Pages

Thursday, September 27, 2012

లేఖతో స్పష్టత కాదు, క్లిష్టతే!



తెలంగాణా సమస్యపై చంద్రబాబు లేఖ రాసి స్పష్టత ఇస్తారన్న ప్రచారాన్ని నేనెప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. నిజానికి దానివల్ల క్లిష్టత, నష్టతలే ఎక్కువని కూడా సరదాగా అనేవాణ్ని. ఇటీవల కేంద్రం అఖిలపక్షం గురించి సంకేతాలు వదిలిన తర్వాత అది వుండకపోవచ్చని తెలుగు దేశం నేతలతో గట్టిగానే వాదించాను. ఒక మాజీ మంత్రి అయితే మరుసటి రోజు కలుసుకున్నప్పుడు బాబు నిజంగానే స్పష్టమైన లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మరీ మరీ చెప్పారు. ఆ మరుసటి రోజున మరో ప్రాంతానికి చెందిన మరో ప్రజా ప్రతినిధి లేఖ వల్ల లాభముంటుందా అని అడిగారు. నిజంగా ఏదీ స్పష్టంగా చెప్పే స్తితి లేనప్పుడు ఈ లేఖల ప్రహసనమంతా దేనికని కూడా అన్నాను. నిన్న రాత్రి పొద్దుపోయాక ఇంకా చెప్పాలంటే ఆజాద్‌ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత చంద్రబాబు విడుదల చేసిన లేఖ ప్రతి నేను వూహిస్తున్నంత వరకైనా వెళ్లలేదు.అఖిలపక్ష సమావేశం వేస్తే చెబుతామని చెప్పడం తప్ప ఇందులో చెప్పిందేమీ లేదు. నిజానికి అఖిలపక్షం అనవసర కాలయాపన గనక వెంటనే కేంద్రం నిర్ణయం ప్రకటించాలన్నది ప్రతిపక్షాల సాధారణ కోర్కెగా వుండింది. చంద్రబాబు లేఖతో ప్రధాన ప్రతిపక్షమే అందుకు అభ్యర్థించినట్టయింది. (బహుశా ప్రధాని ఎదరు దాడి లేఖ రాసేందుకు ఇది అవకాశమైనా కావచ్చు) అప్పటికి అక్కడ ఏం చెబుతారనేది అస్పష్టంగా అట్టిపెట్టేశారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించడం పెద్ద విసయమేమీ కాదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన సంగతే. ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడి వుంటామని అంటే అదో తీరు గాని అదీ లేదు. గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు విలువేమీ లేదు. అసలాయనే రాష్ట్రపతి భవన్‌లో కూచున్నారు. దాన్ని వెనక్కు తీసుకోలేదని పదే పదే చెప్పుకోవడం కూడా అర్థం లేనిదే. ఎందుకంటే ఆ అవకాశం ఎలానూ వుండదు. రాజకీయంగానూ దాన్నుంచి వెనక్కు మళ్లినట్టు చెప్పుకునేట్టయితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది గనక అదీ అసంభవమే. ఈ లేఖ వల్ల తెలంగాణాలో తెలుగు దేశం పుంజుకొంటుందని విశ్వసనీయత పొందుతుందని అనుకోవడం అతిశయోక్తి అంచనా అవుతుంది. ఆ లాభం సంగతి ఎలా వున్నా రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ దాడికి తెలుగుదేశం గురి కావలసి వుంటుంది. స్పష్టమైన విధానం చెప్పి లాభనష్టాలను ఎదుర్కోవడం ఒక పద్ధతి. ఇక్కడ స్పష్టత లేకుండా వున్నట్టు కనిపించాలనుకోవడమే సమస్యలకు దారి తీస్తున్నది. తమపై కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు అంటారు. అయితే అస్పష్టతకు అది సమర్థనమెలా అవుతుంది? ప్రత్యర్థుల కుట్రలునూ దాడులను ఎదుర్కోవడం ప్రతిపార్టీకీ వుండే సమస్యే. ఆ మాటకొస్తే వారు కూడా ఆ పార్టీల పట్ల అభిమానంగా ఏమీ వుండబోరు కదా.. ఇప్పుడు చంద్రబాబు స్వంత జిల్లాలో ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో మొదలైన నిరసనలు ఆయనతోనే ఆగకపోవచ్చు. అలాగే తెలంగాణాలోనూ అసంతృప్తి ఆగకపోవచ్చు.

1 comment:

  1. అన్ని విషయాలలో బాబు గారు మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం అంటూ ఉంటారు.అస్పష్టతే వారి స్పష్టమైన విధాన మని మరోసారి తేలి పోయింది.

    ReplyDelete