- తెలకపల్లి రవి
సంపాదకులకూ సారథులకూ సంఘ పరివార్ వ్యూహమేమిటో తెలియదా? వారి మాటలలో బూటకత్వం ఏమిటో ఎరుగరా? కరత్ మాటలలో లేని అర్థాలు వెతికి వెకిలి వ్యాఖ్యలు చేసిన వారు సంఘ పరివార్ కుత్సిత స్వరూపం బాహాటంగా కనిపిస్తున్నా చూడకుండా కళ్లు మూసుకోవడమెందుకు?2007 అక్టోబరు 11 జరిగిన ఆజ్మీర్ పేలుళ్లలో ఆరెస్సెస్ అనుయాయులు వున్న సంగతి ఒకటకి రెండు సార్లు అధికారికంగా ప్రకటించబడింది. ఆధారాలతో సహా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇందర్ కుమార్ పేరును అభియోగ పత్రంలో పేర్కొన్నారు గాని నిందితుడుగా కాదు. అయితే మూడేళ్ల తర్వాత మొన్న అక్టోబర్ 22న రాజస్థాన్ టెర్రరిస్టు వ్యతిరేక పోలీసులు నిందితులుగా దాఖలు చేసిన అయిదు పేర్లలోనూ నలుగురు ఆరెస్సెస్‌కు సంబంధించిన వారన్నది సమాచారం.చనిపోయిన కారణంగా వదలివేయ బడిన ఆరవ నిందితుడు కూడా ఆరెస్సెస్‌తో సంబం ధాలున్నవారే.
గతంలో మాలెగావ్ పేలుళ్ల తర్వాత అరెస్టు చేసిన వారిలోనూ సంఘ పరివార్‌కు సంబం ధించిన ఒక సాధ్వి,ఒక సైనికాధికారి వున్నారు. ఆ తర్వాత కాలంలో జరిగిన దర్యాప్తుల వల్ల దొరికిన ఆధారాలతోనే రాజస్తాన్ పోలీసులు ఈ అభియోగపత్రం దాఖలు చేశారు. హైదరాబాదు మక్కా మసీదు పేలుళ్లకూ అజ్మీర్ పేలుళ్లకూ సంబంధం వుందని కూడా భావిస్తున్నారు. 2007 ఫిబ్రవరి18న ఢిల్లీ లాహౌర్ సంఝోతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన పేలుళ్ల వైపుగా ఈ దర్యాప్తులన్ని దారి తీస్తున్నాయి. మహారాష్ట్రలో 2003లోపర్బని, జలగావ్‌లోనూ, 2005లో యుపిలోని మౌలోనూ, 2006లో నాండేడ్‌లోనూ, 2008 జనవరిలో టెంకాశిలో ఆరెస్సెస్ కార్యాలయంలోనూ, 2008 ఆగష్టులో కాన్పూరులోనూ వేర్వేరు విధ్వంసపు ఘటనల్లో ఇలాటి ఆధారాలే దొరికాయి. తీగలాగితే డొంక కదిలినట్టు ఇవన్నీ బయిటకు వస్తుండటంతో సంఘ పరివార్ ఎదురు దాడికి దిగింది. మాలెగావ్ పేలుళ్ల కేసులో సాద్వి అరెస్టు అయిన ప్పుడు వారు సంఘ పరివార్ సిద్దాంతాల వల్ల ప్రేరణ పొందివుండొచ్చు గాని దానికి సంబంధించిన వారు కాదని పేలవమైన సమర్థనకు పాల్పడింది. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే విషయంలోనూ వారిది ఇదే పల్లవి! అయినా నాటి నుంచి నేటి వరకూ ఇలాటి విన్యాసాలు ఎన్ని చేసినా పరివార్ కరాళతత్వం దాగలేదు.
