- తెలకపల్లి రవి
ఈ వారంలో అనేక సమస్యలు రోశయ్య ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలోకి నెట్టాయి. అందులోనూ సూక్ష్మ రుణ సంస్థల రాక్షసాలకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిశిత విమర్శలకు గురైంది. ఆఖరుకు అర్డినెన్సు తెచ్చినా అది అరకొరగా వుండటంతో ఆగ్రహం పెల్లుబికింది. కీలకమైన అధిక వడ్డీ సమస్యను అంటుకోకుండా ఆర్దినెన్సు వల్ల ప్రయోజనమేమిటని అందరూ ప్రశ్నిస్తుంటే అది రిజర్వు బ్యాంకుపై నెట్టి తప్పుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆర్‌బిఐ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, దీనిపై జులైలోనే తాము తాఖీదు పంపించామని వెల్లడించడంతో ఆ సమర్థన తేలిపోయింది. ఉద్యోగ వర్గాల న్యాయమైన కోర్కెలను కూడా ఆమోదించకపోవడంతో వారు సమైక్యంగా ఉద్యమ బాట పట్టనున్నట్టు ప్రకటించారు.ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ప్రభుత్వంలోనూ అనిశ్చితి తొలగిపోయేది కాదని ఈ వారం పరిణామాలు విదితం చేశాయి. ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ యాత్రలో ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ప్రస్తావనకు వస్తుందని ఎదురు చూసిన ఆశావహులకు నిరాశే మిగిలింది. జగన్ శిబిరంతో విభేదాలు, రాష్ట్ర భవిష్యత్తు స్పష్టం కాకుండా విస్తరణ చేసే సాహసం అధిష్టానం చేయలేదన్న భావన బలపడింది. ఏ మార్పు చేస్తే ఎవరు కోపగిస్తారోనన్న భయం తప్ప ఇందుకు మరో కారణం లేదు. విస్తరణకు అధిష్టానం అనుమతి రాలేదనుకున్నా తన పరిధిలోని నామినేటెడ్ పదవులను కూడా రోశయ్య భర్తీ చేయకపోవడానికి కారణం కూడా ఇదే నన్నది స్పష్టం. ఆఖరుకు సామాజిక న్యాయంతో ముడిపడిన మహిళా కమిషన్, ఎస్‌సి ఎస్‌టి కమిషన్ వంటివాటికైనా చైర్మన్లను నియమించాలంటూ బి.వి.రాఘవులు లేఖ రాసినా స్పందన లేదు.
ఈ లోగా అంతర్గత కలహాలు మాత్రం ముదురుతున్నాయి. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర సందర్భంలో కాంగ్రెస్ గ్రూపులు తీవ్రస్థాయిలోనే ఘర్షణ పడ్డాయి. జిల్లాలో యాత్రను త్వరగా ముగించాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఈ లోగా రోశయ్య మంత్రివర్గానికి సంబంధించి గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తర్వాత వాటిని సరిదిద్దుకుంటూ రాసిన లేఖ మరో దుమారానికి దారి తీశాయి. జగన్ ఒక్కసారిగా 1100 రెట్లు ఎక్కువ ఆదాయం పన్ను చెల్లించడంపై వచ్చిన ప్రశ్నలకు, విమర్శలకు ఆ శిబిరం ఎదురుదాడి మాత్రమే సమాధానమైంది.
