Pages

Sunday, September 11, 2011

ప్రాతిపదిక లేని ప్రచారార్బాటం


జగన్‌ ఆస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలివ్వడం, ప్రాంతీయ ఉద్యమాలు ప్రస్తుతానికి వ్యూహాన్వేషణలో తలమునకలవడం వల్ల తన ప్రభుత్వానికి కాస్త వూపిరి పీల్చుకునే వ్యవధి లభించిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి భావిస్తున్నారు. ఆ మేరకు సంతోషించి వూరుకుంటే అదొక పద్ధతి. కాని దాన్ని అతిశయోక్తిగా చిత్రించుకుని ప్రజల్లో ప్రచారార్భాటం సాగించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌ యువ కిరణాల పేరిట అయిదు లక్షల ఉద్యోగాలు, స్త్రీ శక్తి బ్యాంకు, ఇందిర జల ప్రభ, రైతు రుణాల మాఫీ, పంటల బీమా పథకానికి నిధులు వగైరా పథకాల పరంపరతో దూసుకుపోగలనని భావిస్తున్నారు. ఆ వూపులో ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై దృష్టి మరల్చడానికి బదులు కొత్తసీసాలో పాత సారా చందంగా పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రచార ప్రహసనానికి తెర లేపుతున్నారు. ప్రతిష్టంభన నుంచి ప్రభుత్వం ఇంకా బయిటపడింది లేదు. రాజకీయ పాలనా పరమైన అనిశ్చితి తొలగిపోయిందీ లేదు.అన్నిటినీ మించి ప్రజలను వేధించే తీవ్ర సమస్యల నుంచి ఉపశమనం కూడా లేదు. వీటిపై దృష్టి సారించి కాస్తయినా తక్షణ ఉపశమనం అందించే చర్యలు తీసుకునే బదులు ఆయన తనవైన పథకాలతో మోత మోగించగలనని అనుకోవడం ఆశ్చర్యమే.
ఇందులో రైతులకు సంబంధించిన పథకాలు కేంద్ర రాష్ట్ర నిధులతో నడిచేవి. చాలా కాలంగా నత్త నడక నడుస్తున్నవి. వాటన్నిటినీ కలగలపి కొత్త పేరు తగిలించారు. రుణ మాఫీ విషయంలో ఏడాది కిందటి వరకూ పేరుకు పోయిన నిధులనే విడుదల చేస్తున్నారు తప్ప కొత్త దనం లేదు. ఇందిర జలప్రభ ఇప్పటికే ఎస్‌సిఎస్‌టిలకు పంచిన భూముల చదునుకు ఉద్దేశించిన పాత ఆలోచనే.పంచిన భూమిలో అయిదు శాతానికే ఇప్పటికి నిధులు విడుదల చేసిన సర్కారు ఇప్పుడు దానికి ఇందిరమ్మ పేరు పెట్టి ప్రచారానికి వాడుకోవాలనుకుంటున్నది.బోర్ల తవ్వకం పల్లెల్లో పెద్ద ప్రభావం చూపిస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు గాని నిజానిజాలు లబ్దిదారులకు తెలియనివి కావు. జలయజ్ఞం పేరుతో ఇప్పటికి ధారపోసిన 52 వేల కోట్ల రూపాయలు సద్వినియోగం కావడానికి అవసరమైన ప్రాధాన్యతా పథకాలను గాక ఈ పాత కొత్త పథకంతో వూదరకొడుతున్నారు. ఇక బీమా మొత్తం రైతులకు వెళ్లేది వుండదు, కంపెనీలకు చెల్లించడమే జరుగుతుంది.కౌలు రైతుల కార్డుల పంపిణీ సగం కూడా జరగలేదు. బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు సరిగ్గా ఇవ్వడం లేదని రెవెన్యూ మంత్రి వర్యులే ఆగ్రహించారు. కొన్ని చోట్ల రైతులు తాముగానే క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఎరువుల కొరత వంటివి వేధిస్తున్నాయి. వాటిపై దృష్టి పెట్టి ఆదుకునే బదులు పథకాలతో వూరించడం వల్ల ఫలితం శూన్యం.మహిళా బృందాలకు వారు పొదుపు చేసుకున్న సొమ్ముపైనే రుణాలు అందక అల్లాడుతున్నారు. సూక్ష్మ రుణాల వూబిలో గిజగిజలాడుతున్నారు. దాన్ని చక్కదిద్దకుండా కొత్త బ్యాంకు అంటున్నారు.
