- తెలకపల్లి రవి
ప్రాంతీయ పాచికలలో భాగంగా గతంలో శ్రుతి మించిన ప్రకటనలు చేసిన మంత్రులు కూడా ఈ సారి అనివార్యంగా వాస్తవికతను గుర్తించవలసి వచ్చింది. రాజ్యాంగ బద్ధంగా తమ బాధ్యతను తాము నిర్వహిస్తామని ప్రకటించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ అవతరణే విద్రోహమనేట్టయితే దానికి అనుకూలంగా అత్యధికంగా ఓటు వేసిన నాటి హైదరాబాదు శాసనసభలోని పెద్దలందరూ ద్రోహులైపోతారా ఇంత కాలం ఇక్కడ వున్న వారంతా విద్రోహ రాష్ట్రంలో వున్నట్టు భావించుకోవాలా అన్న ప్రశ్నకు సమాధానాలు పెద్దగా రాలేదు. కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలలో గతంలో వలెనే భిన్న స్వరాలు వినిపించగా తెలంగాణా విభజన కోరే శక్తులు మొత్తంపైన ఈ వాదనకే కట్టుబడి వున్నాయి.రేపు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా జరపాలన్న వాదనను ప్రాంతాలతో సంబంధం లేకుండా మంత్రులందరూ నిరాకరించడం నేటి రాజకీయ వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. ఇది నిర్బంధం కాదని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించినప్పటికీ ఇలా జరగడం గమనించాల్సిన విషయం. గత వారం ఈ శీర్షికలో చర్చించుకున్న ఈ అంశంలో మొత్తంపైన విద్రోహ వాదనను వ్యతిరేకించే స్వరాలు గట్టిగానే వినబడ్డాయి. ఇప్పటి తమ రాజకీయ అవసరాల కోసం గతాన్ని కూడా అవాస్తవంగా చిత్రించే పోకడలు సరైనవి కావనే మాట విస్తృతంగా వినిపించింది. ప్రాంతీయ పాచికలలో భాగంగా గతంలో శ్రుతి మించిన ప్రకటనలు చేసిన మంత్రులు కూడా ఈ సారి అనివార్యంగా వాస్తవికతను గుర్తించవలసి వచ్చింది. రాజ్యాంగ బద్ధంగా తమ బాధ్యతను తాము నిర్వహిస్తామని ప్రకటించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ అవతరణే విద్రోహమనేట్టయితే దానికి అనుకూలంగా అత్యధికంగా ఓటు వేసిన నాటి హైదరాబాదు శాసనసభలోని పెద్దలందరూ ద్రోహులైపోతారా ఇంత కాలం ఇక్కడ వున్న వారంతా విద్రోహ రాష్ట్రంలో వున్నట్టు భావించుకోవాలా అన్న ప్రశ్నకు సమాధానాలు పెద్దగా రాలేదు. కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలలో గతంలో వలెనే భిన్న స్వరాలు వినిపించగా తెలంగాణా విభజన కోరే శక్తులు మొత్తంపైన ఈ వాదనకే కట్టుబడి వున్నాయి.