ఆస్తుల అమ్మకం(క్యాపిటల్ గెయిన్స్) వల్ల వచ్చిన ఆదాయాన్ని కూడా కలపడం వల్లనే ఎక్కువ పన్ను చెల్లించాడని వారంటున్నారు. అసలు ఈ క్యాపిటల్ ఎక్కడనుంచి వచ్చిందో చెప్పరు. అధిష్టానం ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్చకు అవకాశమిచ్చిందని కూడా జగన్ వర్గం ఆరోపణగా వుంది. ఎల్లో మీడియా కుట్రగా దీన్ని చూపిస్తున్న జగన్ శిబిరం ఇప్పుడు దాంట్టో టీవీ9 ఛానెల్‌ను కూడా చేర్చడం కొత్త పరిణామం. ఏది ఏమైనా వైఎస్ కుటుంబం అనతి కాలంలోనే ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్న తీరును ఎవరూ విస్మరించజాలరు. దానిపై విమర్శలకు జవాబు చెప్పకా తప్పదు. ఈ శిబిరానికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కూడా సంజాయిషీ నోటీసు ఇచ్చిన పిసిసి చర్యను, జగన్‌ను 15 సూత్రాల కమిటీలో నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కలిపి చూస్తే అధికార పక్షం అనిశ్చితి మరింతగా తేటతెల్లమవుతుంది.
ఈ వారంలో అనేక సమస్యలు రోశయ్య ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలోకి నెట్టాయి. అందులోనూ సూక్ష్మ రుణ సంస్థల రాక్షసాలకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిశిత విమర్శలకు గురైంది. ఆఖరుకు అర్డినెన్సు తెచ్చినా అది అరకొరగా వుండటంతో ఆగ్రహం పెల్లుబికింది. కీలకమైన అధిక వడ్డీ సమస్యను అంటుకోకుండా ఆర్దినెన్సు వల్ల ప్రయోజనమేమిటని అందరూ ప్రశ్నిస్తుంటే అది రిజర్వు బ్యాంకుపై నెట్టి తప్పుకోవడానికి ప్రయత్నించింది.
అయితే ఆర్‌బిఐ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, దీనిపై జులైలోనే తాము తాఖీదు పంపించామని వెల్లడించడంతో ఆ సమర్థన తేలిపోయింది. ఉద్యోగ వర్గాల న్యాయమైన కోర్కెలను కూడా ఆమోదించకపోవడంతో వారు సమైక్యంగా ఉద్యమ బాట పట్టనున్నట్టు ప్రకటించారు. సిపిఎం ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా ప్రజాసమస్యలపై జరిగిన నిరాహారదీక్షలు మంచి ప్రభావం చూపించడమే గాక పరిష్కారాల దిశలో ముందంజ వేశాయి.ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రులు ఆరోపణల వూబిలో చిక్కుకుపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఆ జాబితాలో ముఖ్యులు. అయితే ఈ వారం బొత్స తనపై విచారణకు తెలుగు దేశం నాయకులనే నియమించవలసిందిగా చంద్రబాబుకు లేఖ రాయడం ద్వారా కొత్త అస్త్రం సంధించారు. ఇది చవకబారు ఎత్తుగడ అని తెలుగు దేశం నాయకులు కొట్టివేయడమే కాక రాజీనామా చేసి విచారణనెదుర్కోవలసిందిగా సూచించారు. అదెలాగూ జరిగేది కాదని అందరికీ తెలుసు. ఏది ఏమైనా సమస్యలపై అఖిల పక్షాల కదలిక, అన్ని పార్టీలూ కలసి ప్రజాసమస్యలపై ఒత్తిడి తేవడం ఆహ్వానించదగిన పరిణామం.
