Pages

Sunday, November 14, 2010

కేసిఆర్‌ స్నేహగీతం - వైరుధ్యాల వైపరీత్యం

తెలకపల్లి రవి
ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహావేశాలతో మొదలై జైపాల్‌ రెడ్డి సారథ్యం గురించిన కథనాలతో వేడెక్కి కెసిఆర్‌ కెకెల స్నేహగీతాలాపనపై తెలంగాణా విభజన వాదుల ఆగ్రహావేశాలతో పరాకాష్టకు చేరింది. ఈ పరిణామాలన్ని పాలక పక్ష నేతల స్వార్థ వ్యూహాలను సామాన్యులు కూడా తెలుసుకోగలిగిన స్థితి తీసుకొచ్చాయి. ఇరకాటంలో పడిన వారు ఎంతగా సమర్థించుకోవడానికి సవరించుకోవడానికి తంటాలు పడినా దాచేస్తే దాగని సత్యాల్లా వారి చేతలే వారిని ప్రశ్నార్థక స్థితిలో నిలబెట్టాయి. వైరుధ్యాల వైపరీత్యాలను విలువలతో నిమిత్తం లేని విన్యాసాలను విదితం చేశాయి.


ఈ వారం రాష్ట్ర రాజకీయం ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహావేశాలతో మొదలై జైపాల్‌ రెడ్డి సారథ్యం గురించిన కథనాలతో వేడెక్కి కెసిఆర్‌ కెకెల స్నేహగీతాలాపనపై తెలంగాణా విభజన వాదుల ఆగ్రహావేశాలతో పరాకాష్టకు చేరింది. ఈ పరిణామాలన్నీ పాలక పక్ష నేతల స్వార్థ వ్యూహాలను సామాన్యులు కూడా తెలుసుకోగలిగిన స్థితి తీసుకొచ్చాయి. ఇరకాటంలో పడిన వారు ఎంతగా సమర్థించుకోవడానికి సవరించుకోవడానికి తంటాలు పడినా దాచేస్తే దాగని సత్యాల్లా వారి చేతలే వారిని ప్రశ్నార్థక స్థితిలో నిలబెట్టాయి. వైరుధ్యాల వైపరీత్యాలను విలువలతో నిమిత్తం లేని విన్యాసాలను విదితం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలలో చిక్కుకున్న తమ వారిని సమర్థించుకోవడానికి ఆరెస్సెస్‌ ఎదురు దాడి, శ్రీకృష్ణ కమిటీపై విమర్శలు వంటి మరికొన్ని అంశాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన ఫలితాలపైనా ప్రతివారి దృష్టి కేంద్రీకృతమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌కు ఉద్వాసన పలికి పృధ్వీరాజ్‌ను ఎన్నుకోవడం, దీని కొనసాగింపుగా జి2 స్పెక్ట్రం కుంభకోణంలో చిక్కిన కేంద్రమంత్రి రాజాను తొలగించాలన్న డిమాండు వూపందుకోవడం కూడా చెప్పుకోదగిన విషయాలే.
జి20 లో దివాళా దివాన్‌ ఒబామా!
ఒబామా పర్యటన ఏకపక్షమైనదన్న విషయం ఇప్పడు వామపక్షేతరులు కూడా అంగీకరించక తప్పని స్థితి. అయితే ఆయన చివరలో జైహింద్‌ అన్నాడని సంతోషం ప్రకటిస్తున్న మన నాయకులు పాలక వర్గాలు మొత్తంగా జై అమెరికా అంటూ దాసోహమై పోతున్న మాటను దాటేస్తున్నారు. (గత రెండు రోజులలోనూ ఇదే పేజీలో సీతారాం ఏచూరి, గుడిపూడి విజయరావు రాసిన వ్యాసాలు ఇందుకు సంబంధించిన వివరాలను సమగ్రంగా అందించాయి) ఇంతా చేసి దాని ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం బాగా లేదని తాజాగా జరిగిన జి20 సమావేశాలతో స్పష్టమై పోయింది. చైనాను యువాన్‌ విలువ పెంచుకోవాలంటూ ఒత్తిడి చేయడానికి ప్రయత్నించి విఫలమై చివరకు ఎలాగో పరిశీలనకు ఒప్పించి అదే గొప్ప విజయంగా వూపిరి పీల్చుకున్నది.
