Pages

Friday, January 18, 2013

పాక్‌ ప్రమాద వ్యూహం


భారత సైనికులు హేమరాజ్‌, సుధాకర్‌లను అమానుషంగా హతమార్చి మృతదేహాలను పంపించిన పాకిస్తాన్‌ దుశ్చర్య వెనక దుస్తంత్రం చాలా ప్రమాదకరమైంది. ఇటీవలి కాలంలో సంబంధాల సాధారణీకరణ చర్యల గురించిన మాటలు జరుగుతుండగా హఠాత్తుగా ఇంతటి అఘాయిత్యం జరగడం అందరినీ దిగ్భ్రాంత పరిచింది.అలవాటైన సైనిక పద్ధతుల ప్రకారం ఆ మరుసటి రోజున భారత సైన్యం కాల్పుల్లోనూ ఒక పాకిస్తాన్‌ జవాను మరణించాడు. దాయాదులుగా పిలవబడే ఈ రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల పర్వంలో ఇది కొత్త అధ్యాయం. ఇప్పటికి మూడు సార్లు యుధ్ధాలు చేసుకున్న ఉభయ దేశాలు 1998లో టీవీల సాక్షిగా కార్గిల్‌ ఘర్షణను కూడా చూశాయి.ఈ అన్ని సందర్భాల్లోనూ వివాదాన్ని ఘర్షణను రగిలించింది పాకిస్తాన్‌ అనడంలో సందేహం లేదు. దీని వెనక తీవ్రమైన అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలు వున్నాయన్నది కూడా నిజం. భారత ఉపఖండంలో ఉద్రిక్తతలను రగిలించడం, పెద్ద దేశమైన భారత్‌ను నిరంతరం చక్రబంధంలో ఇరికించడం పాకిస్తాన్‌ నిరంకుశ సైనిక- రాజకీయ - అధికార దుష్టత్రయం వ్యూహమైతే అందుకు ప్రేరణ, నిర్ధేశకత్వం అమెరికా సామ్రాజ్యవాదానిది. ఆఖరుకు తమ నాయకురాలైన బెనజీర్‌ భుట్టోతో సహా వందలాది మందిని ఉగ్రవాదదాడుల్లో బలి చేసుకున్న పాకిస్తాన్‌ భారత్‌కు వ్యతిరేకంగా అలాటి ఉగ్రవాద కార్యకలాపాలనే మూర్ఖంగా కొనసాగిస్తున్నదంటే కారణం అది ఆ దేశ పాలక కూటమి అస్తిత్వానికి మూలాధారం కావడమే.
గతంలో మూడు యుధ్దాలు ఒక సాయుధ ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాలు 2003 నవంబరులో వాస్తవాధీన రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఆమాత్రమైనా ఉపశమనం కలిగినందుకు అందరూ ఆనందించినా అది పైపై వ్యవహారమేనని కూడా అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఏదో సాకుతో కాల్పులు ఘర్షణలు చొరబాట్టు జరుగుతూనే వస్తున్నాయి. కొత్త నిర్మాణాలు, బంకర్ల మరమ్మత్తులు వంటివి ప్రత్యేకంగా కారణమవుతుంటాయి. కాశ్మీరీ ప్రజలను రెండుగా విభజించిన యుద్దాల ప్రభావం కూడా దీనివెనక వుంటుంది. ఆరు మాసాల కిందట ఒక వృద్ధ మాత సరిహద్దుకు ఆవల వున్న తన కుటుంబసభ్యులను చూసేందుకు వెళ్లిరావడం చినికి చినికి గాలివానై తాజా ఘటనలను ఘర్షణలకు దారి తీసిందని
నిపుణుల విశ్లేషణ. సుహృద్భావం లేకపోయిన తర్వాత ఏ చిన్న సాకుతోనైనా సంఘర్షణ రగుల్కొంటుందనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. అత్యధిక సందర్బాల్లో పాకిస్తాన్‌ చొరబాటుదార్లు ఇలాటి పరిణామాలు రగిలిస్తుంటారు. తర్వాత సైన్యం కొనసాగిస్తుంది. ముంబాయి దాడులతో సహా అనేక దుశ్చర్యలకు కారణమైన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయిద్‌ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించాడనానికి ఆధారాలున్నాయని హౌం మంత్రి షిండే చేసిన ప్రకటన ఈ దృష్టాంతాల కొనసాగింపుగానే వుంది.
