం మిగల్లేదు. కృష్న శాస్త్రి గారి పాటల్లోనైతే ఎప్పుడూ చిగుళ్లు కోయిలలు, సెలయేళ్లు వంటివి పలకరిస్తూనే వుంటాయి. మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అని ప్రశ్నిస్తాడు. చిగురాకుల వూయలలో ఇల మరిచిన ఓ చిలుకా అనేది ఎప్పటిదో పాత పాట.చిగురులు వేసిన కలలన్ని తలలో పూలుగా మారినవి అని పూలరంగడు పాట మోహన్‌ దాస్‌ గొంతులో అలా నిలిచిపోయింది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు అన్న ఆదృష్టవంతులు పాట జానపద బాణీలో పెద్ద హిట్టయి కూచుంది.చిగురేసే మొగ్గేసే సొగసంత పూత పేసె చెయ్యయినా వెయ్యవేమీ ఓ బాబూ దొర అనే పాట కూడా చిగురుతో ముడిపడిందే. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు చిగురునూ వలపునూ కలిపి పాటలల్లడం మన సినీ కవులకు రివాజు.
పచ్చడి మాత్రం తప్పని సరి
తెలుగు వాళ్లకు ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది , అందుబాటులో అలాగే కొనసాగుతున్నది ఉగాది పచ్చడి వొక్కటే! షడ్రుచుల సమ్మేళనం అని చెబుతున్నా వాస్తవంలొ ఇందులోని చేదు వల్లనే దానికి ప్రత్యేకత కలుగుతున్నది. అయితే క్రమ క్రమంగా చేదు లేకుండా ఉగాది పర్చడి చేస్తామనే వాళ్లు కూడా బయిలు దేరారు. ఆ రోజున ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ మాత్రమే గా క హౌటళ్లలోనూ మెస్సులలోనూ కూడా ఉగాది పచ్చడి వేయడం దాని ప్రాచుర్యాన్ని చెబుతుంది. కొత్త చింతపండు, పచ్చి మిరపకాయలు, కొత్త బెల్లం, మామిడిపిందెలు,వేతపూత,ఉప్పు కలిపితే తయారయ్యేదే ఉగాది పచ్చడి..వీటినే మధుర,ఆమ్ల(పులుపు)లవణ,కటు(కారం),తిక్త,(చేదు),కషాయం అని సంసృతంలో చెప్పి సంతోషించేవారుంటారు. ప్రకృతిలో కొత్తగా కాస్తున్న దినుసులను కలపడమే ఇక్కడ పరమార్థం. ఇదిగాక ఉగాది పచ్చడిలోని వివిధ దినుసుల వల్ల కలిగే ప్రయోజనాలపై కొంతమంది అదే పనిగా రాస్తుంటారు గాని అందులోనూ అతిశయోక్తి వుంటుంది. కేవలం ఆరోగ్యకారణంగా అయితే ఆ రోజునే తినాలని ఏముంటుంది? ఇంతకూ చేదు కూడా ఒక రుచే అని ఇచ్చాపురం జగన్నాథం నవలే రాశారు. నిజంగానే ఉగాది గురించిన ఆధునిక కవితలన్ని ఎక్కువగా ఈ చేదు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి.ఎందుకంటే ఉగాది తెలుగు సాహిత్య సాంసృతిక వేడుకలకు ప్రసిద్ధి. కవి సమ్మేళనాలకు పెట్టింది పేరు. ఈ సమ్మేళనాల్లో కవి శేఖరులు అరిగిపోయిన ప్రాచీన పద్దతుల్లో కోయిలల గురించి చిగుళ్ల గురించి వినిపించి శాలువల కప్పించుకుని నిష్క్రమించేవారు. ఆకాశవాణి ఏటేటా ఉగాదికి జరిపే కవి సమ్మేళనాల్లో విశ్వనాథ,కృష్ణశాస్త్రి,శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, సినారె, ఇత్యాది పేద్ద కవుల నుంచి రేడియో వారి కటాక్షం నోచిన కుర్రకవులు వరకూ గేయాలు వచనాలు వినిపించడం మొదలెట్టాక ఈ బాణీ మారింది.జీవితంలో చేదుగా మారిందనీ, కోయిలలు ఎక్కడ కనిపిస్తున్నాయని ప్రశ్నిస్తూ కవితలు రాస్తుంటారు.
