రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం తెలుగు వారందరూ సంతోషించే విషయం. రెండు మూడు తరాలుగా రావూరి భరద్వాజ పేరు, రచనలూ, భావనలూ సాహిత్య ప్రియులకు సుపరిచితాలు. ప్రగతిశీల వాదులకూ ప్రజాస్వామిక భావాలకూ సదా సన్నిహితంగా మెలిగే రావూరి భరద్వాజ అక్షర శ్రామికుడు. అవిరామ స్వాప్నికుడు. తరాల మధ్య వారధి. సాహిత్య కార్యక్రమాల సారథి. అన్నిటినీ మించి స్నేహశీలి. ఎనిమిది పదుల వయస్సు దాటినా నిరంతర క్రియాశీలంగా కలుపుగోలుగా మసలే సహృదయ సాహిత్య జీవి. అందుకే ఆయనకు అఖిలభారత స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించడం అభినందనీయం. మొదటిది విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి వస్తే రెండవది సి.నారాయణరెడ్డి విశ్వంభరకు లభించింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు ఆ గౌరవం దక్కింది. ఈ విధంగా ఇది తెలుగు వారికి లభించిన మూడో జ్ఞానపీఠం కనుక మరింత ప్రత్యేకం.
నిజానికి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొడవటిగంటి కుటుంబరావు, వంటి మహాకవులు రచయితలెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి తాను శ్రీశ్రీ, ఆరుద్రల పేర్లు అనేక సార్లు సిఫార్సు చేశానని సినారె ఒక సందర్భంలో చెప్పారు. అయితే అప్పట్లో అధినేతల ఆలోచనా ధోరణులు అభ్యుదయాన్ని అస్సలస్సలు సహించేవి కావు గనకే వీరెవరికీ జ్ఞానపీఠం వంటివి లభించే సూచనే లేకపోయింది. తర్వాతి కాలంలో
అనేక భారతీయ భాషల్లో వామపక్ష వాద రచయితలకు కూడా ఈ పురస్కారం లభించిందంటే మారిన పరిస్థితులే కారణం. ఆ మాటకొస్తే అంతర్జాతీయంగానూ నోబుల్ బహుమానం రాజకీయ కారణాలను బట్టి ఇస్తున్నా సాహిత్య నోబుల్ మాత్రం వామపక్ష రచయితలకే లభించడం వారి సాహిత్య సజీవత్వాన్ని పట్టి చూపుతుంది. రావూరి భరద్వాజ కూడా నిస్సందేహంగా ప్రగతిశక్తుల మిత్రుడుగా ప్రజాస్వామిక వాదిగా ప్రసిద్ధిగాంచిన రచయిత గనక ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది.
సుదీర్ఘ అక్షర ప్రస్థానంలో రావూరి భరద్వాజ అత్యంత వైవిధ్య భరితమైన సాహిత్య సృజన చేశారు.చలన చిత్ర ప్రపంచ మేడిపండు స్వరూపాన్ని విప్పిచూపిన పాకుడు రాళ్లు ఆయనకు విశేషమైన ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది గాని నిజానికి ఆయన రచనా వైవిధ్యం అపారమే. రెండవ తరం తెలుగు కథకుల్లో ఆయన లబ్ద ప్రతిష్టుడు. ఎనెన్ని జీవిత గాధలు కథలుగా చెక్కి అనంత సత్యాలను ఆవిష్కరించారో చెప్పలేము. కాదంబరి నవలలోనూ మనిషి నిలదొక్కుకోవడానికి చేసే పోరాటాన్ని చిత్రీకరించారు. బహుశా ఆయన రచనా జీవితానికి మకుటాయమానమైంది జీవన సమరం. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అన్న మహాకవి శ్రీశ్రీ చరణాల విశ్వరూపమే జీవన సమరం. తాళాలు బాగు చేసేవారినుంచి వీధి కళాకారుల వరకూ మన సమాజంలో వివిధ తరగతుల సామాన్యుల జీవన విధానాలను ఆవిష్కరించిన అపురూప ప్రయత్నం అది. సాధారణ పాత్రికేయులు సేకరించిన సమాచారాన్ని అందంగా మలచి సమగ్ర జీవన కావ్యంగా తీర్చి దిద్దిన మహాశిల్పి భరద్వాజ కనుకనే సర్వేసర్వత్రా ఆ మహత్తర రచననకు నీరాజనాలర్పించారు. ఆకాశవాణిలో అనేక సంవత్సరాలు పనిచేయడమే గాక పత్రికా రంగంతోనూ విశేష సంబంధం వున్న రావూరి నాటి సోవియట్ యూనియన్ పర్యటన తర్వాత రాసిన ఇనుప తెరల వెనక ఒక సాహసోపేత రచన. సోషలిజంలో స్వేచ్చ వుండదని అక్కడంతా ఇనుప తెర అని ప్రచారం జరుగుతున్నప్పుడు దాని వెనక వున్న సామ్యవాద సమాజాన్ని సూటిగా సుబోధకంగా తన రచనలో చిత్రించినందుకే సోవియట్ భూమి సాహిత్య పురస్కారం పొందారు. ఇతర రచనల్లోనూ వియత్నాం అలజడినీ, దక్షిణాఫ్రికా నల్లజాతీయుల పోరాటాలనూ ప్రస్తావిస్తారు.