ఈ లోగా మరికొన్ని అవాంఛనీయమైన అనవసరమైన వివాదాలు ముందుకు తీసుకురాబడ్డాయి. ఇలా జరగడం యాదృచ్ఛికం కూడా కాదు. డిసెంబరు నెల సమీపిస్తున్న కొద్దీ శ్రీకృష్ణ కమిటీ నివేదికను కారణంగా చూపి వేడి పెంచడం వెనక స్పష్టమైన రాజకీయ కారణాలే వున్నాయి. తాము ఏదో ఒక అంశమే చెప్పబోమని అందరికీ ఆమోదయోగ్యంగా వుండే అనేక సిఫార్సులు సూచిస్తామని కమిటీ కార్యదర్శి వి.కె.దుగ్గల్ పదే పదే చెబుతున్నారు. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే మార్గాలు సూచించవలసిందిగా ఆ కమిటీ విచారణాంశాలలోనే పేర్కొన్న దృష్ట్యా ఇలా చెప్పడం సహజమే. అలా గాక కమిటీ సిఫార్సుతో ఒరిగేది వుండదంటూనే ఆ నివేదిక గడువును దృష్టిలో పెట్టుకుని తర్వాత పరిణామాలు ఉద్రిక్తంగా వుంటాయన్న వాతావరణం సృష్టించేందుకు రకరకాల శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కె.చంద్రశేఖరరావు అంతర్యుద్ధాల గురించి ఒకసారి గాంధేయ వాద నిరసన గురించి మరొకసారి చెప్పడం ఈ వైరుధ్య వ్యూహాలలో భాగమే. ఎకనామిక్ టైమ్స్ పత్రికలో శ్రీకృష్ణ కమిటీ ముందున్న అవకాశాల గురించిన ఊహాగానాలతో ఒక కథనం వెలువడితే దానిపై అతి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తెలుగుదేశం తెలంగాణా ప్రాంత నాయకులు కూడా ఢిల్లీలో కమిటీని కలిసి వచ్చారు. దుగ్గల్ ఈ కథనాలను తోసిపుచ్చినా ఇవన్నీ చర్చకు రాకుండా ఎకాఎకిన పరిష్కారం దొరక్కపోవచ్చు. హైదరాబాదు ప్రతిపత్తికి సంబంధించిన అంశాన్ని తరచూ చర్చనీయం చేయడంలో రకరకాల ప్రయోజనాలున్నాయి. జనం కోణం నుంచి చూస్తే కుటుంబ బంధాలు ధనం కోణం నుంచి చూస్తే పెట్టుబడులు ఇందుకు కారణమవుతుంటాయి. అయితే సాధారణంగా చెప్పుకునే ఈ మాటలే రాజకీయ బాధ్యత గల వారు కూడా అదుపు తప్పి మాట్లాడ్డానికి దారి తీయకూడదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంతో సంబంధం లేకుండా హైదరాబాదుపై నిర్ణయం గురించి మాట్లాడ్డం ఉద్వేగాలు పెంచడానికే పనికి వస్తుంది. పాలకులు ఉద్దేశ పూర్వకంగానే ఇలాటి పాక్షిక చర్చలను పెంచుతుంటారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసిన కాంగ్రెస్ నాయకత్వం తన రాజకీయ ప్రయోజనాలను అగత్యాలను బట్టి వ్యవహరిస్తుందనేది నిర్వివాదాంశం. డిసెంబరు 9 ప్రకటనలోనూ తర్వాత పరిణామాలలోనూ స్పష్టంగా తెలుస్తున్న సత్యమిదే. అందువల్ల వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అకారణ ఉద్రేకాలు విద్వేషాలు పెరక్కుండా ప్రతివారూ బాధ్యతగా వ్యవహరించవలసి వుంటుంది. కాని ఆ విధమైన సంయమనమే లోపించడం దురదృష్టకరం.
ఈ వారం హైదరాబాదులో విగ్రహాలకు సంబంధించి నడిచిన వివాదాలు, వికృతాలు ఈ కోణం నుంచి చూస్తే ఆందోళనకరమైనవని చెప్పక తప్పదు. ట్యాంక్‌బండ్‌పై కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న కోర్కెతో మొదలైన ఈ వివాదం అనేక వికృత పరిణామాలకు దారితీసింది. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ ప్రభుత్వం విగ్రహాలు స్థాపించిన నాటి సందర్భం వేరు, ఇప్పటి ఉద్రిక్త పరిస్థితి వేరు. అక్కడ వున్న విగ్రహాలు తప్ప తక్కినవన్నీ అనర్హమైనవని గాని, అవే అర్హమైనవని గాని ఎవరూ అనరు. ఒక ఆలోచనా ధోరణిలో అప్పటి అధినేత వాటిని ఏర్పాటు చేశారు. అక్కడ నెలకొల్పిన విగ్రహాలలో అత్యధికం వివాదాలకు అతీతమైన ప్రముఖులవే. అలాటప్పుడు ఒక శ్రీశ్రీ విగ్రహాన్నో మరొక దాన్నో కూల్చివేస్తామన్న మాటలు వినిపించవలసింది కాదు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం నిరవధిక నిరాహారదీక్షతో పోరాడి ప్రాణాలిచ్చిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడం మరింత దారుణమైన విషయం. దీనికి కారకులెవరైనా ఈ చర్య గర్హనీయమైనది. బేషరతుగా ఖండించవలసింది. నాడు మద్రాసు నుంచి తెలుగు జిల్లాలను విడగొట్టుకుంటున్న రోజున ఉత్తరోత్తరా నిజామాంధ్ర ప్రాంతాలు కూడా కలుస్తాయన్న భావన అందరిలోనూ నిశ్చిత రూపంలో వుంది. అందువల్లనే కర్నూలును తాత్కాలిక రాజధానిగానే పేర్కొన్నారు. నవంబరు ఒకటిని విద్రోహ దినమంటూ అందులో పాలు పంచుకున్న వీర తెలంగాణా పోరాట యోధుల స్మృతిని కళంక పర్చడం ఎలాటిదో పొట్టి శ్రీరాములుకు హైదరాబాదుకు సంబంధం లేదనడం కూడా అలాటిదే. అభిప్రాయమే తప్పయితే దాన్నిబట్టి ఆయన విగ్రహానికి అపచారం చేయడం మరింత ఖండనీయం. ఇలాంటి చర్యలను తెలుగు వారెవరూ హర్షించబోరు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఈ వివాదాలు విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత వుంది.