కవితల వనరు, నెనరు
అరవై నాలుగు సంవత్సరాలకూ ప్రభవ,విభవలతో మొదలెట్టి వికృత, వ్యయ,రుణ, విక్రమ,రౌద్ర, రక్తాక్షి, ప్రమోదూత,ప్రమాది ప్రజోత్పత్తి తదితర నామధేయాలుంటాయి ఇందులో కొన్ని మధురమైన పేర్లు కాగా మరికొన్ని భయానకంగానూ వుంటాయి. ప్రారంభాన్ని సూచించే ప్రభవతో మొదలై క్షయతో ముగుస్తుంది. గనక వాటితోనే కవితలు అల్లేస్తారు. వ్యయ నామ సంవత్సరం అనగానే వినియోగదారి సంసృతికి అచ్చంగా పోల్చేస్తారు. గడిచిపోతున్నది వికృత నామ సంవత్సరం గనక అన్ని వికృతంగా అనిశ్చితంగా వున్నాయని కూడా ఒక భాష్యం. ఇలాగే విరోధ వంటివాటిని కూడా అర్థంతో జోడించి పాతుతుంటారు. రాక్షస నామ సంవత్సరంలో ఒకసారి శ్రీశ్రీ వచ్చావా రాక్షసారా,తెచ్చావా ద్రాక్షసారా అని భాషనూ భావాన్ని జోడించి కట్టిన కవిత ప్రసిద్ధం.అలాగే
చరిత్ర దర్శనం
అన్నట్టు చాలా దశాబ్దాల పాటు తెలుగు పత్రికలు ఉగాది నాడు విజ్ఞాన సర్వస్వాలవలె వెలువడుతుండేవి. తొలి ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్ర పత్రిక ఇందుకు వరవడి పెట్టింది. దాని ఉగాది సంచికలు విజ్ఞాన కోశాలుగా మిగిలిపోయాయి. 1910లోనే ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు ఉగాది సంచికల సంప్రదాయం మొదలెట్టారు. అంటే వంద ఏళ్ల కిందటే.. వాటిపై వచ్ని పరిశోధనా వ్యాసాలను తిరగేస్తే కాలగమనంలో మానవ ప్రస్థానం కళ్లకు కడుతుంది. ఉదాహరణకు 1919 ఉగాది సంచికలో బోల్షీవిక్‌ విప్లవం వగైరాలను పరిచయం చేశారు. జలియన్‌ వాలాబాగ్‌ దురంతాలపై నియమించిన హంటర్‌ కమీషన్‌ అభిశసంనను సుదీర్ఘంగా ప్రచురించారు. భారత ప్రభుత్వం చెన్న రాష్ట్రము పట్ల చూపుచున్న వివక్షనే చెన్న రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రుల పట్ల చూపుచున్నది అని నాటి పరిస్థితిని ప్రస్తావించి భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని ఎలుగెత్తి చాటింది.ఇది తొంభై ఏళ్ల నాటి మాట.1944 రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితిలో సంచిక తక్కువ పేజీలతో వచ్చింది. తర్వాతి కాలంలో సుప్రసిద్ధులైన తెలుగు కవులు రచయితల తొలి అడుగుల అక్షరాలు కూడా ఈ సంచికల్లోనే చూడగలము. కాళోజీ 1946లో రాయల్‌ నౌకాదళ తిరుగుబాటును తన ఉగాది కవితలో జొప్పించడం చారిత్రిక ప్రాధాన్యత గల విషయం.
