ఏడాది కాలంగా ఎడతెగని అంతర్గత అస్తిరత్వంలో కొట్టుమిట్టాడుతూ రాష్ట్రంలో అనిశ్చితికి కారణమైన అధికార పక్షం ఎట్టకేలకు మరో అడుగు వేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం అనంతరం అనివార్యంగానూ అనుభవం రీత్యానూ అధికార పీఠం అధిష్టించి అభిశంసనలు మూటకట్టుకున్న రోశయ్య ఆకస్మికంగా పదవీ చ్యుతులు కాగా శాసనసభ స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. ఏడాదిన్నరలో మూడవ ముఖ్యమంత్రి తెరపైకి రావడమే కాంగ్రెస్ అంతర్గత దురవస్థను వెల్లడిస్తుంది. రోశయ్యను పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా ఇది మామూలు మార్పు మాత్రమేనన్నట్టు కాంగ్రెస్ వాదులు సమర్థించుకున్నా వున్న నిజం దాగేది కాదు. వారసత్వంగా అధికారం తనకు రావలసిందేనని పట్టుపట్టిన వైఎస్‌జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం, రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులను ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తేవడం ప్రధాన లక్ష్యాలుగా కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌ను రంగంలోకి తెచ్చిందనేది సర్వజనాభిప్రాయం. జగన్ శిబిరం స్పందన కూడా ఇందుకు తగినట్టే వుంది. సోనియా గాంధీపై సాక్షి కథనం సృష్టించిన అలజడిని అవకాశంగా తీసుకుని అధిష్టానం ఈ మార్పులు చకచకా కానిచ్చేేసింది.అయితే అస్థిరతకు అనిశ్చితికి కారణమైన విధానాలు మార్చకుండా స్పష్టత లేకుండా వ్యక్తులను మార్చినంత మాత్రాన వొరిగేదేమిటన్న ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తున్నది.
చీప్ విప్‌గా కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ కు కుడిభుజంగా మెలుగుతూ ప్రతిపక్షాలపై ఎదురుదాడిలో ముందున్న వ్యక్తి. తర్వాత ఆయను సభాపతిని చేయడంలోనూ ఈ నేపథ్యం బాగా పనిచేసింది. నాజూగ్గానూ దుందుడుగ్గానూ కూడా ఆయన మాట్లాడుతుంటారు.శాసన సభ్యుడుగా తగినంత అనుభవం వున్నా మంత్రి కాకుండా నేరుగా ముఖ్యమంత్రి కాగలిగారంటే ఆయనపై అధిష్టానం విశ్వాసమే కారణం.అయితే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో కొత్త ముఖ్యమంత్రి ముందున్న సమస్యలు సవాళ్లు చాలా జటిలమైనవి.మంత్రివర్గ ఏర్పాటుతోనే ఆ సమస్యలు మొదలవనున్నాయి. వైఎస్ హయాం నాటి శరీరాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రిగా రోశయ్య శిరస్సును అతికించడం మాత్రమే గతంలో జరిగింది. ఇప్పుడు అలాగాక నూతన మంత్రివర్గాన్ని నియమించవలసి వుంటుంది. ఈ కసరత్తు పూర్తికి చాలా సమయం తీసుకోవడంలోనే పరిస్తితి తీవ్రత అర్థమవుతున్నది. ఇన్ని తంటాలు పడి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా అందరినీ సంతృప్తి చెందేవారికంటే అసంతృప్తి పరులే ఎక్కువగా వుంటారు. వారందరికీ జగన్ శిబిరంలో ఆశ్రయం లభించితే అప్పుడు పరిస్తితి మరింత దిగజారుతుంది.అందుకే ఈ లోగానే జగన్‌కు సంబంధించి ఏదైనా చర్య తీసుకుని ఆయనతో వెళితే అంతే సంగతులన్న సంకేతం పంపించాలని అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి మంతనాలలోనూ ద్విముఖ సంకేతాలున్నాయి.