ప్రజా ఫ్రంట్ ప్రతిధ్వనులు
గత వారం 'ప్రయోజనాల ఘర్షణకు ప్రతిబింబం' అన్న శీర్షికతో గద్దర్ తెలంగాణా ప్రజా ఫ్రంట్ ప్రారంభ ఘట్టాన్ని పరామర్శించుకున్నాం. అయితే ఆ ప్రారంభ సభ ఆఖరి ఘట్టంలో వేదికపైనే విభేదాలు తీవ్రంగా వ్యక్తమైనాయి. ముఖ్యంగా ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు భగ్గుమన్నాయి. ఎన్నికలతో సంబంధం లేని ఉద్యమ రాజకీయాల గురించే మాట్లాడ్డం విభజనవాద నేపథ్యంలో నిలిచేది కాదని అందరికీ తెలుసు. అలాంటప్పుడు దానిపై దాగుడు మూతలెందుకుని కొందరు నిలదీయడం, వాకౌట్ చేయడం కానవచ్చింది. ఈ లోగా వరవరరావు ఎన్నికలలో పాల్గొనే ప్రసక్తి లేదని అన్నట్టు పత్రికలలో వచ్చింది. గద్దర్ మావోయిస్టు నేపథ్యం రీత్యా ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. గాని పాలక పక్షాల విభజన పాచికలలో ఈ 'విప్లవ' భావాలకేమి చోటుంటుందన్నది ప్రశ్న. మరోవైపున టిఆర్‌ఎస్, టిపిఎఫ్‌ల మధ్య కనిపించని ఘర్షణ బహిరంగ రూపంలోనే సాగుతున్నది. ఉభయులూ పల్లె బాట చేపట్టడంతో పాటు డిసెంబరు 9న సభలు జరపనున్నట్టు ప్రకటించారు. కెసిఆర్‌పై విమర్శలు కూడా చేస్తున్నారు.
కాంగ్రెస్ కూడా మృతుల కుటుంబాలకు సహాయం పేరిట తెలంగాణా జిల్లాలలో సభలు నిర్వహించి తన ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం పెంచింది. తెలుగుదేశం తెలంగాణా నాయకత్వం సోనియా ఇంటిముందు ధర్నా కార్యక్రమం ప్రకటించింది. మొత్తంపైన తెలంగాణా పేరుమీద సాగే రాజకీయంలో సరికొత్త వైరుధ్యాలు తీవ్రమవనున్నతీరుకు ఇవన్నీ అద్దం పడుతున్నాయి.
చే స్పూర్తికి కళంకం
రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి దుశ్శాసన పేరుతో తీసే చిత్రంలో విశ్వ విఖ్యాత విప్లవకారుడైన చే గువేరా ఆహార్యాన్ని కించపర్చడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. యువజన విద్యార్థి సంఘాలు చే అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రచయిత కూడా పాల్గొన్న ఒక టీవీ చర్చకు హాజరైన పోసాని చేగువేరా గెటప్‌ను మారుస్తానని హామీ నిచ్చారు. అయితే ఈ విధంగా విప్లవ కారులు మహనీయుల స్మృతిని, స్పూర్తిని కించపర్చే ఆలోచనలు, ప్రయత్నాలు సహించరానివన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. పోసాని ఇచ్చిన మాట ప్రకారం వ్యవహరిస్తారని ఆశించాలి.
నీతులు వల్లిస్తున్న బిజెపి నేతలు
కర్ణాటకలో రెండవ సారి బలపరీక్ష ప్రహసనం అయిందనిపించుకున్న బిజెపి నాయకులు అక్కడికదే ఘన కార్యమైనట్టు అదే పనిగా నీతులు వల్లిస్తున్నారు. 14వ తేదీన ప్రభుత్వానికి అనుకూలంగా 106 మంది ఎంఎల్‌ఎలు ఓటు వేసినంత మాత్రాన అత్యంత జుగుప్సాకరమైన యెడ్యూరప్ప ప్రభుత్వ వ్యవహారాలన్నీ మటుమాయమై పోవు. పైగా 18వ తేదీన హైకోర్టు అనర్హత సమస్యపై తుది తీర్పు ఇచ్చే వరకూ ఈ విజయం శాశ్వతమనీ అనుకోవడానికి లేదు. ఇది పూర్తిగా తమ స్వయం కృతాపరాధమన్న మాట మరుగుపరిచి కేవలం గవర్నర్‌నో, కాంగ్రెస్‌నో విమర్శించి ప్రయోజనం లేదు. కొన్ని మాసాల కిందట గాలి జనార్దనరెడ్డి తాకిడికి తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న యెడ్యూరప్ప ఇప్పుడు పరమ నిరంకుశుడిగా వ్యవహరించారు. బలపరీక్ష శాసనసభా వేదికపై జరగవలసి వుండగా అసమ్మతి తెల్పిన వారిపై ముందస్తుగా అనర్హత వేటు వేశారు. ఇది ప్రజాస్వామ్యం సూత్రాలకే విరుద్ధం. 10వ షెడ్యూలు కింద వారు రాసిన లేఖను బట్టి ఈ చర్య తీసుకున్నామని చెబుతున్న స్పీకర్ బొపయ్య కనీసం సంజాయిషీ లేఖైనా పంపించి సమాధానం తీసుకోలేదు. వ్యతిరేకిస్తారనుకున్న వారిని సభలోకి రాకుండా చేసిన తర్వాత బలపరీక్ష అన్న దానికి అర్థం లేదు.
