Pages

Sunday, May 4, 2014

మూడు పార్టీల డబుల్‌ డైలాగులు

ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం కోసం ి ప్రధాన పార్టీల నేతలు సాగిస్తున్న విన్యాసాలు జుగుప్స గొల్పుతున్నాయి. ప్లేసు మారితే ప్లేటు మారులే అన్నట్టుగా తెలంగాణలో హౌరెత్తించిన డైలాగులు గుటుక్కున మింగేసి కొత్త పాటలు ఎత్తుకున్నారు. మిమ్మల్ను ఉద్ధరించేది మేమంటే మేమని పోటీ పడుతున్నారు. తమకు పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అవతలి పార్టీల నుంచి ఫిరాయింపుదార్లను చేర్చుకున్నారు. ఏళ్ల తరబడి తమను నమ్ముకున్న వాళ్లను కాదని కొత్తగా దూకిన కోటీశ్వరులకు టికెట్లు కట్టబెట్టారు.అలాటి వారు దేశాన్ని కాపాడతామని కొత్త రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ఊకదంపుడు మాటలు చెబితే నమ్మే వెర్రి వెంగళప్పలా తెలుగు వాళ్లు?

తెలుగుదేశం సంగతి తీసుకుంటే- చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఇక్కడ అదే పనిగా ప్రచారం చేశారు. విభజించిన పద్ధతి తప్ప విడదీయడానికి మేము వ్యతిరేకం కాదని ఒకటికి రెండు సార్లు చెప్పారు. హైదరాబాదులో సంపదలన్నీ గుమ్మరించి నూతన నిర్మాణాలు చేసింది మేమేనని గొప్పలు పోయారు. తెలంగాణను అభివృద్ధి చేయగల విజన్‌ మాకు తప్ప అన్యులకు లేదని ఆత్మస్తుతి చేసుకున్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు ఆసాములకు ధారాదత్తం చేసి ధనరాశులు పోగేశామన్నారు.వాస్తవానికి ఆ కాలంలో అప్పులు విపరీతంగా పెరిగాయి.
ఇవన్నీ ఆలా వుంచి 2008లో తెలంగాణ విభజన కోసం అధికారికంగా తీర్మానం చేసి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ ఇచ్చి వచ్చారు. తాము ఆ లేఖను ఎన్నడూ వెనక్కు తీసుకోలేదనీ, కట్టుబడివున్నామనీ అదే పనిగా చెబుతూ వచ్చారు. పార్లమెంటులో విభజన బిల్లుచర్చకు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం సభ్యులు ప్రాంతాల వారీగా చీలిపోయి పరస్పరం కొట్టుకున్నారు.అలాటి పార్టీ సర్వాధినేత సమైక్యతను కాపాడేందుకు ప్రయత్నం చేశానని చెప్పడంకన్నా అసత్యం మరేముంటుంది?
విజన్‌ వున్న చంద్రబాబు సకల సంపదలూ హైదరాబాదులో కేంద్రీకరించే వ్యూహాన్ని ఎందుకు అనుసరించారు? వ్యవసాయ ప్రధానమైన ఈ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ప్రపంచ బ్యాంకు మెప్పుకోసం ఎందుకు పాకులాడారు? స్వర్ణాంధ్ర నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయిందని ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు సీమాంధ్ర అనాద అయిందని
ఎందుకు ప్రకటిస్తున్నారు? అంటే గతంలో ఇక్కడ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారా?
చంద్రబాబు నెత్తిన పెట్టుకున్న నరేంద్ర మోడీ ప్రసంగాలు మరింత హాస్యాస్పదంగా వున్నాయి. సీమాంధ్రకు సముద్రం వుంది గనక ప్రపంచ విజేతలు కావచ్చట. తమ పార్టీ కేంద్రంలో పాలన వెలగబెట్టినప్పుడు చంద్రబాబు తొమ్మిడేళ్లు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మాత్రమే గాక వేల ఏళ్ల నుంచి ఆ సముద్రం వుండనే వుంది. ఎప్పుడో ఘంటసాల మోటుపల్లి వంటి రేవు పట్టణాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. అలాటి తెలుగు జాతికి ఎక్కడి నుంచో వచ్చిన ఈ పెద్ద మనిషి కొత్తగా చెబుతున్నదేమిటి? గోదావరి తీరంలో లభించే సహజ వాయు నిక్షేపాలను అప్పణంగా తీసుకుపోతున్న మోడీ ఆ గ్యాస్‌లో