Pages

Sunday, December 30, 2012

కార్యాచరణే కాలమానం





కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం
కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక
కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు
కాలం ఒక చిత్రం
కాలం ఒక సూత్రం
కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం సరిపోవాలి గాని చెప్పుకుంటూ పోతే కాలం గురించి ఇలా ఎన్నయినా పరస్పర విరుద్ధ విషయాలు ఏకరువు పెట్టొచ్చు.
కాలం గురించి ఆలోచనా పరులంతా ఏదో చెబుతూనే వచ్చారు. కవులు కావ్యాలు వెలువరించారు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. చేస్తున్నారు. కాలంతో పరుగు తీయాలని మానవులు కలలు కంటూనే వున్నారు. కాలాన్ని జయించేశామనుకునే లోపలే మళ్లీ అది కవ్విస్తూ సవాలు చేస్తూనే వుంది.
ఇన్ని తమాషాలకు కారణం ఒక్కటే- కాలం దానికదే ఏమీ కాదు. కాలమానం ఒక కొలమానం మాత్రమే.
అబ్బిన జ్ఞానాన్ని బట్టి అధ్యయానికి విలువు. వచ్చిన మార్కులను బట్టి రాసిన పరీక్షకు విలువ. వచ్చిన లాభాన్ని బట్టి వ్యాపారానికి విలువ. దిగుబడిని బట్టి సేద్యానికి విలువ.గుణాన్ని బట్టి వైద్యానికి విలువ. రుచిని బట్టి వంటకు విలువ. అలాగే కాలాన్ని విలువ కట్టాలంటే కార్యాచరణతోనే సాధ్యం. కాలాన్ని కొలవడానికి ఏకైక సాధనం కార్యాచరణే. ఎంత సమయంలో ఎంత పని జరిగింది లేదా జరగలేదు అన్నదాన్ని బట్టే కాలానికి విలువ అన్నది మొదటిసూత్రం.
ఎవరు ఏ రంగంలోనైనా వుండొచ్చు. పైన చెప్పుకున్న పనుల్లో ఏది చేసేవారైనా కావచ్చు. సాపేక్షంగా ఎంత సమయంలో ఎంత ఫలితం సాధించారనేదాన్ని బట్టి - లేక ఎంతో సమయంలోనైనా ఏం సాధించారనే దాన్ని బట్టి విలువ కట్టాల్సివుంటుంది.
నీటికి విలువ వుండేది కాదు- ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుని వాడుకోవడం మొదలెట్టాకే బొట్టుబొట్టు లెక్క కట్టడం జరుగుతున్నది. అలాగే జీవరాశులే లేనప్పుడు కాలం గురించిన ఆలోచనే వుండి వుండదు. జంతు జాలమైనా వచ్చాకే వాటి అలవాట్లకు ప్రాకృతిక పరిణామాలకు అనుసంధానం అవసరమైంది. తెలియకుండానే అనుసరించడం మొదలెట్టాయి.మనిషి కూడా మొదటి దశలో ఎన్ని వేల సంవత్సరాలు అనాగరికంగా జంతు సదృశంగా బతికాడో మనకు తెలియదు.ఆ దశలోనూ కాలానికి విలువ గాని లెక్క గాని వుండి వుండదు.మేధా వికాసం జరిగాకే పరిసరాలను అధ్యయనం చేసి విజ్ఞానశాస్త్రం పెంపొందింది. అప్పుడే కాలాన్ని లెక్కగట్టడం మొదలైంది.ఒకసారి మొదలైన తర్వాత వెనకటి కాలాన్ని కూడా గణించే పద్ధతులన్నీ తెలిశాయి. అలా చూసినప్పుడు ఎన్ని సహస్రాబ్దులు అలా స్తబ్దుగా గడిచిపోయాయి? మరి ఇప్పుడో..!