సాయుధ పోలీసుల పహారాలో సభ్యులతో మమ అనిపించి మహత్తర విజయంగా చిత్రించుకున్నారు. ఈ నిర్వాకాలతో గవర్నర్ జోక్యానికి తాముగా వీలు కల్పించి ఆ పైన కుట్ర అని గగ్గోలు పెట్టారు. ఇంతకూ కాంగ్రెస్ కుట్ర అనాలంటే అదే జనార్థనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతకు అనుంగుసహచరుడు, అండదండగా నిలిచిన వ్యక్తి శక్తి. రాష్ట్రాల రాజకీయ విధేయతల రేఖలను దాటి విస్తరించిన ఈ ధన బలం ప్రస్తుత ప్రజాస్వామ్య మేడిపండు రూపానికి నిదర్శనం. ఇప్పుడు అడ్డం తిరిగిన సభ్యులు గతంలో కాంగ్రెస్‌నుంచి రాబట్టి పదవుల ఆశజూపి రాజీనామా చేయించి బిజెపి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నవారే. గవర్నర్‌పై చిందులు తొక్కుతూనే ఆయన ఆదేశానుసారం మలి పరీక్షకు సిద్దం కావడంలోని మర్మం అనర్హత వేటుపై న్యాయస్థానం తీర్పు వచ్చేలోగానే మరోసారి తంతు పూర్తి చేసుకుందామన్న వ్యూహమే. ఈ విషయంలో జెడి(యస్) నాయకులు కుమారస్వామి అనవసరంగా హడావుడి పడ్డారన్న అభిప్రాయం కూడా వుంది.పెద్దపార్టీగా వున్న కాంగ్రెస్ ఆశీస్సులు లేకుండా కుమారస్వామి చేయగలిగిందీ వుండదు. అసలు కోర్టు తీర్పు ఎలా వస్తుందో కూడా చెప్పడానికి లేదు. దీనిపై గతంలో రకరకాల తీర్పులున్నాయి. బిజెపిలో నెలకొన్న కుమ్ములాటలు ఇవన్నీ చూసినప్పుడు అస్థిరత దాన్ని వెన్నాడుతూనే వుంటుంది. దక్షిణ భారత దేశంలో మొదటి బిజెపి ప్రభుత్వం రావడం లౌకిక శక్తులు హర్షించిన పరిణామమేమీ కాదు. దాని మతతత్వ రాజకీయాల వల్ల కలిగిన ప్రమాదమూ తక్కువ కాదు ప్రజాస్వామ్య సూత్రాలు పరిపాలనా వ్యవస్థలు ఇంత ప్రహసన ప్రాయంగా మారిపోవడం అరిష్టదాయకం.
సుప్రీం కోర్టుకు హిందూ మహాసభ!
