ట్యాంకు బండ్‌పై తెలుగు ప్రముఖుల విగ్రహాల విధ్వంసం ప్రజాస్వామిక భావనల పట్ల గౌరవం వున్నవారంతా నిశితంగా ఖండించవలసిన చర్య. మీడియా ప్రతినిధులపై దాడి, కెమెరాల విధ్వంసం ఇంకా దారుణమైనవి. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నాయకులపై దౌర్జన్యం గతంలో ఇక్కడి ఇద్దరు ఎంఎల్‌ఎలపై జరిగిన దానికి కొనసాగింపు. వీటిని ఖండించడమంటే తెలంగాణా ప్రజలను లేదా ఉద్యమాన్ని అవమానించడంగా చేసే వ్యాఖ్యలు రెండు విధాల పొరబాటు. ఒకటి - జరిగిన దాన్ని పరోక్షంగా సమర్థించడం, రెండు - తమ నిర్వాకాన్ని ప్రజలందరికీ ఆపాదించడం. మార్చ్ నిర్వాహకులు విగ్రహ విధ్వంసం అసమంజసం అంటూనే అదేదో తెలంగాణా సాంసృతిక ఆధిపత్యంపై పోరాటానికి వ్యక్తీకరణ అంటూ ఆమోద ముద్ర
వేస్తున్నారు. ఈ వితండంలో విలువల విధ్వంసం మరింత విడ్డూరనమైంది.
విడిపోయినా కలిసి వుండొచ్చని హితవు చెప్పేవారు నిన్నటి తరం మహనీయుల విగ్రహాలను కూడా చిరునామాలను బట్టి చూసి విధ్వంసం చేయడం దేనికి నిదర్శనం? కరసేవకులు, తాలిబాన్లు, శివ సైనికుల వంటి వారు తప్ప లౌకిక ప్రజాస్వామిక వాదులెవరూ ఇలాటి పనులకు పాల్పడరు. లోగడ కరసేవలకు ఆధ్వర్యం వహించిన,ఇప్పుడు కూడా విధ్వంస ఘట్టంలో భాగస్వాములుగా వున్న నేతలే అందరికన్నా ముందు ఖండించడం ముందు జాగ్రత్త కావచ్చు. ద్వంద్వ భాషణాల కాంగ్రెస్,తెలుగు దేశం, బిజెపిలను అలా వుంచితే సిపిఐ, న్యూ డెమోక్రసీ నాయకులు, ప్రతినిధులు కూడా విధ్వంసాన్ని ఖండించారు గాని అలాటి సందర్బంలో భాగం పంచుకుని ఆ పైన ఏం చెప్పినా జరిగిన వికృతం మాసిపోదు.
రాష్ట్ర రాజధానిలో సచివాలయ సమీపాన ఏదైనా ఏర్పాటు చేసేప్పుడు మొత్తం రాష్ట్రాన్ని గమనంలో వుంచుకోవడం సహజం. దాంతో పాటే సామాజిక పొందికను కూడా చూడక తప్పదు. తన చేతనైన మేరకు వివిధ కోణాల నుంచి చూసి అన్ని ప్రాంతాల వారితో యోచించి ఎన్టీఆర్ ప్రభుత్వం 1986లో విగ్రహాలను ప్రతిష్టించింది. వారిిలో దాదాపు అందరూ సంస్కర్తలు కవులు కళాకారులు చారిత్రిక వ్యక్తులే. మాననీయులే.కాస్త తేడాలున్నా- కెసిఆర్, జానారెడ్డి, నాగం, సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, అందరూ - వాటిని స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ పార్టీ వెనకే వున్నారు. ఇప్పుడు వారు విధానం మార్చుకోవచ్చు. అంతమాత్రాన గడియారం వెనక్కు తిరగదు. 1986లో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తే ఆ తర్వాత కాలంలో మరణించిన దాశరథి, కాళోజీ,అయిలమ్మ వంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం అలాటిదే కొమరం భీం విగ్రహం పెట్టడానికి అందరూ అంగీకరించినా అలక్ష్యం చూపింది పాలకులే తప్ప ప్రాంతాల తేడాలు కాదు,
