Pages

Sunday, November 21, 2010

ఊబిలో కేంద్రం - వివాదాల్లో రాష్ట్రం- పోరాటాల్లో ప్రజానీకం

- తెలకపల్లి రవి

కాంగ్రెస్‌ 125 వార్షికోత్సవాల హడావుడిలో దేశాన్ని ఊపేయాలనుకుంటే అవినీతి ఆరోపణల వూబిలో అంతకంతకూ దిగబడి పోతున్నది. దేశ చరిత్రలోనే అతి పెద్దదైన 2 జి స్ప్రెక్ట్రమ్‌ వ్యవహారంలో ఎట్టకేలకు టెలికాం మంత్రి ఎ.రాజా దిగిపోక తప్పలేదు. గాని అంతటితోనే భారం దిగిపోయిందనుకున్న ఆశలు మాత్రం ఆవిరై పోయాయి. పురాణాల్లో ఇంద్రుడు తక్షకుడనే సర్పరాజును కాపాడాలనుకుంటే తన సింహాసనానికి కూడా ఎసరు వచ్చినట్టు ఇప్పుడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుచేత అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది. దేశ విదేశీ
గుత్తాధిపతులకు అత్యంత ఇష్టుడైన ఆర్థిక విధాన కర్త కాకపోతే ఈపాటికి ఆయనకూ ఉద్వాసన చెప్పేసేవారే. ఆ పని చేయలేకా అవినీతి సెగలను తట్టుకోలేక యుపిఎ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతున్నది. మిస్టర్‌ క్లీన్‌ అని అందరితో అదే పనిగా పొగిడించుకునే మన్మోహన్‌ సింగ్‌ను కూడా మకిలి వదలకపోవడం, ప్రభుత్వాన్ని కనుసన్నలతో శాసించే సర్వాధినేత్రి సోనియా గాంధీ కూడా ఆరోపణలకు గురి కావడం కాంగ్రెస్‌ దురవస్థకు అద్దం పడుతుంది. ఇన్ని కళంకాల మధ్యన ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం దేశానికి కాంగ్రెసే ఆదర్శం అని ఢంకా బజాయించి చెప్పడం మాటలకందని విడ్డూరం.

అవినీతిపై వుక్కిరి బిక్కిరి
దేశాన్ని కుదిపేసిన స్పెక్ట్రం కుంభకోణంపై కుంభకర్ణనిద్ర నటించిన మన్మోహన్‌ ప్రభుత్వం కాగ్‌ కడిగేయడంతో కంపించి పోయింది. ఆ పైన సుప్రీం కోర్టు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్లిప్తతను, నిరవధిక జాప్యాన్ని తూర్పార పట్టడం, పార్లమెంటు సమావేశాలు సమీపిస్తుండడం వీటన్నిటివల్లా గత్యంతరం లేక రాజాను సాగనంపారు. అది కూడా భాగస్వామ్య పక్షమైన డిఎంకెను బుజ్జగించి లాలించిన తర్వాతనే. మిశ్రమ ప్రభుత్వం గనక తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయామని కాంగ్రెస్‌ చెప్పుకోవడానికి తంటాలు పడినా దాన్ని సురేష్‌కల్మాడి, అశోక్‌ రావు చవాన్‌ రాజీనామాలు దాన్ని వెక్కిరించే వాస్తవాలుగా మిగిలిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి కేసు విషయాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది గాని వాస్తవానికి సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి అంతకు చాలా కాలం ముందుగానే దీనిపై ప్రధానికి లేఖ రాశారు. అన్ని సందర్బాల్లోనూ ఇది ప్రస్తావనకు వస్తూనే వుంది. సీతారాం ఏచూరి గాని సిపిఎం గాని కేవలం దీనికే పరిమితం కాకుండా మొత్తం ప్రభుత్వ ఆస్తుల వాటాల అమ్మకంలో నిరంతర అవినీతి వ్యవహారాలను ఎండగడుతూనే వున్నారు.