చవాన్‌ ఇంటిదారి. జి2 రాజా మరి??
ఆదర్శ హౌసింగ్‌ సొసైటీ కుంభకోణంలో అనూహ్యంగా చిక్కుకుపోయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ అనివార్యంగా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఆ స్థాంలో కేంద్రమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. భారత దేశ వాణిజ్య రాజధాని మాఫియా మూల బిందువు అయిన మహారాష్ట్ర రాజకీయాల్లో కుంభకోణాలు, నిష్క్రమణలు కొత్త కాదు. 1980లలోనే సిమెంటు కుంభకోణంతో ముఖ్యమంత్రి ఎఆర్‌ అంతూలే కొత్త తరహా అవినీతి భారతానికి ప్రతీకగా ఇంటిదారి పట్టారు. తర్వాత సుధాకర్‌ రావ్‌ నాయక్‌ మాత్రమే గాక శరద్‌ పవార్‌ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్లు అక్కడి నుంచి ఇతర చోట్లకు వెళ్లిన వారు కూడా ఇలాటి దుస్థితి పాలయ్యారు. అక్కడి అక్రమ ధనబలం అంతగొప్పది. వాటితో పోలిస్తే అశోక్‌ చవాన్‌ చిన్న తప్పుకే దొరికి పోవడమేమిటని అవినీతి దురంధరులు ఆశ్చర్యపోతున్నారట! కార్గిల్‌ అమరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ సొసైటీ ప్లాట్లలో తమ బంధువులకు ఇప్పించడంలో వున్న రాజకీయ కక్కుర్తి మాటలకందేది కాదు.
ఆయనను తప్పించడం తప్పనిసరైనా అంతకంటే వందల రెట్లు పెద్దదైన లక్షా 70 వేల కోట్ల రూపాయల జి2 స్పెక్ట్రం కుంభకోణం బాధ్యుడు కేంద్రమంత్రి రాజాను తప్పించకపోవడం తీవ్ర విమర్శకు దారి తీస్తోంది. ఆయన పార్టీ డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి ఇందుకు ఒప్పుకోనందువల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామన్నట్టు కాంగ్రెస్‌మాట్లాడుతుంటే అసలు మిశ్రమ ప్రభుత్వ విధానం వల్లనే ఇదంతా జరుగుతున్నదని కొందరు అర్థరహితమైన వాదన చేస్తున్నారు. ఇంకోవైపున డిఎంకె వైదొలగితే మేము బలపరుస్తామని అన్నా డిఎంకె అధినేత జయలలిత ఆశపెడుతున్నారు. ఇదంతా కూడా నీతి బాహ్య రాజకీయాల రీతిని తెలుపుతుంది. చూరు పట్టుకు వేళ్లాడుతున్న రాజాను తప్పించకపోతే ఉత్తరోత్తరా అది యుపిఎ మొత్తానికే ముప్పు కావచ్చని కూడా కాంగ్రెస్‌ నాయకులకు తెలుసు. కనక ఈ విషయంలో మరిన్ని మలుపులు చూడవలసే వుంటుంది.
ఆరెస్సెస్‌ ఎదురు దాడి! జెపి వింత వ్యాఖ్యలు!!
