Pages

Thursday, September 15, 2011

కృష్ణశాస్త్రీయ గీతామృతం


తెలుగు తియ్యదనమూ, ప్రకృతి సౌందర్యమూ, ప్రేమ సౌకుమార్యమూ, మానవీయ మహత్వమూ కలబోసుకున్న మధుర భావకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవితా పితామహుడుగా సుప్రసిద్ధుడైన ఆయన తెలుగు సినిమా పాటకూ గోరింట వన్నెలు అద్దారు. తర్వాతి కాలంలో మరెవరైనా సున్నితమైన పదాలతో సుకుమార గీతాలు రాసినా వాటిని వెనువెంటనే కృష్ణశాస్త్రి రచనలుగా పరిగణించేంత బలంగా చెరగని ముద్రవేశారు. మనసు లోలోతులు తాకే మధుర వీవన వంటిది ఆయన పాట. గుండెలలో గులాబీలు పూయించే సృజన శీలత ఆయన కలానిది. రాసిన పాటల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం ప్రాభవం అనితర సాధ్యమైనవి. మల్లీశ్వరితో బిఎన్‌రెడ్డి రంగ ప్రవేశం చేయించిన దేవులపల్లి వాణిజ్య చిత్రాలలోనూ తన బాణీ నిలబెట్టుకోవడం అసాధారణ విజయం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి చలన చిత్ర గీతాలు గతంలో మేఘమాల,గోరింట పేర్లతో సంపుటాలుగా వెలువడ్డాయి.ఇప్పుడు ఆ రెంటినీ కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ వారు ఒకే పుస్తకంగా తెచ్చారు. కృష్ణశాస్త్రి రచనా సర్వస్వంలో మూడవ సంపుటంగా వెలువడిన ఈ వెండితెర పాటలు రస హృదయులైన ప్రేక్షకులకు కవితాభిమానులకు గొప్ప కానుకలేనని చెప్పాలి.
సహజంగానే ఈ పుస్తకం మల్లీశ్వరి పాటలతో మొదలవుతుంది. అందులోని పదిహేను పాటలు కృష్ణశాస్త్రివే. అందులోకోతి బావకు పెళ్లంట, పరుగులు తీయాలి, పిలిచినా బిగువటరా వంటివి బాగా గుర్తున్నవే కాని అంతకంటే ప్రసిద్ధమైనవి ఇంకా చాలా వున్నాయి. పుస్తకానికి శీర్షికంగా అమరిన 'అందాల ఓ మేఘమేలా' 'ఔనా నిజమేనా' మనసున మల్లెల మాలలూగెనే వగైరాలు. బిఎన్‌ తీసిన మరో కళాఖండం ' బంగారు పాప'లో 'తళాంగు థకదిమి తోల్‌ బొమ్మ దీని తమాష చూడవె కీల్‌బొమ్మ' అన్న పాట వేదాంత ధోరణిలో సాగితే 'యౌవన మధువనిలో వన్నెల పూవుల వుయ్యాల' అనేది చక్కటి ప్రేమ గానం.'భాగ్యరేఖ'లోనూ ఆయన చాలా పాటలు రాశారు గాని అందులో
ఏడుకొండల వాడిపై రాసిన ' నేవుండే దా కొండపై, నా స్వామి నే వుండేదీ నేలపై' అన్న పాట బాగా ఆదరణ పొందింది. పూజాఫలములో పగలే వెన్నెల వంటి ప్రసిద్ధమైన పాటలు ఇతర కవులవి వున్నా 'ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా నిదురరాదు కనులకు,శాంతిలేదు మనసుకు' అన్న కృష్ణశాస్త్రి పాట ఒక ప్రత్యేక తరహాలో సాగుతుంది. 'రాజమకుటం'లో 'సడిసేయకోగాలి సడిసేయబోకె' కూడా చాలా కర్ణపేయం. 'భక్త శబరి'లో ఆయన చాలా పాటలు రాశారు గాని వాటిలో ' ఏమి రామకథ శబరీ శబరీ ' అంటూ పిబిశ్రీనివాస్‌ గానం చేసింది చాలా అద్భుతంగా వుంటుంది.(విశేషం ఏమంటే శబరి గురించే తర్వాత సంపూర్ణ రామాయణం'లో ఎందుకో కొలను నీరు వులికి వులకి పడుతుంది అంటూ ఆయనే చాలా విలక్షణమైన పాట రాశారు. శ్రీరామపట్టాభిషేకం పేరిట ఎన్టీఆర్‌ ఆఖరి రోజులలో తీసిన చిత్రంలోనూ శబరి గీతం ఆయనదే)