కాగా కేవలం ఇది 2 జిస్పెక్ట్రం ఒక్కదానికే పరిమితమైనట్టు అది కూడా రాజాకే సంబంధించినట్టు చిత్రించజూడటం కుదిరేపని కాదు. అదే నిజమైతే దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు అంగీకరించకుండా అడ్డుపడవలసిన అవసరమే లేదు. వ్యవస్థా గతమై పోయిన సరళీకరణ యుగపు అవినీతికి పరాకాష్ట స్పెక్ట్రం పురాణం. దీన్ని సాకల్యంగా పరిశోధిస్తే డొంక మొత్తం కదులుతుంది.
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ప్రధాని మార్పు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మన్మోహన్‌ పట్ల గుత్తాధిపతుల మొగ్గు ఎంత గొప్పదంటే కేసు వేసిన స్వామి కూడా తాను ఆయన రాజీనామా కోరడం లేదని ప్రకటించారు! ప్రణబ్‌ ముఖర్జీ షరామామూలుగా సంక్షోభ నివారణ యత్నాలలో యాత్రలు చేస్తున్నారు. డిఎంకె అసంతృప్తిని కూడా చల్లార్చేందుకు శాఖల పునర్విభజనలో అడ్డు లేకుండా చేసుకోవడానికి తెర చాటు ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. డిఎంకె కూడా ఎన్నికల ఏడాదిలో కేంద్రంలో స్థానం పోగొట్టుకోవడానికి సిద్దంగా లేదు.కనక ఏదో విధంగా ఈ అవినీతి అతుకుల బొంత కొనసాగవచ్చు. ఈ వ్యవహారాన్ని ప్రధానికి వ్యక్తిగత రాజినామా కథనాలవైపు మరల్చడంలో కూడా బోలెడు వ్యూహం వుంది. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని బతికించుకున్నా అవినీతి భూతం మన్మోహన్‌ సర్కారును వెన్నాడుతూనే వుంటుంది.
బిజెపి యెడ్యూ.. డిటో డిటో..
స్పెక్ట్రం కుంభకోణంపై బిజెపి నాయకులు చాలా విమర్శలు చేశారు. కాని అవినీతికి అందులోనూ టెలికాం రంగంలో అవినీతికి సంబంధించి వారి పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. గతంలో వాజ్‌ పేయి ప్రభుత్వ హయాంలోనూ యాభై వేల కోట్ల విలువైన కుంభకోణం ఈ రంగంలో జరిగింది. ఇప్పుడు కేంద్రంలో దీనిపై తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తుతుంటే కర్ణాటకలో యెడ్యూరప్ప సంతానానికి భూమి కట్టబెట్టిన కుంభకోణంలో ఇరుక్కుపోయారు. నిన్న గాక మొన్న పీకల లోతు సంక్షోభంలో కూరుకుపోయి ఎలాగో మాయోపాయాలతో గట్టెక్కిన ఆయనను ఈ వ్యవహారంలో తప్పించగల సత్తా గాని స్థితి గాని బిజెపికి లేవు. ఇంచుమించు ఇలాటి వ్యవహారంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌ను రాజీనామా చేయాలన్న బిజెపి తమ నాయకుణ్ని మాత్రం ఆయనను తప్పించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఆ స్థలాలు వెనక్కు ఇప్పించేయడంతో అవినీతి క్షాళన అయిపోయినట్టు చేస్తోంది. ఒకరిని మించి ఒకరుగా అవినీతి మయమై పోయిన కాంగ్రెస్‌ బిజెపిలు పరస్పరం ప్రత్యామ్నాయం కాదని తామే నిరూపించుకుంటున్నాయి. ఆ మేరకు వాటి వాదనలలో నైతిక బలం కూడా లుప్తమవుతున్నది.
మరో టెర్రరిస్టు స్వామీజీ ...
ఈ వారం సంఘ పరివార్‌కు చెందిన మరో స్వామిజీ అసిమానంద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితుడిగా చిక్కిపోయాడు. ఈయన అభినవ భారత్‌ అనే సంస్థ నిర్వహిస్తున్నాడట.. వాస్తవంలో ఈ అరెస్టు చాలా సమయం తీసుకుందని చెప్పాలి. 2007 మే 18న జరిగిన మక్కా మసీదు పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు సమీపంలో మారుపేరుతో నివసిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో పట్టుబడిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ నుంచి ఈయనకు సంబంధించిన ఆధారాలు సంపాదించారు. దీంతోపాటుగానే విహెచ్‌పికి చెందిన ముఖేష్‌ వాసానీ సునీల్‌ జోషీలకు కూడా ఈ కేసుతో సంబంధం వుందని సిబిఐ అనుమానిస్తున్నట్టు సమాచారం.జోషి ఇప్పటికే హత్య గావించబడగా వాసానీనిపోలీసులు అరెస్టు చేయగలిగారు. అయితే పక్కా ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేద్దామని వారు ఎదురు చూస్తున్నట్టు సమాచారం.ఏది ఏమైనా తమపై టెర్రరిజం ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరెస్సెస్‌ గగ్గోలు పెట్టినా దాచేస్తే దాగని సత్యాల్లా నిజాలు బయిటకు వస్తూనే వున్నాయి
వివాదాలు పెంచిన ప్రభుత్వం
ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కోసం పరీక్షలు నిర్వహించాలన్న రోశయ్య ప్రభుత్వ వైఖరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య వివాదాలు మరోసారి ప్రజ్వరిల్లడానికి కారణమైంది. హైదరాబాదు పోలీసు కమీషనరేటుకు ఫ్రీ జోన్‌ హౌదా కల్పిస్తూ గతంలో విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వులో దొర్లిన పొరబాటును సవరించాలని శాసనసభ గతంలోనే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నిజాం కాలంలో అనేక కారణాల వల్ల నాటి పరిస్థితుల వల్ల హైదరాబాదు పోలీసు విభాగ నియామకాలను ప్రత్యేక తరహాలో చూస్తూ వచ్చారు.విలీనం తర్వాత కూడా అది కొనసాగింది. రాష్ట్రంలో వివిధ రకాల ప్రాంతీయ ఉద్యమాల తర్వాత పరిష్కారంగా వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వు 14(ఎఫ్‌)లో కూడా దాన్ని యధాతథంగా కొనసాగించడం లేనిపోని సమస్యలకు కారణమైంది. రాష్ట్రాన్ని నియామకాలకు సంబంధించి ఆరు జోన్లుగా విభజించినప్పుడు హైదరాబాదు ఆరవ జోనులో వుంటుంది. ఈ సూత్రాన్ని పోలీసు కమీషనరేట్‌కు మాత్రం మినహాయించడంలో ఎలాటి తర్కం లేదు. వున్నా రాజ్యాంగ బద్ధం కాదు. ఉత్తరోత్తరా ఈ మినహాయింపు హైదరాబాదు ఫ్రీ జోన్‌ అనే తరహాలో కొంతమంది మాట్లాడటానికి మరికొంత మంది ఆ సమస్యను పెద్దది చేయడానికి కారణమైంది.