గత అయిదారేళ్లలోనూ అనేక పేలుడు ఘటనలు, విధ్వంసాలలో ఆరెస్సెస్‌ అనుకూలుర, అనుయాయుల హస్తం వున్నట్టు వెల్లడవుతున్నది. ఈ జాబితాలో మక్కా మసీదు పేలుళ్ల వ్యవహారం కూడా వుంది. ఎట్టకేలకు ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పేలుళ్లకు సంబంధించి ఆరెస్సెస్‌తో అనుబంధం గల వారిపై టెర్రరిజం వ్యతిరేక పోలీసులు కేసు నమోదు చేశారు.దాంతో సంఘ పరివార్‌ దేశవ్యాపితంగా పథకం ప్రకారం ఆందోళన మొదలెట్టింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంతో సహా దేశవ్యాపితంగా పరివార్‌ సంస్థలు బిజెపి కలసి ధర్నాలు చేశాయి. జరిగిన దానికి సంజాయిషీ చెప్పడానికి బదులు ఎదురు దాడికి దిగారు. ఆరెస్సెస్‌ మాజీ అధినేత సుదర్శన్‌ ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అద్యక్షురాలు సోనియా గాంధీపై వ్యక్తిగతంగా అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారు. (ఈ విషయంలో వారి వైఖరిని నిశితంగా ఎత్తిచూపడంలో మీడియా వైఫల్యం నిన్నటి సంచికలో పరిశీలించాం.) ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు మంత్రులతో సహా బషీర్‌బ్యాగ్‌లో ధర్నా చేయగా ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడారు. నిషేధాజ్ఞలు వున్న చోట ధర్నాలో ఎలా పాల్గొన్నారని బిజెపి నేతలు, లోక్‌సత్తా, తెలుగుదేశం ధ్వజమెత్తాయి. ఇందులో ద్వంద్వ ప్రమాణాలుంటే ఖండించవలసిందే గాని అసలు దర్నాలో పాల్గొనడమే పొరబాటన్నట్టు భావించనవసరం లేదు. పైగా ఈ సందర్భంలో లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ కూడా సుదర్శన్‌ ఆరెస్సెస్‌లో ఏ పదవిలో లేరు గనక ఆయన వ్యాఖ్యలపై ధర్నా అవసరమేమిటన్నట్టు మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? ఒక పార్టీ లేదా సంస్థకు సర్వాధినేతగా వున్న వ్యక్తి పదవీ విరమణ చేయగానే దానికి సంబంధం లేకుండా పోయిందనేది కనీస తర్కానికి నిలిచే వాదనేనా? సంఘ పరివార్‌ ప్రతినిధుల నోట రావలసిన మాటలు లోక్‌సత్తాధిపతి ఎందుకు ప్రవచించారో బోధపడదు.
భీషణ దూషణ పర్వం
ఈ వారంలో మరోసారి ముఖ్యమంత్రి రోశయ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చెలరేగిపోయారు. అసహనం పరాకాష్టకు చేరినట్టుగా వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్య చేసి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారని అనూహ్య భాషలో దాడి చేశారు. తమ తమ ఆస్తులపై విచారణ జరిపిస్తే అసలు సంగతి తేలుతుందంటూ అందుకు సిద్ధమేనా అని సవాలు చేశారు. గల్లాపెట్టె దగ్గర కూచుని లెక్క వేసుకోవడమే తప్ప ప్రజల మేలు పట్టించుకోనవసరం లేదా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందన అన్నప్పటికీ వాస్తవంలో ఈ వాగ్దాడి వ్యూహాత్మకంగానే కనిపించింది. చంద్రబాబు కూడా తర్వాత తగు రీతిలో సమాధానమిచ్చారు.తనపై 23 దర్యాప్తు సంఘాలు నియమించారని వాటిలో రోశయ్యదే నాయకత్వమని ఇంకా విచారణ జరపాలంటే చేసుకోవచ్చని అన్నారు. విధానాలతో నిమిత్తం లేని వివాదాలు దుందుడుకు మాటలూ దూషణలు ప్రజలకు చేసే మేలు వుండదన్న సత్యం ఈ సందర్భంలో మరోసారి రుజువైంది. తుపాను ముప్పు తప్పినప్పటికీ భారీ వర్షాల కారణంగా దారుణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ఇతర పేద ప్రజానీకాన్ని అదుకోవడంపై కేంద్రీకరించాలని కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.
