Pages

Tuesday, February 7, 2012

ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు: అపూర్వ సంరంభం




ఫిబ్రవరి 2,3,4 తేదీలలో ఖమ్మంలో జరిగిన సిపిఎం ఆంధ్ర ప్రదేశ్‌ 23వ మహాసభ, ప్రత్యేకించి చివరి రోజున అపూర్వంగా జరిగిన బహిరంగసభ రాష్ట్రమంతటినీ ఆకర్షించాయి. రాజకీయ విశిష్టతకే గాక నిర్మాణ దక్షతకు కూడా అద్దం పట్టాయి. ప్రాంతాలవారీ రాజకీయంలో ప్రతిదీ వివాదాస్పదమవుతున్న నేటి కాలంలో వీర తెలంగాణా పోరాట క్షేత్రమైన ఖమ్మం నడిబొడ్డున లక్షలకు లక్షల మంది ప్రజలు అత్యంత క్రమ శిక్షణగా సమీకృతులై ఎర్ర జెండా సత్తా చాటారు. అంత పెద్ద సభలోనూ చిన్న అపశ్రుతి కూడా దొర్లనివ్వని ఆహ్వాన సంఘం ప్రణాళికా రచన, అచరణ అందరి జేజేలందుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలలోనే అత్యంత అనిశ్చిత కాలంలో అరుదైన ఆదర్శాన్ని, అనితర సాధ్యమైన ఉత్తేజాన్ని అందించిందీ సభ.
ఖమ్మం ఒక అరుణ వనం...
కనుచూపు మేరలో జన సందోహ సముద్రం తప్ప ఖాళీ స్థలం కనిపించని అనూహ్య స్పందన ప్రత్యర్థి వర్గాలలో ప్రకంపనలు పుట్టించి, మైకులు తీసేయించడం, ప్రసారాలు నిలిపేయించడం వంటి అవివేకపు పనులకు కారణమైంది. అవన్నీ సభికుల సంకల్పాన్ని ఇంకా దృఢతరం చేశాయి. వేదికపై వక్తలు ఈ దుర్నీతిని ఎండగడుతుంటే అక్కడ చేరిన లక్షల కంఠాలు ఒక్కపెట్టున ఖండించాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ఈ అవివేకపు అల్పిష్టి చేష్టలు అక్కసు పనులు అందరిలో అసహ్యాన్ని కలిగించాయి. అరుణవనంలా మారిన ఖమ్మం సభల సందేశం అందరినీ ఆవరించి కొత్త చైతన్యం నింపింది.
2010 ఆగష్టులో విజయవాడలోనూ సిపిఎం కేంద్ర కమిటీ విస్త్రత సమావేశాల ముగింపులో పెద్ద సభ జరిగింది. అక్కడా ఇక్కడా కూడా సిపిఎం చెప్పిన విధానం ఒక్కటే. రాజకీయ సారాంశం ఒక్కటే. బహుశా ఇంత బలంగా స్వంత గొంతు వినిపించగలుగుతున్నందుకే ఇంతటి ప్రజా దరణ పెల్లుబికిందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా నుంచి కూడా గణనీయంగా ప్రజలు హాజరవగా మరికొన్ని జిల్లాల నుంచి కూడా తర తమ తేడాలతో పార్టీ అభిమానులు విచ్చేశారు. 'తెలంగాణా లేదు ఆంధ్ర లేదు అంతా జనమే జనం' అన్నాడు ఖమ్మంలో ఆ రోజు రాత్రి నేనెక్కిన ఆటో డ్రైవర్‌ పక్క పాసింజరుతో. పార్టీ అగ్రనేతలు కూడా