అస్తిత్వం గురించి, ఆధిపత్యాల గురించి ఎంతైనా మాట్లాడవచ్చు గాని దానికి అనేక కోణాలుంటాయి. తెలంగాణా ప్రజలు వెట్టిచాకిరీలో మగ్గిపోవడానికి కారణమైన నిజాంను నెత్తిన పెట్టుకుని మాట్టాడటం ఒకవైపు- నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్న దాశరథి విగ్రహం పెట్టాలనడం మరో వైపు ఎలా పొసుగుతాయి? హైదరాబాదులో 1946-51 నాటి తెలంగాణా సాయుధ పోరాట వీరుల స్థూపాలు పెట్టకపోవడానికి వారి కమ్యూనిస్టు రాజకీయాలు ప్రధాన కారణం. ఈ పదేళ్లలో ప్రాంత స్మరణ చేసిన వారైనా ఆ విగ్రహాలను ఎన్ని చోట్ల పెట్టారు? దొడ్డి కొమరయ్య, అయిలమ్మ భవనాలు కమ్యూనిస్టులు పెట్టుకున్నారే గాని వీరు కాదే? తెలంగాణా సాయుధ పోరాట తొలిఅగ్ని కణం దొడ్డి కొమరయ్య చిత్రం కూడా లేదు.ఇటీవలనే పన్నీరు రమేష్ అనే మిత్రుడు కడవెండిపై పరిశోధన చేసి కొమరయ్య కవల అయిన వాళ్ల అన్నయ్య చిత్రం తెస్తే దాని ఆధారంగా ఒక వూహా చిత్రం ప్రజాశక్తి బుకహేౌస్ తీసుకొచ్చిన పుస్తకంలో ప్రచురించాము.ఈ రచయిత సంపాదకత్వంలో వెలువడిన వీర తెలంగాణా మాది పుస్తకంలోనూ అలాటి వీరుల కథలు అనేకం వున్నాయి. ఆ పైన వరంగల్ జిల్లా వీర గాధలు పుస్తకం వచ్చింది, నల్గొండకు సంబంధించింది రాబోతుంది. వీటిలో విప్లవ చైతన్యం వున్నా విభజన రాజకీయాలుండవు గనకే కొందరికి గిట్టదు. అది వారి ఇష్టం. కాని ఇప్పటి తమ విభజన వాదాన్ని వందల ఏళ్లనాటి ఎర్రాప్రెగడకు, మొల్లకు వర్తింపచేయడం ఏ నాగరికత? ఏ విధమైన చారిత్రికత? రాముణ్ని కూడా మానవీయంగా చిత్రించిన మొల్ల, చాప కూటితో సమతను నేర్పిన బ్రహ్మన్న, బ్రహ్మమొకటేనన్న అన్నమయ్య, విశ్వనరుడ నేనన్న జాషవా, మనుష్యుడే నా సందేశం అన్న శ్రీశ్రీ, వీళ్ల విగ్రహాలు విద్వేషానికి ధ్వంసం చేయడం ఏం సాదించడానికి? ఖైరతాబాద్ జంక్షన్‌లో విశ్వేశ్వరయ్య, ట్యాంక్‌బండ్ పక్కనే అంబేద్కర్ వీరిని కూడా ప్రాంతాల వారిగా చూద్దామా? కాటన్ మాకు ఆనకట్టలు కట్టాడా, కందుకూరి మా పెళ్లిల్లుచేశాడా అని అడగడంలో అమాయకత్వం వుందా అసహనం రగిలించే వ్యూహం వుందా? విగ్రహాలదేముంది అని తీసిపారేయదలిస్తే అప్పుడు తెలుగు తల్లికి చెల్లిలాటి తెలంగాణా తల్లి వచ్చేదేనా? ఆ తెలంగాణా తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసిన వారిలో విభజన వాద నాయకులు వున్నారని పోలీసులు వెల్లడిస్తే మౌనం పాటించడంలో మతలబేమిటి? ఇదే శీర్షికలో తెలుగు తల్లి అనేది ఒక భావన, అని తల్లి అంటేనే విశ్వ జనీనమని అన్నందుకు కొందరు విరుచుకుపడ్డారే?