కనీస వాటా ఇవ్వడానికి కూడా సిద్దంగా లేరు గాని అభివృద్ధి గురించి ఉత్తుత్తి కబుర్లతో వూరించడం విడ్డూరం. బిజెపి ఎన్నికల ప్రణాళికలో కీలకంగా వున్న మూడు మతపరమైన అంశాలను గురించి ఒక్క ముక్క చెప్పినా లౌకిక వాదులైన తెలుగు ప్రజలు సహించబోరని తెలుసుగనకే వాటిని గప్‌చిప్‌గా దిగమింగుతున్నాడు మోడీ. అనాదలైన సీమాంధ్రులకు తాను భరోసా వుంటానని చెప్పడం ద్వారా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నాడన్న మాట. విభజన వల్ల ఆవేదనకు గురైన మాట నిజమే గాని అనాదలు కావలసిన అవస్థ వారికేమీ పట్టలేదు. అధికారంలోకి ఈ సారైనా రాకపోతే అనాదలవుతామనే ఆందోళన ఆయన పక్కనున్న నేతలకే వుంది.
ఆంధ్ర ప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్నది లోతుగా ఆలోచించి పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా చేయవలసిన పని తప్ప ఈ విధంగా అరచేతిలో వైకుంఠం చూపించడం వల్ల ఫలితం శూన్యం. విభజన బిల్లు ఆమోదం పొందడానికి బిజెపి మద్దతు ముఖ్యమైతే తెలుగుదేశం నేతలు కూడా గొంతు కలపడం వాస్తవం. చేయవలసింది చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం మోసం తప్ప మరొకటి కాదు, ఈ ఇద్దరికీ తోడు కొత్త నాయకుడి అవతారంలో రంగంలోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తాడూ బొంగరం లేని మాటలతో అసలే క్షోభితులై వున్న తెలుగు ప్రజలను మరింత మనస్తాపానికి లోను చేస్తున్నాడు. రెండు ప్రాంతాల మధ్య రెండు రాష్ట్రాల మధ్య వుండాల్సిన సత్సంబంధాలను సుహృద్భావాన్ని మర్చిపోయి నోరు పారేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం లౌకిక తత్వం వంటి విషయాలను కనీసంగా ప్రస్తావించకుండా మోడీ భజనలో పరవశిస్తున్నాడు. ఇంత అసంబద్దమైన అపరిపక్వమైన రాజకీయాలను ప్రజలు ఆమోదిస్తారనుకోవడం అవివేకం. కనీస అవగాహన లేని పవన్‌ కళ్యాణ్‌ వల్ల సినీ అభిమానులు సామాజికి వర్గీయులు ఒకశాతమైనా ఓటేయకపోతారా అని ఇవన్నీ భరిస్తున్నామని ఒక బిజెపి నేత నాతో అన్నారు. కేవలం ఆ కారణం వల్లనే దీనంతటినీ అనుమతిస్తున్నారు టిడిపి బిజెపి నేతలు. ఇది వారి దీనావస్థనే సూచిస్తుంది.
ఇక కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, యువరాజు రాహుల్‌ గాంధీ వంటివారిది మరో ప్రహసనం. తెలంగాణలో జరిగిన ప్రతి సభలోనూ రాష్ట్ర ఏర్పాటు కేవలం తమ ఘనతేనని టిఆర్‌ఎస్‌కు ఇందులో ఏ పాత్ర లేదనీ ఘనంగా ప్రకటించుకున్నారు. కాని అవతలి వైపు వెళ్లగానే ఇతర పార్టీల వైఖరి కారణంగా అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందని సమర్థించుకుంటున్నారు. ఇంత ఘోరంగా రెండు మాటలు మాట్లాడ్డం దేశ నేతలమనేవారికి తగిన పనేనా?వారు మాట్లాడినంత మాత్రాన జనం నమ్మేస్తారా?తమ రాజకీయ అంచనాల ప్రకారం చేయవలసిందంతా చేసి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందంటున్నారు. అంత తప్పనిసరిగా విభజన చేయాలని వారు అనుకున్నప్పుడే మిగిలినప్రాంతాల ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడవలసింది. సందేహాలు పోగొట్టవలసింది. కనీసం సిడబ్ల్యుసి నిర్ణయం తర్వాతనైనా ఇక్కడి ప్రజలతో మనసు విప్పి మాట్లాడింది లేదు. విశ్వాసంలోకి తీసుకుని వివరణ ఇచ్చింది లేదు.ఏకపక్షంగా దాన్ని ఆమోదించేసి రాష్ట్ర విభజనకు తేదీలు నిర్ణయించేసి ఇప్పుడు వచ్చి మీ బాధలు అర్థం చేసుకుంటున్నామని చిలకపలుకులు వినిపించడం క్రూర పరిహాసమే.