తమ వర్గానికి పదవులు రావన్న భావన జగన్ శిభిరంలో బలంగా వున్నా వచ్చిన మేరకు తీసుకోవాలనే చూస్తున్నారు. సోనియాపై కథనం దుమారం రేపితే దాన్ని ఆపకుండా రోశయ్యపైన తాజాగా రాహుల్ గాంధీపైన కూడా కథనాలు ప్రసారం చేయడం ద్వారా తమ ఆలోచనా ధోరణిని తెలియజేస్తున్నారు. కిరణ్ కుమార్ వయస్సు రీత్యా వైఎస్ తో అనుబంధం రీత్యా అనుకూలతలున్నా జగన్ ఆయనతో చేయి కలిపే అవకాశం వుండకపోవచ్చు. తమ శిబిరానికి ఆయన చోటు కల్పిస్తారని వీరూ అనుకోవడం లేదు. వైఎస్ వివేకానంద వంటివారి నియామకంలోనూ భిన్నమైన కోణాలుంటాయి. ఇంతకూ ఎవరిని తీసుకుంటారనే దానిపై వూహాగానాలు అవసరం లేకున్నా రాని వారిలో అసమ్మతి వుండనే వుంటుంది. ఏతావాతా అధికార పార్టీలో అనిశ్చితి కొనసాగడం, దాని ప్రభావం ప్రభుత్వ వ్యవహారాలపై పడటం అనివార్యం.ఇప్పటికే పేరుకుపోయిన అసంఖ్యాక సమస్యలపై దృష్టి పెట్టేందుకు కొత్త నేతకు కూడా వీటన్నిటి నడుమా శ్రద్ద వ్యవధి వుండదు. పైగా పదవి ఆశించి భంగపడిన వారితో శిరోభారం ఎలానూ వుంటుంది. ఇన్నిటి మద్యనా కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు సజావుగా నడవడం సులభమేమీ కాదు. మంత్రివర్గ ఏర్పాటుపై జరుగుతున్న జాప్యంలోనే ఆ సంగతి స్పష్టం.ఈ సమయంలోనే జైపాల్‌రెడ్డి వంటి సీనియర్ నాయకుడు జగన్‌పై తొలిసారి విమర్శలు చేయడంలో అధిష్టానం వైఖరి కనిపిస్తుందనుకోవాలి.
మరోవైపున ప్రాంతాల పేరిట రాజకీయాలు నడిపే కాంగ్రెస్ నేతలు ప్రయోజనాల కోసం అన్నిటినీ పక్కనపెట్టేస్తారని ఈ ప్రహసనంలో తేటతెల్లమైంది.అందరూ కలిసి సర్వాధికారం సోనియా గాందీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదించి ఇప్పుడు మంత్రి పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ మాత్రమే కాక వివిధ పాలకపక్షాల నేతలకూ ఇది వర్తిస్తుంది. కనకనే ప్రజారాజ్యం అధినేత కూడా ఈ సమయంలోనే కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపినట్టు వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గంలో చేరతారా అన్నది ఇంకా తేలవలసి వున్నా అడుగులు అటే పడుతున్నట్టు అనేక సూచనలు వెలువడుతున్నాయి. తెలంగాణా విభజన సమస్యకూ కిరణ్ కుమార్ సారథ్యానికి ముడిపెట్టి శ్రుతిమించిన వూహాగానాలు చేయడం వల్ల ఫలితం లేదు. ఆయన హైదరాబాదులో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఫక్తు హైదరాబాదీగా చెప్పుకున్నారు. కేసులు ఎత్తివేస్తే ఆయనను తెలంగాణా వారిగా వొప్పుకుంటామని గద్దర్ అన్నారు. ఆయన ఎంపికలో ఈ అంశం కూడా పరిగణనకు వచ్చి వుండొచ్చు గాని దాన్ని బట్టి అనుకూల ప్రతికూల వాదోపవాదాలు లేవనెత్తి అపోహలు పెంచవలసిన అవసరం లేదు. తొలి మీడియా గోష్టిలో ఆయన శాంతి భద్రతల పరిరక్షణ పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడంలోనూ పాలక వర్గాలకు అలవాటైన పరిభాషనే ప్రతిధ్వనించింది.కాఠిన్యం, మృదుత్వం అన్న సమస్యల కన్నా స్పష్టత పారదర్శకత ప్రజాహితం కీలకం.
