Pages

Friday, October 12, 2012

మోడీని మోయడానికి కారణం



గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదేళ్ల తర్వాత వీసా ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించడం పాశ్చాత్య దేశాల వ్యూహంలో మార్పును సూచిస్తుంది. రేపు అమెరికా చేసే పని ఈ రోజు బ్రిటన్‌ చేస్తుందనేది ఇరాక్‌ యుద్ధం నుంచి అర్థమవుతూనే వుంది. గత ఏడాది కాలంలోనే అమెరికా సెనేట్‌, విదేశాంగ నిపుణులు నెమ్మదిగా మోడీ వైపు మొగ్గుతుండడం చూస్తున్నాం. రాబోయే ఎన్నికలు మోడీకి రాహుల్‌కు మధ్యనే అని అధికారిక నివేదికలో అభివర్ణించడం కూడా ఇలాటిదే. గుజారాత్‌లో 2002లో జరిగిన జాతి హత్యాకాండకు అధికారంలో వుండి ఆధ్వర్యం వహించిన మోడీ విషయంలో వారి వైఖరి మారడానికి ఇంతకన్నా కారణం లేదు. ఆ మత మారణహౌమంలో ఆయన పాత్ర ఏమైనప్పటికీ ఆ కారణంగా వీసా నిరాకరించడాన్ని దేశంలో పార్టీలన్నీ ఖండించాయి. అయినా వారు పట్టించుకోలేదు. ఇప్పుడు తమకు తామే ఏకపక్షంగా స్వాగతం పలుకుతున్నారంటే ఇది వైదేశిక విధాన అవసరాల కోసమేనన్నది స్పష్టం. వాస్తవానికి ఈ కాలంలో మోడీ గత మంత్రి వర్గ సభ్యులకు కోర్టు శిక్షలతో సహా అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికే యుపిఎను లొంగదీసుకుని మన్మోహన్‌ సర్కారునుంచి అనేక అనుకూల నిర్ణయాలు రాబట్టిన అమెరికా కూటమి మరింత సాధించుకోవడానికి గాను మోడీ మోత మోగించుతున్నట్టు కనిపిస్తుంది. దీనికే ఉబ్బిపోయిన మోడీ మహాశయులు విదేశాలు మనకన్నా ముందు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నాయన్నట్టు మాట్లాడారు.అన్నిటికంటే వింత ఏమంటే మత సామరస్య దృష్టితో పరస్పర కలహాలు వద్దని చెప్పిన వివేకానందుని పేరిట ఆయన యాత్ర చేసి ముగింపులో ఈ ఆణి ముత్యాలు వినిపించడం! హతవిధీ!

No comments:

Post a Comment