ఈ పరిస్థితులలోనే శాసనసభ 14(ఎఫ్‌)ను తొలగించాలని కేంద్రాన్ని కోరుతూ(పిఆర్‌పి మినహా) ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ వివాద గ్రస్త కాలంలో అందరూ ఏకగ్రీవంగా చేసిన ఒకే ఒక తీర్మానం ఇది. ఈ సద్భావాన్ని సద్వినియోగం చేసుకుని సానుకూల సంకేతాలు పంపించేందుకు కేంద్రం తక్షణం చర్య తీసుకుని వుండాల్సింది.కాని ఇప్పటి వరకూ ఈ ఏకగ్రీవ తీర్మానం అమలుకు నోచుకోలేదు. ఈ జాప్యం నిర్లక్ష్యం యాదృచ్ఛికమని అనుకోలేము. ప్రాంతీయ వివాదాలను చల్లార్చకుండా చేసే పాలకవర్గ వ్యూహం ఇందులో స్పష్టం. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వమైనా సంయమనం చూపించే బదులు ఏకపక్షంగా పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది. సహజంగానే దీనిపై ప్రాంతాల వారి ప్రతిస్పందనలు వ్యక్తమైనాయి. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత తాండవించి పోలీసులు నిర్బంధ చర్యలు తీసుకోవడం కొందరు రాళ్లు రువ్వి వి ధ్వంసానికి పాల్పడటం పునరావృతమైంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి ఏకపక్ష సమర్థనలు ఆ పైన అసహనం నిండినట్టు హుస్సేన్‌ సాగర్‌ ఖాళీగా వుందని వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత కలుషితం చేశాయి. ఇంతా అయిన తర్వాత అనివార్యంగా మరుసటి రోజున పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించగా తెలంగాణేతర ప్రాంతాలలో ఆందోళనలు ప్రారంభమైనాయి.

