Pages

Sunday, July 29, 2012

రాజకీయ అనిశ్చితి-ప్రాంతాల పల్లవులు!



రాష్ట్రాన్ని విభజించదలిస్తే ముందు రాయలసీమ నాలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలుగు దేశం ఫ్రధాన కార్యదర్శి హౌదాలో వున్న కర్నూలు జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. తెలంగాణాపై తెలుగు దేశం స్పష్టత ఇస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్న తరుణంలో రాయలసీమ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ౖ అదే జిల్లాకు చెందిన కె.ఇ.కృష్ణమూర్తి వాటిని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ నేత కె.తారక రామారావు తెలంగాణా ఏర్పాటు తర్వాత మీరు రెండు కాకుంటే పన్నెండు చేసుకోండి అంటూ నాన్న గారి శైలిలో స్పందించగా మరో నేత హరీష్‌రావు బైరెడ్డి ప్రకటనను చంద్రబాబు కుట్రలో భాగంగా వర్ణిస్తూ లేకపోతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. నిజానికి గతం నుంచి టిజివెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి,జి.శ్రీకాంతరెడ్డి,మైసూరా రెడ్డి వంటి కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఇలాటి వాదనలు వినిపిస్తూనే వున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా 1986 ప్రాంతంలో సాక్షాత్తూ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వత్తాసుతోనే మైసూరా రెడ్డి, ఎం.వి.రమణారెడ్డి, భూమన్‌ వంటి వారు రాయలసీమ ప్రత్యేక
వాదం వినిపించారు.ఇంకా వెనక్కు పోతే 1937లోనే ఆంధ్ర మహాసభ కాలంలోనే రాయలసీమ నాయకులు భిన్నాభిప్రాయం ప్రకటించడం, దానిపై శ్రీబాగ్‌ ఒడంబడిక వంటివి చూస్తాము. తర్వాత కాలంలో పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఈ తరహాలో కాంగ్రెస్‌ నేతలే కుదుర్చుకున్నారు.కాంగ్రెస్‌ తెలుగు దేశం ఇప్పుడు వైఎస్‌ఆర్‌ పార్టీ దేనికి సంబంధించిన నేతలైనా సరే తమ స్థానిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ వాదనలు వినిపిస్తారే తప్ప ప్రజల కోసం కాదు. ఆ ప్రయోజనాలలో ఎవరు ఏ మేరకు సాధిస్తే మిగిలిన వారు పోటీకి వస్తారు. అంతే తప్ప ప్రాంతం పేరు చెప్పే వారంతా అందుకోసమే ఆలోచిస్తున్నారని కాదు. తెలంగాణా సీమాంధ్ర అన్న మాటలు ఇప్పుడు బాగా వాడుకలోకి వచ్చాయంటే ఇప్పటి అవసరాల కోసం సృష్టించుకున్నారు. అసలు రాయలసీమలో కూడా రెండు జిల్లాలు మాత్రం తెలంగాణాలో కలపాలని కొందరు, రాయల తెలంగాణా అని కొందరు అంటుంటారు. ఉత్తరాంధ్రను కళింగాంధ్ర అంటూ బరంపురం వగైరాలను కలుపుకోవడం గురించి కొందరు మాట్లాడుతుంటే అనంతపురంను కర్ణాటకలో కలపాలని అప్పుడు మంత్రిగా వున్న జెసి దివాకరరెడ్డి బహిరంగంగానే వాదించారు. ఇవన్నీ తెలంగాణాను అడ్డుకోవడానికి అని హరీష్‌ రావు వంటి వారు అనవచ్చు గాని విడగొట్టడం అంటూ మొదలు పెట్టాక ఆది ఆయన ప్రతిపాదనతోనే ఆగుతుందా? అన్నిటినీ కలిపి ఒకేసారి చూడాలన్న కోర్కె రాకుండా వుంటుందా? విడిపోవాలనుకునే వారంతా కలసి వాదించవచ్చు. అలాగే సమైక్యంగా వుండాలనే వాళ్లు ముందు తాము కలసి వుండి ఇతరులకు చెప్పొచ్చు.ఇలా గాక ఎవరికి వారు ఎప్పటికి తగిన వాదన అప్పుడు చేస్తున్నారంటే అర్టం ఏమిటి? ప్రాంతాలపైనా అక్కడి ప్రజల పైనా ప్రేమ కన్నా ఈ పాలక పక్ష నేతలకు తమ వ్యక్తిగత పార్టీగత ప్రయోజనాలే ముఖ్యం. అవి నెరవేరేవరకు ఏవో వాదనలతో ప్రజలను రెచ్చగొట్టడానికి వెనకాడరు. మళ్లీ కలసి రాజకీయాలు వ్యాపారాలు చేస్తారు ప్రభుత్వాలను ప్రతిపక్షాలను నడుపుతుంటారు. కనక అప్రమత్తంగా వుండాల్సింది ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలే! తెలుగన్నలు అక్కయ్యలే!

No comments:

Post a Comment