Pages

Saturday, October 15, 2011

రాజకీయ మలుపుల మధ్య రైల్‌రోకో




నెలరోజులు దాటిపోయిన సకల జనుల సమ్మె ద్వితీయ ఘట్టంలో సహజంగానే అనేక మలుపులు వస్తున్నాయి. మూడు రోజుల రైల్‌రోకో సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుని అరెస్టులు చేయడం ఇందులో ముఖ్యమైంది. గతంలోనూ ఆందోళనలు చేస్తున్నవారిని నిర్బంధించినా ఈ సారి ముందుగానే డిజిపి తీవ్ర హెచ్చరికలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. మామూలుగా ప్రజా ఉద్యమాల సందర్భంలో రైల్‌రోకోల వంటివి సంకేత ప్రాయంగా కొన్ని గంటల పాటు జరిగేవి. కాని ఈ సారి తెలంగాణా జెఎసి మూడు రోజుల పాటు రైల్‌ రోకో ప్రకటించింది. రెండు సార్లు వాయిదాల అనంతరం శనివారం నాడు అది ప్రారంభమైంది. డిజిపి దినేష్‌ రెడ్డి రైల్‌రోకోలో పాల్గొన్నవారిపై చాలా తీవ్రమైన శిక్షలకు దారి తీసే కేసులు నమోదు చేస్తామని చెప్పడం ముందే వివాద గ్రస్తమైంది. తమ అధిష్టానం నుంచి ప్రకటన తెప్పించడంలో విఫలమైన కాంగ్రెస్‌ ఎంపిలు కూడా రైల్‌రోకోలో పాల్గొంటామని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రచారం పొందింది. అయితే మిగిలిన వారితో పాటు ఎంపిలను కూడా అరెస్టులు చేసేందుకు సిద్ధమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తను గట్టిగా వుండబోతున్నాననే
సంకేతాలు పంపించింది.మరోవైపున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు కూడా వూహించినట్టే విఫలమైనాయి. ముందుగా సమ్మె విరమిస్తే వైఖరి మార్చుకుంటామన్నది ప్రభుత్వ విధానమైతే తెలంగాణాకు సంబంధించి ఏదైనా ప్రకటన లేదా తీర్మానం తీసుకురావాలన్నది సంఘాల షరతు కావడంతో వైఫల్యం అనివార్యమైంది.
అయితే విద్యా సంస్థల విషయంలో వచ్చిన విమర్శలను మాత్రం ఆలోచిస్తామని జెఎసి ప్రకటించవలసిన స్తితి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటించే వరకూ సమ్మె కొనసాగుతుందని వారు అంటుంటే కేంద్రం మాత్రం ఇప్పట్లో ఎలాటి ప్రకటన చేసే అవకాశం కనిపించక పోవడంతో సహజంగానే తలిదండ్రులలో విద్యార్తులలో ఆందోళన ఏర్పడింది. ఇది ఉద్దేశ పూర్వకంగా సృష్టించినట్టు సమ్మె నాయకులు పైకి వ్యాఖ్యానిస్తున్నా వాస్తవంగా వున్న సమస్యను వారు కూడా విస్మరించలేకపోతున్నారు. స్వతహాగా చదువులంటే ప్రాణమిచ్చే పిల్లలు ఎటూ వుంటారు. అంతకంటే కూడా ఎందరో పేద మధ్యతరగతి తలిదండ్రులు పిల్లల విద్యపైనే ఆశలన్నీ పెట్టుకుని వుంటారు. రాజకీయ అనిశ్చితి వారి ఆందోళనను పెంచేదిగానే వుంది. ఇక ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికైతే జీతాల సమస్య కూడా వుంటుంది. సమ్మె కాలానికి తమకు జీతాలు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని వారు అంటుంటే అనివార్యంగా తెరుచుకోవడానికి అనుమతిచ్చినట్టు కొందరు నేతలు చెబుతున్నారు.
మరోవైపున చూస్తే విద్యుదుద్యమం, ఆర్టీసీ కార్మికుల ఐక్య పోరాటాలు గతంలో రాష్ట్ర రాజకీయాలనే మార్చేశాయి.ఇప్పుడు ఆ రెండు రంగాలలోనూ ప్రాంతాల వారీ విభజన రావడం ప్రైవేటీకరణపై ఐక్య పోరాటాలు కోరేవారికి ఒక ఎదురుదెబ్బ వంటిదే. విభజనకు అనుకూలమైన నేతగా చెప్పబడిన పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోని రవాణా శాఖలోనే బస్సుల బందును విరమిస్తున్నట్టు ఎన్‌ఎంయు తో ప్రకటన చేయించడం ఆసక్తికరమైన విషయం. ఆ నిర్ణయంతో విభేదించి టిఎన్‌ఎంయు పెట్టుకున్నప్పటికీ హైదరాబాదులోనూ మరికొన్ని చోట్ల బస్సుల రాకపోకలు పెరగడానికి ఈ పరిణామం కారణమైంది. ఇలాటి సమయంలోనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చర్చలకే నిరాకరించడం సమంజసంగా వుండదనే దృష్టితోనే హాజరైనట్టు బావించాల్సి వుంటుంది. వారి మూడు షరతులకు సానుకూలంగా స్పందిస్తున్నా సమ్మె విరమిస్తే తప్ప అమలుకు చర్యలు తీసుకోలేమన్నట్టు ప్రభుత్వం మాట్లాడింది. ముందుగా నిర్బంధ చర్యలను ఉపసంహరించడంతో పాటు ప్రత్యేక రాష్ట్రంపై రాజకీయ చొరవ చూపాలన్న షరతుకు టీఎన్జీవో సంఘాలు కట్టుబడి వుండటంతో వైఫల్యమే మిగిలింది.