డిసెంబరుకు ముందు ప్రశాంతతను కాపాడుకోవాలన్న భావన ప్రజలందరిలో వుండగా ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరించి ఉద్రిక్తత పెరగడానికే కారణమైంది. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వుండగా కేవలం కొన్ని వందల వుద్యోగాల కోసం ఉద్రిక్తతలు పెంచుకోవడం అవాంఛనీయమేనని విద్యార్థులందరూ తెలుసుకోవడం అవసరం. ఇందులో ఎవరికి ఎన్నిఎక్కువగా వచ్చాయి లాటి లెక్కలు బొత్తిగా అప్రస్తుతం.రాజకీయ వాస్తవికత చూపాల్సిన చోట సాంకేతిక వాదనలు చెల్లుబాటు కావు.
కాంగ్రెస్‌ వాదుల కయ్యాల కథలు!
వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అపార్థాలు పెంచడం కోసం ఈ వారం కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు ఎంపిలు వారిలో వారు కీచులాడుకునే కొత్త వ్యూహానికి తెర తీశారు.వివిధ ప్రాంతాల వారే గాక ఒకే ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ విషయంలో పోటీలు పడ్డారు.గత వారం ఈ శీర్షికలో చర్చించినట్టు కె.కేశవరావుతో కెసిఆర్‌ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోగా ఈ వారం కెకెపై కావూరి సాంబశివరావు బ్లాక్‌ మెయిలర్‌ అంటూ తీవ్ర భాషలో విరుచుకుపడ్డారు. అంతకు ముందు పోలవరంపై అవగాహన కోసమంటూ మొదలెట్టిన సంప్రదింపుల్లో కెఎస్‌రావు గిరిజనులను కించపరచేలా మాట్లాడారన్నది కెకె ఆరోపణ. అది సర్వాబద్ధమంటూ కెఎస్‌రావు ఈ ప్రతిదాడి చేశారు. ఇది తెలంగాణా ప్రాంతం వారందరినీ అవమానించడమేనని కొందరు ఎంపీలు వాదనలు లేవనెత్తినా అది పెద్దగా నిలవలేదు.అయితే పోలవరం వైఎస్‌ తలపెట్టిన నమూనాలో కడితే గోచీ కట్టిన గిరిజనులను వృద్ది లోకి తీసుకురావచ్చని కెఎస్‌రావు చేసిన వాదన కూడా అర్థరహితమని వాస్తవంలో వారికి వున్న గోచీ వూడిపోవడమే గాక ఉనికి కూడా గల్లంతవుతుందని గిరిజన సంఘం నాయకుడు భద్రాచలం మాజీ ఎంపి డా.ఎం.బాబూరావు స్పష్టం చేశారు. ఈ లోగా అమలాపురం ఎంపి హర్షకుమార్‌ పోలవరంకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటిస్తే రాజమండ్రి ఎంపి వుండవల్లి అరుణ్‌ కుమార్‌ దాన్ని పూర్తి చేయడమే కర్తవ్యమన్నట్టు మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ తెలంగాణా ఫోరం తలపెట్టిన సభలో మాజీ మంత్రి దామోదరరెడ్డి ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వైఎస్‌ ఫోటోపై ఇలాగే ఘర్షణ పడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొన్న 125 ఏళ్ల సభల్లో కూడా ఫోటో వుండాలని వున్నది పెద్దదిగా లేదని ఏదో పేరుతో రభస కొనసాగుతూనే వచ్చింది. ఇదంతా కూడా కాంగ్రెస్‌లో కలహాల కార్చిచ్చును ప్రతిబింబిస్తోంది. సోనియా గాంధీపై జగన్‌ శిబిరం, మీడియా సంస్థలు సూటిగా వ్యతిరేక కథనాలు ప్రచారం చేయడం కూడా ఇందులో భాగమేననుకోవచ్చు. అయితే తనే వూబిలో చిక్కిన అధిష్టానం వీటిపై స్పందించగల స్థితిలో లేదు.
పోరాటాంధ్ర ప్రదేశ్‌
ఏది ఏమైనా కాలమే వాస్తవాలకు తగినట్టు ప్రజలను కదిలిస్తుంది. ప్రాంతాల వారీ ప్రజల మధ్య వివాదాలు పెంచేందుకు పాలక పక్షాలు పాచికలు వేస్తుంటే సమస్యలు ప్రజలను ఒకటి చేస్తున్నాయి. ఇన్ని ఉద్రిక్తతల మధ్యన ఉద్యోగులు తమ కోర్కెల కోసం ఒక్కతాటిపై నిలిచి పోరాటాలు చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులు, 104 ఉద్యోగులు, ప్యారామెడికల్‌ సిబ్బంది, బీడీ కార్మికులు, రైతాంగం ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పోరాట మార్గం పడుతున్నారే గాని రోశయ్య చెప్పినట్టు హుస్సేన్‌ సాగర్‌వైపు పోవడం లేదు! సమస్యలపై ఈ సమరరశీల సమైక్య పోరాట శీలతే ప్రజలకు రక్షా కవచమవుతుంది.

