Pages

Thursday, May 8, 2014

రేపటి రూపం..?




ఎట్టకేలకు ఏళ్లతరబడి సాగిన అనిశ్చిత పర్వం ముగిసింది.ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడే రెండు చోట్ల ఓటర్ల తీర్పు నివ్వడం పూర్తయింది. ఇక కొత్త ప్రభుత్వాలు ఎవరు ఎలా ఏర్పాటు చేస్తారనే ప్రశ్న మాత్రమే మిగిలింది. ఇంత కాలం వినిపించిన ఇక్కడ మేము అక్కడ వారు అన్న పాట ఈ సమయంలోనూ కొనసాగుతున్నదే తప్ప పెద్ద మార్పు వుంటుందనిపించడం లేదు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కూ, ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఆధిక్యత వుండొచ్చన్న అభిప్రాయమే బలంగా వుంది. చివరి మోడీ-చంద్రబాబు- పవన్‌ కళ్యాణ్‌ త్రయం హడావుడి చేయడం వల్ల అవకాశాలు కొంత మెరుగుపడి వుంటాయి తప్ప అధికారం వచ్చే పరిస్థితి లేదని చాలామంది తెలుగుదేశం నాయకులు, అంతకు మించి బిజెపి నేతలూ కూడా ఒప్పుకుంటున్న స్థితి. వైసీపీ అద్యక్షుడు జగన్‌ మోహన రెడ్డి వ్యక్తిగత శైలి, కేసులూ వంటి వాటి గురించి గాని లేక టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహాలూ వాగ్ధోరణి గురించి గాని చాలా విమర్శలు వుండొచ్చు. కొందరు అసలే భరించలేకపోవచ్చు.అయితే వాటికీ ఓట్ల సరళిపై వచ్చే అంచనాల పరిశీలనకూ సంబంధం లేదు. ఎందుకంటే ఎన్నికల తరుణంలో ఎవరి ఇష్టాయిష్టాలు ఏవైనా వివిధ కోణాలు నుంచి విభిన్న ప్రాంతాల జన బాహుళ్యం నుంచి వినవచ్చే అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కద్దు. ఆ విధమైన అభిప్రాయాలను తీసుకున్నప్పుడే టిఆర్‌ఎస్‌, వైసీపీలకు మెరుగైన అవకాశాలున్నాయని అంచనాలు అత్యధికంగా వినిపిస్తున్నాయి.
ఇందులోనూ రెండు రాష్ట్రాల మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రథమ శక్తిగా వస్తుందనే వారు కూడా పూర్తి మెజారిటీ వస్తుందా లేదా అని ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. అదే జరిగితే ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరమైన విషయం. దేశ రాజకీయాల్లో వున్న మూడు శక్తులతోనూ సంబంధం పెట్టుకోవడానికి కెసిఆర్‌కు అభ్యంతరం వుండకపోవచ్చు. కాని చెప్పినదాన్ని బట్టి చూస్తే
వరుసగా తృతీయ కూటమి, బిజెపి, కాంగ్రెస్‌ అన్న తీరులో ఆయన ఎంపిక వుంటుంది.ఇంకో సంగతి ఏమంటే ఇవన్నీ కేవలం రాష్ట్రంలో పరిణామాలను బట్టి మాత్రమే గాక దేశ వ్యాపిత తీర్పుపైన ఆధారపడి వుంటాయి. కాంగ్రెస్‌ ఓడిపోతుందనే అంచనాలే అంతటా వున్నాయి గనక కోరి కోరి వారి జట్టుకట్టేవారు ఎవరూ వుండకపోవచ్చు. తెలంగాణ ఇచ్చింది తామేగనక (టిఆర్‌ఎస్‌) విలీనమూ విజయమూ వాటికవే జరిగిపోతాయనుకున్న లెక్కలు కాస్త వెనక్కు కొట్టడం కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. తర్వాత తల్లీ కొడుకులు వచ్చి సభలు పెట్టినా తలకిందులయ్యే మార్పులు రాలేదు. కానైతే హంగ్‌ వస్తే అప్పుడు టిఆర్‌ఎస్‌ కన్నాతమకు అధికంగా అవకాశాలుంటాయని ఆ పార్టీ వారు ఆశపడుతున్నారు. ఆ ప్రకారమే సీట్ల లెక్కలు కడుతున్నారు. ఈ రెండింటి మధ్యనా టిడిపి