Pages

Thursday, April 18, 2013

సంస్కృత సంస్కృతి




ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అత్యవసర పోలీసు డయల్‌ సర్వీసు 100 ప్రారంభించారు.ఈ నెంబరుకు ఎవరు ఎప్పుడు ఫోన్‌ చేసినా పోలీసు సహాయం లభిస్తుందని ప్రకటించి తనే డయల్‌ చేశారు. అయితే పాపం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. తర్వాత ఎవరో ఎలాగో కలిపి ఇచ్చారు గాని పాపం ఆయనకు అప్పటికే విసుగొచ్చి ఇక స్పందించడం మానేశారు. ఆదిలోనే హంసపాదు వంటి ఈ చేదు అనుభవాన్ని కూడా దిగమింగి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారు పోలీసులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. ప్రజలతో వ్యవహరించేప్పుడు సంస్కృతం మాట్లాడకండి అని.
సంస్కృతమే మన సంస్కృతి అనీ, అది దైవభాష అనీ ఈ దేశంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు. కనక చాలా మంది నమ్ముతుంటారు కూడా. సంసృతంలో నాలుగు శ్లోకాలు ఇంగ్లీషులో నాలుగు కొటేషన్లు దంచేస్తేనే సదరు వ్యక్తి పండితుడని మనం నమ్ముతాం. అందుకే హైటెక్‌ బాబులు అడపాదడగా ఒకటో అరా సంసృత చరణాలు వల్లిస్తుంటారు. అలాగే స్వామి వర్యులు ఇంగ్లీషు వాక్యాలు జొప్పిస్తుంటారు.ఏతావాతా ఒక దశలో సంసృతం మరో దశలో ఆంగ్లం తెలుగు వంటి భాషలను ఎదగకుండా చేశాయన్నది ఒక వాదన. అలాగే అర్థం కాని సంసృతంలోనూ అన్నీ జరిపేంచుస్తుంటారు పురోహితులు. వారికైనా అర్థం అవుతాయో లేదో మనకు తెలియదు గాని వందల ఏళ్లపాటు వేదాలు వల్లెవేసిన వారంతా అక్షరాస్యులు కాదన్నది నిజం. అసలు వేదాలు అచ్చు వేయకూడదనేది కూడా వందేళ్ల కిందటి వరకూ మన వాళ్లు గట్టిగా నమ్మిన మాట. అన్నీ వేదాల్లో
వున్నాయష అనే వాళ్లు ఆ వున్నది ఏమిటో ఎప్పుడూ పరిశీలించరు. నాటి జన గణాల జీవనమూ విశ్వాసాలే దానిలో నిక్షిప్తమై వున్నాయి గాని ఇప్పుడు వాటిపేరిట కొందరు చలామణి చేస్తున్న అంశాలేమీ లేవని నూటికి తొంభై మందికి తెలియదు. చెప్పినా ఒప్పుకోరు. ఇంత గజిబిజికి కారణమేమంటే అవి సంసృతంలో వుండటమే. సంసృతం ఏ నాడూ ఈ దేశ ప్రజా బాహుళ్యం మాట్లాడలేదు గాని పండిత వర్గం వారిని పోషించే ప్రభు సంతతి ఉద్దేశ పూర్వకంగానే అత్యధికులకు అర్థం కాని ఆ భాష పట్ల ఆరాధనా భావం పెంచుతూ వచ్చారు.
అయితే సంసృతం మాట్లాడవద్దని చెప్పడంలో ముఖ్యమంత్రికి ఇలాటి ఉద్దేశాలేమీ వుండకపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఇటీవల యధాశక్తి పండితుల ఆశీర్వచనాలు అందుకునే ప్రయత్నంలో కనిపిస్తున్నారు.పోలీసులు సంసృతం వాడకూడదని చెప్పడంలో అర్థం తెలుగు వారందరికీ తెలుసు. సంసృతం అంటే ఇక్కడ అసభ్య పదజాలం ఇంకా చెప్పాలంటే బూతులు వాడకండి అని ఆయన హితవు. మరి ఆ పదాలకు సంసృతం అనే పేరెందుకు వచ్చింది? ఎందుకంటే సంసృతంలో ఏం చెప్పినా అర్థం కాదు గనక పచ్చి అశ్లీలంగా పరిగణించే అనేక పదాలు అలవోకగా పాదేసి పరవశిస్తుంటారు. అవే మాటలు తెలుగులో వాడితే బూతులంటారు. ఈ వైరుధ్యాన్ని గుర్తించిన బుద్ధిశాలులెవరో సంసృతం అనే పదం కనిపెట్టినట్టున్నారు. పెద్దమనుషులుగా సంసృతీ పరులుగా కనిపించే చాలా మంది నోరు విప్పితే బూతుల పంచాంగం భరించలేని స్థాయిలో సాగిపోవడం అనుభవమే. కొందరు దీన్ని సహజసిద్దమైనదిగా అలవాటుగా సమర్థించుకోవడం మరో వైపరీత్యం. ఈ బూతుల పంచాంగంలో ఆరితేరిన వారు పోలీసులే గనక ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా హెచ్చరిక చేశారంతే.