ముందు రోజే ఖమ్మం చేరుకుని ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేకుండా స్వేచ్చగా జనంతో కలసి నడుస్తూ కలయతిరిగారని ఒక పత్రిక ప్రత్యేకంగా రాసింది.
ఈ సభలు చాలా గొప్పగా జరుగుతాయని అందరూ భావించారు. సరిగ్గా ఈ కారణంగానే ప్రత్యర్థులు ముందునుంచే కుత్సిత వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు ప్రారంభించారు. సిపిఎంకు ప్రజలు అభిమానంతో ఇస్తున్న విరాళాలపై విషం కక్కారు. నాయకులపై నిందలు మోపారు. కొంత కాలంగా విచ్చిన్నకర పథకాలను పట్టుకుని వేళ్లాడుతున్న వారు వారికి వంతపాడే వారూ మింగలేక కక్కలేక అవస్థ పడ్డారు. ఇలాటి నానా బాపతుకూ సభల ముగింపు రోజున జన సముద్రమే జవాబు చెప్పింది. ఎర్రజెండాతోనే వుంటామని ప్రతిజ్ఞ బూనింది.
అర్థవంతంగా చర్చలు
మహాసభలో ప్రారంభం ముగింపు పోను రెండు రోజుల పాటు 700 మందికి పైగా ప్రతినిధులతో అత్యంత శిక్షణా యుతంగానూ క్రమబద్దంగానూ జరిగిన చర్చలు నిర్మాణ స్థితికి అద్దం పట్టాయి. మొదట జిల్లాల వారిగా తర్వాత సంఘాలు రంగాల వారీగా జరిగిన చర్చల్లో తమకున్న సమయంలోనే ప్రతినిధులు తమ బృందాల అభిప్రాయాలను నిర్మాణాత్మకంగానూ, నిర్మొహమాటంగానూ నివేదించారు. ఉద్యమానికి రాజకీయ విధానానికి నిర్మాణ అవగాహనకు సంబంధించిన అన్ని అంశాలు ప్రస్తావనకు రావడమే గాక లోపాలు గుర్తించడానికి అవకాశం కలిగింది. ఆచరణను మెరుగుపర్చుకునే సూచనలూ వచ్చాయి. భవిష్యత్‌ ప్రణాళికలు సభ ముందుకొచ్చాయి. వివిధ తరగతుల వయో బ్రందాల ప్రతినిధులు కూడా పరిపక్వంగా మాట్లాడటం మన్నన పొందింది. కార్యదర్శి సమాధానం తర్వాత నివేదిక ఏకగ్రీంగా ఆమోదం పొందింది.అలాగే ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలన్నిటిపైనా 40 సమగ్రమైన తీర్మానాలు వచ్చాయి
వూహాగానాలు పటాపంచలు