జగన్‌ ఉప్పెన వ్యాఖ్యలు - కొత్త నేతపై కథనాలు
ఈ వారం మొదట్లో కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిస్తూ తన వాళ్లపై చర్యలు తీసుకోవడాన్ని గట్టిగా ఖండించారు. ఈ చర్యల కారణంగా తన సహనం ఎప్పుడు తెగుతుందో ఉప్పెనగా విరుచుకుపడుతుందో చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఈ మాటలు అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నవే నని ఆయన అనుయాయులు భాష్యం చెప్పినా పై నుంచి మాత్రం ఎలాటి స్పందన రాలేదు. తర్వాతి రోజుల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సస్పెండ్‌ చేయడంతో నాయకత్వం వైఖరిలో మార్పురాలేదని స్పష్టమైంది. మరి జగన్‌ శిబిరం ప్రతినిధులు అనేక సార్లు పరోక్షంగా బెదిరిస్తున్నట్లుగా కొత్త పార్టీ పెట్టడం తేలిక కాదని అందరికీ తెలుసు.
ఈ స్థితిలో తదుపరి వ్యూహాలేమిటో చూడవలసిందే. ఇది ఇలా వుంటే ముఖ్యమంత్రి మార్పుపై ఢిల్లీలో మంతనాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలను కాంగ్రెస్‌ వాదులే ప్రచారంలో పెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ ప్రముఖులు అధికార పదవుల్లో వున్న వారు కూడా పాలుపంచుకుంటూ తమ స్పందనలు తెలియజేస్తున్నారు. కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి పేరు ఈ వారం ఎక్కువగా చలామణిలోకి రాగా ఇందుకు తెలంగాణాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలే అడ్డు తగిలినట్టు వార్తలు వచ్చాయి. ఈ దశలో ముఖ్యమంత్రిని మార్చి తమ ప్రాంతం ప్రముఖుణ్ని నియమిస్తే రాష్ట్ర విభజన వెనక్కు పోతుందన్న మాట వారు బహిరంగంగానే చెబుతున్నారు. పైగా ఒక ప్రతినిధి వర్గం ఢిల్లీ వెళ్లి ఈ మార్పు వద్దని చెప్పి వచ్చారన్న ప్రచారం కూడా సాగుతున్నది. పైకి అందరూ గంభీరంగా ఎలాటి మార్పులు వుండవని చెబుతున్నప్పటికీ దానికి వ్యతిరేకంగానూ అనుకూలంగానూ కూడా ఉభయత్రా వ్యూహ ప్రతివ్యూహాలు సాగుతుండడంతో అనిశ్చితి పెరుగుతున్నది. ముఖ్యమంత్రి అసహన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కెసిఆర్‌ కెకే! మద్దతు కాంగ్రెస్‌కే!
తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కాంగ్రెస్‌ నాయకుడు కె.కేశవరావుతో సుదీర్ఘ భేటీ జరిపి ఆ పైన తెలంగాణా కోసం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానని చెప్పడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్‌ అంతా సజావుగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు నాయుడు లేదా సీమాంధ్ర నాయకులు(వారిలోనూ కాంగ్రెస్‌ వారుంటారు) మాత్రమే అడ్డం పడ్డారన్న కెసిఆర్‌ వాదన తర్కానికి నిలిచేది కాదని అందరికీ తెలుసు. చట్టసభల్లో మరీ ముఖ్యంగా పార్లమెంటులో తెలుగు దేశం సంఖ్యా బలాన్ని బట్టి దేనికీ అడ్డుపడగలిగిన శక్తి లేదనేది స్పష్టం. తెలుగు దేశం కూడా రాష్ట్ర విభజన విషయంలో ద్వంద్వ రాగాలు ఆలపించిన మాట నిజమే అయినా అధికారంలో వున్న కాంగ్రెస్‌దే పెద్ద పాత్ర అవుతుందనేది నిర్వివాదాంశం.అయినా కెసిఆర్‌ విమర్శలు మొదటి నుంచి ఇతరులపైనే కేంద్రీకృతమయ్యాయి.
