త్రిపురలో అరుణ పతాక జైత్రయాత్ర అభ్యుదయ శక్తులకు అమితోత్సాహం కలిగించే పరిణామం. అస్థిరతకూ అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన ఈశాన్య భారత రాజకీయాల్లో ఒక ఆశా కిరణంలా అరుణ తారలా భాసిస్తున్న త్రిపుర వామపక్ష ప్రభుత్వ విజయం నిజానికి దేశానికే ఒక ఉత్తేజం. కేంద్ర కాంగ్రెస్ కుట్రపన్ని వేర్పాటు వాద టియుజెఎస్(త్రిపుర ఉపజాతి యువసమితి)తో కలసి సైన్యం సహాయంతో అధికారం కైవశం చేసుకున్న 1988 ఎన్నికలను మినహాయిస్తే ఈ ముప్పై అయిదేళ్లలోనూ సిపిఎం వామపక్ష ఫ్రంట్ విజయ పరంపరలు సాధిస్తూనే వుంది. విజయ దుందుభులు మోగిస్తూనే వుంది.ఈ విజయానికి కర్తలు చైతన్య వంతులైన ఆ రాష్ట్ర ప్రజలే. ప్రకృతి పరంగానూ, పాలక వర్గాల కుటిల వ్యూహాల కారణంగానూ, దేశ విద్రోహ శక్తుల కుట్రల కారణంగానూ అనేక సవాళ్లు సంక్లిష్లతలూ ఎదురైనా మొక్కవోని చైతన్యం అది. దాడులు దౌర్జన్యాలూ నిర్బంధాలు నరమేధాలకు చలించని సాహసం అది. అందుకే ఈ విజయోత్సవ సన్నివేశంలో త్రిపుర మహాజనానికి మా జేజేలు. అక్కడ వామపక్ష ప్రభుత్వానికీ సిపిఎం నాయకత్వానికి శ్రేణులకు మా విప్లవాభినందనలు.
అది 1977.కేంద్రంలో తొలిసారి ఇందిరాగాందీ నిరంకుశ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బెంగాల్, తమిళనాడు మినహా అన్నిచోట్లా ఈ రెండు పార్టీల వారే విజయాలు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ బిజెపిల చుట్టూ తిప్పినట్టే అప్పుడూ రెండు పార్టీల సిద్ధాంతం ముందుకు తెచ్చే ప్రయత్నం ప్రచారం జరిగాయి. అదిగో అలాటి సమయంలో 1977 చివరి తేదీన అంటే డిసెంబరు 31న నూతన భానోదయాన్ని సూచిస్తూ త్రిపుర వామపక్ష సంఘటన అపురూప విజయం సాధించింది.అరవైకి యాభై నాలుగు స్థానాలు గెలుపొందటమే గాక కాంగ్రెస్ బిజెపిలకు ఒక్క సీటు లేకుండా చేసింది. దీనికి వెనక త్రిపుర ప్రజల
పోరాటాలున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమాలున్నాయి. ఎమర్జన్సీతో సహా అనేక సందర్బాల్లో నిర్భంధాలను తట్టుకున్న సాహస ఘట్టాలున్నాయి. అత్యంత పేద గిరిజన ప్రధాన రాష్ట్రమైన త్రిపురలో అధికారంలోకి వచ్చిన తొలి వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజా సంక్షేమానికి అంకితమైంది. పశ్చిమ బెంగాల్, కేరళల తరహాలో భూ సంస్కరణలు,ఉపాది కల్పన వంటి చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గిరిజనుల భాష సంసృతి ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడంపై కేంద్రీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అమలు జరిపింది.ఇవన్నీ చూసి సహించలేని కాంగ్రెస్, టియుజెఎస్‌లు అనందమార్గ్ వంటి విద్రోహ సంస్థలు అక్కడ ప్రశాంతతకు చిచ్చు పెట్టాయి. ఆమ్ర బెంగాలీ పేరుతో గిరిజన గిరిజనేతర ఐక్యతను విచ్చిన్నం చేయాలని కుట్రలు పన్నాయి. ఈ క్రమంలో ఘోర మారణకాండకు కూడా వెనుకాడలేదు. అమెరికా సామ్రాజ్యవాదం కూడా ఆపరేషన్ బ్రహ్మపుత్ర పేరుతో ఈశాన్యన ప్రత్యేకించి త్రిపురలో అనేక దుష్టపన్నాగాలకు పాల్పడింది. ఆ సమయంలో అస్సాంలోనూ సిపిఎంకు గణనీయమైన స్తానాలు రావడం వల్ల అస్సాం ఆందోళనను బెంగాలీ వ్యతిరేకత ప్రాతిపదికపై రగుల్కొల్పడం కూడా ఈ పథకంలో భాగంగా జరిగింది.
