Pages

Friday, January 18, 2013

స్వాములకైనా..చట్టం చట్టమే



శ్రీశైలంలో స్వామి కమలానంద భారతిని అరెస్టు చేయడం హిందూ మతంపైన దాడిగా సంఘ పరివార్‌ ప్రతినిధులు గగ్గోలు పెట్టడం ఏ విధంగానూ సమర్థించరాని విషయం. మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మత భావాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తప్పయితే కమలానందులది కూడా తప్పే. సంక్రాంతి నాడు స్వామీజీని అరెస్టు చేశారంటూ రాజకీయాలతో సంబంధం లేదనే సాధుసంతులు అనేకులు ధ్వజమెత్తడం మరింత అవాంచనీయం. సాధువులకైనా సన్యాసులకైనా మౌల్వీలు పాధర్లు ఎవరికైనా చట్టం చట్టమే. నిజానికి సంయమన శీలతకు ప్రతిరూపంగా వుండాల్సిన స్వామీజీ బిరుదాంకితులకు ఇది మరింతగా వర్తిస్తుంది. కమలానంద అరెస్టు న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జరిగిందే తప్ప ఎవరి ఇష్టానుసారం చేసింది కాదు. ఇందిరా పార్కు దగ్గర ఆయన మాట్లాడిన మాటలు కూడా తెలియనివి కావు. ఉద్రిక్త వాతావరణం వున్నప్పుడు బాధ్యత గలవారెవరైనా ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది.అంతేగాని అవతలివారిపై రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా నోరు పారేసుకోవడం దురుద్దేశపూరితం. ఇలాటి ప్రసంగాలకు ప్రజలు స్పందించడం లేదంటే అది వారి పరిపక్వత మాత్రమే. వాస్తవంలో అది భారతీయ సమాజంలో అంతర్లీనంగా వుండే లౌకికతత్వం,మత సామరస్యాల ప్రతిబింబం. అయితే ఆ మౌలిక విలువలకే చేటు తెచ్చేలా ఇటీవలి పరిణామాలు వుండటం ఆందోళన కలిగిస్తుంది. కమలానంద భారతి దేవుళ్లను దూషించలేదంటూ సమర్థించే వారు అంతకన్నా తల్లిని మించిన దైవం లేనేలేదు అన్న మానవజాతి మహౌన్నత సూక్తిని విస్మరిస్తున్నారు. ఆ వాదనలన్ని అలా వుంచి వివాదం న్యాయస్థానంలో వున్నప్పుడు దాని ఆదేశాల కోసం అంతిమతీర్పు కోసం ఎదురు చూడాలి తప్ప తమకు తామే తీర్పులిచ్చేసుకుని ఆవేశపడిపోతే కుదిరేపని కాదు. పొంచి కూచున్న రకరకాల మతోన్మాద శక్తుల పాచికల నుంచి మతసామరస్యాన్ని సామాజిక శాంతిని కాపాడుకోవడమే ఇప్పుడు ప్రథమ కర్తవ్యం.

No comments:

Post a Comment