70వ దశకంలో కృష్ణశాస్త్రి సినిమా పాటలు కొత్త పుంతలు తొక్కాయి. సుఖదు:ఖాలులో రెండు పాటలు వాటికి మకుటాయమానమైనవి.'మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు' అంటూ అన్నయ్య చెల్లిగురించి పాడే పాట ఒకటి. అమాయకంగా మోసపోయిన చెల్లెలు అన్నకు చెప్పలేని తన బాధను 'ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొండర పడి ఒక కోయిల ముందే కూసింది' అంటూ పాడే ఆవేదనా భరిత గీతం మరొకటి.ఈ పాటలోని ముందే కూసిన కోయిల అన్న ప్రయోగం అంతకు ముందటి 'ఔనా నిజమేనా' లాగే తెలుగులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఎండకు కమిలిపోయిన కోయిల ఉదాహరణతో ఆయన వంచనకు బలై పోయే అభాగ్య మహిళల మూగవేదనను సాక్షాత్కరింపచేశారు.విశ్వనాథ్‌ ప్రతిభను చూపించిన 'ఉండమ్మా బొట్టుపెడతా'లో పాటలన్ని చాలా బావుంటాయి. 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా' పాటలో సంక్రాంతి సోయగాలు శాశ్వతం చేస్తే పాతాళగంగమ్మ రారారా పాటలో రైతుల ఆనందాన్ని కళ్లకుకట్టారు. పగబట్టే పామల్లే పైకీ పాకీ పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ అనడంలో అచ్చమైన ఆయన ముద్ర కనిపిస్తుంది. మొత్తం పాట ఇదే తూగుతో వూపుతో వుంటుంది. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటుచూస్తే తప్పని అన్నపాట లలిత శృంగారాన్ని ఒలికిస్తుంది. 'అడుగడుగున గుడి వుంది, అందరిలో గుడి వుంది' పాట దైవభావనకు మానవ స్పర్శ అద్ది శాస్త్రి గారి బ్రహ్మ సమాజ చరిత్రను గుర్తు చేస్తుంది. ప్రతిపులుగూ ఎగిరే దైవం, ప్రతి మనిషీ నడిచే దైవం అంటూ ముగిస్తుంది. చాలులే నిదురపో జాబిలి కూనా, శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన పాటలు కూడా గొప్ప ప్రకృతి స్పూర్తినింపేస్తాయి. అమాయకుడు చిత్రంలో 'మనిషైతే మనసుంటే కరుణ కురియాలిరా కురిసి జగతి నిండాలిరా' అనే పాట కూడా కరుణ రస ప్రధానమైన ఆయన కలం తత్వాన్ని చెబుతుంది.డాక్టర్‌ ఆనంద్‌ కోసం రాసిన నృత్యనాటిక పాట 'నీలమోహనా రారా, నిన్ను పిలిచే నెమలి నెరజాణ' గొప్ప సంగీత రసమయం.
బంగారు పంజరంలో ఆయన మామూలు శైలికి భిన్నంగా జానపద బాణీలలో రాసినా సుకుమారత తగ్గలేదు.గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో నల్లకనులనాగసొరమూ వూదేరు, పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా వంటి వాటిలో నర్మగర్భ శృంగారం తొంగిచూస్తుంది. ఈ చిత్రంలోనూ నీ పదములె చాలును రామా అంటూ కొత్త రామగీతాన్ని రచించారు. మహబూబ్‌ మదర్‌ ఇండియా ఆధారంగా తెలుగులో తీసిన బంగారు తల్లి కోసం ఆయన రాసిన పాటలతో మేఘమాల అన్న మొదటి భాగం ముగుస్తుంది.
గోరింట అన్న రెండవ భాగంలో ఈ తరానికి కూడా పరిచితమైన కొన్ని పాటలున్నాయి. ప్రారంభమే అమోఘమైన ఏకవీర పాట.' ప్రతిరాత్రి వసంత రాత్రి, ప్రతిగాలి పైరగాలి' తో. ఘంటసాల బాలు కలసి పాడిన అతికొద్ది గీతాల్లో ఇది తలమానికమైంది. మాయని మమతలో ' రానిక నీ కోసం సఖీ రాదిక వసంత మాసం' అన్న పాట అక్షరాల దేవులపల్లి తరహాకు చెందుతుంది.
చెల్లెలి కాపురంలో నృత్య నాటిక పాట డాక్టర్‌ ఆనంద్‌లోని నీలవేణి కథనే మరోరూపంలో చెబుతుంది.అయితే ఇది కూడా హృద్యంగానే వుండటం విశేషం.'అమ్మమాట'లో ' ఎంతబాగ అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా, వేలెడైన లేవుటా వేదంలా విలువైన మాట' అంటూ కొడుకును చూసి మురిసే తల్లి మనసును సాక్షాత్కరింపచేశారు.జగత్‌ కిలాడిలు వంటి ఫక్తు వాణిజ్య చిత్రంలోకూడా 'ఎగిరే పావురమా,దిగులెరుగని పావురమా' అంటూ సున్నితమైన పాటను పొందించడం ఆయనకే చెల్లుతుంది. కాలం మారింది చిత్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన కడజాతి పాపను ఉద్దేశించి ' ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి వూపేను జోల, ఎవరికి నీవు కావాలి,ఎవరికి నీ మీద జాలి' అంటూ ఆర్ద్రగీతం రచించారు.సంపూర్ణ రామాయణంలో రామజననం నుంచి సీతారామ కళ్యాణం వరకూ మొత్తం కథను కొద్ది చరణాలలో బాపు చిత్రిస్తే అందుకు అనుగుణమైన సాహిత్యం అందించారు. (ఇదే చిత్రంలో శబరి పాట గురించి పైన ప్రస్తావించుకున్నాం)
కళ్యాణం కోసం పరితపించి విషాదాంతం చెందిన అమ్మాయి కథ' కళ్యాణమంటపం'లో 'సరిగమ పదనిసా నిదప మగరిస ' అంటూ కేవలం సప్తస్వరాలే పల్లవిగా ఆయన రాసిన పాట 'పలికే వారుంటే హృదయమూ తెరిచివారుంటే' అలా హత్తుకు పోతుంది. అలాగే భక్త తుకారాంలో ఘనాఘన సుందర పాటలో కూడా దైవ స్మరణకు ప్రకృతి వర్ణణను జోడిస్తారు.' మంచి రోజులు వచ్చాయి'లో పందెంలో భార్యగా గెలుచుకొచ్చిన ధనవంతుని కుమార్తెను ఉద్దేశించి నాయకుడు పాడే పాట ' నేలతో నీడ అన్నది నను తాకరాదని, పగటితో రేయి అన్నది నను తాకరాదని' . ఈ పాట వెనక సన్నివేశం అసహజమైనది, ఇతివృత్తం కూడా గొప్పదేమీ కాదు.అయినా కృష్ణశాస్త్రి పొహళింపుతో ఆ పాటకే గాక చిత్రానికే గొప్ప నిండుదనం వచ్చింది.
సాధారణ చిత్రాల్లోనూ అసాధారణ అనుభూతినిచ్చే గీతాలు రాస్తారు.'ధనవంతులు గుణవంతులు' అనే చిత్రంలో ' తెరచి వుంచేవు సుమా పొరబడి నీ హృదయమూ, బిర బిర ఏ సుందరియో చొరబడితే ప్రమాదమూ' అన్న పల్లవితో సుతిమెత్తని హెచ్చరికగా సాగుతుంది.చీకటి వెలుగులు చిత్రంలో చీకటి వెలుగుల కౌగిటిలో చిందె కుంకుమ వన్నెలు' అన్న యుగళ గీతం ప్రకృతి వర్ణాలను శొభస్కరంగా ఆవిష్కరిస్తుంది. మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలూ నీ మెడచుట్టూ గులాబీలు నీ సిగపాయల మందారాలు ఇలా పాట మొత్తం పూలజలతారులా సాగిపోతుంది.కులాంతర వివాహాలకు సంబంధించిన బలిపీఠంలో పాట 'కుశలమా నీకు కుశలమేనా' పాట మాట్లాడుకున్నట్టుగా నడిచే మధురగీతం. ' ఈనాటి బంధం ఏనాటిదో' అనే హాస్య చిత్రంలోనూ ఆయన 'ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు' అంటూ ప్రకృతి వర్ణనతోనే 'ఇష్టదేవతార్చన' చేస్తారు.అన్నదమ్ముల కథలో పొంగిపొర్లే జల ప్రవాహాలను అంతే వేగంగా దూకే పదజాలంతో వర్ణించే పాట 'కదలిరా జలధరా' .
మరపురాని మధుర గీతాలు మరికొన్ని. రెండవ భాగం శీర్షికగా పొందిన గోరింటాకు పాట ' గోరింటపూచింది కొమ్మ లేకుండా'. 'కార్తీక దీపం'లో ఆరనీకుమా ఈ దీపం', అమెరికా అమ్మాయిలో 'పాడనా తెలుగు పాట..పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట' సీతామాలక్ష్మిలో 'మావి చిగురు తినగానే కోయిల పలికేనా' అన్నిటినీ మించింది 'శ్రీరాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌'లో పాట ' పేరు బికారి నా దారి ఎడారి' విసుగు రాదు, ఖుషీపోదు వేసట లేనేలేదు,అసలు నా మరోపేరు ఆనంద విహారి అంటూ సామాన్యుల సంతోషాలను సంకల్పాలను అక్షరీకరించారు.