కేంద్రం సృష్టించిన సంక్షోభంలో ప్రధాన రాజకీయ పార్టీలు చదరంగం ఆడుతుంటే ఆ వైరుధ్యాలు విడమర్చి చెప్పవలసిన మేధావులనే వారు, కవులు కళా కారులు కూడా కొట్టుకుపోవడం విచారకరం. తెలంగాణా భాష అంటూ విడిగా వుందని అశాస్త్రీయ వాదనల నుంచి సహజ వైవిధ్యాన్ని వైరుధ్యంగా చూపించే కుటిల వాదనల వరకూ చాలా చాలా వస్తున్నాయి. ఉచ్చారణలో ఏ తేడాలున్నా తెలుగు భాష లిపి, సంసృతి అవిభాజ్యం, అదిలాబాదు నుంచి మహబూబ్ నగర్ వరకూ ఏకరూప సంసృతి ఉచ్చారణ ఏమీ వుండవు. యాదగిరి నరసింహస్వామి,కొమరవెల్లి మల్లన్న జాతరలు ఒక్కలా జరగవు. ఇప్పుడు కొన్ని ఛానళ్లలో కృత్రిమంగా వాక్యం చివర పదాలు మార్చేవారు తెలంగాణా సహజ పదజాలాన్ని కృతకం చేస్తున్నారు కూడా. సినిమాలలో భాషను తక్కువ చేశారని, మరెవరో కవులను తక్కువగా చూశారని విమర్శించదలిస్తే అలా చేసిన వారి కుసంస్కారాన్ని తప్పు పట్టాలి. నిజాం రాజు రాజకీయ అవసరాల వల్ల చారిత్రికంగా వచ్చిన ఈ తేడాలకు ఇప్పటి జనం కారణం కాదు.దోచుకోవడంలో ఏ ప్రాంతంలోని పెత్తందార్లు తక్కవ కాదు. వారిలో వారికి వుండే తేడాలతో జనానికి సంబంధం లేదు. అసమానతల వ్యవస్థలో తేడాలు ఎప్పుడూ వుంటాయి గాని వాటిపై చేయాల్సిన పోరాటాలు వేరు. సాంసృతిక ఆధిపత్యం అన్న మాటను అసందర్భంగా వాడటం స్వార్థపరులకే ఉపయోగం. సురవరం ప్రతాపరెడ్డి రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పోతన రాసింది ఆంధ్ర మహా భాగవతం. వారికి ఇప్పటి రాజకీయ అవసరాలు వ్యూహ ప్రతివ్యూహాలు తెలియవు. .గతమంతా ఎందుకు ఇప్పుడు కూడా గద్దర్‌ను తెలుగు వారందరూ తమ వాడిగా చూస్తారు తప్ప ఆయన పుట్టిన వూరిని రాజకీయ భావాలను బట్టి పరిమితం చేయరు.
ఇప్పుడు మనం ఏం కావాలంటే అలా చేయొచ్చు. పాలక వర్గీయులు ఏదో నిర్ణయం తీసుకుంటున్నట్లు నమ్మించవచ్చు. కొయ్య గుర్రంపై స్వారీ చేస్తూ వేల మైళ్ల వేగంతో దూసుకుపోతున్నట్టు నటించచ్చు. కాని. అవకాశవాదుల,అరాచక శక్తుల హానికర పోకడలను గమనించకుండా అస్తిత్వ వాదం పేరుతో వారిని భుజాన మోయడం ఆందోళన కరం. ప్రాణాలపట్ల విలువున్న వారెవరూ ఆత్మహత్యలను ఊతపదంగా వాడరు. ఆ గుండెకోత అందరిదీ. అందుకు బాధ్యత అందరిదీ. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పాదాలు పాలతో కడుగుతామని ప్రకటించడంలో లేని ఆత్మ గౌరవ సమస్య వందల ఏళ్లనాటి మొల్లతోనో ఎర్రా ప్రెగడతోనో కందుకూరి వీరేశలింగంతోనే రావడం వెనక వున్నది రాజకీయమే.. విగ్రహాల విధ్వంసంపై నిఘా వర్గాల స్పష్టమైన నివేదికలను ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమే లేదు. తర్వాత నమోదు చేసిన కేసులపై వస్తున్న ఆరోపణలకూ వివరణా లేదు. సీమాంధ్ర తెలంగాణా పేర్లతో ఇరువైపులా శక్తి కొద్ది మాట్లాడే నేతల విన్యాసాలకు అంతు లేదు. ఈ స్వకీయ వ్యూహాలు విరమించేంత వరకూ తెలుగు వెలుగులపై దాడి జరుగుతున్నట్టే భావించాలి. ఈ విలువల విధ్వంసాన్ని ఒక పాఠంగా తీసుకోవడం అందరికీ మంచిది. అంతేగాని ఎక్కడెక్కడ బొమ్మలు పడగొట్టారో ఏకరువు పెట్టి సమర్థించుకోవడం మొదలెడితే రేపు ఇదే అరాచకం తమపైకి మరలవచ్చు.అసహనం వల్ల కలిగే అనర్థమే అది. అయితే చైతన్యవంతులైన తెలుగు ప్రజలు అన్ని రకాల అవకాశవాదాలకూ సమాధానమివ్వడం త్వరలోనే చూడొచ్చు.
