Pages

Tuesday, February 25, 2014

గు'లాబీ' హస్త విలీన విన్యాసం..









తెలంగాణా విభజన బిల్లు ఆమోదం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి యావత్తూ టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడంపై కేంద్రీకరించింది. విలీనంపై చర్చ ముగిసిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజరుసింగ్‌ చేసిన ప్రకటనతో ఈ తతంగం కూడా పరిసమాప్తమైంది. వారం రోజులుగా దిగ్విజరు సింగ్‌తో రాజకీయ చర్చలు చేస్తున్నట్టు కె.సి.ఆర్‌ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటనను సందేహించవలసిన అవసరం కనిపించదు. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి వెళ్లి 100 శాతం తెలంగాణా రాష్ట్రానికి వస్తానని కెసిఆర్‌ అన్నప్పుడు టిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లి కాంగ్రెస్‌కు వస్తారా అని నేను తమాషాగా అన్నాను. ఇప్పుడు ఇంచుమించు అదే జరిగినట్టు కనిపిస్తుంది.
టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలసి కృతజ్ఞతలు తెల్పి వచ్చారు. సకుటుంబ సందర్శనం మర్యాదకోసం జరిగినట్టు కనిపించినా వాస్తవానికి రాజకీయంగా తమ అనుబంధాన్ని చాటుకోవడానికే కెసిఆర్‌ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తమ పార్టీ కీలక నేతలనూ సీనియర్లనూ వదలిపెట్టి కేవలం కుటుంబసభ్యులనూ బంధువులను తీసుకెళ్లడంపై ఆ పార్టీలో కొంత దుమారం రేగింది కూడా. ఈ సమయంలో తెలంగాణా అభివృద్ధికి అవసరమైన కోర్కెల పత్రాన్ని సోనియా గాంధీకి సమర్పించినట్టు చెప్పిన కెసిఆర్‌ రాజకీయాలు చర్చకు రాలేదనడం ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. విలీనానికి సిద్ధమని చెప్పిన తర్వాత కొత్తగా ఆ స్థాయిలో చర్చించవలసిన అంశాలేముంటాయి? వాటిపై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో ఎలాగూ చర్చలు జరుగుతూనే వున్నాయి అని టిఆర్‌ఎస్‌ నేత ఒకరు నాతో చెప్పారు. వారు చెప్పినట్టు వినడం తప్ప మా చేతుల్లో ఏముంటుంది? ప్రత్యామ్నాయాలేముంటాయి అని ఆ నేత అన్నారు.
ఉభయ పార్టీల విలీనంపై వాస్తవానికి వివిధ రూపాల్లో చర్చ నడుస్తూనే వుంది. విలీనమా విడిగానే అనేది ఒక కొలిక్కి రావడం లేదు. ఇందుకు కె.సి.ఆర్‌ వైఖరి ప్రధాన కారణం అన్నది ఒక కథనం. విలీనం ప్రతిపాదనను తోసిపుచ్చకుండానే ఆయన అనేక విధాల రాజకీయ బేరసారాలకు ప్రయత్నిస్తున్నారు. పైగా విలీనం వల్ల తెలుగుదేశం ప్రచారం నిజం చేసినట్టవుతుందని ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన కూడా వాస్తవికంగా లేదు. ఒకసారి అన్న మాట ప్రకారం తెలంగాణా ఇచ్చిన తర్వాత తాను అన్నమాట నిలబెట్టుకోవడానికి ఇంతగా తటపటాయించడంలో ఆంతర్యం ఏమిటి? అని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అన్నారు. కాంగ్రెస్‌ కోణం నుంచి మాట్లాడుతున్నట్టు కనిపించే కెసిఆర్‌ నిజానికి తన పార్టీ పునాదిని విస్తరించుకోవడంపై కేంద్రీకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తుతో పోటీ చేసి గరిష్టంగా స్థానాలు తెచ్చుకోవడం మంచిదని అంటున్న కెసిఆర్‌ రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో పరిస్థితి మారిపోతే మాట మార్చరని ఇతరులతో కలవరని ఎవరు గ్యారంటీ ఇస్తారన్నది మా అధిష్టానాన్ని వేధిస్తున్న సమస్య అని మరో మాజీ ఎంపి వివరించారు. ఇన్ని కారణాల రీత్యా కాంగ్రెస్‌ ఆయనను కమిట్‌ చేయించిందని అనుకోవాలి.
తెలంగాణా ఆవిర్భావంతో మొత్తం తానే తుడిచిపెట్టేస్తానని కెసిఆర్‌ అతిగా అంచనా వేసుకుంటున్నారు. విలీనమైతే ఆయనపై ఒత్తిడి తగ్గి కాంగ్రెస్‌ అధిష్టానం పేరుమీద అంతా జరిగిపోతుంది. లేదంటే అసలు పొత్తుకే విలువ లేకుండా బహుముఖ పోటీలు తిరుగుబాట్లు పెరుగుతాయి. ఈ ఓట్ల చీలికలో బలమైన యంత్రాంగం గల తెలుగుదేశం, విభజనకు సహకరించిన బిజెపి సీట్లు తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నది కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న ఆందోళన. తెలుగుదేశం చాలా ఇరకాటంలో వున్నా వెంటనే ఎన్నికల రంగంలోకి దిగిపోతుంటే మనం తర్జనభర్జనలలో మునిగిపోయామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రజలలో ఈ ఎన్నిక వరకూ కెసిఆర్‌ కన్నా సోనియాపైనే ఎ క్కువ గురి వుంటుందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఇస్తే కాళ్లు కడుగుతానని ఇంకా ఏవేవో మాట్లాడిన కెసిఆర్‌ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కు పోవడం కూడా సులభం కాదు.

కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను కలిపేసుకోవడం తప్ప విలీనం వంటి మాటలను కూడా ఉపయోగించదు. ఒకప్పుడు శరద్‌ పవార్‌ తన కాంగ్రెస్‌ను విలీనం చేస్తున్నానని చెబితే అదే సభలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీ మాతృసంస్థలోకి వస్తున్నందుకు స్వాగతం చెబుతున్నానని మాత్రమే అన్నారు. ఇటీవల చిరంజీవి పిఆర్‌పిని విలీనం చేసినప్పుడు ఎలాటి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. ఆ సభకు సోనియా వస్తారని ప్రచారం జరిగినా నిజం కాలేదు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ విషయంలోనూ అందుకు భిన్నంగా జరగబోదంటున్నారు. విలీనం జరిగితే మొదట్లో ప్రాధాన్యత నిచ్చినా తర్వాత కెసిఆర్‌కు ఇంత బలమైన స్థానం వుండబోదని కాంగ్రెస్‌ తేలిగ్గా చప్పరించేస్తుందని విభజనకోసం కృషి చేసిన ఒక ప్రముఖ సంపాదకుడు అన్నారు. ఇప్పుడు కెసిఆర్‌ లేకుండానే దిగ్విజరు సింగ్‌ తానుగా ఇలాటి వ్యాఖ్యలు చేశారంటే ఎంత దాని వెనక ధీమా స్పష్టం. తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పే కెసిఆర్‌ అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌లో కలసి పోయి కొత్తగా సాధించేదేమిటన్న ప్రశ్న వుండనే వుంటుంది.
నిజానికి టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఈ విలీనం పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. పైనున్న వారికి స్థానం లభించవచ్చు గాని తమ వంటి వారి పరిస్థితి ఏమిటని యువ నాయకులు కింది వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాటి వారంతా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
.

No comments:

Post a Comment