గతంలో చెప్పుకున్నట్టు లోగడ రాష్ట్రంలో రెండు విభజన ఉద్యమాల సందర్భంలోనూ ఉద్యోగులు విద్యార్తులే అధికంగా నష్టపోయారు. ఇప్పుడైనా అది అనివార్యమే. ఉద్యోగుల జెఎసి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యలు దాన్నే ప్రతిబింబేంచాయి. తాము సమ్మె చేసి నష్టపోతుంటే రాజకీయ నాయకులు రాత్రిళ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహించారు. ఒకవేళ తాము అలసిపోతే మాత్రం ఆడిపోసుకోవద్దని గతంలోనూ ఆయన చెప్పిన సంగతి ఇక్కడ గుర్తుచేయాలి. ఎవరు ఏ విధమైన భాష్యం చెప్పినా అనేక రూపాలలో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం వారు కాంగ్రెస్‌ మంత్రులతో సమావేశమై రాజీనామాలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది సందేహమే. వారం రోజుల కిందట ఢిల్లీలో ఇలాటి ప్రయత్నమే జరిగినప్పుడు ఇదే జానారెడ్డి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతలోనే వారి వైఖరి పెద్దగా మారకపోవచ్చు. కాంగ్రెస్‌ ఎంపిలు రాజీనామాలు ఆమోదించమంటూ లోక్‌సభ స్పీకర్‌ను ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేసినా నిరాహారదీక్షకు ప్రకటనను అధిష్టానం ఒత్తిడి వల్లనే వాయిదా వేసుకున్నారు. కనక రైల్‌రోకోలో పాల్గొన్నప్పటికీ వారు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పనవసరం లేదు. ఇక తెలంగాణా ప్రాంతానికి చెందిన పదిమంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు విద్యా సంస్థలను మినహాయించాలని సమిష్టిగా విజ్ఞప్తి చేశారు. ఆ మరుసటి రోజున టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ కె.తారక రామారావు ముఖ్యమంత్రి 13 మంది తెలంగాణా కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలకు రు.25 లక్షల చొప్పున ముట్టజెప్పి మద్దతు కొనుక్కున్నారని ఆరోపించారు. ఆధారాలు మాత్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తే చూపిస్తానన్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు కూడా మీరే వసూళ్లు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ మోసం చేస్తున్నందున బిజెపి ఎన్‌డిఎలతో కలవడం మంచిదని గతంలో ఆ పార్టీ నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి బహిరంగంగా సూచించడం మరో విశేషం.అయితే ఆ పార్టీ నేతలు మాత్రం తాము బిజెపితో కలవబోమని చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. పైగా ఢిల్లీ యాత్ర తర్వాత జెఎసిలో బిజెపి నేతలు కొంత భిన్నస్వరం వినిపిస్తూ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. అద్వానీ రథయాత్ర కోసం రైల్‌రోకో వాయిదా వేసుకోవాలని కూడా వారు సూచించితే జెఎసి అంగీకరించలేదు. ప్రాంతం పేరిట జరిగే ఉద్యమంలో పార్టీల వైరుధ్యాలకు ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. టీ టీడీపికి ఈ మొత్తంలో స్థానం ఏమిటన్నది ఇంకా అయోమయంగానే వుంది. రెండు చోట్ల పార్టీని కాపాడుకోవడం అన్న అధినేత సూత్రం రాజకీయంగా సరిగా వుందంటున్నా ప్రాంతాల వారీగా ప్రజలను ఒప్పించడంలో ఎదురీత తప్పడం లేదు. దేవినేని ఉమ వంటి తెలుగుదేశం సభ్యులు కూడా అగ్నిగుండం భాషలో