మోడీ సముద్రం వుందని వూరించే ప్రయత్నం చేయగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి పట్టణం గొప్పదంటూ ఒక పేర్ల జాబితా చదివారు సోనియాగాంధీ. మరి వాటి అభివృద్ధి కోసం ఇన్నేళ్లలో అధికార పక్షం ఏం చర్యలు తీసుకుంది? ఇన్ని అనుకూలతలు వున్న రాష్ట్రం ఎందుకు అధ్వాన్నంగా వుండిపోయింది? ఇలాటి పరిస్థితికి కారకులైన వారే ఇప్పుడు ఒక్కసారిగా తలకిందులు చేస్తామంటే ఎందుకు నమ్మాలి? ఇంతకు రెండింతలు మాటలు తెలంగాణ లో చెప్పారు. విభజన నిర్ణయంతో విజయం వచ్చేస్తుందని లెక్కలు వేసుకున్నారు. కాని తీరా అలా జరిగేట్టు కనిపించడం లేదు. కెసిఆర్‌ అడ్డం తిరగడమే గాక ప్రజల నుంచి కూడా ఆశించిన స్పందన రాలేదు. టిఆర్‌ఎస్‌ ప్రథమ పార్టీగా వచ్చేట్టున్నది. దేశమంతటా దెబ్బతిన్నా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓట్ల వాన తథ్యమన్న అంచనా ఘోరంగా దెబ్బతిన్నది. అక్కడ అనుకున్నట్టుగా అధికారం కాదు కదా ఏకైక పెద్దపార్టీగా వచ్చే అవకాశం కూడా లేదని అంచనాలు చెబుతున్నాయి. ఇలా జరిగిన కొద్ది సీమాంధ్రపై ప్రేమ ముంచుకొచ్చింది. చివరి నిముషంలో కొత్త కథలతో పరువు దక్కించుకోగలమనీ ఆపదమొక్కులతో మెప్పించగలమని భ్రమ పడుతున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. ఇన్నేళ్లు చేయని ఘనకార్యాలు ఇప్పుడే చిటికెల మీద జరిపేస్తామని వూరిస్తున్నారు. ఆఘమేఘాల మీద పోలవరం అధారిటీ ప్రకటించారు.అయితే అన్ని విధాల రాజకీయ వంచనకు గురైనామనుకుంటున్న ఈ ప్రాంత ప్రజలు కొత్త ఎత్తుగడలకు మోసపోవడానికి సిద్దంగా లేరు. 1994లోనే కాంగ్రెస్‌కు26 స్థానాలు మాత్రం ఇచ్చి ప్రతిపక్ష హౌదా కూడా దక్కకుండా చేసిన అనుభవం మరింత దారుణంగా పునరావృతం కానుంది ఆ పార్టీకి. కాంగ్రెస్‌ ప్రజల హృదయాల్లో వుందని దాన్నెవరూ తొలగించలేరని ప్రచార కమిటీ అద్యక్షులు చిరంజీవి రాజకీయ డైలాగులు వల్లిస్తున్నారు గాని వాటిలో పస లేదనీ ఆయనకూ తెలుసు. అసలీ అన్నా దమ్ములు చెరో పక్షాన చేరి పోటాపోటీగా మాట్లాడుతుండటంపైనా జనంలో సందేహాలు బాహాటంటానే వ్యక్తమవుతున్నాయి.