నేటి తరం విజ్ఞానం రేపటి తరం వికాసం కోసం ప్రత్యేకించి వైజ్ఞానిక రచనలు బాలసాహిత్యం అందించడం ఆయన దార్శనికతకు మరో నిదర్శనం. వినువీధిలో వింతలు పేరిట తొలుదొల్త విజ్ఞాన శాస్త్ర రచనలు చేసిన వారిలో ఆయన స్థానం సంపాదించారు. తొలి దశలో కందుకూరి వీరేశలింగం, తదుపరి దశలో కొడవటిగంటి,ఆ ఆపైన నండూరి రామమోహనరావు వంటి కొద్ది మంది రచయితలు మాత్రమే ఈ కృషి చేయడం గమనించదగ్గది. శాస్త్ర విజ్ఞాన ప్రపంచంలో వచ్చే అనేక నూతన ఆవిష్కరణలను జాగ్రత్తగా గమనిస్తూ సరళ సుందర శైలిలో చెప్పాలన్న తపన ఆయనలో నిరంతరం వుంటూనే వుంది. అలాగే బాల సాహిత్యంలోనూ గణనీయమైన కృషి చేసి అనేక రచనలందించారు. ఇవన్నీ రావూరి భరద్వాజ కృషిలో మైలురాళ్లు.
ఈ రచనలన్నిటా భావుకత మానవత,సమానత, సంస్కారం, వుట్టిపడతాయని విజ్ఞుల విశ్లేషణ. కొండొకచో సంప్రదాయ పదాలు భావాలు కనిపించినా ఆయన మౌలికంగా సామాజిక సృహకే పెద్దపీట వేశారు. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు చాలా వున్నతంగానూ గౌరవాస్పదంగానూ నిలిచిపోయాయి. కీర్తిశేషురాలైన తన భార్య గురించి ఆర్తితో ఆయన రాసిన సృతి కావ్య సంపుటి దానికదే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇలాటి ప్రత్యేకతలెన్నొ వున్న రావూరి భరద్వాజ సాహిత్య సభల్లోనూ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ కొత్త తరాలను స్వరాలనూ ప్రోత్సహిస్తూ ముందుమాటలు రాస్తూ కాలంతో పాటు నడుస్తున్నారు. ఇంత సాహిత్య జీవితం, సామాజిక స్పర్శ, ప్రగతిశీల భావన వున్న రావూరి భరద్వాజను జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేయడం హర్షనీయం. పురస్కారం పేరుతో ఆయన కృషిని గౌరవించే అవకాశం లభించడం మరింత సంతోషం. ఆయనకిదే మా అభినందన. ఈ ఉత్సాహంతో ఆయన సమాజాభ్యున్నతికి సాహిత్య వికాసానికి మరింత దోహదం అందిస్తారని ఆకాంక్ష.
మంచి పోస్ట్. రావూరి భరద్వాజ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ReplyDelete