మరీ ముఖ్యంగా రాష్ట్రంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం నోచకపోగా ఈ ఏడాది అనిశ్చితి వాటిని మరింత తీవ్రం చేసింది. ప్రభుత్వ నిర్వహణకు ప్రాణ వాయువులాటి వుద్యోగులు వుపాధ్యాయుల కోర్కెలను పరిష్కరించకపోవడంతో సమైక్య పోరాటపథం చేపట్టారు. 104, ప్యారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, బీడీకార్మికులు, డీఎస్సీ అభ్యర్థులు, ధరలు రాని రైతులు, బోధనా ఫీజులు అందని విద్యార్థులు ఇలా అన్ని తరగతులూ అందోళనమార్గంలోనే వున్నారు. కొత్త ముఖ్యమంత్రి అంతర్గత సమరాలు సర్దుబాట్లు లేదా ప్రాంతీయ సమీకరణాలలోనే తల మునకలై ఈ సమస్యలను పట్టించుకోకపోతే ప్రజలు ఓపిక పట్టే స్థితి వుండదు. పైగా గత ముఖ్యమంత్రి వయోభారం వల్ల, మితిమీరిన లౌక్యం వల్ల అసహనం వల్ల మామూలు సమస్యలపై కూడా స్పందన లేక వివిధ తరగతుల ఓరిమి నశించిన స్థితి వుంది. ప్రమాణ స్వీకారం వెనువెంటనే నిమ్స్‌కు వెళ్లినట్టే ఇందిరా పార్కు ధర్నా చౌకులో కిక్కిరిసిన వివిధ తరగతుల సమస్యల గురించి సత్వర చర్యలు తీసుకోవడం ద్వారానే జనం విశ్వాసం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది.ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికారులు అమాత్యులను అదుపు చేసుకోవడమే కాదు, అధిష్టానాన్ని మెప్పించడం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యమైంది అన్ని తరగతుల బాధలను పట్టించుకోవడం. కొత్త ముఖ్యమంత్రి తొలి ఘట్టంలోనే అందుకు ప్రాధాన్యత నిస్తే జనం సంతోషిస్తారు. అలా జరక్కపోతే అదే స్థాయిలో ఆగ్రహిస్తారు.
బీహార్ ఎన్నికల ఫలితాలు
ఈ వారంలో బీహార్ ఎన్నికల ఫలితాలు నితిష్ కుమార్ నాయకత్వంలోని జెడియు-బిజెపికూటమి ఎన్‌డిఎకు ఘన విజయం చేకూర్చాయి.అనూహ్యమైన స్థాయిలో నితిష్ విజయం సాధించగా బిజెపి కూడా విజయాల శాతం బాగా పెంచుకుంది. ఇది అభివృద్ధికి విజయమంటూ గుజరాత్‌ను బీహార్‌లో నితిష్ పాలనను కలిపి మాట్టాడుతున్నారు.లాలూ యాదవ్ పాలనలో అనేక అవలక్షణాలు, అవినీతి వ్యవహరాలు వున్నా అది పూర్తిగా ఆటవిక పాలన అని నితిష్ ఒక్కసారిగా అభివృద్ధిని రోడ్డెక్కించాడని చెప్పడం అతిశయోక్తి మాత్రమే. గతంలో లాలూ కూడా ఇలాగే విజయ పరంపరలు సాధించిన కాలం వుంది. నితిష్ పరిపాలనపై ఎక్కువ శ్రద్ద పెట్టివుండొచ్చు గాని మౌలికంగా ఆయన పాలన విధానాలు పెద్ద భిన్నమైనవి కావు. పైగా బిజెపి మతతత్వ ఛాయలు తనపై పడకుండా లౌక్యంగా వ్యవహరించి ముస్లిం మైనారిటీల ఓట్లు తెచ్చుకున్నారు.విచిత్రమేమంటే గుజరాత్ బీహార్‌లను అభివృద్థి నమూనాలుగా చెబుతున్న వారు మత తత్వ రాజకీయాల మాట దాటేస్తున్నారు. తన వంటి ''అభివృది''్థ ముఖ్యమంత్రి ఆపైన మిత్ర పక్ష నాయకుడు అయిన నరేంద్రమోడీని ఎందుకని నితిష్ ప్రచారానికి రానివ్వలేదో ఆ అవమానాన్ని బిజెపి ఎందుకు దిగమింగిందో చెప్పనవసరం లేదు. భూసంస్కరణలపై తానే నియమించిన బంధోపాధ్యాయ కమిటీ సిపార్సులను భూస్వాముల ఒత్తిడి కారణంగా అటకెక్కించిన నితిష్ అభ్యుదయ పాలకుడన్నట్టు చెప్పడం అవాస్తవం. లాలూ కన్నా ఆయనకు సంయమనం ఎక్కువ వుండొచ్చు గాని పాలనలో లోపాలను విస్మరించి ఆకాశానికెత్తడం మీడియా పనిగట్టుకుని చేస్తున్న పని.