2000 సంవత్సరం నూతన సహస్రాబ్ది వచ్చిందని హడావుడి చేసి అప్పుడే పుష్కర కాలం గడిచిపోయింది. ఆ రోజున అదే పనిగా కేరింతలు కొట్టిన వారు చిందులేసిన వాళ్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవద్దూ.. పన్నెండేళ్లలో సాధించేందేమిటి? అని. అప్పటితో పోలిస్తే ఇప్పుడెక్కడున్నాం?కొత్తగా ఏం నేర్చుకున్నాం? ఏం మార్చుకున్నాం? పుష్కర కాలం పురస్కరించుకుని పరిశీలించుకోవచ్చు.అంత ఓపిక లేకుంటే
కనీసం 2012 నైనా తిరగేసి చూసుకోవచ్చు.
ఈ ఏడాది మొదట్లో ఏమైనా అనుకున్నామా? అనుకున్నట్లుగా వ్యవహరించామా?అసలేమీ అనుకోకపోతే తర్వాత నైనా అనుకోవాలని అనిపించిందా? ఆ ఆలోచనల మంచి చెడ్డలేమిటి? వాటి సాధనలో అనుభవాలేమిటి? ఏది మనకు ఎక్కువ ఫలితం ఇచ్చింది?
అసలు ఏడాది మొదట్లో ఏమైనా లక్ష్యాలు నిర్దేశించుకున్నామా? వాటిలో దీర్ఘకాలికమైనవేవీ? స్వల్పకాలికమైనవేవి? తక్షణం చేయాలనుకున్నవేవి? చివరి తరహాలోవి చేసేశామా?స్వల్పకాలికమైనవి పూర్తికావచ్చినట్టేనా? దీర్ఘకాలిక లక్ష్యాలకు బాటవేసుకున్నామా? అంతా మన స్వంతమే కాకుండా కుటుంబానికి ఇతరులకు సంబందించి సమాజానికి సంస్థలకు సంబంధించి కాస్తయినా దోహదం చేయగలిగామా?
చేస్తే ఓకె.కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవచ్చు. చేయలేదంటే కారణాలు వెతుక్కోవచ్చు. అవి సహేతుకమా లేక అహేతుక సమర్థనలేనా? అదే అయితే వాటినే మళ్లీ నిర్ణయించుకుని మళ్లీ సంవత్సరాంతంలో సమర్థించుకుంటే సార్థకత ఏముంటుంది? అవాస్తవమైనవైతే మార్చుకోవడం నయం కదా? అంత తులనాత్మక పరిశీలన తలనొప్పి ఎందుకులే అని మళ్లీ అవే లక్ష్యాలు రాసుకుని అదే తరహాలో గానుగెద్దుల్లా పరిభ్రమిస్తూ గడిపేద్దామా? ఇవన్నీ వేసుకోవలసిన ప్రశ్నలు. సమాధానం తెలసుకోవలసిన ప్రశ్నలు. కాలానికి కొలమానం వంటి నూతన సంవత్సరాగమన వేళ పరిశీలించుకోవలసిన ప్రశ్నలు.
ఇళ్లు కాస్త శుభ్రంగా పెట్టుకోవడం అనే లక్ష్యం చాలా చిన్నది. కాని ఆచరణలో అన్నిటికన్నా కష్టమైనది. కాస్త సమయం మిగుల్చుకుని సత్కాలక్షేపం చేయడం అనే లక్ష్యం చాలా చిన్నదే.కాని దాన్ని అమలు చేయడం గగనమవుతుంది. ఎందుకంటే అంతులేనంత సమయం వ్యర్థమై పోతుంటుంది. ఆ వ్యర్థ కాలాన్ని గుర్తించడానికి కూడా వ్యవధి చిక్కనంతగా కూరుకుపోయి వున్నామన్నమాట.
పనులు రెండు రకాలని నిపుణులు అంటారు. తక్షణ పనులు, ముఖ్యమైన పనులు. తక్షణ పనులు ఎప్పుడూ వస్తుంటాయి.అవి మన ప్రమేయం లేకుండా వస్తుంటాయి. ముఖ్యమైనవి ఎలాగూ ఎప్పుడూ ముందుంటాయి. వాటిని ముందుగా చేసుకుంటే అప్పుడు తక్షణం తోసుకొచ్చేవాటిపై పనిచేయడానికి అవకాశం వుంటుంది. అలాగాక తక్షణం వాటిలో తలమనకలవుతూ సంతృప్తి పడుతూ వుంటే ముఖ్యమైనవి సావధానంగా చేసేబదులు తక్షణ జాబితాలోకి వచ్చేస్తుంటాయి.తక్షణ జాబితా అనగానే హడావుడి కంగాళీ ఏదో విధంగా చేశామనిపించుకోవడం అన్నీ షరామామూలే. పైగా ఎప్పుడో చేయాల్సిన ముఖ్యమైన పని ఇప్పుడు చేస్తూ కూచుంటే ఇప్పుడు చేయాల్సిన తక్షణ పనికి నష్టం.