Pages

Thursday, March 28, 2013

వికసించిన విద్యుత్తేజంప్రభుత్వాలకు పోలీసులుంటారు. ఉసిగొలిపితే చాలు విరుచుకుపడి విరగ్గొడతారు. నిజమే. ఆ బలం చూసుకుని జులం చూపి విర్రవీగిన విరగబడిన వారందరూ ప్రజల ముందు శృంగభంగం పాలయ్యారన్నది అంతకన్నా పెద్ద నిజం.కాని అధికారబలంలో అహంకరించే వారికి, అప్రజాస్వామికంగా హుంకరించేవారికి చరిత్ర చెప్పిన ఈ పాఠాలు చెవికెక్కవు. నిరంతర గుణపాఠాలు తలకెక్కవు. చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది. బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అంటారు. తప్పదు. వికసించిన విద్యుత్తేజం ఎంతటి విస్పోటనమై విజృంభిస్తుందో బషీర్‌బాగ్‌ ఆ నాడు చెప్పింది. నాలుగు రోజులుగా వామపక్ష నేతలు సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షలో పెల్లుబికిన ప్రజాభిమానమూ చాటించింది. అయినా ఆ గ్రహింపు లేని పాలకులు ఆగ్రహం తప్ప అవగాహన కనీసంగా ప్రదర్శించలేకపోయారు. ఖాకీలను ప్రయోగించడం తప్ప కాస్త విజ్ఞతతో స్పందించేందుకు నిరాకరించారు.
నిరాహారదీక్షలు ఎక్కువ రోజులు సాగి ఉద్రిక్తంగా మారితే, దీక్షలో కూచున్న వారి ఆరోగ్యం మరీ క్షీణిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకోవడం అస్పత్రిలో చేర్పించడం కొత్త కాదు. కాని దానికి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియవుంటుంది. ప్రభుత్వం సానుకూలంగా ప్రస్తావనలు చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి వంటి వారు సాధికారికంగా ప్రకటన చేసి ప్రతినిధులను పంపిస్తారు. మధ్యవర్తులైన పెద్దమనుషులతో సంప్రదింపులు జరుపుతారు. సగౌరవంగా ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పాలక పక్షం
హయాంలోనూ అలా జరిగిన ఉదాహరణలున్నాయి. కాని ఇప్పుడు జరిగింది అందుకు పూర్తి భిన్నం. ఏకపక్ష అధికార ప్రదర్శనం. నిరంకుశత్వానికి నిదర్శనం.ఎందుకంటే మహాత్మాగాంధీ నుంచి సామాన్యుల వరకూ ఈ దేశంలో నిరాహారదీక్ష చేయడం అత్యంత ప్రజాస్వామిక మైన ప్రాథమిక నిరసన రూపం. దాన్ని కూడా తట్టుకోలేకపోవడం అసహనానికి పరాకాష్ట.
విద్యుచ్చక్తి సంక్షోభంపైనా మరీ ముఖ్యంగా ప్రజల మాడు పగలగొడుతున్న ముప్పై రెండు వేల కోట్ల భారాల పైనా వామపక్షాలు పదే పదే ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేశాయి. విచారణల్లో నిరసన తెలిపాయి. సవివరమైన సమగ్ర సూచనలు అందజేశాయి. వీటిపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రధాన ప్రతిపక్షంతో సహా వివిధ పార్టీలు ఈ పోరాటంలో కలసి రావాలని కోరాయి. అలా ముందుకు రావడంలో తటపటాయింపులను తర్జనభర్జనలను విమర్శించాయి. మిగిలిన ఇతర సమస్యల కన్నా పాక్షిక దీర్ఘకాలిక అజెండాల కన్నా ప్రజల మెడమీద కత్తిలా వేళ్లాడుతున్న కరెంటు రేట్లపై పోరాటం తక్షణావసరమని నొక్కి చెప్పాయి. చివరకు ఏడుగురు వామపక్ష నేతలు 23 వ తేదీన నిరవధిక నిరాహారదీక్ష చేపట్టవలసి వచ్చింది.గతంలోనూ భూ సమస్యపై రాఘవులు నారాయణ తదితరులు ఇలాగే నిరాహారదీక్షలు చేశారు. ఎస్‌సిఎస్‌టి సబ్‌ప్లాన్‌పైనా నిరశన చేపట్టారు. అవి చాలా సత్పలితాలిచ్చాయి. ప్రజల్లో కదలిక తెచ్చాయి.ఇప్పుడు విద్యుత్‌ దీక్ష కు అంతకన్నా ఎక్కువ గానే స్పందన రావడం పాలకులను బెంబేలెత్తించింది. దీక్ష మొదలు కాకముందే ఉద్యమాలు చాలా చూశామని ముఖ్యమంత్రి చులకనగా మాట్లాడారు. దీక్షలు మొదలై సంఘీభావం పెరుగుతున్నకొద్దీ ఈ అసహనం మరింత తీవ్రమై చివరకు బలప్రయోగంతో ముగిసింది. శాసనసభ వాయిదా పడిన అదను చూసుకుని పోలీసులు విరుచుకుపడటం వూహించలేని విషయం కాదు.
ఒక పోరాటాన్ని అడ్డుకున్నంత మాత్రాన సంగ్రామం నిలిచిపోదు.నిరాహారదీక్షను బలవంతంగా భగం చేసినంత మాత్రాన నిరసనాగ్ని చల్లారదు. ఈ నాలుగు రోజుల్లోనూ వామపక్ష నేతల నిరసన ప్రభావం దావానలంలా రాష్ట్రమంతటా ప్రసరించింది. పరస్పరం పొడగిట్టని పార్టీల నేతలంతా ఏకోన్ముఖంగా మద్దతు ప్రకటించారు. మరింత క్రియాశీలంగా ముందుకు రావాలన్న ప్రజల ఆకాంక్షకు వత్తిడికి తమ తమ పద్ధతుల్లో స్పందిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ వామపక్షాలు ఇచ్చే ఏ కార్యచరణకైనా సిద్ధమని ప్రకటించింది. తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీలు విడివిడిగా ఆందోళనలు చేపట్టాయి. వీటిపట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందీ ముందు ముందు చూడాలి. ఏమైనా పాక్షిక వ్యక్తిగత సంకుచిత అజెండాలతో చిన్నాభిన్నమైన రాష్ట్ర రాజకీయ గమనాన్ని సరైన దిశకు మరల్చడంలో వామపక్షాల కార్యాచరణ సత్ఫలితాలిచ్చింది. నాయకుల నిరాహారదీక్షలు అందరినీ కదిలించి కదం తొక్కించాయి. ఇంత విస్తార స్పందన తెచ్చిన ఆందోళన గాని, ఇంత సమైక్య సంఘీభావం వ్యక్తమైన సందర్భం గాని ఇటీవలి కాలంలో లేవనే చెప్పాలి. బహుశా ఏప్రిల్‌ 9న జరిగే రాష్ట్రబంద్‌ రాజకీయ దృశ్యాన్ని మరింతగా మార్చేయవచ్చు.


No comments:

Post a Comment