యువరాజా వారి అజ్ఞానం!
కాంగ్రెస్ యువనేత యువరాజు రాజీవ్‌గాంధీ ఈ వారం తన అజ్ఞానాన్ని మరోసారి బయిటపెట్టుకున్నారు. గుజరాత్‌లో ఆయన మాట్లాడుతూ మోడీ అభివృద్ధి సాధించిన మాట నిజమే అయినా అది మావో సాధించిన అభివృద్ది వంటిదని విపరీతమైన పోలిక తెచ్చారు. మావోకు మోడీకి ఏ విషయంలో పోలిక వుందో తెలియని రాజకీయ అజ్ఞానం క్షమించరానిది. మావో నిద్రాణమై వున్న చైనా జనతను మేల్కొల్పి సామ్యవాద మహాప్రస్థానం చేయించిన నాయకుడైతే మోడీ నాజీ తరహాలో జాతి హత్యాకాండను ప్రోత్సహించిన మతతత్వ రాజకీయ వేత్త.ఈ రోజున చైనా సాధించిన అభివృద్ధికి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంటే రాహుల్ మాత్రం వక్రభాష్యం చెబుతున్నారు.ఆ పైన నర హంతకుడు మోడీని ఆయనతో పోల్చడం దారుణమైన అపచారం. రాహుల్ గాంధీ గతంలోనూ చరిత్రకు రాజకీయాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలలో అవకతవకగా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఒక వైపున ఫ్రధాని పదవి ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని అంతా తన స్వంతమేనన్నట్టు మాట్టాడుతున్న రాహుల్ ఇంత అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం అపహాస్య భాజనం కదా?తెలిస్తే తెలిసినట్టుండాలి తెలియకపోతే తెలియనట్టుండాలి.పైగా చైనాతో సంబంధాలను పెంచుకోవాలనుకుంటూ ఆ దేశ మూల పురుషుడైనమావోను గురించి ఇంత అవివేకంగా మాట్టాడ్డం మరెంత బాధ్యతా రహితం?
అన్యధా శరణం నాస్తి యెడ్డీ!
కర్ణాటకలో అవినీతి ఆరోపణల్లో ప్రత్యక్షంగా చిక్కిపోయిన యెడ్యూరప్పను తొలగించేస్తామన్నట్టు బీరాలు పలికిన బిజెపి నేతలు తీరా సమయం వచ్చేసరికి తోక ముడిచారు.ఆయననే కొనసాగనివ్వాలని తీర్మానించారు. ౖ గాలి జనార్థనరెడ్డి, యెడ్యూరప్పల మధ్య కుమ్ములాటల్లో అవినీతి మయమై పోయిన కర్ణాటక బిజెపి ప్రభుత్వం కాషాయ మార్కు రాజకీయాలకు అద్దం పడుతుంది.
.
రవి గారూ,
ReplyDeleteనమస్తే.మీ విశ్లేషణలు నాకు బాగా నచ్చుతాయండీ.రెడ్డొచ్చె మొదలాడు అన్నట్లుంది మన రాష్ట్ర పరిస్థితి .బీహార్ లో లాలూ అగ్రకులాల ఆధిపత్యానికి గండి కొట్టి వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కట్టబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.రాహుల్ గాంధీ అజ్ఞాని అనేది జగమెరిగిన సత్యమే.ఈ సారి వ్రాసే వ్యాసంలో తెలుగు టైపింగ్ మీద శ్రధ్ధ పెడతారని ఆశిస్తూ!
రవి గారూ మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడం సంతోషం. ముక్కు సూటిగా ఉండే మీ విశ్లేషణ బాగుంటుంది. పత్రికాలోకం లో చాలమందికి అది నచ్చదని తెలుసు. జర్నలిస్టులలో ఎక్కువమంది తెలంగాణాని సమర్ధించడమే దానికి మరింత ప్రాముఖ్యత రావడానికి కారణం అని అంటే మీరు ఏకీభవిస్తారా?
ReplyDelete