బిజెపి కూటమి అప్రధాన పాత్రలోకి మారిపోవడం అనివార్య పరిణామం. మొత్తంపైన ఎవరికి 50 ప్లస్‌ వస్తాయి ఎవరు బలపరుస్తారు లేక టిఆర్‌ఎస్‌ చెప్పే గాలి పనిచేసి వంటరిగానే సర్కారు ఏర్పరుస్తారా చూడాల్సిందే. మజ్లిస్‌ తన స్థానాలు నిలబెట్టుకుంటుందనీ, సిపిఎంకు కూడా రెండు జిల్లాల్లో సీట్లు వస్తాయనీ, కాంగ్రెస్‌ దెబ్బతినేపక్షంలో దానితో జతకట్టిన సిపిఐపైనా ప్రభావం పడుతుందని మరో అంచనా. వైసీపీకి ఇక్కడ ఒక పార్లమెంటు సీటుతో సహా కొంత ఉనినికి చూపించే అవకాశాలూ వున్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌ భాగంలో వైసీపీకి అనుకూలత ఎక్కువగా వుందనేది క్షేత్రస్థాయి అంచనా. ఇది గత రెండేళ్లుగా కొనసాగుతూ వచ్చిన పరిణామమే. వైఎస్సార్‌ హయాంలో అవినీతి, వాటికి సంబంధించి జగన్‌పై సాగుతున్న కేసులు, విచారణ, జైలుకు వెళ్లిరావడం వంటివాటిపైనే తెలుగుదేశం దాడి కేంద్రీకరించింది. అయితే ఆ కాలంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంపై కేంద్రీకరించింది వైసీపీ. వాటి ప్రభావాన్ని గ్రహించకపోగా ఆయన కేసులపై అహౌరాత్రాలు మాట్లాడుతూ పరోక్ష ప్రచారం కల్పించింది తెలుగుదేశం నాయకత్వం. దీనికే నేను జగన్నామస్మరణ అని పేరు పెట్టాను. అవినీతి కేసుల్లో 16 మాసాలు నిర్బంధంలో వుండి న్యాయస్థానాల ముందున్న వ్యక్తిపై కొత్తగా అదే విమర్శ చేయడం వల్ల ఫలితమేముంటుంది? ఉప ఎన్నికల్లో ఒకటికి రెండు సార్లు ఆ పార్టీ సంచలన విజయాలు సాధించిన తర్వాత కూడా వారికీ వాస్తవం అర్థం కాలేదు. రేపు ఏ తీర్పు వెలువడుతుందనేది కోర్టులకు సంబంధించిన విషయం. కాని ఆ పేరుతో ఆయన రాజకీయ ఉనికినే భరించలేనట్టు మాట్టాడ్డం ఎలా కుదురుతుంది? ఇలా అడిగినందుకు నాపైనా కొన్ని అర్థరహిత వ్యాఖ్యలు రాకపోలేదు. ఆ మాటకొస్తే కేసులను గురించి మాట్లాడితే జగన్‌ పార్టీ, వేరే విషయం మాట్లాడితే తెలుగుదేశం దాడి చేసిన విచిత్ర స్థితి, సీమాంధ్ర అంటే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు అంటే అవతలి వారు తట్టుకోలేని స్థితి చాలాకాలం కొనసాగింది.
జగన్‌ విషయంలో నిజానికి తెలుగుదేశంకు ఒక విధానమే లేదు. మొదట ఆయన తిరుగుబాటు చేసినప్పుడు కాంగ్రెస్‌ బలహీనపడుతుందనే అంచనాతో పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆయన పార్టీ నిలదొక్కుకుంటుందనే కారణంగా అస్తిరత్వంలో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల కూడా ఉదారంగా వ్యవహరించి కొనసాగనిచ్చారు. ఈ రాజకీయ వ్యూహాలలో రాష్ట్ర విభజన అనే అంశం నిజానికి ప్రాధాన్యత కోల్పోయింది.ఏదైతేనేం - కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆ విషయమై స్పష్టంగా నిలబడే బదులు ఎవరు ఎక్కువ 'మైలేజీ' పొందుతారనే రీతిలో వ్యవహారాలు నడిచాయి. ఈ క్రమంలోనూ ఒక దశ తర్వాత వైసీపీ సమైక్యత అన్న నినాదం చేపట్టింది. తెలుగుదేశం, ముఖ్యంగా దాని అధినేత రకరకాల తికమకలకు గురైనారు. విభజనకు కట్టుబడివున్నామంటూ ఆనాటి లేఖ జిరాక్సులు ఇస్తూనే దాన్ని ఆపాలని పర్యటనలు