Pages

Friday, February 21, 2014

తెలంగాణా రాష్ట్రావతరణ


ఆంధ్ర ప్రదేశ్‌ పునరవ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ మంగళవారం, రాజ్యసభ గురువారం ఆమోదించడం తెలుగు ప్రజల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఉభయ సభలు పచ్చజెండా వూపడంతో దేశంలో తెలంగాణా 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది. అరవై ఏళ్లుగా వివిధ రూపాల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రాంతీయ సమస్య ఇప్పటికి ఈ విభజనతో ముగుస్తున్నది. ఆయా దశల్లో పాలక వర్గ పార్టీల నేతల పంచాయితీలు, క్రమేణా ప్రజల్లో ప్రబలిన మనోభావాలు, నాలుగేళ్లుగా నానుతున్న అనిశ్చితి అన్నీ దీని వెనక వున్నా కాంగ్రెస్‌ అధిష్టానం కళ్లముందున్నది మాత్రం నెలాఖరుకు రానున్న ఎన్నికలేనన్నది నిర్వివాదాంశం. పదేళ్లుగా పేరబెట్టిన సమస్యను పది రోజుల పార్లమెంటు చివరి సమావేశాల్లో తేల్చిపారేయడం సాధ్యమైందంటే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అందించిన సంపూర్ణ సహకారమే కారణం. ఈ సందర్భంగా లోక్‌సభలో కానవచ్చిన దృశ్యాలు ప్రాంతాల ప్రతినిధుల కుమ్ములాటలు జుగుప్సా కరం కాగా యుపిఎ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రమాణాలను తోసిరాజని ఏకపక్ష ఆమోదానికి పరుగులు పెట్టిన తీరు అత్యంత ఆందోళన కరం. దేశంలో తొలి భాషా రాష్ట్రంగా ఆవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌ను కనీస చర్చ లేకుండా అత్యున్నత సభ పేరిట విభజించడానికి రెండు ప్రధాన పార్టీలూ చేతులు కలపడంలో రాజకీయ ప్రయోజనాల పాకులాట తప్ప ప్రజా శ్రేయస్సు గోచరించదు. లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభలో కాస్తయినా చర్చ జరగడం కొంతలో కొంత మెరుగు. కావాలంటే ఈ రెండు పార్టీలూ అక్కడ కూడా చర్చ జరపలేవని కాదు గాని దాటవేయడానికి, ప్రధాన తతంగం ముగించేయడానికి ఆతృత పడ్డాయి.ఏమైనా బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది గనక ఇక రెండు రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడు ఎలా అన్నది కేవలం లాంఛనంగా ప్రకటించడమే మిగిలివుంటుంది.
ఇన్నేళ్లుగా సాగిన వాదోపవాదాల్లో నిజమైన సమస్యలు కొన్ని వుంటే స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాపింప చేసిన అవాస్తవాలూ చాలా వున్నాయి. ఈ క్రమంలో నిజమైన సమస్యలు మరుగున పడ్డాయి.ప్రజల పేరిట ప్రాంతాల పేరిట అటూ ఇటూ పాలకపక్షాలు పోటీ పడి రాజకీయ నాటకాలు నడిపించాయి. అసమానతలకు మూలమైన ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ ఆపైన ఇటీవలి ప్రపంచీకరణ అనారోగ్యకరమైన రాజకీయ కాలుష్యం వీటన్నిటి నేపథ్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. అడుగు జారుతున్న ప్రధాన పార్టీలు పట్టు నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రాల విభజనను ఆయుధంగా చేసుకోవడం అస్తిత్వ రాజకీయాలను రెచ్చగొట్టడం దేశంలోనూ ప్రపంచంలోనూ చూస్తున్నదే.