మీడియాలో కొన్ని వారాలుగా వూహాగానాలు సాగింది కొత్త నాయకత్వం ఎన్నికపైన. కొన్ని పత్రికలు ఛానళ్లు పనిగట్టుకుని దీనిపైనే కథనాలు గుప్పిస్తూ వచ్చాయి. వాటికి తోచిన పేర్లను వదులుతూ అందుకు తాడూ బొంగరం లేని వాదనలు జోడిస్తూ.. అందులోనే రకరకాల కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు తంటాలు పడ్డాయి. తీరా మహాసభ ముగిసే సరికి ఇలాటి కథన రాయుళ్లందరూ కళ్లు తేలేయక తప్పలేదు! వారు అనుకున్న కధ ఒక్కటీ నిజం కాలేదు. ఎందుకంటే అవన్నీ అభూత కల్పనలు గనక. పదవీ రాజకీయాలు పైరవీలు పోటాపోటీల పాలక పక్ష సంసృతికీ సిద్దాంత నిబద్దమైన సిపిఎం వంటి పార్టీకి మధ్య తేడాను కావాలనే మరుగుపర్చాలన్నది వారి ప్రయత్నం. దీనిపై ముందుగానే స్పష్టత ఇచ్చినా - కులాలు ప్రాంతాలను బట్టి ఎంపిక సిపిఎంలో వుండదని వివరించినా కొంతమంది ఆఖరి వరకూ అదే వాదిస్తూ కూచున్నారు. ఏకగ్రీవంగా నాయకత్వ ఎన్నిక ప్రకటించిన తర్వాత కూడా తమ వాదనలు కొనసాగిస్తూ కులాధిక్యతను ఆపాదిస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు ప్రాంతీయ భాష్యం చెబుతున్నారు. ఈ కులం కళ్లజోళ్లు, ప్రాంతీయ పాచికలు పక్కన పెట్టి ప్రజా రాశుల కోణం నుంచి వర్గ పోరాటాలు ప్రజా ఉద్యమాల కోణం నుంచి చూస్తే తప్ప సిపిఎం మహాసభల ప్రత్యేకత అర్థమవదు. అర్థమైనా అయినట్టు నటించే బాపతుకు చెప్పవలసిందీ వుండదు. పార్టీ విధానం నచ్చకపోతే విమర్శించవచ్చు గాని ముందే చెప్పినట్టు విజయవాడలోనూ ఖమ్మంలోనూ విశాల సమీకరణలు జరిపి ఒకే మాట చెప్పగలిగిన పార్టీ నాయకత్వంపై అవకాశవాద ముద్రలు వేయడం చెల్లుబాటయ్యేది కాదు. అనిశ్చితి పరిస్థితుల్లో ఎదురు దెబ్బల తర్వాత కూడా పార్టీ స్పూర్తిని నిలబెట్టడానికి దోహదపడిన నాయకత్వం తిరిగి ఎన్నికవడంలో ఆశ్చర్యమూ లేదు. సభల్లో పలువురు పదే పదే చెప్పినట్టు వ్యక్తి స్వామ్యాలూ అధిష్టానాల సంసృతి లేని సిపిఎంలో సమిష్టి సూత్రమే శిరోధార్యం. విచిత్రమేమంటే ఎన్నిక తర్వాత కూడా కళ్లు తెరవకపోగా ఎవరో ముందుకు రాకుండా మరెవరో అడ్డుపడ్డారనీ అర్థం లేని కథనాలతో కాగితం ఖరాబు చేయడం.

