Pages

Friday, March 1, 2013

బడ్జెట్‌ బండారం



అనితర సాధ్యంగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం చిదంబరానికి ఎందుకు వచ్చిందో యుపిఎ 2 తరపున ఆయన సమర్పించిన ఆఖరి బడ్జెట్‌ తేటతెల్లం చేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితిపై తానే ఇచ్చిన సర్వేలో పేర్కొన్న సమస్యలు వేటికీ పరిష్కారాలు చూపకపోగా మరింత జటిలం చేసే ఝంఝాటమే ప్రదర్శించారు. నిన్న మా సంపాదకీయంలో చెప్పినట్టు ఆ సర్వే బడ్జెట్‌కు ఉపోద్ఘాతం అనుకుంటే అందులో ఇచ్చిన దుస్సలహాల హాలాహలమే చిదంబర బడ్జెట్‌ సారాంశం. ఈడిగిల బడిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే ఏ ఒక్క నిర్దిష్ట చర్యనైనా ప్రతిపాదించింది లేకపోగా సామాన్య జన వ్యతిరేకమైన వాటిని మాత్రం మహౌత్సాహంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి. సబ్సిడీల స్తంభన,కోత వాటిలో భాగమే. కంటితుడుపుగా కాస్త పెంపు చూపిించినా పెరిగిన ధరలతో పోలిస్తే అవి అక్కరకు వచ్చేవి కావు. అమెరికా తదితర దేశాలలో విరుచుకు పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయిటపడ్డామని గొప్పలు పోయిన ఆర్తిక మంత్రి అందుకు రక్షగా నిలిచిన బ్యాంకులు బీమా సంస్థలపైనే వేటు వేసేందుకు సిద్దం కావడం ఒక విడ్డూరం. అవినీతి భాగోతాలకు ఆలవాలమైన బొగ్గు చమురు సహజవాయు రంగాల్లోనే ప్రభుత్వ సంస్థలు నేరుగా ప్రైవేటుతో కలవొచ్చని ప్రతిపాదించడం బంగారు బాతులను అప్పజెప్పడమే. వ్యవసాయం నాలుగు శాతం కూడా అభివృద్ధి సాధించలేని స్తితిలో
వుందంటూనే అందులోకి కార్పొరేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెగబడ్డం కూడా యాదృచ్చికం కాదు. పారిశ్రామికాభివృద్ధి ఉత్పత్తి రంగం వెనకపట్టు పట్టిన పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా ఇదమిద్దమైన ప్రతిపాదనలు నాస్తి.
ఎన్నికల ముందు ఇదే కడపటి బడ్జెట్‌ గనక ఏవో సంక్షేమ పథకాలు ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారంటూ వినవచ్చిన అంచనాలు కూడా చిదంబరం పటాపంచలు చేశారు.కడపటి ఏడాది కార్పొరేట్‌ ప్రభువులనూ వారి రేటింగు సంస్థలనూ మెప్పించాలన్న తాపత్రయమే బడ్జెట్‌ను ప్రభావితం చేసింది. ఆహార అభద్రత గురించి ఆర్థిక సర్వేలో అదేపనిగా ఆందోళన వెలిబుచ్చినా అన్నార్తులను ఆదుకునే వూసే లేకుండా పోయింది. ఉద్యోగాలు తగ్గిపోవడంలో ఉపద్రవాన్ని ఏకరువు పెట్టినా ఆ దిశలోనూ నిర్దిష్ట పథకం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఉపాధికి ప్రధానాధారాలైన వ్యవసాయం చిన్న పరిశ్రమలు,గ్రామీణాభివృద్ధి వంటివన్నీ గాలికొదిలేశారు. వ్యవసాయం, ఉపాధిహామీ,ఎరువుల సబ్సిడీ, మధ్యాహ్న భోజనం వంటి వాటికి ఏవో కేటాయింపులు పెంచి చూపించినా ధరల పెరుగుదలతోనూ అవసరాలతోనూ పోలిస్తే అవి తగ్గినట్టు భావించాల్సి వస్తుంది. విద్య వైద్య