అయోధ్య వివాదానికి సంబంధించి హిందూ మహాసభ సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. హిందూత్వ శక్తులకు ఆనందం కలిగించిన తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు గాక హిందూ మహాసభ అప్పీలు చేయడం ఆశ్చర్యం అనిపించవచ్చు గాని నిజానికి ఇలాటి ఎత్తుగడలు సంఘ పరివార్‌కు కొత్తేమీకాదు. ముందు తాము అప్పీలుకు వెళ్లడం వల్ల అవతలి పక్షానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు రాకుండా అడ్డుకోవచ్చన్న కుత్సితం దీని వెనక వుంది. న్యాయ నిపుణులు, చరిత్రకారులు, విశ్లేషకుల నుంచి అయోధ్య తీర్పు అంతకంతకూ విమర్శల నెదుర్కొంటున్నది. స్థలం యాజమాన్యం ఎవరిదనే అంశాన్ని పక్కనబెట్టి అక్కడ రాముడు పుట్టాడా లేడా అన్న విశ్వాసానికి తీర్పు పెద్ద పీట వేసింది. కనుకనే విశ్వాసం తీర్పులకు అతీతం అని వీరంగం తొక్కిన హిందూత్వ కూటమికి ఈ తీర్పు అత్యంత గొప్పదిగా కనిపిస్తున్నది. అయితే ఆ మూడో ముక్క కూడా తమకు కట్టబెట్టి తప్పుకోవడం ద్వారా ముస్లింలు సామరస్య భావన ప్రదర్శించాలని సంఘీయులు శాంతి వచనాలు చెబుతున్నారు! ఇంతకూ న్యాయస్థానం వివాదాస్పద స్థలంలోనే రాముడు పుట్టాడని నిర్ధారించడం ఎలా సాధ్యమైంది? రామాయణం ప్రకారమే ఎనిమిది లక్షల ఏళ్ల కిందట పుట్టాడంటున్న రాముడి జన్మ స్థలం ఘనత వహించిన న్యాయమూర్తులెలా చెప్పగలిగారు? ఇందుగల డందు లేడను సందేహము వలదన్న దైవ భక్తి విశ్వాసాన్ని మసీదు గుమ్మటాల కిందకే ఎలా పరిమితం చేస్తారు? వేల పేజీల తీర్పును ఔపోసన పట్టిన వారికైనా అంతుపట్టని ప్రశ్నలివి. ఎఎస్‌ఐ తవ్వకాలైనా, న్యాయస్థానం పంపకాలైనా 1992 డిసెంబరులో అద్వానీ ప్రభృతుల సమక్షంలో బాబరీని కూల్చివేయడం వల్లనే సాధ్యపడ్డాయి. ఆ కూల్చివేతను కంటితుడుపుగా ప్రస్తావించి గట్టిగా ఖండించకుండా దాటేయడంలో ఏ మాత్రం న్యాయం లేదు. తీర్పు రాజకీయ ప్రధానమైన పంచాయతీ న్యాయమన్నట్టుగా మధ్యేమార్గ పరిష్కారం కోసం ఈ తీర్పునిస్తున్నామని చెబితే అప్పుడు మరోలా వుండేది. కాని విశ్వాసాలనే కొలబద్దలుగా పేర్కొన్న తర్వాత, దేవుడి దావాను ఆమోదించిన తర్వాత లౌకిక ప్రాతిపదిక కుప్పకూలింది. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై బిజెపి అసలైన స్పందన తెలుస్తుంది. అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం చెప్పేవరకు అక్కడ యథాతథ స్థితిని కాపాడవలసిన బాధ్యత కేంద్రంపైనా యుపి ప్రభుత్వంపైన వుంది. ఈ లోగా హిందూత్వ సంస్థలను కవ్వింపు ధోరణిలో మాట్టాడ కుండా నివారించాలి. అలాగే ముస్లిం ఛాందస వాదులు కొందరు అసహనాన్ని ప్రదర్శిస్తున్న తీరు కూడా మైనార్టీలకే ఎక్కువ నష్టం చేస్తుంది. దేశంలో మొత్తంపైన అయోధ్య వివాదం న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కారం కావాలన్న భావం వ్యక్తమైంది గనక సుప్రీం తీర్పు వచ్చేవరకు వేచిచూడాలి.
No comments:
Post a Comment