Pages

Thursday, March 28, 2013

ములాయం ముసలం




రోజుకో సంచలన వ్యాఖ్యతో యుపిఎ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమాజ్‌ వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరిన్ని ఫిరంగులు పేల్చారు. కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని అధికారమే దాని పరమావధి అని విమర్శలు గుప్పించారు. పలుసార్లు మూడవ ఫ్రంట్‌ గురించి మాట్లాడ్డం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వదిలారు. అయితే ఆయన రాజకీయ విన్యాసాలు, పిల్లిమొగ్గల నేపథ్యంలో వెంటనే స్పందించడానికి స్వాగతించడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు.
మూడవ ఫ్రంట్‌ గురించి ములాయం మాటలపై అవిశ్వాసం పెరగడానికి ఆయన గత వైఖరే కారణం 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పుడు తిరిగి 2008లో యుపిఎ అణుఒప్పందంపై ఓటింగును ఎదుర్కొన్నప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆఖరి నిముషంలో నిర్ణయాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇటీవల ఎఫ్‌డిఐల విషయంలోనూ ఆ పార్టీ అలాగే చేసింది. ఇవన్నీ గాక ఈ మధ్యన ఒక సభలో ములాయం బిజెపి నేత ఎల్‌.కె.అద్వానీపై ప్రశంసలు కురిపించడం, బిజెపి గనక తన మూడు మత అజెండాలను వెనక్కు తీసుకుంటే సహకరించవచ్చునని చెప్పడం సందేహాలు పెంచింది.
కేంద్రంలో మూడవ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని మార్చి24న ములాయం చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ బిజెపి లు తోసిపుచ్చాయి. అయితే ఆయన మాత్రం సుష్మా స్వరాజ్‌, శరద్‌ పవార్‌లతో సహా అనేక మందిని కలుసుకుని హడావుడి చేస్తున్నారు. కర్ణాటకలో జనతాదళ్‌(ఎస్‌)తోనూ మంతనాలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అందరి సహకారం అవసరం గనకే ఆయన ఇన్ని తంటాలు పడుతున్నారనే మాట రాజధాని వర్గాల్లో వినిపిస్తున్నది.యుపి రాజకీయాల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన బిఎస్‌పి నేత మాయావతి కూడా ప్రదాని కావాలన్న కోర్కెను బాహాటంగానే వెలిబుచ్చారు.ఈ ఉభయుల మధ్య పోటీ ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలను ఎలాటి మలుపులు తిప్పుతుందో ఆ మధ్యన కాంగ్రెస్‌ బిజెపిలు ఎలాటి రాజకీయం నడుపుతాయో చూడవలసిందే. కాకపోతే రాహుల్‌ గాంధీ కూడా పార్లమెంటుకు అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు వస్తే మంచిదని భావిస్తున్నాడనేది ఒక వాదన. దాన్నిబట్టి ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం చాలా వుందనే చెప్పాలి.


No comments:

Post a Comment