పని చేయని ఐఎఎస్ అధికారులను కాల్చి చంపాలని మంత్రి టిజివెంకటేష్ వ్యాఖ్యానించడం ఏ విధంగానూ సమర్థించడానికి లేదు గనకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా అందరూ ఖండించారు. అయితే తర్వాత కూడా తన ధోరణి మార్చుకోకుండా ఆయన అటూ ఇటూ తిప్పి మాట్లాడుతున్నారు. ప్రజల కోసమే నోరు పారేసుకున్నానంటున్నారు. లగడపాటి రాజగోపాల్‌లాగే టిజి కూడా నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలతో వుండాలనుకుంటారు. (ఈ జాబితాలో ఇంకా జెసి దివాకర రెడ్డి, శంకర రావు, ఆనం వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారిని జోడించవచ్చు.) అయితే మంత్రి పదవిలో వుండి మాట్లాడే ప్రతిమాట ప్రభుత్వానికి వర్తిస్తుంది. మరో వైపున తెలంగాణా జాగృతి సంస్థ అద్యక్షురాలు కవిత టీజీనే కాల్చి చంపాలని ఎదురు దాడి చేశారు. ఆమె అనుభవం, రాజకీయ స్థానం వంటి కారణాల రీత్యా , ఒక మంత్రి మాటలకు ఎక్కువ అభ్యంతరం చెప్పాల్సి వున్నా ఈ మాటలు కూడా సరికాదనేది స్పష్టం. ఉద్దేశ పూర్వకంగానే ఉద్రేకాలు పెంచడానికి
కొంతమంది చేస్తున్న విఫలయత్నాలు ఈ మాటల్లో మనకు తెలుస్తాయి. డిల్లీ ఎపిభవన్‌లో ఉద్యోగిపై దాడి చేసినందుకు గర్వపడుతున్నామని ఈటెట రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఒక పత్రిక వీటితో పాటుగా ప్రచురించింది. మిత్రుడు రాజేందర్ వంటి వారు ఇంత కాలం తర్వాత ఆ ఘటనను సమర్థిస్తూ మాట్లాడ్డం దురదృష్టకరం. పాలకుల పార్టీల అవకాశవాదాలకు ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను గురి చేయడం మంచిది కాదు. అందులోనూ ప్రజా పక్షపాతులైన వారు ఉద్యోగులపై ఎప్పుడూ దాడి ఎక్కుపెట్టరు.ఆ ఘటనపై ఎవరి ఆగ్రహాలు ఏమైనా సరే దాడి సమర్థనీయం కాజాలదు.ఈ తరుణంలో వాటిని లేవనెత్తడం అసలే అవసరం లేని పని.
సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సిపి గౌరవాద్యక్షురాలు విజయమ్మ దీక్షను అడ్డుకోవడం గురించిన మాటలు కూడా ఈ కోవలోవే. గతంలో పాలించిన తెలుగుదేశం కాంగ్రెస్‌లు సక్రమంగా వ్యవహరించి వుంటే చేనేత సంక్షోభం సంభవించి వుండేదే కాదు. సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యేదీ కాదు. ఈ క్రమంలో వ్యక్తులుగానూ పార్టీగానూ టిఆర్‌ఎస్ వాటా కూడా వుండకపోదు. ఆ గతమంతా ఎలా వున్నా ఇప్పుడైనా చేనేత సమస్యలపై కేంద్రీకరించే బదులు పార్టీల ప్రయోజనాల వేటగా వ్యూహాల యుద్ధంగా సిరిసిల్ల మారడం దురదృష్టకరం. నేతన్నల కోసం ఒకరితో ఒకరు పోటీ పడి దీక్షలు చేయొచ్చు గాని ఎవరినీ ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదు.అది సరైందీ కాదు. అనేక అనుభవాలు చూసిన తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇలాటి వివాదాలకు విలువ నివ్వబోరని విశ్వసించవచ్చు. మాటలతో మంటలు పెట్టే పాచికలు చాలా కాలం నుంచి పనిచేయడం లేదని నేతలు గ్రహించడం అవసరం.
చక్కటి మాటలు చెప్పేరు. కాని మన నాయకులెవరూ ఇట్లాంటి మంచి మాటలు తలకెక్కించుకున్నదాఖలాలు లేవు.అయినా చెప్పడం మన ధర్మం.
ReplyDeleteవిజయమ్మ దీక్షను అడ్డుకోవడం సరికాదేమో కాని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమపార్టీ విధానం ఏమిటో స్పష్టం చేయని వారు పర్యటన చేస్తున్నపుడు నిరసన తెలియజేయడం తప్పు కాదు కదా? అమెరికా అధ్యక్షుడు పర్యటనకు వస్తే నిరసన తెలియజేయలేదా? వైఎస్ఆర్సిపి దీక్ష కన్నా నిరశన ప్రదర్శన పెద్దగా ఉండాలి. పోలీసులు అందుకు అనుమతి కూడా ఇవ్వాల్సిందే.
ReplyDelete