కిక్కిరిసిన ఖమ్మం.. ఉప్పొంగిన ఉత్సాహం

మహాసభ ముగింపు సమయానికే ఖమ్మం జన సముద్రమై పోయింది. వాహనాలు కదల్లేని స్థితి. ఎక్కడెక్కడ నుంచో జన సామాన్యం ఎర్ర జండాలు పట్టుకుని ప్రవాహాలుగా వస్తూనే వున్నారు. మూడు చోట్ల నుంచి ప్రదర్శనలుగా రావాలనుకుంటే మొదటి ప్రదర్శన సమయానికే సభా స్థలమైన జ్యోతిబాసు ప్రాంగణం ఇసుకవేస్తే రాలనట్టు తయారైంది. ప్రధాన నాయకత్వం పాల్గొన్న మూడో ప్రదర్శన లోపలికి రావడానికి అవకాశమివ్వాలని అనేక సార్లు అభ్యర్థించితే తప్ప సాధ్యం కాలేదు! ఇంతసేపూ వేదికపై నుంచి ప్రజా నాట్యమండలి కళాకారులు, గిరిజన బృందాలు రకరకాల కళారూపాలతో ఆటపాటలతో అలరిస్తూనే వున్నాయి. నాయకులు వేదికపై వచ్చి ప్రసంగాలు ప్రారంభించిన తర్వాత వేదికపై నుంచి చూస్తే కనుచూపు మేరలో జనం తప్ప అంగుళం నేల కనిపించని స్థితి! సభా స్థలంలో వున్నవారికి రెట్టింపుగా రోడ్లపైన, మేడల పైన, చెట్లపైన ఆఖరుకు వద్దని వారిస్తున్నా వినకుండా ఎత్తయిన ట్యాంకులపైన కూడా ఎక్కి కుర్రాళ్లు ఉత్సాహం పంచుకున్నారు.
మూర్ఖత్వమెవరిదో!
ఇంత బ్రహ్మాండమైన ప్రజా స్పందనతో అనితర సాధ్యమైన శిక్షణతో రాజకీయ స్పష్టతతో సభ జరిగితే తెలంగాణా పేరు పెట్టుకున్న ఒక పత్రికలో (అది ఇప్పుడు ఎవరి గుండె చప్పుడో తెలియదు) మాజీ మావోయిస్టు సంపాదకీయ వ్యాఖ్యాత గారికి మాత్రం అంతా మూర్ఖత్వంగా కనిపించింది. పాలక వర్గ పాచికలలో చిక్కి తమ స్వకపోల సిద్దాంతాల చుట్టూ పరిభ్రమించే వారికి మార్క్సు చెప్పిన వలస వాదానికి వక్రభాష్యాలు చెప్పడం ఏమంత కష్టం? కమ్యూనిస్టులను శాపనార్థాలు పెట్టేందుకు మరేదీ దొరక్క కామ్రేడ్‌ అన్న అత్యున్నత పదాన్ని అపహాస్యం చేసి అపభ్రంశం పట్టించిన అభివృద్ధి నిరోధక సంప్రదాయమే శరణ్యమైంది. ఈ వ్యాఖ్యతా అదే శ్లేషలో ఘోషించాడు! ఇక ఉద్యమాలు పోరాటాలు అన్నప్పుడు తెలంగాణా విభజన ఉద్యమం ఎందుకు చర్చకు రాలేదని బిజెపి నేత ఒకరి ఆక్షేపణ. అలా అని ఆయనకు ఎవరు చెప్పారో? అవసరాన్ని బట్టి జై శ్రీరాం అని జై తెలంగాణా అని ఏ పేరుతోనైనా యాత్రలు చేయగలిగిన వారికి సూత్రబద్దమైన సిద్దాంత నిబద్దమైన సిపిఎం వైఖరి ఎలా నచ్చుతుంది? ప్రాంతాల వారీ వ్యూహాలతో ద్వంద్వ భాషణలతో పబ్బం గడుపుకొంటున్న పాలక పక్షాల వ్యూహాలను తిప్పికొట్టి సమస్యలపై సమైక్య పోరాటాలు చేయాలన్నదే మహాసభ సందేశం.
స్వతంత్ర పునాది.. వామపక్ష ఐక్యత
స్వతంత్ర పునాదిని పటిష్టం చేసుకుంటూ సమస్యలపై ఉద్యమాలు పోరాటాలతో ముందుకు సాగాలనీ వామపక్ష ఐక్యతకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలనీ మహాసభ నిర్ణయించింది. ఇప్పటికే విడుదలైన సిపిఎం అఖిలభారత మహాసభ తీర్మానం ముసాయిదా ఇందుకు మార్గదర్శిగా వుంటుంది. దీనిపైనా అనేక కథనాలు వ్యాఖ్యానాలు.. ఇందుకు సంబంధించిన రాజకీయాంశాలు మరో సందర్భంలో చర్చించుకోవచ్చు. దేశమంతటా బూర్జువా పార్టీలు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒక విధంగా అధికారంలోకి వచ్చాక మరో విధంగా వ్యవహరిస్తున్నాయి. అవకాశవాదంతో అటూ ఇటూ దూకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభలు వామపక్ష ఐక్యత, ఉమ్మడి పోరాటాల అవసరాన్ని నొక్కి చెప్పాయి.11 వామపక్షాలతో కలసి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రాఘవులు ప్రకటించారు. రాజకీయంగా అది కీలక అంశం. కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రమైన ఖమ్మంలో ఈ వైఖరి తీసుకోవడం మరింత ప్రాధాన్యత కలిగిన విషయం.