ఇన్ని అగ్ని పరీక్షల మధ్య ఆ నాటి నృపేన్ చక్రవర్తి ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసింది. గిరిజనుల హక్కులు రక్షించడమే గాక స్వయం పాలక జిల్లా మండళ్లను ఏర్పరిచింది. కల్లోలితమైందిగా పేరు బడిన ఈశాన్య ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు మారు పేరుగా నిలిచింది. ఇవన్నీ సహించలేకనే కేంద్రంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం మోసపూరితంగా సైన్యాన్ని పంపించి ఎన్నికలను బూటకంగా మార్చి అధికారంలోకి రాగలిగింది. తర్వాతి అయిదేళ్లు త్రిపుర చరిత్రలో చీకటి ఘట్టం వంటిదే. ఈ కాలంలో ప్రత్యేకంగా సిపిఎం కార్యకర్తలు దారుణ నిర్బంధానికి గురైనారు. 1993లో ఎన్నికలు మామూలు పరిస్తితుల్లో జరగడంతో మరోసారి వామపక్ష ప్రభుత్వం దశరథ దేవ్ నాయకత్వంలో ఏర్పడింది. అగ్రనాయకుడుగా వున్న నృపేన్ చక్రవర్తి వంటి వ్యక్తి ఆ సమయంలో నిష్క్రమించినా చెక్కుచెదరని క్రమశిక్షణతో సిపిఎం వామపక్ష ప్రభుత్వం కొనసాగాయి. దశరథదేవ్ ఈశాన్య భారతాన తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడం సామాజిక న్యాయానికి సాటిలేని సంకేతమైంది. తర్వాతి కాలంలో ఆయన మళ్లీ మార్క్సిస్తు పార్టీ సభ్యత్వం కోరుతూ లేఖ రాయడం ద్వారా తన నిబద్దత నిరూపించుకున్నారు. ఈ నేతల నీతి నిజాయితీలను నిరాండబరత్వాన్ని పుణికి పుచ్చుకున్న యువనాయకుడు మాణిక్ సర్కార్ గత మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఆదర్శాన్ని చాటుతున్నారు. అందుకే అంతగా ప్రజాదరణ పొందగలిగారు. సైద్ధాంతిక రాజకీయ ఉద్యమంతో పాటు పాలనా దక్షతను జోడించి వేర్పాటు వాద హింసాకాండ వైపు ఆకర్షితులైన యువతను తిరిగి ఉద్యమాల స్రవంతిలోకి తీసుకురాగలిగారు. జీవన భధ్రత, ఆహారం ఉపాధి కల్పించడానికి అహౌరాత్రులు కృషి చేసి ప్రమాణాలు పెంచగలిగారు. అయితే ఇందుకోసం మంత్రులు ఎంఎల్‌ఎలతో సహా కార్యకర్తలు 1180 మంది ప్రాణాలు బలికావలసి వచ్చింది. ఈ త్యాగాలన్నిటి ఫలితమే ఇప్పుడు లభించిన అఖండ విజయం.
రాజీవ్ గాంధీ ఒకప్పుడు బెంగాల్‌లో జ్యోతిబాసుకు సెలవిప్పించాలని మాట్లాడి ఘోర పరాజయం పాలైనారు. అలాగే ఇప్పుడు యువరాజు రాహుల్ గాంధీ త్రిపుర నుంచి సిపిఎంను తరిమేయాలని చెప్పి అభాసుపాలైనారు. కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడమే గాక దాని మిత్రపక్షాలైన ఐఎన్‌పిటి ఎన్‌సిటిల చిరునామాలే గల్లంతైనాయి మాణిక్ సర్కార్‌తో సహా మంత్రులూ సీనియర్ నేతలు అసాధారణ మెజార్టిలతో ఎన్నికైనారు. సిపిఎం ఎస్‌సి ఎస్‌టిలకు రిజర్వు చేసిన 27 స్థానాలూ గెల్చుకోవడం, అది నిలబెట్టిన అయిదుగురు మహిళా అభ్యర్థులూ విజయం సాధించడం అక్కడ సామాజిక పొందిక విశిష్టతకు తార్కాణం. ఇటీవలి ఎన్నికల్లో ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌లో ప్రతికూలతను ఎదుర్కొన్న సిపిఎం వామపక్షాలకు త్రిపుర ఘన విజయం కొత్త ఉత్సాహమిస్తుందనడం నిస్సందేహం. దేశ వ్యాపితంగా ప్రత్యామ్నాయ శక్తుల పోరాటాలకు సమీకరణకూ ఇది ఉత్ప్రేరకంగా పనిచేయడం తథ్యం. ఈ విజయానికి కారకులైన వారందరికీ మా జేజేలు. త్రిపురలో ప్రజాభ్యున్నతికీ ప్రజాస్యామ్య ఉద్యమ విస్తరణకూ ఇది దారి తీస్తుందని మా విశ్వాసం.
Why was Nripen Chakrawarty expelled from CPM?
ReplyDelete
ReplyDeleteyou have the answer inside in a polite way...
త్రిపుర ప్రజల చైతన్యానికి అభినందనలు .
ReplyDelete