రెండు విధాల నష్టమే తప్ప ప్రయోజనం శూన్యం. కననకే ముఖ్యమైనవి ఎప్పుడూ తక్షణమే. తక్షణమైనవి ఆ క్షణంలో ముఖ్యమే. ఈ విచక్షణే వుంటే ఏ పనికి జరగాల్సిన న్యాయం దానికి జరుగుతుంది. పనుల ముందు వెనక ప్రాధాన్యతలు వుండేది మన చేతులోనే గనక ప్రశాంతంగా చేసుకుంటూ పోతే గరిష్ట ప్రమాణాన్ని అందుకునే అవకాశం వుంటుంది. లేకపోతే రెండందలా అరకొరగా సరిపెట్టుకోవడం అనివార్యమవుతుంది. అంటే ఇక్కడ పని గురించి ప్రాధాన్యత ప్రాథమ్యాలు గురించి స్పష్టమైన అవగాహన వుండాలి.కాలాన్ని గురించిన మెళకువ వుండాలి.రెంటినీ సరిగ్గా జోడించగల నైపుణ్యం వుండాలి. సమయం లేదు లేదు అనేవాళ్లు వాస్తవంలో సగం సమన్వయం లేదు అని చెప్పుకోవాలి. ప్రణాళికా లోపంగా గుర్తించాలి. నిరంతరం పనిచేసేవారి నోట సమయం లేదు అన్న మాట రాదు.పరిమితంగా చేస్తూ ఆపసోపాలు పడేవారే ప్రతిదానికి గడియారం చూసుకుంటుంటారు. ప్రణాళికా బద్దంగా చేస్తే దేని సమయం దానికి వుంటుంది. కాకపోతే ఆ మేరకు మిగులు తేలుతుంది.కాలం అంటే ఖర్చులేనిది గనక లెక్కే లేనట్టు వ్యవహరిస్తే చివరకు చేసేది తక్కువ చెప్పుకోవడం ఎక్కువ చందం అవుతుంది.
ఇదిగో ఇలా మనను మనం తేరిపార చూసుకోవడానికి గతాన్ని వీక్షించడానికి భవిష్యద్దర్శనం చేయడానికి బంగారు సందర్భం నూతన సంవత్సరం.గత ఏడాది ప్రయాణం ఎలా వుంది? విజయాలు వైఫల్యాలేమిటి?బాగా తృప్తినిచ్చిన అంశాలేమిటి?అసంతృప్తి వెన్నాడిన విషయాలేమిటి? వాటికి కారణాలేమిటి? ఏ వైఫల్యాలు ఎక్కువ నష్టం కలిగించాయి? ఏ పనులు అత్యధిక ప్రయోజనం తెచ్చిపెట్టాయి? మామూలుగా ప్రభుత్వాలు సంస్థలు వార్షిక నివేదికలు ఇస్తుంటాయి.ఉద్యోగుల పనిపైనా అంచనాలు నడుస్తుంటాయి.కాని వ్యక్తుల పరంగా వారే తీర్పరులు. తమలో తాము తమతో తాము చెప్పుకున్న లక్ష్యాలైనా పరిశీలించుకోగలిగింది వారు మాత్రమే. ఆంతరంగిక వ్యవహారమే గనక వీలైనంత నిక్కచ్చిగా వుండే అవకాశమూ వుంటుంది.
నూతన సహస్రాబ్ది మొదటి పుష్కరం ముగుస్తున్న తరుణంలో అలాటి సవిమర్శక సమీక్ష చేసుకుంటే వర్తమాన దర్శనం, భవిష్యత్‌ వీక్షణం కూడా సాధ్యమవుతుంది. బలమైన సంకల్పం ప్రణాళికా బద్దమైన కృషి వున్నప్పుడు ఫలితం కూడా వుండనే వుంటుంది. మనతో పాటు మన సహచరులు సన్నిహితుల సహాయమూ లభిస్తుంది.ఎందుకంటే మనమూ వారి గురించి ఆలోచిస్తాము గనక. అందరం కలసి అడుగేస్తాము గనక.
రష్యన్‌ కవి మయకోవస్కీ అన్న మాటలు మానవాళికి ఎప్పుడూ హెచ్చరికలే.
వారానికేడు రోజులు మనకి
రోజుకిరవై నాలుగ్గంటలు
వాడుకో మానుకో
అంతే జీవితం...
ఆ జీవిత గమనంలో సంవత్సరాలు మైలు రాళ్లలా నిలిచిపోవాలంటే చేయదల్చుకున్న ప్రయాణం గురించిన స్పష్టత వుండాలి. మిగిలింది అలసిపోకుండా కొనసాగించే స్థయిర్యం వుండాలి.చేయలేకపోయినవి గుర్తించి సరిదిద్దుకునే సాహసం వాస్తవికత కూడా వుండాలి.
అవే వున్నాయనుకుంటే 2013 ఖచ్చితంగా హ్యాపీ న్యూఇయర్‌


No comments:

Post a Comment