అన్నిటికన్నా వూహాజనితమైంది ఉద్యోగ కిరణాలు. ముఖ్యమంత్రి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఈ ఏడాది చివరి రోజున లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తానని భరోసాగా చెబుతున్నారు. ఏడాదికి అయిదు లక్షల ఉద్యోగాల చొప్పున రావడం ఖాయమంటూ ఆ తర్వాతనే ఓట్లు అడుగుతానని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ విషయాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న మీడియాపైన కూడా అసహనం వెలిబుచ్చుతూ పాత పాలకులను గుర్తు చేశారు. ఇంతకూ గతంలో ప్రకటించిన ఉద్యోగ హామీలన్ని బూటకమని తేలిపోయింది. ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోగా వున్న వుద్యోగాలనే వూడకొట్టే పనిలో వున్నాయి. రాష్ట్రంలో పదవీ విరమణ జరిగిన ఖాళీలలో నియామకాలు చేపట్టడమే మానేశారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ రాజ్యమేలుతున్నాయి. అప్రెంటిస్‌ పద్దతికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎంఎల్‌సిలు ఉపాధ్యాయ నాయకులు నిరాహారదీక్షలు చేస్తున్నారు. దేశంలో కూడా ఇప్పుడు జరుగుతున్నది ఉపాధి రహిత అభివృద్ధి అని ఆర్థిక వేత్తలు నామకరణం చేశారు.2004-2010 మధ్య దేశంలో ఉపాధి గ్రామాలు పట్టణాల్లో సగటు లెక్కకట్టి ఒక్కశాతం కూడా లేదని జాతీయ శాంపిల్‌ సర్వే వెల్లడించింది. అనిశ్చితి కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా వుంది. ఈ పరిస్తితికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగమే. కనక దాన్ని సరిదిద్దాంటే ప్రభుత్వ విధాన నిర్దేశం మారాలి. ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పన,భూ పంపిణీ వంటి చర్యలు తీసుకోవాలి. దానికి మారుగా ప్రైవేలు రంగంలోని అమాంబాపతు కొలువులను లెక్క కట్టి ప్రభుత్వ ఖాతాలో వేసుకోవడం, అందుకోసం ఒక పెద్ద కమిటీని నియమించినంత మాత్రాన ఏడాదికి అయిదు లక్షల ఉద్యోగాలన్న మాట ఎవరైనా ఎలా విశ్వసించగలరు?ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టతో గాక రాజకీయ ఆర్థిక విధానాలతో ముడిపడివున్న సంగతి ఇది.
రాజకీయంగా ఒక విధానం తీసుకోకుండా ప్రభుత్వానికి సుస్తిరత రాదు.సభ జరిపి సమస్యలు చర్చించి ఏదో విధంగా బలం నిరూపించుకోకుండా పటిష్టతా పెరగదు. ఇప్పటికీ క్యాబినెట్‌ మొత్తం సజావుగా ఒద్దికగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. గాంధీ భవనానికి క్యాంపు కార్యాలయానికి ప్రచ్చన్న యుద్దం ప్రత్యక్ష రూపంలోనే నడుస్తున్నది. జగన్‌ వర్గం ఎంఎల్‌ఎల రాజీనామాల భవితవ్యం తేలలేదు. తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార యంత్రాంగంలోనూ అయోమయం తొలగిపోలేదు. ఇలాటప్పుడు ఏదైనా కాస్త రాజకీయంగా వెసులుబాటు దొరికిందనుకుంటే తక్షణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి గాని పథకాల ప్రచారంలో ముంచెత్తడమే పని కారాదు. ఈ వాస్తవాలు ఎత్తి చూపితే మీడియాపై విరుచుకు పడడం మరీ అర్థ రహితం.వ్యూస్‌ తప్ప న్యూస్‌ లేదు అంటున్న ముఖ్యమంత్రి గత రెండేళ్లలోనూ రాష్ట్రంలో వార్తా పత్రికలు ఛానెళ్లు రెండు వార్తల చుట్టూనే తిరగడానికి తమ బాధ్యత ఎంతో ఆలోచించుకుని అసహనం నుంచి బయిటపడటం శ్రేయస్కరం.

No comments:

Post a Comment