కేంద్రంలో వున్న కాంగ్రెస్‌ను మేమెలా దూరం చేసుకుంటామన్న మాట ఆ పార్టీ ప్రతినిధుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. మొన్నటి ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశంను భూ స్థాపితం చేయమంటూ ప్రచారం మొదలైంది. తర్వాత ఆ పార్టీకి అన్ని చోట్ల డిపాజిట్టుకూడా పోయాయి.అయితే తెలంగాణా తెలుగుదేశం నేతలు మాత్రం కొన్ని సార్లు తాము విభజన కోరుతున్నామంటూ ఢిల్లీలో కూడా ధర్నా చేసి వచ్చారు.అలాటప్పుడు కెసిఆర్‌ కాంగ్రెస్‌ను వదలిపెట్టి తెదేపా పైనే విమర్శలు సంధించడం వెనక సహజంగానే రాజకీయ వుద్దేశాలున్నాయన్న మాట సహజంగానే వినిపిస్తుంది. ఢిల్లీలో ఈ ప్రకటన తర్వాత దేశం నాయకులు ఈ రెండు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వుందని రుజువై పోయిందంటూ మరింత తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేకానేక జెఎసిల ప్రతినిధులూ దిష్టిబొమ్మలు తగలేశారు.వీటన్నిటినీ గమనించిన తర్వాత కెసిఆర్‌ వూహించినట్టుగానే వివరణ పేరుతో సవరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌ను స్ట్రెంతెన్‌ చేయాలని తాను అన్నదాన్ని బలోపేతం చేయడం అని చిత్రించారని బలపరుస్తానని మాత్రమే తన భావం అని మీడియాపై రుసరులాడారు. అనువాద సూత్రాల ప్రకారం ఆయన చెప్పేది నిలవదు గాని బలపరచడం అన్నా ఇంచుమించు అదే అర్థం.
బలం చేకూర్చడమే బలపర్చడం.ఉర్దూలో మదత్‌ అన్నా అంతే. గతంలో చాలా సార్లు వైరుధ్య భరితమైన ప్రకటనలతో ఉద్రిక్తతలు వివాదాలకు కారకులైన కెసిఆర్‌ ఈసారి రాజకీయంగా మరింత అననుకూల స్థితిలో పడిపోవడం యాదృచ్చికం కాదు. కాంగ్రెస్‌కు దగ్గరగా వుండటమనే వ్యూహం తెరాస వైఖరిలో అంతర్బాగంగానే వుంది. గత అనేక దశాబ్దాలలోనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలనూ రకరకాల మాటలతో మభ్యపెట్టిన రాజకీయ శక్తిపైనే అంత నమ్మకం పెట్టుకోవడం వాస్తవాలతో పొసిగేది కాదు. కనకనే ఈ మాటల వెనక ఏదో అవగాహన వుందన్న అభిప్రాయం బలంగానే వ్యక్తమవుతున్నది.తెలంగాణా విభజన వాద సంస్థల్లో విభజనను విస్తృతం చేయడానికి ఈ పరిస్థితి దారి తీస్తుంది. బిజెపి జెఎసి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం బహుశా ఆ క్రమంలో ఆఖరి ఘట్టం కావచ్చు. కాంగ్రెస్‌ వాదులు మాత్రం రాయలసీమ సైనిక సేవాదళ్‌ ఏర్పాటు, తెలంగాణా వాదం పేరిట శ్రీకృష్ణ కమిటీపై విమర్శలు,హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా వుండాలంటూ మంత్రులు చేసే వ్యాఖ్యలు వగైరాలతో అన్ని పాత్రలు తామే పోషిస్తూ గజిబిజిని ఉద్రిక్తతను పెంచడానికి కారకులవుతున్నారు. మొత్తంపైన 2011 జనవరి వరకూ వేచి చూస్తామని కెసిఆర్‌ ప్రకటించిన రీత్యా అప్పటి వరకూ ప్రశాంతతను కాపాడటానికి దోహదం చేయాల్సిన బాధ్యత తీసుకోవలసి వుంటుంది.

No comments:

Post a Comment