మినహాయించవలసిన వాటికంటే ఉదహరించవలసినవే అత్యధికంగా వుండే కవి దేవులపల్లి. అయినా ఆఖరులో చెప్పుకోవలసింది మళ్లీ మొదట్లో వున్న లాటి మేఘమాల పాటలే. మేఘ సందేశంలో ఉపయోగించిన ఆయన గీతాలు . అప్పటికే ప్రసిద్ధమైనవి కూడా ' ఆకులో ఆకునై పూవులో పూవునై' అన్నది ప్రకృతితో మమేకతను చూపిస్తే 'శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు, ఎదలోపల పూలకారు ఏనాటికి పోనీయకు' అంటూ నిత్య నూతనత్వాన్ని చెబుతుంది. 'ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా మందమతిని,నీవు వచ్చు మధుర క్షణమేదో' అంటూ సాగే మరో గీతం ఆయన శైలిలో అ లౌకికాకనందం కోసం నిరీక్షణను చిత్రిస్తుంది. ఘంటసాల,భానుమతి,సుశీల, జేసు దాసు,బాలు వంటి గాయకులు ఆయన పాటలను అజరామరం చేశారు. ఎక్కువ సందర్భాల్లో ప్రకృతిప్రేమతో ఇష్టదేవతార్చన చేసే దేవులపల్లి గీతాలలో సామాజిక సృహ కన్నా సౌందర్యారాధనే అధికమనిపించినా మానవీయ స్పర్శ, అక్షర అమరిక మరచిపోలేని అనుభూతిని మిగిలిస్తాయి. అందుకే చలన చిత్ర గీతాలలో ఆయనది ఒక ప్రత్యేక ప్రకరణం.