ఇప్పుడు మాలెగావ్ నుంచి ఆజ్మీర్ వరకూ వచ్చేసరికి కన్నంలోనే దొరికి పోవడం వల్ల కపట వాదనలతో గగ్గోలు పెట్టక తప్పదని నిర్ణయానికొచ్చిన ఫలితమే దేశవ్యాప్త నిరసన ప్రహసనం.ఈ క్రమంలో పరివార్ ప్రతినిధులు ప్రముఖులు లేవనెత్తిన వాదనలు ప్రజాస్వామ్య సూత్రాలనే అవహేళన చేసేవిగా వున్నాయి. అవసరాన్ని బట్టి చట్టాన్ని న్యాయాన్ని తురుపు ముక్కగా వాడుకోవడం ఆరెస్సెస్‌కు వెన్నతో పెట్టిన విద్య.రాముడి పుట్టుక న్యాయ స్థానాల తీర్పులకు అతీతమన్న వారు ఆ తీర్పు అనుకూలంగా వచ్చిందనుకోగానే ఎక్కడ లేని న్యాయ బుద్దులై పోయారు! ఇప్పుడు పేలుళ్లకు కారకులైన తమ వారు చిక్కిపోగానే న్యాయం చట్టం గాలికి వదిలేసి ఎదురు దాడికి దిగారు. ఉగ్రవాద ముద్ర వేస్తారా అని మహౌగ్రంగా వూగిపోతున్నారు. బాబరీ విధ్వంసక కన్నా ఉగ్రవాదం, గుజరాత్ నరమేధం కన్నా రాక్షసం ఏముంటాయి?
అత్యధిక హిందూ మతావలంబులకు వుండే సహన సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాలకోసం బలిచేసి వీరంగం తొక్కిన సంఘ పరివార్ కుట్రలకు పాల్పడిన తమ వారిని అరెస్టు చేస్తే అదే కుట్ర అని చిందులేయడం సత్యాన్ని తలకిందులుగా చూపించడమే. హిందువులే టెర్రరిస్టులైతే దేశంలో ఎవరూ బతకలేరని హైదరాబాదులో ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ జోషీ శివమెత్తి పోయారు! హిందూత్వ సంస్థలపై వుగ్రవాద ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతోందని లక్నోలో సర్‌సంఘ చాలక్ మోహన్ భగవత్ మోత మోగించారు! సంఫ్‌ు కేవలం సాంసృతిక సంస్త అని తమకూ దానికి ఎలాటి జీవ సంబంధాలు(ఆర్గానిక్ రిలేషన్స్) లేవని చెప్పే బిజెపి నేతలు కూడా ఈ నిరసన ప్రవహసనానికి గొంతు కలిపి తంతు నడిపారు.
మాజీ సర్‌సంఫ్‌ు చాలక్ సుదర్శన్‌జీ మరో అడుగు వేసి సోనియా గాంధీ ఇందిరా, రాజీవ్ గాంధీలను హత్య చేయించిందని నోరు పారేసు కున్నారు. తర్వాత దానితో సంబంధం లేదన్నారు. రాజకీ యాలతో సంబంధం లేదంటూనే రాజగురువులా నడిపిం చడం సంఫ్‌ు చాలక్‌లకు బాగా తెలుసు కనకఈ ద్వంద్వ భాషణానికి ఆశర్య పోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. కానైతే విమర్శనే మా విధి అంటూ అమితంగా చెలరేగి పోయే మన మీడియాలో మరీ ముఖ్యంగా తెలుగు మీడియాలో ఒక్క ప్రధానమైన ఏ పత్రికకూ ఛానెల్‌కూ ఈ ద్వంద్వభాషణాన్ని విడమర్చి చూపవలసిన అవసరమే కనిపించలేదు!సంఫ్‌ుపై కుట్ర పేరుతో ఆంధ్రజ్యోతి గురువారం పత్రిక మొదటి పేజీలో నాలుగు కాలాల ప్రదాన వార్త ఇచ్చింది. ''1925లో ఆవిర్భవించిన సంఫ్‌ు స్వాతంత్రం వచ్చాక 63 ఏళ్లలో ధర్నాకు దిగడం ఇదే తొలిసారి'' అని మొదటి పేజీలో లీడ్ ఇచ్చి లోపల ఇంకా ఇలా కొనసాగించింది: అయిదవ పేజీలో వార్త ఇలా మొదలైంది '' ప్రచారం కోసం రోడ్డెక్కడం తెలియని సంస్థ ఆరెస్సెస్. అలాటి సిద్దాంత భూమిక కలిగిన సంస్థ ఆవిర్భవించిన 85 ఏళ్లలో తొట్టతొలిసారి నిరసన స్వరం వినిపించింది.హిందూ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని బహిరంగంగా వ్యతిరేకించింది...'' తర్వాత కూడా మొత్తం కథనం ఇదే ఫక్కీలో సాగింది. ఈనాడు అదే రోజున ఇచ్చిన వార్తలో తనుగా వర్ణించినట్టు కాకుండా మోహన్ భగవత్ మాటలలో ఇదే భావాన్ని ఇచ్చింది. హిందువులపై కుట్ర అన్న వారి మాటలను కూడా యధాతథంగానే పొందుపరచింది.