తెలంగాణా సమస్యకు కొన్ని ప్రత్యేకాంశాలు వున్నా ఈ మౌలిక లక్షణం మరుగున పడేది కాదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు తెలంగాణాను బలపరుస్తున్నామంటూనే సీమాంధ్ర పేరిట నడిపిన ప్రహసనాలకు కూడా లోటు లేదు. ఈ పదిహేడేళ్లలోనూ పలుపల్లవులు మార్చిన బిజెపి ఇటీవల వరకూ తెలంగానం చేసి చివరి దశలో సీమాంధ్ర కోసం కంకణం కట్టుకున్నట్టు కపటనాటకాలాడి కసీన చర్చ కూడా లేకుండానే గుండుగుత్తగా బిల్లు ఆమోదానికి మాత్రం సహకరించింది. లోక్‌సభలో అత్యంత అప్రజాస్వామికంగా జరిగిన ఈ తతంగం రాజ్యసభలో కాస్త చర్చ జరిగేందుకు అవకాశమిచ్చింది. అయతే ఆ సందర్భంలో వెంకయ్య నాయుడు వంటి బిజెపి నేతలు పదే పదే ఏదో సాధించినట్టు కనిపించేందుకు చేసిన రాజకీయం రక్తి కట్టలేదు. స్వాతంత్రానంతరం దేశ భౌగోళిక పటాన్ని పాలనా విభాగాలను ఏర్పాటు చేసుకునేప్పుడు అనుసరించిన భాషా ప్రయుక్త సూత్రాన్ని తోసిపుచ్చేందుకు కేంద్ర రాష్ట్రాలలోని మూడు ప్రధాన పార్టీలూ కుమ్మక్కు కావడం దాచేస్తే దాగని సత్యం. రాజ్యసభ చర్చలో చాలా పార్టీలు ఈ పద్ధతిని వ్యతిరేకించడం యాదృచ్చికం కాదు.
సిపిఎం మొదటి నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన తగదనే సూత్రబద్ద వైఖరికి కట్టుబడి వుంది. పార్లమెంటులో చర్చ సందర్భంగానూ సిపిఎం నేత సీతారాం ఏచూరి అదే నొక్కి చెప్పారు. చర్చ జరిగిన రాజ్యసభలో ఓటింగు తీసుకోనందువల్ల వాకౌట్‌ చేసింది.కమ్యూనిస్టుపార్టీ మొదటి నుంచి చెబుతున్న విధానమదే. అన్ని రకాల ఒత్తిళ్ల మధ్య ఒక విధానానికి కట్టుబడి వున్నందునే విమర్శకులు సైతం దాని కట్టుబాటును గుర్తించారు. ఇంత ప్రాంతీయ వివాదాల మధ్య కూడా ప్రజాసంఘాల పోరాటాలు ఉద్యమాలు ఆగింది లేదు. ఈ పోరాటాలన్నీ ప్రాంతాల తేడా లేకుండానే జరిగాయి. రేపు కూడా రాష్ట్రాలు రెండైనా కొనసాగుతుంటాయి. సిపిఐ విభజనను సమర్థించగా వైసీపీ సమైక్యత నినాదమిచ్చింది. తెలంగాణా సమస్య ఈ దశలో ముందుకు రావడానికి ప్రధాన కారణమైన టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో విలీనానికి కూడా సిద్ధమంటోంది. లౌకిక పార్టీగా పేరున్న తెలుగుదేశం నరేంద్ర మోడీ చెలరేగి పోతున్న ఈ తరుణంలో బిజెపితో చేతులు కలపడానికి సిద్ధమైంది. బిజెపి నేతలు ఆఖరి నిముషంలో చేసిన హడావుడి అందుకు అనుగుణంగా జరిగిందే తప్ప చిత్తశుద్ధి నాస్తి. ఇక విభజనను ఆపే బ్రహ్మాస్త్రముందన్న కాంగ్రెస్‌ ఎంపిలు పెప్పర్‌ స్ప్రేలతో తప్పుసంకేతాలివ్వగా చివరి బంతి తగిలాకే ముఖ్యమంత్రి ఇంటిదారి పట్టారు. ఏతావాతా కాంగ్రెస్‌ నాయకత్వం ఉద్దేశించిన రాజకీయ క్రీడ చివరి దశకు చేరింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కోసం ఎదురు చూడటమే మిగిలింది. రాష్ట్ర విభజన నిర్ణయం అమలుకు ఆదేశాలు జారీ చేయవలసింది కూడా ఆయనే. ఇన్నేళ్లలోనూ ఎందరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా ఘర్షణలకు ఆస్కారమివ్వకుండా ప్రశాంతతను కాపాడుకున్న తెలుగు సోదర సోదరీ మణులు ఇక ముందూ అదే సుహృద్భావాన్ని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నేతలందరూ ఆ విధమైన పిలుపునివ్వడం ఆహ్వానించదగింది. ఎందుకంటే వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చినాడన్నా వరాల తెలుగు ఎప్పటికి ఒక్కటిగానే వుంటుంది. అదే స్పూర్తితో తెలుగు ప్రజల సమరశీల చైతన్య వారసత్వం చెయ్యెత్తి జై కొడుతూనే వుంటుందని విశ్వసిద్దాం.
3 comments:

 1. Finally the dream comes true. Jai Telangana

  ReplyDelete
 2. Very good analysis..whatever is happen, it's happened..no need to worry about the power games..our ancestors faced these and overcome with new ideas and developments..atleast now telangana people don't have any choice to complain on others..it's time to start work on their own state..so far we lost somany telugu biddalu..not any more i guess..some people has to form a group and educate lower level people..This generation has lot of courage to do good things..as per my observation people has to change their mindsets...
  1. Telugu people proved that, we can built new communities and compete with world, hyderabad is the best example.
  2. Stop criticizing each other and work as one team to move forward.
  3. No need to rush for new capital..it's government responsibility to built all required infra..
  4. we have to educate our next generation about greatness of telugu people, involve them in future developments.
  5. all are equal in telugu land, we have to start practicing these and helping each other for good cause.
  6. Gujarat and Israel are good examples..
  7. In my opinion Chandrababu is the best option to make our place flourish with new developments.
  8. Instead of IT we have to think about other future developments..
  9. Hyderabad is going to reach it's break even point, people start thinking about beach homes soon. AP is next possible destination for better living.
  10. Taking education to next level..we have great professors and lecturers to nourish future generations.
  11. Every telugu person think about his mother land and adopt few villages and schools to nourish future generation.
  12. Giving moral support to other telugu/indian all the time..

  just my thoughts...it's better to form new group for "Better and Bright AP" for future generations..lot of people are ready to contribute their work..

  ReplyDelete
 3. సార్ తెలంగాణా అని చెప్పి...రాయల తెలంగాణాని వేశారు...రాయలసీమ లోని రెండు జిల్లాలు కలిపేశారు...

  తరవాత, ఈ రాష్ట్ర విభజన... ఉద్యమాల వల్ల జరిగిందని అనుకుంటున్నారా... కేవలం ఉత్తరాది ఆధిపత్యం కోసం మరియు జాతీయ పార్టీల పేరుతొ బిజెపి, కాంగ్రేసు వంటి హిందీ పార్టీలు... దిల్లి పరిపాలన చేసుకోవటానికే... దీనికి ఆటంకంగా ఉన్న పేద్ద రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల బలం తగ్గించటానికే మాత్రమే ఈ విభజనలు....రాబొయ్యే రోజులలో తమిళనాడు, బెంగాలు, మహారాష్ట్రాలు కూడా ముక్కలు కాబోతున్నాయి... అందుకే ఆ రాష్ట్ర ఎంపిలు నానా గోలా చేసారు...ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నయూ.పీ ఎలాగు తన గొంతు తానూ కోసుకోటానికి అసెంబ్లీలో తీర్మానం చేసేసింది కూడా....

  ఉంటె మీరు లేకపోతె మేము అనే ధోరణిలోనే కాంగ్రెస్సు, బిజెపిలు కలిసిపోయి నాటకాలకి దిగినాయి.

  ReplyDelete