3 comments:

 1. చాలా బాగుంది రవి గారు..మొత్తం క్రిష్ణశాస్త్రి గారి పాటలన్నీ సవివరంగా రాసారు...ధన్యవాదాలు..

  ReplyDelete
 2. ఏ పోస్ట్ వ్రాసినా ఒకే కమిట్మెంట్ తో వ్రాయటం
  మీకే చెల్లింది రవి గారూ,దేవులపల్లి వారి గురించి ఏ వాక్యాన్ని ,
  ఏ,విషయాన్ని వదలకుండా వ్రాసారు.నా చిన్నప్పుడు స్కూల్
  గోడలపై "ప్రతి మనిషీ నడిచే దైవం" అని నేను వ్రాసిన కొటేషన్
  ఇప్పటికీ ఉంది

  ReplyDelete
 3. మీ స్పందనకు ధన్యవాదాలు. సాహిత్యం, సినిమాలు, మీడియా వగైరాలపై నేను రాసిన వ్యాసాలను బ్లాగులో పోస్టు చేసే అవకాశం కుదరక తక్షణ రాజకీయ సామాజిక పరిణామాలకే పరిమితమైనాను. ఇప్పుడు వీలు చిక్కడం, మీరు వెంటనే చూడటం సంతోషం.ఇంకా ఏమైనా సూచనలుంటే చెప్పగలరు.

  ReplyDelete