మాట్లాడ్డం వారి ఇరకాటాన్ని పెంచుతున్నది. కాంగ్రెస్‌ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ కూడా తన రివాజు ప్రకారమే తెలంగాణాలోనే దొరల దోపిడీ జరిగిందంటూ కెసిఆర్‌కు పుస్తకాలు సిడిలు ప్రచార పూర్వకంగా పంపించారు. తెలంగాణాలో దొరల దోపిడీ వెట్టిచాకిరీ నిజమే, దానిపై కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి తుదముట్టించిన మాటా నిజమే. అయితే ఇందులో కాంగ్రెస్‌ ఘనత శూన్యం. పైగా ఆ దొరలను తిరిగితీసుకొచ్చి గడీలలో ప్రవేశపెట్టి పదవులు కట్టబెట్టిన దోషి కాంగ్రెసే. ఇతర ప్రాంతాలలోనూ జమీందారీ వ్యతిరేక పోరాటాలు జరిగాకే పరిస్తితి మారింది. నిజాం రాజ్యంలో మధ్య యుగాల నాటి వెట్టిచాకిరీ కొనసాగడానికి చారిత్రిక కారణాలున్నాయి. బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనలోని ఇతర ప్రాంతాలలో వెట్టిచాకిరీ లేకున్నా భూస్వామ్య దోపిడీ లేదనడం సరికాదు. మందసా జమీందారుకు, చల్లపల్లి జమీందారుకు,తర్వాత మునగాల జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు తెలంగాణా సాయుధ పోరాటానికి ముందుమాట లాటివి. శ్రీకాకుళంలో గున్నమ్మ, చల్లపల్లిలో వియ్యమ్మ, పాలకుర్తిలో అయిలమ్మ ముగ్గురూ భూస్వామ్య వ్యతిరేక పోరాట ప్రతీకలేనని లగడపాటి వంటివారు గుర్తుంచుకోవాలి.అలాగే తెలంగాణా పేరిట ఇప్పుడు రాజకీయాలు నిర్మించుకుంటున్న వారు కూడా ఈ గతాన్ని క్షణమైనా విస్మరించకూడదు.అప్పుడు భూస్వామ్య విధానమైనా ఇప్పుడు పెట్టుబడిదారీ సామ్రజ్యావాద ప్రపంచీకరణ అయినా ప్రాంతాల తేడా లేకుండా ఏదో ఒక రూపంలో అన్ని చోట్లా కొనసాగుతున్నది. వాటిపై అందరూ కలసి పోరాడవలసిన అవసరమూ వున్నది. ప్రతిదీ ప్రాంతీయ రేఖలతోనే చూసే వారికి చరిత్ర పాఠాలు పెద్దగా పట్టకపోవచ్చు గాని ప్రజలు గుర్తుంచుకోవాల్సిందే. ఇంకా ఏమైనా సందేహాలుంటే శనివారం సాయింత్రం జానారెడ్డి సమ్మె విరమణకై చేసిన ప్రకటన తర్వాతనైనా పరిస్తితి స్పష్టమై వుండాలి. జానారెడ్డి ఇంట్లోనే జెఎసికి అంకురార్పణ జరిగింది.ఆయనే ఢిల్లీలో టిఆర్‌ఎస్‌ విలీనం గురించి మాట్లాడారు.ఇప్పుడు ఆయనే సమ్మె విరమణ కోరుతున్నారు. దీనిపై టిఆర్‌ఎస్‌ ప్రతినిధి ఆగ్రహం వెలిబుచ్చవచ్చు గాని ప్రాంతం పేరు జపించేవారికి కూడా తమ తమ రాజకీయాలుంటాయని తెలుసుకోవడం అంతకన్నా ఉపయోగకరం.
రైల్‌రోకో ఉద్యమ ఉధృతిని నిలబెట్టడానికి ఒక ప్రధాన సందర్భంగా ఉపయోగపడుతుందని భావించినా ముందుగానే నాయకులను అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలలో వుంచడం ప్రభావం చూపించిందనే చెప్పాలి. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున రద్దు చేసిన రైళ్లలో కొన్నిటిని పునరుద్ధరించడం అందువల్లనే కావచ్చు. పోలీసులను విస్త్రతంగా మోహరించడం ఒకటైతే ఘర్షణకు సిద్ధంగా వున్నామనే భావన కలిగించడం పాల్గొన్న వారిపై దీర్ఘకాలిక కేసులు పెడతామని హెచ్చరికలు చేయడం వగైరాలన్ని జరిగాయి. ఇది రాసే సమయానికి ఎలాటి అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడం మంచి విషయం. ఇందుకు పాలకులు, ఉద్యమ నాయకుల కన్నా ప్రజల శాంతి కాంక్ష ప్రధాన కారణమని చెప్పాలి. కనకనే రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడకుండా కేంద్రం తక్షణం తన నిర్ణయం ప్రకటించక పోతే ఈ పరిస్తితి ఇంకా దిగజారుతుంది తప్ప మెరుగుపడదు. సమ్మెను సమర్థంగా ఎదుర్కొనగలిగానని సంతృప్తి చెందే బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాటి ప్రకటనను వేగవంతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలి.

No comments:

Post a Comment