ఇదే తరహాలో తక్కిన పత్రికలూ ఆరెస్సెస్ అధినేతల మాటలనుకోట్స్ గాని, పంచ్ గాని లేకుండా ఘనంగానే ఇచ్చాయి. భిన్న మతాలు గల దేశంలో కొందరిని కేసులో పొందుపరిచినంత మాత్రాన ఆ మతస్తులందరిపైనా కుట్రగా అభివర్ణించడంలో గల అనౌచిత్యం పాఠకుల దృష్టికి తేవలసిన బాధ్యత తమపై వుందని ఎవరూ భావించలేదు. మరే ఇతర పార్టీల విషయంలోనైనా తరచూ కనపరిచే వ్యంగ్యం విసురు విరుపు వంటివేవీ ఉపయోగించనూ లేదు.ఎఐసిసి సమావేశాలలో సోనియా గాంధీ ఆరెస్సెస్‌పై విమర్శలు చేసినప్పుడు వ్యూహాత్మకమని ఇదే మీడియా విశ్లేషించిన సంగతి ఇక్కడ మర్చిపోరానిది. మతతత్వంపై చేయవలసిన పోరాటం చేయని కాంగ్రెస్ అధినేత అనివార్యమైన కొన్ని ప్రస్తావనలు చేస్తే అది వ్యూహాత్మకమైంది గాని కన్నంలో దొరికి పోయిన కాషాయ కూటమి సభ్యులను చట్ట ప్రకారం హాజరు పరిస్తే అది కుట్రగా మారిపోయింది! ఆ కుట్రపేరిట గగ్గోలు పెట్టడంలోని కపటత్వాన్ని చూచాయగానైనా తెలియజేసే బాధ్యతను మీడియా కూడా విస్మరించింది.
అంతకంటే కూడా విచిత్రమేమంటే 24 గంటలు హౌరెత్తించే ఛానళ్లయుగంలో దాదాపు ఏ మీడియా సంస్థ కూడా ఆరెస్సెస్ ఎదురు దాడిపై సమగ్ర విమర్శకు విశ్లేషణకు సిద్దం కాలేదు. బిసిల కోసం బీరాలు పలికే సూర్యతేజాలు మసకబారి పోయాయి.పత్రికలది ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రేనని ప్రతిదాన్ని చీల్చిచెండాడమే తమ నైజమని ప్రజ్ఞలు పలికి ప్రతిజ్ఞలు చేసిన ప్రకాండులెవ్వరూ ప్రతిస్పందించలేదు. వార్త మాత్రం దీనిపై కార్టూన్ వేస్తే సంఘ పరివార్ వారి కార్యాలయం ముందు ఆందోళనలు హెచ్చరికలతో హడలగొట్టింది.