2 comments:

  1. రవి గారు,
    మీరు రాసిన అనాలిసిస్ చాలా బాగుంది. ఎర్ర పార్టి వారికి ఒక సౌలభ్యం ఉంట్టుంది. జీవిత కాలం లో వారు కెంద్రంలో అధికారం లోకి రారు కనుక నిజాయితీగా జాతీయ పార్టిల వారందరిని విమర్సిస్తారు. మీరు ఇతర పార్టిల మీద ఇంత అనాలిసిస్ చేస్తున్నారు గదా ! గత శాసన సభ ఎన్నికలలో తమఆంధ్రాలో ఎర్ర పార్టిలు కు మునుపు ఉన్న స్థానాల కన్నా చాలా తక్కువ గెలుచుకొన్నాయి. ఆ పార్టి కి మీరు ఇచ్చిన సలహాలు ఎమైనా ఉన్నాయా? వారు మీలాంటి మేధావుల సలహాలు తీసుకొని తమ పరిస్థిని ఎమైనా మెరుగు పరుచుకొన్నారా? మాకు తెలియజేయగలరు.

    ReplyDelete
  2. రాష్ట్ర దేశ రాజకీయ సంకట స్థితులను అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులభశైలిలో వివరించారు .ధన్యవాదాలు.

    ReplyDelete