పల్లవి మారిన పంచాంగం
ఉగాదిలో ఏది మారినా మారకపోయిన పంచాంగ శ్రవణం మాత్రం తప్పక సాగుతుంది. కాలం మారి మీడియా పెరుగుతున్న కొద్ది ఈ పంచాంగ పఠనం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహించే పఠనానికి ముఖ్యమంత్రి స్వయానా విచ్చేసి వింటారు. కనక అక్కడ పఠనం యుక్తియుక్తంగా ఏలినవారికి ఏ మాత్రం నొప్పికలిగించకుండా మెప్పించే ఫక్కీలో నడుస్తుంది. అదే సమయంలో క మ్యూనిస్టేతర ప్రతిపక్ష నేతలు తమ తమ ఆస్థానాల్లో ఈ తతంగం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడా ఇదే రీతిలో నిర్వాహకానుకూలంగా సాగిపోతుంది.రాను రాను ఈ పంచాంగ శ్రవణం రాజకీయ విశ్లేషణలా మారిపోతుంటుంది.అసమ్మతి, ప్రతిపక్షం, ఎన్నికలు వంటివి అలవోకగా చెప్పేస్తుంటారు. తర్వాత ఏం జరిగినా ఆ క్షణంలో ఆహ్వానించిన వారిని అలరించడమే ఏకైక సూత్రమని అందరికీ తెలిసినా సంప్రదాయం! వాస్తవంలో ఈ పండుగ ఇంకా వున్నదే పంచాంగ ం పాటింపు కోసం. పంచాంగం అంటే ఏమిటి?పంచ అంగాలు- లేదా అయిదు భాగాలు.....తిథి,వారం,నక్షత్రం,యోగం,కరణం అన్నవే అయిదు అంగాలంటారు. ఇందులో వారం నక్షత్రం ఖగోళ సంబంధమైనవైతే మిగిలినవన్నీ నమ్మకాలతో ముడిపడినవే. ఫలానా సమయంలో ఫలానా తిధి గనక ఆ సమయంలో ఫలానా పని చేస్తే కలిగే యోగం ఇలా వుంటుందని చెప్పడమన్న మాట. ఏ పని చేయాలన్నా ముందు ముహూర్తం చూసుకుని మొదలెట్టే అలవాటు ఇప్పటికీ అత్యధికులు కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ కూడా జీవిత వాస్తవానికి తరతరాల విశ్వాసాలకు వైరుధ్యం ఎదురవుతూనే వుంటుంది. ఉదాహరణకు పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఎన్నికలు ఇవేవీ ఎవరో ఒకరు అనుకున్న ప్రకారం మొదలు కావు. కాకపోతే దాన్ని మార్చలేరు గనక తమ పరిధిలో వున్న సన్నాహాలకు ముహూర్తం చూసుకోవడం చేస్తుంటారు.అలాగే ఎన్నికలు,రాజకీయాల వంటి సందర్బాలలో ఉభయ పక్షాలూ ముహూర్తాలు చూసుకుని బయిలుదేరినా ఒకరినే విజయం వరిస్తుందని తెలుసు.
పంచాంగాలు పలు విధాలు
ఉగాది సందర్భంలో వందలాది మంది విడుదల చేసే పంచాంగాలలో ఏడాది పొడుగునా వర్తించే ముహూర్త బలాలూ ప్రతికూలతలూ వగైరా వుంటాయి. అందులోనూ తేడాలు కూడా వుంటాయి. ఆఖరకు తిరుపతి,భద్రాచలం వంటి చోట పండుగలు, గ్రహణాలకు సంబంధించి అనుసరించే కాల గణనలోనే తేడాలు కనిపిస్తుంటాయి. అయితే భారతీయ ఖగోళ శాస్త్రం చాలా గొప్పది గనక గ్రహ గతులను గురించిన లెక్కలు చాలా వరకూ సరిగ్గానే నడుస్తుంటాయి. శాస్త్ర బద్దమైన ఆ అవగాహనకు తమ నమ్మకాలను జోడిస్తారు పంచాంగ కర్తలు. చాలా కాలం పాటు తెలుగు పత్రికలు వీటిని పట్టించుకునేవి కావు. రాశిఫలాలు వేసే అలవాటు తర్వాత నెమ్మదిగా పెరిగింది.ఇప్పుడు చాలా పత్రికలు ఇంగ్లీషు తేదీలతో పాటు తిధి నక్షత్రాలు, ముహూర్తం వంటివన్నీ ప్రచురిస్తున్నాయి. ఇది మారుతున్న కాలంలో పునరుద్ధరణ వాద ప్రభావం అనుకోవాలి. అయితే ఇవన్నీ వున్నా ఏదైనా నిర్ణయం తీసుకోవడం మాత్రం జనవరి, ఫిబ్రవరి లెక్కలోనే జరుగుతుంది. కాకపోతే శ్రావణ మాసం, ఫల్గుణ మాసం వంటివి కొన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పల్లెల్లో రైతాంగం కార్తెలను అనుసరిస్తున్నా వారి లావాదేవీలు మాత్రం మామూలు క్యాలెండరే అనుసరించడం కద్దు.
