Pages

Friday, February 21, 2014

నిరర్థక నిష్క్రమణఆంధ్ర ప్రదేశ్‌ బిల్లు లోక్‌సభ ఆమోద ముద్ర వేయించుకుని రాజ్యసభకు రానున్న తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. విభజన ప్రాంగణంలో వున్న ఈ రాష్ట్రాన్ని ప్రజలనూ దృష్టిలో వుంచుకునే తాను రాజీనామా చేశాను తప్ప స్వప్రయోజనం ఎంతమాత్రం లేదని ఆయన బల్లగుద్ది చెప్పారు. రాజకీయ రాజ్యాంగ ప్రక్రియ రాష్ట్ర సరిహద్దులు దాటి కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తర్వాత అందులోనూ ప్రధాన భాగం పూర్తయిన తర్వాత ఆయన రాజీనామా చేయడం వల్ల ఒరిగేది జరిగేది శూన్యమని ఆయనకూ తెలుసు. చివరి బంతి అంటూ ఎడతెగని ప్రజ్ఞలు పలుకుతూ బ్రహ్మాస్త్రాలు చక్రాయుధాల గురించి చెబుతూ అంతా అయిపోయిన తర్వాతనే ఆయన వైదొలగడానికి రాజకీయ ప్రాధాన్యత గానీ ప్రభావం గానీ వుండకపోవచ్చు.
విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం వెలువడిన తర్వాత గత ఆరునెలల్లోనూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహారశైలి గానీ, చేసిన వ్యాఖ్యానాలు గానీ అతిశయోక్తికీ అవాస్తవికతకూ అద్దం పట్టాయి. సమైక్య సింహం అని ప్రచారం చేయించుకున్న కిరణ్‌ శాసనసభలో బిల్లుపై చర్చ సందర్భంలోనూ ద్విముఖ వ్యూహమే అనుసరించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును శాసనసభలో చర్చకు చేపట్టి నివేదిక తయారు చేసేందుకు సహకరించారు. ఆ తర్వాత బిల్లును తిరస్కరిస్తున్నట్టు ఆఖరి దశలో తీర్మానం పెట్టి మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు ప్రకటించారు. ఈ చర్య చాలా గొప్పదైనట్టు ముఖ్యమంత్రి అనుయాయులు ప్రచారం చేసుకుంటే తెలంగాణా వాదులు దానిపై తీవ్రంగా దాడి చేశారు. రాజ్యాంగం మూడవ అధికరణం ప్రకారం శాసనసభ అభిప్రాయాన్ని పార్లమెంటు తోసిపుచ్చవచ్చుననే మాట ఒకటైతే అది కూడా సూటిగా చేయడం గాక ఉభయ తారకంగా తతంగం నడిపించడం ముఖ్యమంత్రి కేంద్రానికి చేసిన పరోక్ష సేవ వంటిదే. ఈ విధంగా ఒక వైపు పూర్తిగా సహకరిస్తూ మరో వైపు ధిక్కారం అభినయిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌ రసవత్తర రాజకీయమే నడిపించారు, ఆ తర్వాత ఇరవై రోజులపాటు రోజూ రాజీనామా వార్తల ధారావాహిక నడిపించారు. దీనివల్ల చివరి నిముషం వరకూ అధికారం చేజారిపోకుండానూ మరో నేతను ఎన్నుకోవలసిన చిక్కు సమస్య అధిష్టానానికి రాకుండానూ శాయశక్తులా సహకరించారు. విధేయత తప్ప విలువలు పెద్దగా పాటించని కాంగ్రెస్‌ నేతగా ఆయన ఇవన్నీ చేయడం మామూలేగాని పైకి గంభీరోక్తులు పలుకుతూ ఏదో చేయబోతున్నారన్నట్టు కొందరిలో భ్రమలు గొల్పడం మరికొందరు వివాదాలు రగిలించడానికి ఆస్కారం కలిగించాయి.