పాకిస్తాన్‌ ఘాతుకాని గట్టిగా ఖండించుతూనే ఈ సమస్య పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై పరిపరివిధాల మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులైతే కఠినంగా వ్యవహరించకపోవడమే తప్పు అని ఆగ్రహౌదగ్రులవుతున్నారు. అంటే ఏం చేయాలని మీ ఉద్దేశం అన్న మాటకు సూటిగా జవాబు లేదు. వారి హయాంలో పార్లమెంటుపైనే దాడి, కాందహార్‌కు విమానం హైజాక్‌ వంటి ఘటనలు జరిగిన సంగతి దేశం మర్చిపోలేదు. మరో వైపున పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుడికి నివేదించాలని సూచించడంలోనూ చాలా కుత్సితం వుంది. సమస్యలను అంతర్జాతీయం చేసే ఈ ప్రతిపాదనను భారత్‌ సరిగ్గానే తోసిపుచ్చింది. గతంలో కూడా ఒత్తిడికి గురైన నెహ్రూ కాశ్మీర్‌ వివాదాన్ని ఐరాస వేదికపై నివేదించిన ఫలితం ఇప్పటికీ వెంటాడుతున్నది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా భారత పాక్‌ల మధ్య తాను పెద్దన్నలా తీర్పు చెప్పాలన్నదే అమెరికా వ్యూహం.పాకిస్తాన్‌ సైనికి కూటమికి మహారాజపోషకురాలు అమెరికానే అయినప్పుడు తటస్ధ భంగిమ అభినయించడం మోసపూరితం మాత్రమే. అయితే భారత దేశంలో సరళీకరణ ప్రపంచీకరణ సమర్థకులు మాత్రం పాకిస్తాన్‌ బదులు మనం అమెరికా జూనియర్‌ భాగస్వాములమవుదామని సదా చెబుతుంటారు. అణు ఒప్పందం నుంచి చిల్లర వ్యాపారంలోకి తలుపులు తెరవడం వరకూ అన్నీ ఆ ఒత్తిడి ఫలితాలే.ఇవన్నీ ఎలా వున్నా భారత పాకిస్తాన్‌ల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడమే వాంఛనీయం. ఆ దిశలో నిరంతరం కృషి కొనసాగిస్తుండాల్సిందే తప్ప కఠిన వైఖరి పేరుతో దారి దాని ప్రాధాన్యతను మర్చిపోకూడదు. 2011తో పోలిస్తే 2012లో సరిహద్దు ఉల్లంఘనలు ఎక్కువైన మాట నిజమే. అదే సమయంలో వీసా లు సరళతరం చేసే అవగాహన గత ఏడాది చివరనుంచే అమలులోకి వచ్చిన మాటా నిజమే. పాకిస్తాన్‌ చర్యను నిరసిస్తూనే వాటి విషయంలో వెనక్కు తగ్గరాదని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరిగ్గానే వుంది. భద్రతా ప్రయోజనాల కోసం అప్రమత్తత పాటిస్తూ సరిహద్దుల్లో సంఘర్షణ ప్రబలకుండా చూసుకోవడమే దేశం ముందున్న ఏకైక మార్గం. పాక్‌ వైఖరి మారకపోతే గతంలో వలె సంబంధాలు వుండబోవని మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరించడం, హాకీ జట్టును వెనక్కు పంపి వీసా వ్యవస్థను స్తంభింపచేయాలని ప్రకటించడం జరిగాక ఆ దేశం దిగిరావడం కొంత వరకూ అనివార్యమైంది. అయితే మొత్తంగా అక్కడ రాజకీయ సంక్షోభం ఆవరించివున్నప్పుడు నిజంగా ఏదైనా మార్పు సాద్యమా అనేది అనుమానమే.

No comments:

Post a Comment