తేదీలే మారాయి!
క్యాలెండర్‌ వినియోగంలో ఈ మార్పు ఎక్కడి వరకూ వచ్చిందంటే ఒకప్పుడు ఉగాది ఎక్కువగా మార్చి నెలలో వచ్చేది. ఇప్పుడు అది క్రమేణా ఏప్రిల్‌కు మారిపోయింది. పర్యావరణంలో వచ్చిన మార్పులు,సూర్య గమనంలో తేడాలు ఇందుకు కారణం. తెలుగు సంవత్సరాదిని కూడా ఇంగ్లీషులో చెప్పుకోవడంలోనే ఈ మార్పు మనకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఇంతకూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది చేసుకోవమే సంప్రదాయం గాని ఎవరైనా దాన్ని ఏప్రిల్‌ ....వ తేదీన అని మాత్రమే చెబుతారు. సెలవులు గట్రా ఆ విధంగానే తీసుకుంటారు. ఇవన్నీ విశ్వాసం వాస్తవాలతో సర్దుబాటు చేసుకొని మనుగడ సాగిస్తున్న తీరును చెబుతాయి. మరోవైపు నుంచి చూస్తే దేశీయ సంసృతులు వుండటంలో పెద్ద దోషం లేదు గాని వలస వాదం వాటన్నిటిని నిర్దూమధామం చేసి ఏకరూప సంసృతిని రుద్దింది. రవి అస్తమించదని చెప్పుకున్న బ్రిటిష్‌ సామ్రాజ్యాధిపత్యం ప్రతిచోటా తన క్యాలెండర్‌నే వాడుకలోకి తెచ్చింది. చంద్రమాన సంవత్సరాలలో నెలకు నాలుగు వారాలు చొప్పునే లెక్కించి దాన్ని సరిచేయడానికి అధిక మాసం,శూన్యమాసం లెక్కిస్తుంటారు. ఇందుకు భిన్నంగా ఇంగ్లీషు క్యాలెండర్‌లో నెలను బట్టి 30,31 రోజులు ఖాయంచేసి ఫిబ్రవరిలో మాత్రం 27,లీపు సంవత్సరంలో మాత్రం 28 రోజులు చూపిస్తుంటారు. చాంద్రమానం ఆధారంగా కాలాన్ని గణించిన భారతీయ సంప్రదాయానికి సౌరమానంపై ఆధారపడిన పాశ్చాత్య గణనకు మూలంలోనే తేడా వుంది.అయినా రెంటినీ కలగాపులగం చేసిన మిశ్రమ జాతకాలు ఇప్పుడు నడుస్తున్నాయంటే అంతకంటే గత్యంతరం లేదు గనకే. బిడ్డ ఖచ్చితంగా ఏ క్షణంలో పుట్టిందనేది ఎవరూ లెక్కించలేరు గనక అసలు సిజేరియన్‌ ద్వారా ఆ క్షణంలోనే బయిటకు వచ్చేట్టు చేస్తున్నారంటే అది విజ్ఞానానికి విశ్వాసానికి వివాహం చేయడం కాక మరేమిటి?ఇదిగో ఇలాటి తతంగాలన్నిటికీ నాందీ వాచకం ఉగాది.

ఏది ఏమైతేనేం, తెలుగు వారి సంవత్సరాదిగా చెప్పుకునే ఉగాదిని ఇంగ్లీషు కాలంలో తెలుగు ఏడాదిగానూ, సంప్రదాయ సంవత్సరంగానూ పరిగణించడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.




No comments:

Post a Comment