పొరబాటా.. గ్రహపాటా..?
కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు ఈ వారం మరోసారి రచ్చకెక్కాయి. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన విలేకరుల ప్రశ్నలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి పొరబాటునో గ్రహపాటునో తాను ముఖ్యమంత్రినైనంత మాత్రాన.. అనడం ఆశ్చర్యం కలిగించినా పరిస్థితికి అద్దం పట్టింది. నిజానికి డీఎస్సీ నియామకాలపై ఎడతెగని జాప్యానికి వ్యతిరేకంగా అభ్యర్థులు, యువజన సంఘాలు అనేక విధాల ఆందోళనలు చేసినా న్యాయబద్దమైన నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. రకరకాలైన వత్తిళ్లు వూగిసలాటలు ఇందుకు కారణమైనాయి. ఎట్టకేలకు 70-30 నిష్పత్తిలో నియమకాలు చేస్తామన్న ప్రకటన వెలువడింది. సూక్ష్మ రుణ రాక్షసాలైనా ఉపాధ్యాయ నియామకాలైనా రైతాంగం ధరల సమస్య అయినా ప్రాంతీయ రేఖలతో నిమిత్తం లేకుండా అందరూ పోరాడి పరిష్కరించుకోవలసిందేనన్న సందేశం ఇందులో స్పష్టం. ఈ వాస్తవం అన్ని ప్రజా సమస్యలకూ వర్తిస్తుంది.
కార్పొరేట్ కళా తోరణానికి స్వస్తి!
ప్రపంచీకరణ యుగంలో ప్రజావరణం కుదించుకుపోయి ప్రైవేటీకరణం తారకమంత్రమైంది. దాంతో పాటుగానే విశాల ప్రజారాశుల కళాభిరుచికి ఆసక్తికి గ్రహణం పట్టించే కార్పొరేటీకరణ కాటేస్తున్నది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు లలితా కళా తోరణం పేరు మార్పు ఉదంతం కూడా ఈ తరహాకు చెందిన వైపరీత్యమే. ఎన్‌టిఆర్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నేపథ్యంలో ప్రజలందరికీ అందుబాటులో వుండే బహిరంగ ప్రదర్శనశాలగా ఏర్పరచిన ఈ లలిత కళా తోరణం దాతృత్వం పేరుతో కార్పొరేట్ బాట పట్టడం దారుణమైన విషయం. మొదట రాజీవ్ కళాతోరణం అని పేరు మార్చినట్టు జీవో విడుదల చేశారు. నేటి రాష్ట్ర పరిస్థితులలో తెలుగు అన్న మాటను తొలగించడం ఏమిటన్న ఆగ్రహావేశాలు భగ్గుమన్న మీదట రాజీవ్ పేరుకు తెలుగును కూడా జోడిస్తూ సవరణ విడుదలైంది. ఇది ఎంత కృతకంగా వుందో చెప్పనవసరం లేదు. ఇంతకంటే కూడా తీవ్రమైంది ఆరుబయట ప్రజలందరికీ అందుబాటులో వున్న ఈ రంగస్థలాన్ని సదుపాయాల కల్పన హంగు దర్పాల పేరిట బందీకృతం చేయడం. పైకి ఏమి చెప్పినా దాని ఆడంబరాలతో పాటే దాని అందుబాటు తగ్గి జన బాహుళ్యానికి తలుపులు మూసుకుపోవడం ఖాయం. ఇది ఎంత మాత్రం సహించరాని, అనుమతించరాని విషయం. లక్ష కోట్ల బడ్జెట్ గురించి గొప్పలు చెప్పుకునే రాష్ట్రం లలిత కళాతోరణం మరమ్మత్తులు చేయించుకోలేక దాతలకు ధారాదత్తం చేయవలసిన అవసరం ఏమిటని కళా సాహిత్య సంఘాలు, ప్రతిపక్షాలు మీడియా ఎలుగెత్తిన మీదట ఏడు కోట్లు ఇస్తానంటూ దాతగా ముందుకొచ్చిన సుబ్బరామిరెడ్డి వెనక్కు తగ్గారు. ఇక ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవడం కూడా జరగొచ్చు. ఇది భగ్గుమన్న నిరసన ఫలితమే.