నిజానికి ఆధిపత్యం నుంచి అధికారం నుంచీ ఆగ్రహం నుంచీ అజ్ఞానం నుంచీ బూతులు వినియోగించడం మొదలవుతుంది. ఎందుకోసమైనా సరే దుర్భర భాషణాలు భరించలేనివే. అయితే అధికార దర్పంతో అశ్లీల భాషణం చేయడం అసలే సహించరాని విషయం. పెత్తందార్లు, భూస్వాములు, అధికారులు, అధినేతలు, బడా బాబులు చాలా మంది నోరు విప్పితే బూతుల పంచాంగాలే. నాగరికంగా కనిపించే అనేకమంది తమ తమ ప్రపంచాలలోనూ తమ కిందవారితో వ్యవహరించేప్పుడు ఆఖరుకు స్వగృహాలలోనూ సంసృతంలోనే గాక పైశాచీ భాషలోనూ విరుచుకుపడుతుంటారు. పరాచకాలాడుతుంటారు. పైగా అది నేటివిటీ అనీ, అలవాటనీ సమర్థించుకుంటారు. పైగా ఇదేదో అలగాజనం కోసం మాట్లాడుతున్నట్టు గొప్పలు పోతారు.
నిజానికి తిట్లన్నీ మహిళలను కించపర్చేవే. గొప్పలకు పుంలింగం, బూతులకు స్త్రీ లింగం మన సంసృతిలో పరమ రహస్యం. మా అగ్రహారంలో అంతా మహా పండితులేగాని వివాదం వస్తే మాత్రం అమ్మ నాలుకపైకి రావలసిందే అని మహారచయిత మహీధర రామమోహన రావు గారే అన్నారు! కాగా సర్వ కాల సర్వావస్థల్లోనూ సంసృతం తప్ప అన్య భాష గిట్టని వారు పోలీసులు. పై బాసులకు సలాం చేసినప్పుడు తప్ప అన్యులెవరికైనా సరే అనుభవమైన సత్యం ఇది. ఇక ఈ దేశంలోని అశేష అభాగ్య జనం( పోలీసుల పంజరంలో చిక్కి గిజగిజలాడే అత్యధిక శాతం ఈ కోవలో వారే) అన్ని వేళలా వారి తిట్లకూ దెబ్బలకూ గురవుతుంటారు.లాఠీచార్జి లాకప్‌డెత్‌ వంటి వాటికంటే ఈ బూతుల ఛార్జి తక్కువది కాదు. చాలా సార్లు చచ్చిపోవడం మెరుగనిపిస్తుంది.
ఇవన్నీ తెలిసిన వారు గనకే ముఖ్యమంత్రి వర్యులు పోలీసు మిత్రులకు తెలుగునే ఉపయోగించండి అని హితబోధ చేశారు. అసలే ఈ మధ్య ఆయన ప్రచార పర్వంలో తెలుగు భాషా సంసృతుల వాటా పెరుగుతుంది కదా... కాకపోతే ఆ వెంటనే డిజిపి మహాశయులు దినేష్‌ రెడ్డి స్వల్ప సవరణ చేసి పోలీసులు వెసులుబాటును పునరుద్ధరించారు. పని వత్తిడి వల్లనే పోలీసులు అలా మాట్లాడుతుంటారట! బాగుంది సమర్థన. అంటే సంసృత సంసృతి మార్చుకోనక్కర్లేదన్న మాట. వాస్తవానికి పోలీసులు ప్రజలపై ఉపయోగించే సంసృతానికి పదిరెట్లు దారుణమైన మాటలు పై వాళ్లు తమ సిబ్బందిపైనే వాడతారని ఎవరికి తెలియదు? డిజిపీ గారూ మరో మారు తెలుగులో ఆలోచించుతారా? సంసృత రహితమైన సంస్కార వంతమైన భాష వాడమని చెప్పలేరా? అలాగే అలవాటు అనో సరదా అనో అసందర్భంగా అసభ్య పదజాలం వాడే వారెవరైనా తెలుగు సంవత్సర ప్రారంభంలోనూ కాస్త మార్చుకోరా, దయచేసి? అందరూ వినగలిగేది అందరూ ఆస్వాదించేది భాష తప్ప క్షోభ పెట్టేది జుగుప్స గొల్పేది ఏం భాష?
(మనవి: రెండు ఒత్తులు ఇవ్వడంలో ఇబ్బంది వల్ల శీర్షికలోనూ లోపలా కూడా పేరు సరిగ్గా రానందుకు మన్నించ ప్రార్థన)


No comments:

Post a Comment