టెర్రరిజం ఆకుపచ్చయినా కాషాయమైనా తేడా ఏమిటని, ఆరెస్సెస్ సిమి దేనికి సంబంధించిన వారైనా నిందితులు ఒకటేనని అర్థం వచ్చేలా జావేద్ వేసిన ఆ కార్టూనులో నిజానికి తప్పేమీ లేదు. కాని సంఘ పరివార్ దాడి కారణంగా ఆ పత్రికా యాజమాన్యం కార్టూను ప్రచురణపై విచారం వెలిబుచ్చింది. ఆ విచార ప్రకటనలో హిందూ సంస్థల మనోభావాలను గాయపరినందుకు విచారం అని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనల వార్తను కూడా చూడటానికి జనం నోచుకోలేదు. దేశంలో అన్నిజాతీయ ప్రాంతీయ ఉపప్రాంతీయ పార్టీలనూ అవహేళన చేయొచ్చు ఆక్షేపించవచ్చు గాని ఆరెస్సెస్‌ను మాత్రం సర్వాతీతంగా చూడాలనడం ఎక్కడి ధర్మం? మరెక్కడి లౌకిక తత్వం? కమ్యూనిస్టులు ఆత్మ విమర్శ అన్నా అపహాస్యం చేసే మీడియాకు సంఘ పరివార్ అఘాయిత్యపు మాటలలో ఆవిగింజంత దోషం కనిపించకపోవడం ఎంత విడ్డూరం? ఉగ్రవాదంపై వుమ్మడి పోరు వంటి మాటలతో వూరేగే వారు తమదాకా వచ్చేసరికి కుట్ర అంటూ గగ్గోలు పెడితే ప్రశ్నాస్త్రాలతో ఎందుకు వెంటాడటం లేదు? ప్రకాశ్ కరత్‌పై ప్రయోగించిన కలాల కరవాలాలు పరివార్ విషయంలో ఎందుకు కళ్లకు గంతలు కట్టుకుంటున్నాయి? ఎన్నడూ రోడ్డెక్కని సంస్థ అని సిద్దాంత భూమికకు పేరెన్నిక గన్నదని ప్రశంసలలో ముంచితేల్చాల్సిన అగత్యం ఏమి కలిగింది?
వీటన్నిటికి సమాధానం ఒక్కటే-మతతత్వం మార్కెట్ తత్వం ప్రపంచీకరణ కు రెండు ముఖాలు. ఇందులో ఒకదాన్ని భుజాన మోసే కార్పొరేట్ మీడియా మరోదాన్ని ప్రశ్నించడానికి సిద్దం కాదు. ప్రత్యామ్నాయ భావాలను చూపించే కమ్యూనిస్టులపైనైతే ఒంటికాలితే లేస్తుంది గాని బెదిరింపులు విధ్వంసాలకు పాల్పడే పరివార్‌ను అంటుకోవడానికి సాహసించదు. కమ్యూనిస్టులకు సిపిఎం పార్టీకి ఆ విధమైన జంకు ఉండదు గనకే పీపుల్స్ డెమోక్రసీ దీనిపై ముందే సంపాదకీయం రాసింది. దాన్ని ప్రజాశక్తి పునర్ముద్రించింది. మహాదారుణమైన మారణహౌమాలకు పాల్పడే వారు ఏ మతానికి ఏ మతతత్వ సంస్థకు చెందిన వారైనా ఉపేక్షకు ఆస్కారం వుండకూడదు. కఠిన శిక్షల నుంచి తప్పించుకోనివ్వకూడదు. కాషాయం అన్న దాన్ని ప్రతీకాత్మకంగా వాడటం తప్ప రంగుకు లేదా దానితో ముడిపడిన విశ్వాసానికి గాని ముడిపెట్టేంత మూర్ఖులెవరూ వుండరు. మైనారిటీల విషయంలో వుగ్రవాదాన్ని మతమంతటికీ పులిమే ఆరెస్సెస్ తమ సంస్థపై దాడిని హిందూమతస్తులందరిపైనా దాడిగా చిత్రించడం ఒకే కపటనీతికి బొమ్మ బొరుసు వంటిదని తెలుసుకోవడం చాలా అవసరం. తెలియజేయడం మీడియా బాధ్యత. అందరిపట్లా ఒకే ప్రమాణాలు పాటిస్తేనే విమర్శకు విలువ. మన మీడియాలో కొరవడేదీ అదే.
Ravi gaaru.. nice to see u here :)
ReplyDeletedhanyawdalu. choodali. maa technical sub soujanyam..
ReplyDeleteRavi gaaru,
ReplyDeleteThanks for the nice article. I completly agree with you. I also observed many times the double statndards being followed by telugu media and news papers. They give full coverage to any small news related to Islamic terrorism and silently ingnores the atrocities of Sangh. On anniversary of Lumbini/Gokul chat blasts, many news channels conducted programs with victims of these blasts but no channel even mentioned about Macca blasts and never bothered to show the blast victims.. Terrorism of any form should be condemned irrespective of religion but Telugu media is delibaratly failing in this. Analysts and journalists like U are the only hope for unbiased journalism. Thnaks.