Pages

Sunday, May 4, 2014

బెట్టు... ఎబ్బెట్టు..






అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ గాదు అని ఏనాడో చెప్పాడు వేమన్న. మేడిపండు పొట్ట విప్పిచూస్తే పురుగులున్నట్టేనని పిరికివారి బింకాన్ని పోల్చి చెప్పాడా ప్రజాకవి. ఓటమి అంచుల్లో వుండి హాహాకారాలు పైకి వినిపించకుండా నానాతంటాలు పడుతున్న కాంగ్రెస్‌ నేతలు ఇంకా మేకపోతు గాంభీర్యం వెలగబెట్టడం ఆ తంతునే తలపిస్తుంది. ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కల్లో తేడాలు వుండటం తప్పిస్తే కాంగ్రెస్‌ ఘోర పరాజయం గురించి ఎలాటి సందేహం ఎవరికీ రావడం లేదు. ఈ కారణంగానే విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ వంటివారు కూడా తాము అవసరమైతే తృతీయ కూటమికి మద్దతిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఆఖరులోనైనా అధికార పక్షానికి అధిష్టానానికి ఆ మాత్రం విజ్ఞత కలిగిందని లౌకిక వాదులు సంతోషించారు. మోడీ మతతత్వ కూటమి అధికారం చేపట్టకుండా నిరోధించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆశించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌తో సహా వామపక్ష ప్రాంతీయ పార్టీల నేతలు పలువురు ఇలాటి అంచనానే ప్రకటించారు. ఉన్నంతలో ఫలితాల తర్వాత చూస్తే కాంగ్రెస్‌కు అంతకన్నా గత్యంతరం వుండదనేదీ సుస్పష్టం. అయినా సరే ఇలాటి వార్తలు రావడం తమను పలుచన చేస్తుందని కంగారు పడిన యువరాజు రాహుల్‌ గాంధీ ఖండనలు విడుదల చేశారు. తద్వారా తమ అపరిపక్వతనూ అసహనాన్నీ బయిటపెట్టుకున్నారు.
ఈ దేశ రాజకీయ నేపథ్యంలో తృతీయ కూటమి అధికారం చేపట్టడానికి గల అవకాశాలను గురించి గతంలోనే మేము ప్రస్తావించాము. ఫలితాల తర్వాత ఏ పరిస్థితుల్లో ఏ శక్తుల కలయికతో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందనేది ఫలితాల తర్వాత మాత్రమే తెలియాల్సిన విషయం. ఆ క్రమంలో బలీయమైన ప్రాంతీయ లౌకిక పార్టీలూ స్థిరమైన వామపక్షాల పొందికతో తృతీయ శక్తి అధికారం చేపట్టడం కూడా ఒక అవకాశం. కాని ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి అంగీకరించినా ప్రకటించడానికి అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ కూడా సిద్ధంగా లేవు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా
తమ రెండు పార్టీల మధ్యనే రాజకీయ రంగుల రాట్నం తిరగాలన్నది వాటి కాంక్ష. అయితే వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన ఎన్‌డిఎ పాలనను మినహాయిస్తే ఇప్పటి వరకూ కేంద్రంలో వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలన్నీ మౌలికంగా తృతీయ శక్తుల కలయికలే.
1977లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరిచిన జనతా పార్టీ కావడానికి ఏకపార్టీ అయినా అందులో అందరికీ భాగం వుంది. సిపిఎం ఎన్నికల ముందే బయిటనుంచి బలపర్చింది కూడా. కాగా దాన్ని కూలదోసింది మాత్రం ఆరెస్సెస్‌ ప్రేరిత మాజీ జనసంఫ్‌ు విభాగమే. తర్వాత మళ్లీ 1989లో ఎన్టీఆర్‌ చైర్మన్‌గా వున్న నేషనల్‌ ఫ్రంట్‌ విపిసింగ్‌ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి బిజెపి వామపక్షాలు బయిటనుంచే మద్దతు నిచ్చాయి. దాన్ని కూడా రథయాత్ర చిచ్చు పెట్టి బిజెపి వెన్నుపోటు పొడిస్తే కాంగ్రెస్‌ చేయి కలిపింది. అది పడిపోయిన తర్వాత చంద్రశేఖర్‌ను ప్రధాని పీఠంపై కూచోబెట్టి మూడు మాసాలు నడిపించింది. తర్వాత కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వున్నా రాజీవ్‌ గాంధీ ఎన్నికల మధ్యలో హత్యకు గురి కావడంతో మలిదఫా పోలింగ్‌ జరిగిన స్థానాల్లో ఆధిక్యత పొంది మైనార్టీ ప్రభుత్వం ఏర్పరిచింది. దాన్ని చాలా కాలం బిజెపి బతికించింది. 1992 డిసెంబరు6న బాబరీమసీదు విధ్వంసం తర్వాత పరిస్థితి మారి బిజెపిని నిరోధించడం కోసం వామపక్షాలు తటస్తంగావుండాల్సి వచ్చింది.మూడోసారి 1996లో ఎన్నికల అనంతరం ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ తరపున దేవగౌడ ప్రధాని కాగా ఏడాది తిరక్కుండానే బలపర్చిన కాంగ్రెస్‌ కూలదోసింది. తర్వాత గుజ్రాల్‌ను ప్రధానిని చేస్తే ఎనిమిది మాసాల్లో పడగొట్టింది. దేవగౌడకు ముందు వాజ్‌పేయి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచి లోక్‌సభలో బలపరీక్ష ప్రహసనం జరిపి బలపర్చేవారు లేక 13 రోజుల్లోనే పడిపోయిన దుస్థితిని దేశం చూసింది. కాని 1998 తర్వాత ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా వుండి ఎన్‌డిఎ వైపు దూకడం వల్లనే వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడినా ఏడాదిలోనే అవిశ్వాసంతో కూలిపోయింది. అయితే అనుకోకుండా కలిసొచ్చిన కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలోనే మరో దఫా అవకాశం లభించింది. అయితే ఇంతటికీ మూలం మాత్రం చంద్రబాబు మొదటిగా అటువైపు ఫిరాయించడమే. వాజ్‌పేయి హయాంలో గుజరాత్‌ మారణహౌమంతో సహా అనేక అఘాయిత్యాలు అవినీతి వ్యవహారాలు జరగడంతో దాన్ని గద్దె దింపేందుకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. వాటి మద్దతు వల్లనే కాంగ్రెస్‌ నాయకత్వంలో యుపిఎ1 అధికారంలోకి రాగలిగింది.అణుఒప్పందానికి వ్యతిరేకంగా వారు ఓటు చేశాక అక్రమ మార్గాల్లోఅధికారం నిలబెట్టుకుని మరోసారి గెలుచుకున్నది. అయితే అందుకు కారణం మాత్రం లౌకిక ప్రాంతీయ పార్టీలు మద్దతు నివ్వడమే.