కళంకిత కర్ణాటకంలో న్యాయ పర్వం
కర్ణాటకంలో యెడ్యూరప్ప ప్రభుత్వం బతికిబట్టకట్టడానికి ఈ వారం వచ్చిన బెంగుళూరు హైకోర్టు తీర్పు వూపిరిపోసింది. ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టుగా గవర్నర్‌కు లేఖ రాసిన 11 మంది బిజెపి ఎంఎల్‌ఎలను విశ్వాస తీర్మానంపై ఓటింగుకు ముందే అనర్హులుగా ప్రకటించడం చెల్లుతుందని తీర్పు వెలువడింది. ఫిరాయింపుల నిషేద చట్టం విప్‌ను ధిక్కరించిన సందర్భాల్లోనే గాక వాస్తవంగా పార్టీ వైఖరినుంచి విడగొట్టుకున్నట్టు ధృవీకరించబడిన వెంటనే వర్తిస్తుందని లోగడ కొన్ని తీర్పులున్నాయి. పదవ షెడ్యూలు బి విప్‌కు సంబంధించినదైతే ఈ తరహా సమస్యలకు వర్తిస్తుందని కొందరు నిపుణులు చెప్పిన దాన్ని హైకోర్టు తీర్పు ధృవీకరించింది. మొదట కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవడం వల్ల మూడో న్యాయమూర్తి కేసును విని ఈ తీర్పును ఖరారు చేశారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు సంబంధిత పక్షాలు ప్రకటించాయి. అయినా ప్రస్తుతానికి యెడ్యూరప్ప సర్కారుకు ఢోకా వుండకపోవచ్చు. అయితే ఈ తీర్పుతోనే ఆయన ప్రభుత్వ నిర్వాకాలు నీతిబాహ్య వ్యవహారాలు మాయమై పోవని కూడా గుర్తుంచుకోవాలి. విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యులను ప్రలోభాలతో తిప్పుకుని రాజీనామాలు చేయించే తతంగం జోరుగా సాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.
మరో మహా సిఎంకు గ్రహణం?f
మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు రకరకాల కుంభకోణాలతో ఇంటి దారి పట్టడం గతంలో అనేక సార్లు చూశాం. సిమెంటు కుంభకోణంలో అంతూలే, స్థలాల వ్యవహారంలో పవార్, సీట్ల కుంభకోణంలో సుధాకర రావు నాయక్, కోన ప్రభాకర రావు ఇలా అనేక ఉదంతాలు జరిగాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చవాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయేలా వున్నారు.ముంబాయిలోనే ఖరీదైన కొలాబా ప్రాంతంలో కార్గిల్ వీరుల కుటుంబాల కోసం కట్టిన ఫ్లాట్లు అత్తగారితో సహా బంధుజనానికి కట్టబెట్టాడన్న ఆరోపణ ఆయనను కుదిపేస్తున్నది. దీనిపై సుదీర్ఘ సమర్థన ఇచ్చినా ఫ్లాట్ల కేటాయింపు నిజమే గనక తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు. అనివార్యంగా ఆయనను తప్పిస్తారేమో చూడాల్సి వుంది. ఈ లోగానే జి2 స్పెక్ట్రం కుంభకోణంలో ఆరోపణలకు గురైన కేంద్రమంత్రి రాజాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించడం కూడా యుపిఎను ఇరకాటంలో పెడుతున్నది. కామన్వెల్త్ కుంభకోణాలకు కొనసాగింపులాంటి ఈ అవినీతి అధికార కూటమికి అశనిపాతాలవుతున్నాయి.
No comments:
Post a Comment