ఇక చిలకపాటిగా పేరొందిన లగడపాటి రాజగోపాల్‌ చివరి ఘట్టంలో ఎన్నికల సర్వే అంటూ విడుదల చేసి తెలుగు దేశం అధికారంలోకి వచ్చేస్తుందని జోస్యం చెప్పడంలోనూ రాజకీయ ప్రయోజనమే తొంగి చూస్తుంది. ఏదైతేనేం- సర్వేలూ ఒపీనియన్‌ పోల్సును బట్టి తీర్పులే కావాలనుకుంటే ఎన్డీటీవీ వంటివి గతంలోనే రకరకాల లెక్కలు విడుదల చేసి వున్నాయి.వాటినే గనక తెలుగు దేశం నేతలే నమ్మలేకపోయారు గనకే ఇంత అభద్రత కనిపిస్తున్నది. నిస్పాక్షికతకు మారుపేరుగా చెప్పుకునే వారే నేరుగా ఫలానా నాయకుణ్ని గెలిపించమని చెప్పడం గతంలో ఎన్నడూ లేనంత బాహాటంగా జరిగిపోతున్నది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రాంతంలో వైఎస్సాఆర్‌ పార్టీ విజయవావకాశాలున్నాయని భావించకపోతే వీరు ఇంతగా దానిపై కేంద్రీకరించవలసిన అవసరం వుండేదా అన్నది తర్కబద్దమైన ప్రశ్న.
జగన్‌పై విమర్శలు చేయడానికీ, ఆయనను ఓడించేందుకు ప్రయత్నించడానికీ ఎవరికైనా హక్కుంటుంది. జగన్‌ పార్టీ చేస్తున్న ప్రచారాలూ చెబుతున్న వాగ్దానాలు కూడా మౌలికంగా భిన్నమైనవి కావు. గతంలో ఆ పార్టీ ఆరాధ్యనేత వైఎస్‌ పాలనలో అవినీతి వ్యవహారాలూ, అవకతవక పోడకలూ, ప్రాంతీయ సమస్యపై విన్యాసాలు మటుమాయం కావు కూడా. అయితే ఆ లోపాలనూ పాపాలనే చూపుతూ మతమారణ హౌమానికి కారకులైన మోడీ వంటి వారిని గొప్పగా వూరేగించడం, అవకాశవాద కలయికలను ప్రోత్సహించడానికి సిద్ధపడటం ఘోరమైన విషయం. మరి వారిని ఓడించేందుకు గాను అవినీతి మరక కూడా లేని వామపక్షాల నేతలకు వీరెందుకు మద్దతివ్వడం లేదు? ఆ మాటకొస్తే బిజెపి రాష్ట్ర నేతలు వద్దంటున్నా మెడలు వంచి తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పించడం వెనక కూడా బడా మీడియా, వారికి సంబంధించిన రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ అధిపతులు కీలక పాత్ర వహించారని ఆ పార్టీవారే వాపోతున్నారు. మరెవరినో ఓడించడానికీ, టిడిపిలకు వంత పాడటానికి ఏ సంబంధం లేదని ఇది కేవలం వారి ఎజెండా ప్రకారమే ఇలా చేస్తున్నారని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కెజిబేసిన్‌ గ్యాస్‌ విషయంలో గుజరాత్‌ ప్రభుత్వానికీ రిలయన్స్‌కూ ఒకే విధమైన ఆసక్తి వుంది. ఉభయులూ వాయు నిక్షేపాల్ని అప్పణంగా పాడేసుకుని తెలుగు వారికి మొండి చేయి చూపిస్తున్న వారే.
తెలుగు జాతి రెండు ముక్కలవుతున్న ఈ తరుణంలో ఒకో ముక్కకూ ఒక ముక్క చెబుతున్న నాయకుల లెక్కలు తేల్చాలి. రెక్కలు విప్పిన అవకాశవాదాలకు అసలైన అవినీతి పరులకూ బుద్ధి చెప్పాలి. ప్రజల కోసం నిజంగా నిలబడే వారికే విజయం చేకూర్చడం ద్వారా రేపటి ఆంధ్ర ప్రదేశ్‌ రూపురేఖలు తీర్చిదిద్దుకోవాలి. మరో రెండు రోజుల్లో జరిగే పోలింగు అందుకు చివరి అవకాశం. 

No comments:

Post a Comment