గత పాతికేళ్లలో ప్రభుత్వాల ఏర్పాటు చరిత్రను పరిశీలించినప్పుడు ప్రాంతీయ పార్టీలూ వామపక్షాల కీలకపాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా కొంతమంది దాన్ని దాటేయడం హాస్యాస్పదం. వాటికి విలువ లేనట్టు నిలకడ లేనట్టు చిత్రించేవారు రెండు పార్టీల గుత్తాధిపత్యాన్ని తీసుకురావాలని కలలు కంటున్నారు. అయితే వైవిధ్య భరితమైన ఈ దేశంలో అది సాధ్యమయ్యేది కాదని ఆయా రాష్ట్రాలలో వివిధ పార్టీలకున్న పట్టు కాదనలేని సత్యమని అందరికీ తెలుసు. అవినీతి కుంభకోణాలు అస్తవ్యస్త పాలనతో అభాసుపాలైన కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం గనక ఆ స్థానంలో బిజెపిని మరీ ముఖ్యంగా మోడీని ప్రతిష్టించాలని కార్పొరేట్‌ శక్తులు కలలు కంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బిజెపియేతర ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెల్పడం తప్ప కాంగ్రెస్‌ చేయగలిగింది ఏముంటుంది? అలాగాక రాహుల్‌ గాంధీ అంటున్నట్టు ప్రతిపక్షంలో కూచుని మతతత్వ శక్తులకు అవకాశమిస్తానంటే భవిష్యత్తులో కూడా మళ్లీ పుంజుకోవడం జరక్కపోవచ్చు. మరి ఆయన మిగిలిన పోలింగు దృష్ట్యా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా లేక నిజంగానే అంటున్నారా అనేది ముందు ముందు చూడాలి.

No comments:

Post a Comment