ఇన్ని ప్రత్యేకతలతో మహాసభ దిగ్విజయంగా జరగడానికి అపూర్వమైన బహిరంగ సభ ఏర్పాట్లకూ మొత్తం మంది వలంటీర్లు దీక్షా యుతంగా అవిరామంగా శ్రమించారు. ప్రతినిధుల వసతి భోజన సదుపాయాలు, రాకపోకలు అన్నిటా తామై నిలిచారు. యువజనులు విద్యార్థులు మహిళలు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో పాల్గొన్నారు. మహాసభలకు సమాంతరంగా కళా ప్రదర్శనలు పుస్తక ప్రదర్శన, వందలాది సెమినార్లు, పోటీలు, వేషాలు, రోజు వారి ప్రచార కార్యక్రమాలు వంటివన్నీ జరిగాయంటే పకడ్బందీ ప్రణాళిక నిరంతర సమీక్ష వున్నాయి. ఇలాటి భారీ కార్యక్రమాలలో సర్వసాధారణంగా వుండే లోపాలు కూడా రాకుండా ముందే తగు ఏర్పాట్లు చేశారు. వైద్యులు వివిధ మధ్యతరగతి మేధావి ఉద్యోగ బృందాలు కూడా తమవైన సేవలందించారు. గ్రామీణ ప్రజలు తమ సభలుగానే భావించారు. మీడియా వారు కూడా ఈ ఉత్సాహంలో పాలు పంచుకుంటూ చక్కగా నివేదించడానికి పోటీ పడ్డారు. బహిరంగ సభ తర్వాత రాష్ట్ర స్థాయిలో కవరేజి తగినంత లేదనిపించినా జిల్లాలో మాత్రం అసంఖ్యాక కథనాలు ఇచ్చారు. ఇతర రాజకీయ పార్టీల వారు కూడా ఆదరణ చూపారని నాయకులు సభా ముఖంగానే ప్రకటించారు. కనకనే ఈ సభలు ఇంత ఘనంగా విజయవంతమైనాయి. కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్తశక్తినిచ్చాయి.

3 comments:

  1. /దేశమంతటా బూర్జువా పార్టీలు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒక విధంగా అధికారంలోకి వచ్చాక మరో విధంగా వ్యవహరిస్తున్నాయి./

    'మద్యం బూర్జువా వ్యాపారస్తులు స్పాన్సర్ చేసిన మహా సభలు' అన్నది కూడా బూర్జువా పార్టీలు, బూర్జువా పత్రికలు చేస్తోంది దుష్ప్రచారమే అనుకుంటా.
    http://www.eenadu.net/Homeinner.aspx?qry=break24
    రశీదులిచ్చినా మద్యం బూర్జువాలు ఇలా దుష్ప్రచారం చేయడం ఖండనీయం.

    ReplyDelete
  2. వ్యతిరేకతతో అయినా సరే వర్గ పరిభాష మీరు బాగా వాడతారు. అభినందనలు. మూడు లక్షల మంది వచ్చిన సభలను సమీక్షించేప్పుడు మూడు లక్షలు అది కూడా రశీదులు తీసుకుని ఇచ్చిన ఘటనతో కప్పేయాలనుకోవడం హాస్యాస్పదం కదా? ఏ ప్రజా కార్యక్రమమైనా విరాళాలు తీసుకోవడం వేరు, మద్యం బూర్జువాలను గురించి పెటీ బూర్జువా బుద్దితో అపహాస్యం చేయడం వేరు. శాసనసభలో బూతు చిత్రాలు చూస్తే ముందు ఖండించకుండా ప్రకృతి ధర్మం చూడమంటారు. ఒక రాష్ట్ర సభకు రాజకీయ విరాళాలు వసూలు చేయడం అపరాధమవుతుంది. ద్వంద్వ ప్రమాణాలంటే ఇవే.మహాసభకు విరాళం ఇవ్వడం మద్యం మాఫియాలో వాటాలు వేసుకోవడం ఒకటేననే వారికి ఏం చెప్పాలి?

    ReplyDelete
    Replies
    1. రవిగారు,
      లక్షల్లో విరాళాలు ఇచ్చిన బూర్జువాలు ఏ ఉద్దేశ్యంతో బూర్జువా వ్యతిరేక కమ్యూనిస్టులకు ఇస్తారు? అదే చేత్తో తెదెపా, కాంగ్రెస్‌లకు కూడా వితరణ చేసారట. పార్టీలని కాదు గాని, ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామకర్మ వామపక్ష సభలను స్పాన్సర్ చేయడం, సామ్యవాద భావాలపై లిక్కర్ బూర్జువాలకున్న మక్కువ తెలుస్తోంది. లక్షల్లో విరాళాలు చెక్కు రూపంలో తీసుకోవాలనే నిభంధనలు పాటించివుంటే, అంతలా సంజాయిషీలు ఇచ్చుకునే అవస్థ తప్పేది.

      Delete