చేశారు. ఇందాక చెప్పుకున్న ఎన్నికల లెక్కల్లో నరేంద్ర మోడీ సరసన చేరేందుకు ఆరాటపడి లౌకిక శక్తులకూ మైనార్టిలకూ దూరమైనారు. విభజన జరిగిపోయాక ఆయనైతేనే స్వర్ణాంధ్ర నిర్మించగలరనే ఒక ప్రచారం తీసుకొచ్చి దాన్ని తమకు తామే తీవ్రంగా నమ్మడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా చిరపరిచితుడైన నేత గురించి ప్రజలకు ఎవరైనా చెప్పవలసింది ఏముంటుంది? పైగా ఆ సమయంలోనే మోడీత్వను నెత్తిన పెట్టుకోవడం, మధ్యలో తెంచుకున్నట్టు మాట్లాడి మరో సీటు తగ్గించి పొత్తు సాగించడం ఇవన్నీ రాజకీయంగా నష్టదాయకాలే. ఆఖరులో తెచ్చిపెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌ కూడా నాకు చంద్రబాబు పట్ల తెలుగుదేశం పట్ల ప్రేమ లేదు అని ఒకటికి రెండు సార్లు చెబితే మాట్టాడి దారికి తెచ్చుకుని త్రిమూర్తులుగా వూరేగడం దేనికి సంకేతం? పాలనా దక్షుడుగా ప్రజలు ఆయనను గెలిపిస్తారని తెలుగుదేశం నేతలు ఇప్పటికీ చెబుతున్నారు. బుధవారం ఉదయం కూడా ఒక మాజీ మంత్రి తమకు 110 స్థానాలు వస్తాయని నాతో అన్నారు. చంద్రబాబు మీడియా గోష్టిలోనైతే అంతకన్నా ఎక్కువే చెప్పి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వివిధ చోట్ల నుంచి తరగతుల నుంచి వస్తున్న సమాచారం కనిపించే పరిణామాలు చూస్తే మాత్రం అలా అనిపించదు. మోడీ మోత అనేది ఆంధ్రప్రదేశ్‌లో మిథ్యగానే మిగలొచ్చు.
కాంగ్రెస్‌పార్టీ దాదాపు ఉనికి కోల్పోయింది గనక చెప్పడానికి ఏమీ లేదు. ఇక ఉభయ కమ్యూనిస్టుపార్టీల ప్రభావం కూడా ఈ ఎన్నికల వరకూ దాదాపు వుండకపోవచ్చు. తెలుగుదేశం, వైసీపీల మధ్య పోరులో ఎన్నికల స్వరూపమే మారిపోయింది.సంపన్న వర్గాల క్రీడగా తయారైంది. ఫిరాయింపులూ, ధన ప్రవాహాలూ, కార్పొరేట్‌ ప్రాబల్యాల మధ్య పార్టీల వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. విభజనకు సంబంధించిన ఆవేదన నేపథ్యంలో ఎన్నికలు జరిగినా ఆచరణలో వ్యక్తుల మధ్య ధన శక్తుల మధ్య అధికార పోరాటంగానే ఇది పరిణమించింది. ఉద్యమాలూ ప్రజాస్వామిక భావాలకు మూలపీఠమైన ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలను ప్రజాస్వామిక పథంలోకి మళ్లించే కృషిని పున:ప్రారంభించవలసి వుంటుంది.అలాగే తెలంగాణ ఏర్పడిందనే ఆశలతో అధికార సోపానాలు నిర్మించుకోవాలనుకునే వ్యూహాలకు భిన్నంగా మధ్య ప్రజా బాహుళ్య ప్రధానమైన విధానాల కోసం పెనుగులాడవాలసీ వుంటుంది. అభ్యుదయ వాదులనూ ఆలోచనా పరులనూ అపహాస్యం చేసే ఈ వాతావరణం నుంచి వారి పునరేకీకరణ జరగవలసే వుంటుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ బిజెపిలు గాక తృతీయ శక్తులు వచ్చేట్టయితే ఆ కృషి మరింత వేగం పుంజుకుంటుంది. అప్పుడు వైసీపీ వంటివి కూడా ఆ దిశలోకి వచ్చే అవకాశం వుంటుంది. ఏది ఎలా వుంటుందనేది ఫలితాల తీరుతెన్నులపై ఆధారపడి వుంటుంది. తర్వాత కూడా ఆ ఫలితాలలోనే మునిగితేలకుండా దీర్ఘ కాలిక విధాన లక్ష్యాల కోసం విస్త్రత వేదికలతో ఉద్యమించవలసీ వుంటుంది. (ఆంధ్రజ్యోతి - గమనం - 8.5.14)

No comments:

Post a Comment