రంగాల కేటాయింపులు కూడా గత బడ్జెట్‌లో శాతంతో పోలిస్తే దిగజారాయి. పెట్రోలియం సబ్సిడీ కూడా గత బడ్జెట్‌ అంచనాతో పోలిస్తే దాదాపు 30 వేల కోట్లు తగ్గింది. ఇక ఎస్‌సి ఎస్‌టి మైనార్టి వంటి అలక్షిత వర్గాల అవసరాలపై అసలే ధ్యాస లేదు. ధరల తగ్గించకపోగా పెంచేందుకు ప్రాధాన్యత కల్పించింది. అందుకే అన్ని విధాల ఇది ప్రజలకు శూన్యహస్తమే చూపించడమే గాక మరింత అనర్థక దిశలో నడిచింది. మధ్య తరగతికి సంబంధించి తొలి గృహ రుణాలపై వడ్డీ మాఫీ వంటివి కూడా కంటితుడుపు తతంగాలే తప్ప గణనీయమైనవి కావు.
ద్రవ్య విధానం విషయానికి వస్తే ద్రవ్యలోటుపై అమితాందోళన ప్రదర్శించినా దాన్ని కట్టడి చేసేందుకు ఏం చర్యలు ప్రతిపాదించినట్టు? ఆర్థిక మంత్రి తనకు కరెంటు ఖాతా లోటు మరింత ఆందోళనగా వుందన్నారు గాని అందుకు కారణం తామేనన్న వాస్తవాన్ని దాటేశారు.కార్పొరేట్లకు వివిధ రూపాల్లో ఇచ్చిన రాయితీల వల్ల కలిగిన ఈ ఆదాయ నష్టాన్ని ప్రజలపై తోసే ప్రయత్నం దారుణమైంది. స్కామ్‌ ఆద్మీకి వరాలు ఆమ్‌ ఆద్మీకి భారాలు అన్నట్టుగా సాగే ఈ వ్యవహారాన్ని చిదంబరం నిస్సిగ్గుగా కొనసాగించారు గనకే ఇది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అవుతున్నది. వినిమయంపై ఎనిమిది శాతం చొప్పున పెరిగిన వ్యయం ఇప్పుడు అందులో సగానికి నాలుగు శాతానికి పడిపోయిందన్న ఆర్థిక మంత్రి అయినా ద్రవ్యోల్బణం ఎందుకు అనూహ్యస్తాయికి చేరిందో వివరించింది లేదు.పైగా వినియోగాన్ని కుదించే చర్యలు తీసుకోవాలని తిరోగామి పాఠాలు చెప్పారు. ఇప్పటికే దేశ ప్రజల్లో దాదాపు సగం మందికి పౌష్టికాహారం లేదని తెలిసినా ఘనత వహించిన విత్తమంత్రి అలా అంటున్నారంటే ప్రజలంటే ఎంత చులకనో తెలుస్తుంది. అంతేగాక ఆర్థిక సంవత్సరం ఆఖరులో ఖర్చులు బిగబట్టి ఇప్పుడు భవిష్యత్తు వసూళ్లపై అతిశయోక్తి అంచనాలు చూపించి లోటును 4.8 శాతంగా చూపిన చిదంబరం ఆర్థిక వేత్తలనూ బురిడీ కొట్టించజూడటం దుస్సాహసం.
చైనా ఇండోనేషియా మాత్రమే మనకన్నా అధికంగా అభివృద్ధి వేగం సాధిస్తున్నాయని చెప్పిన చిదంబరం అలాటి దేశంలో ప్రభుత్వ వ్యయం పెరక్కుండా కోతకోయాలని ప్రతిపాదించడం తలకిందులు తర్కం. అభివృద్ధి చెందే దేశంలో రుణాలు వ్యయాలు కూడా పెరగొచ్చు గాని వాటివల్ల ఉత్పాదకత ఉపాధి కల్పిస్తున్నామా అన్నదే కొలబద్ద. అందుకు భిన్నంగా ప్రకృతి వనరులను దేశ విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టి విస్తారమైన మానవ వనరులను అందులోనూ అపార శక్తిగా వున్న యువ భారతం భవితను నిరాశామయం చేసేందుకు ఈ బడ్జెట్‌ దారితీస్తుంది. ప్రజలపై నేరుగా భారాలు పెంచడమే గాక పరోక్షంగానూ బతుకులు భారం చేస్తుంది. అందుకే ఇది అన్ని విధాల ప్రజా వ్యతిరేక బడ్జెట్‌. ఇది యుపిఎను గట్టెక్కించదు సరికదా పుట్టి ముంచడం తథ్యం. దీనిపై నిరసన పెల్లుబుకడమూ అనివార్యం.

No comments:

Post a Comment