క్లిష్ట సమయంలో పదవి చేపట్టి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చయడం కిరణ్‌ గొప్ప అనే భావం ఒకటి ప్రచారంలో వున్నా వాస్తవానికి ఈ మూడేళ్లు ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమైన దుస్థితి. ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడుతున్నా పాలన స్తంభించిన దుర్గతి. తామే సృష్టించిన ప్రాంతీయ చిచ్చును సాకుగా చూపి కనీస ఉపశమన చర్యలను కూడా ఉపేక్షించింది. మరోవైపున కేబినెట్‌ ప్రాంతాల వారిగా చీలిపోయి సమిష్టి బాధ్యతను ప్రహసనంగా మార్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది తక్షణ పాలనా చర్యలైనా సక్రమంగా సకాలంలో తీసుకోడానికి బదులు ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు పార్టీ ప్రచారానికి పాకులాడారు. తాడూ బొంగరం లేని పథకాలతో ప్రజాధనం వెచ్చించి ప్రచార యజ్ఞం నడిపించారు. అవినీతి ఆరోపణలకు గురైన అమాత్యులను తప్పించకపోగా రకరకాలుగా వెనకేసుకొచ్చి చేయిదాటిపోయాకే బయిటకు పంపించారు. అక్రమంగా కట్టబెట్టిన భూములను వెనక్కుతీసుకుంటానన్న వాగ్దానం అరకొరగానే అమలు చేశారు. పైగా ఆఖరి క్షణంలోనూ సంతకాల సంతర్పణతో ఆరోపణలు మూటకట్టుకున్నారు. అంగన్‌వాడీలపై అధికార నివాసం దగ్గర అమానుషం జరిగితే ఆపలేని అలక్ష్యంలో మునిగిపోయారు. వ్యక్తిగత పోకడలకు మారుపేరుగా వివాదాస్పద వ్యాఖ్యలకు మూర్తీభావంగా స్వజనంతోనే విమర్శలు అందుకున్నారు. ఇంటా బయిటా ఈసడింపుల జడివాన కురుస్తుంటే ఆత్మస్తుతితో కాలక్షేపం చేశారు. సమైక్య జపం చేసిన ముఖ్యమంత్రి రెండు ప్రాంతాల మధ్య సుహృద్భావం పెంచే చర్యలు తీసుకున్నది లేకపోగా కొన్ని సార్లు దుందుడుకు వ్యాఖ్యలతో వివాదం పెరగడానికి కూడా కారణమైనారు. వాస్తవంగా ఏ ప్రాంతానికీ ఏ తరగతి ప్రజలకూ నిజంగా జరిగిన మేలు లేకపోగా వాతావరణం కలుషితమైంది. స్వంత పునాదులు కాపాడుకోవాలనే పాలక పక్ష రాజనీతి తప్ప విశాల దృక్పథంతో పదిమందినీ కలుపుపోవడానికి చొరవ చూపింది పూజ్యం. ఆఖరికి ఆయన దగ్గర పట్టుమని పదిమంది మంత్రులు గాని పాతిక మంది శాసనసభ్యులు గాని మిగల్లేదంటే ఇవన్నీ కారణాలే. కాంగ్రెస్‌ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అనుసరించిన దివాళాకోరు విధానాల అనివార్య పరిణామమే కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరర్థక నిష్క్రమణ. తానే ఏదో చేస్తానని చెప్పడం ద్వారా మిగిలిన వారిని కూడా నిరోధిస్తూ అధికార పీఠాన్ని కాపాడుతూ అధినేత్రి ఆదేశాలు తుచతప్పక అమలు చేశారనే ఆరోపణలపై సుదీర్ఘ సంజారుషీ ఇచ్చుకోవలసివచ్చిందీ అందుకే. అయితే వీటితో సంతృప్తి చెందేవారెవరూ వుండరు.
కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రి అవుతారా లేక మరో చివరాఖరి కీలుబొమ్మకు అవకాశం వుంటుందా అనేది వేచిచూడాల్సిన విషయమే. అనిశ్చితి అలవాటుగా మారిన అంధ్ర ప్రదేశ్‌ ప్రజానీకానికి ఈ కొద్దిపాటి అస్పష్టత ఒక లెక్కలోది కాదు. విభజన బిల్లుకు పార్లమెంటు సంపూర్ణ్త ఆమోదం తదితర తతంగాలు పూర్తి అయితే రాష్ట్రపతి పాలన విధించడమా లేదా అనేదానిపై భావిగతి ఆధారపడి వుంటుంది.

No comments:

Post a Comment