వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాద్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు స్వాతంత్రం పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్ విచ్చిన్నానంతరం ప్రజాచైతన్యం ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస నేనాని. సమర్థ పాలకుడు.
చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం.. ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం,, ప్రపంచ కార్పొరేటింగ్ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం.. అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను ఆఘమేఘాల మీద అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు... మన కన్నా చాలా చిన్నదైన దేశపాలకుడు..... అమెరికాకు అతి సమీపస్తుడు..... నిన్నమొన్నటిదాకా అంకుల్ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన మెలిగిన చరిత్రకు వారసుడు... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా తీవ్రంగా ప్రజానుకూల విధానాలు అమలు చేసిన
పరిపాలకుడు చావేజ్. సిద్ధాంత పరిభాషలో కమ్యూనిస్టు కాకపోయినా కామ్రేడ్లకు ప్రపంచమంతటా కొత్త వూపిరి పోసిన సహచరుడు ఛావేజ్.ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడెల్ కాస్ట్రో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు చావేజ్.
..ప్రపంచీకరణ యుగంలో ప్రైవేటుకు ప్రజలను బలి చేయడం తప్ప గత్యంతరం లేదన్న వాదనలకు ప్రత్యక్ష సమాధానం చావేజ్. చమురు సంపన్నమైన వెనిజులా బడా సంస్థల కల్పవృక్షంలా వుండే స్థితిని చావేజ్ మార్చేశాడు. ఆ ఆదాయాన్ని ప్రజా సంక్షేమం వైపు మరల్చాడు. వాటిని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశాడు. విస్త్రత స్థాయిలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూమిని పంచాడు.ప్రతిచోటా ఉద్యోగ భద్రత పోతుంటే వెనిజులాలో పనిగంటలు వారానికి 44 నుంచి 40కి తగ్గించడమే గాక ఇంకా అనేక సరికొత్త హక్కులు కల్పించాడు. 1999-2010 మధ్య వెనిజులాలా దారిద్య్రం 21 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి కమీషన్ అభినందనలు పొందాడు. నిరక్షరాస్యత నిర్మూలించి ఉచిత ఆరోగ్య వసతి కూడా కల్పించేందుకు చర్యలు మొదలెట్టాడు. తాను సైనిక నేపథ్యం నుంచి వచ్చినా, అమెరికా వత్తాసుతో నడిచే సైనిక కుట్రలకు తావులేకుండా ప్రజాస్వామ్యాన్ని విస్తరించాడు. అందుకే 1998లో మొదటి సారి ఎన్నికైన చావేజ్‌ను 2002లో కూలదోయడానికి సైన్యం ద్వారా కుట్ర జరిగితే వమ్ము చేసి దమ్ము చూపించాడు.తర్వాత దాదాపు ఏడెనిమిది సార్లు రెఫరెండంలు, రకరకాల ఎ న్నికలు, రాజ్యాంగ రూపకల్పన, ఇలా ఏదో ఒక రూపంలో ప్రజల ఆమోదం పొందుతూ జైత్రయాత్ర సాగిస్తున్నాడు.
క్యూబాను దుర్మార్గ దిగ్బంధం చేయజూసే అమెరికా ఆంక్షలను తోసిపుచ్చి అగ్రజుడు కాస్ట్రోను ఆనుజుడుగా ఆదుకున్నాడు.భారత దేశంతో సహా అన్నిచోట్లా అభ్యుదయశక్తులకు తోడైనాడు. సద్దాం హుస్సేన్‌ను కలుసుకుని సంఘీభావం చెప్పివచ్చాడు. చైనాతో చెలిమి చేశాడు. తనకు నచ్చని నాజర్,కాస్ట్రో, అరాఫత్,సద్దాం,వంటివారందరిపైనా దాడిచేసినట్టే చావేజ్‌పైనా అమెరికా మీడియా సహాయంతో విష ప్రచారం సాగించింది. ఈ సారి ఆయన ఓడిపోవడం ఖాయమనీ, కొద్ది పాటి తేడాతో నెగ్గినా చేయగలిగింది వుండదనీ శాసనార్తాలు పెట్టింది.ఒక్కసారిగా అమెరికా పత్రికలు చానెళ్లు చావేజ్‌పై చేయని దుఫ్చ్రచారం లేదు. ఆయనను ఓడించేందుకు వెనిజులా పెట్టుబడిదారులు, చమురు మాఫియాలు, అమెరికా హంగు దారులు ప్రతీఘాతప్రతిపక్షాలు అందరూ కలసి 30 పార్టీల కూటమిగా ఏర్పడి కాప్రిల్ అనే మితవాదిని నిలబెట్టి ఓడించాలని విఫలయత్నం చేశాయి. ఇన్నిటినీ తట్టుకుని అశేష జనాదరణతో అఖండ విజయం సాధించిన చావేజ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా లేకుండా ప్రాణాంతక కాన్సర్‌తో పెనుగులాడాల్సి వచ్చింది. అందుకోసం క్యూబాలో చికిత్స కాస్ట్రోతో సాన్నిహిత్యం ఆయనను ఆఖరి వరకూ సజీవ స్పూర్తిగా నిలిపాయి. అయినా చివరకు ఆ వ్యాధి ఆయన ప్రాణాలు బలిగొనకుండా వదల్లేదు.
చావేజ్ చారిత్రిక పాత్రకు స్పష్టమైన భూమిక వుంది. సామ్రాజ్యవాద, నయాఉదారవాద ఎదురుదాడికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజావెల్లువ ఫలితంగానే వెనిజులాతో సహా అనేక లాటిన్ అమెరికా దేశాలలో ప్రజాప్రభ'ుత్వాలు ఆవిర్భవించాయి. దీన్నే 'పింక్ వెల్లువ- వామపక్షంవైపుకు మలుపు' అని పిలుస్తున్నారు. వీటి మనుగడ గొప్ప సానుకూల పరిణామం.ఈ పరిణామ క్రమానికి స్పూర్తిగా నిలిచిన హ్యూగో చావేజ్ కన్నుమూయడంతో ఈ క్రమాన్ని అడ్డుకోవడానికి సామ్రాజ్యవాద శక్తులు నిస్సందేహంగా కుట్రలు తీవ్రం చేస్తారు. ఇప్పటికే ఆ కుటిల పన్నాగాలు మొదలైనట్టు కనిపిస్తుంది. విప్లవం ఏ ఒక్కడిపైనో ఆధారపడి వుండదని చావేజ్ స్వయంగా చెప్పిన మాట.కనక చావేజ్‌కు అశ్రుతర్పణ చేస్తూనే ఆయన ఆఖరి వరకూ అడ్డుకున్న ఆధిపత్య శక్తుల ఆటకట్టించడం ఇప్పుడు అవశ్య కర్తవ్యం. ఆయనక అసలైన నివాళి కూడా అదే.
శాల్యూట్ టు కామ్రెడ్ చావెజ్ !
ReplyDeleteThanks for the detailed details...
ReplyDelete