Pages

Friday, January 18, 2013

హైదరాబాద్‌ చర్చ తీవ్రంఅవసరమైతే హైదరాబాదు ప్రతిపత్తిపై రెఫరెండంకు  సిద్ధమని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్య రాజధానిపై మధనాన్ని మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకూ మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, తెలుగుదేశం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఈ ప్రత్యేక ప్రతిపత్తి కోరుతూ వచ్చారు. ఏ పరిస్థితిలోనూ హైదరాబాద్‌పై చర్చకు ఆస్కారమే లేదనీ, వదులుకునే ప్రసక్తి లేదని టిఆర్‌ఎస్‌ ఘంటా పథంగా చెబుతూ వచ్చింది. అలాటిది గురువారం నాడు ఒక టీవీ చర్చ మధ్యలో జొక్యం చేసుకున్న కె.సి.ఆర్‌ అనపర్తి ఎంఎల్‌ఎ శేషారెడ్ది ప్రశ్నకు జవాబుగా తాము రెఫరెండంకు సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తెలంగాణా విడిపోవాలని ఆ ప్రాంతంలో 99.9 శాతం మంది కోరుకుంటారన్న ఆయన మాటలు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు గాని రెఫరెండంకు సంసిద్ధమనడమే చర్చను కొత్త మలుపు తిప్పింది. హైదరాబాదు ఒక్కటే ఇప్పుడు నిర్ణయానికి ఆటంకమవుతుందనే భావన బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి రాష్ట్ర భవిష్యత్తుపై ప్రకటన రాకుండా ఒక్క హైదరాబాదు గురించిన చర్చ జరిగే అవకాశం చాలా తక్కువ. కాగా హైదరాబాదు చర్చనే ముందు చేపడితే తెలంగాణా చర్చ వెనక్కు పోయే అవకాశం కూడా వుంటుంది. ఇవన్నీ తెలిసి కూడా కెసిఆర్‌ రెఫరెండంకు సిద్ధమని చెప్పడంలో వ్యూహాత్మక కారణాలుంటాయని భావిస్తున్నారు. అందుకు తగినట్టే
కెసిఆర్‌ ఆలా అని వుండాల్సింది కాదని టిఆర్‌ఎస్‌లో కొందరు భావిస్తున్నారు గనకే
ఎవరూ ఉత్సాహంగా దాన్ని భుజాన వేసుకోలేదు.ఆయన కూడా కొంత సర్దుకునే ప్రయత్నం చేశారు. కాని ఆమోస్‌ వంటి కాంగ్రెస్‌ నేతలు కెసిఆర్‌ ప్రతిపాదనను బలపరుస్తున్నామంటూ మరింత ముందుకు నడిపించారు. మరో వంక ఆ ఛానెల్‌ ఆయన మాటలను పదే పదే ప్రసారం చేయడంతో కాదనలేని స్థితి తలెత్తింది. జైపూర్‌ చింతన్‌ భైఠక్‌కు హాజరవుతున్న మంత్రి దానం నాగేందర్‌ కూడా కెసిఆర్‌ వాదనను ఆహ్వానించడం మరో విశేషం.
రాష్ట్ర విభజన లేదా సమైక్యత అన్న మొత్తం సమస్య స్థానే హైదరాబాదు ప్రత్యేక ప్రతిపత్తిని ముందుకు తేవడం పరిస్థితిలో మార్పుకు కారణం కావచ్చు. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్‌, కొంత వరకూ మహబూబ్‌నగర్‌ జిల్లాల వారు తమకు తెలంగాణా కన్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ భవితవ్యమే ముఖ్యమని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సూటిగా చెప్పకపోయినా టిఆర్‌ఎస్‌ నగర నేతల్లోనూ ఈ భావాలున్నాయి.ఇప్పటి వరకూ హైదరాబాదులో టిఆర్‌ఎస్‌ పెద్దగా పట్టు పెంచుకోలేదకపోయిందన్నది కూడా తెలిసిన విషయమే. ఇలాటి వారందరినీ కెసిఆర్‌ మాటలు కలిసొచ్చినట్టయింది. మరి ఆయన ఏదైనా సవరణ చేసుకుంటారా లేక కావాలనే అని వుంటే కొనసాగిస్తారా అన్నది త్వరలోనే తేలాలి. ఏది ఏమైనా చాలా మంది మనస్సులో వున్న హైదరాబాద్‌ చర్చ నేరుగా ముందుకు రావడానికి కెసిఆర్‌ కారకులవడం ఆసక్తికరం. హైదరాబాదుకోసమే తెలంగాణా విభజనను వదులుకోవడం గాక ముందు వచ్చినంత వరకూ రాబట్టుకోవడం మంచిదనే భావన కూడా ఆ పార్టీలో బలంగానే వుందని ఈ మాటలను బట్టి తెలుస్తుంది.

2 comments:

  1. Hyderabad vishayamlo referandum pettatam chala manchidi.

    ReplyDelete
  2. hyderabaad maatrame kaadu, khammam jillaalo koodaa refarandam pettaali.

    ReplyDelete