ఎడిట్ పేజి,ఆంధ్రజ్యోతి
"మన బాధలన్నిటికీ యూదులే కారణం, వారిని అంతమొందించండని" హిట్లర్ అనగానే, మొత్తం జర్మన్ ప్రజలు గుడ్డిగా ఎలా నమ్మారా..? అనే సందేహం ఉన్నవారికి ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కొంత సమాధానం ఇస్తాయి. కొందరు నాయకులు తమ స్వార్థం కోసం, కొన్నేల్ల పాటు యదేచ్చగా, పిట్టకథలు,పొడుపు కథలతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ, ప్రజల్లో విద్వేషాగ్నుల్ని రగుల్చుకుంటూ పోతుంటే.. మిగతా నాయకులు తమకేం పట్టనట్లు చూస్తూ ఉండటమో, లేకపోతే పొత్తులతో ఆ విద్వేషాగ్నుల్లో చలికాచుకోవటానికో ప్రయత్నిస్తే, అంతిమంగా ఇలాంటి పరిస్తితులు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు. విగ్రహాల ధ్వంసం కన్నా, దానిని సమర్థించుకునే చర్యలు, దానిని కూడా తమ రాయకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నాలే ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి. మీరన్నట్లు -"చైతన్యవంతులైన తెలుగు ప్రజలు అన్ని రకాల అవకాశవాదాలకూ సమాధానమివ్వడం త్వరలోనే చూడొచ్చు" అని ఆశించటం మినహా వేరే మార్గం లేదు.
ReplyDeleteరవి గారూ,
ReplyDeleteవిగ్రహాల విధ్వంసం మీద మీ విశ్లేషణ చాలా వాస్తవికంగా ఉంది. తెలంగాణా సమస్య, ఆ మాటకొస్తే భారత దేశానికి సంబంధించిన ఏ రాజకీయ సమస్య పైన అయినా అమెరికాలో ప్రసారం అయే టీవీలలోనో, అంతర్జాల పత్రికలు చదవడం వలనో తప్ప స్థానికులకి ఉండే అవగాహన మాకు లేక పోయినా, ఈ విధ్వంసక చర్యల ఎటునుంచి ఎటు చూసినా సర్వత్రా ఖండింఛదగినదే. బాబ్రీ లాగే ఇది కూడా బహుశా రాజకీయ ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు అనిపిస్తోంది.
అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీ నైన్ వారి న్యూస్ వాచ్ లో చూస్తూ ఉంటాను. మీ విశ్లేషణలు చాలా బావుంటాయి....
మీ బ్లాగ్ ఈ వారంలోనే మొదటి సారిగా చూశాను. ఇదివరలో మీరు మహాకవి శీశ్రీ గారి మీద వ్రాసిన వ్యాసం చదివాను. చాలా బావుంది. ఆ మహానుభావుడు 1981 లో మా ఇంట్లో, ఒకే ఒక్క రోజులో "సిప్రాలి" పద్యాలన్నీ వ్రాసి ఇవ్వడం, ఆ వ్రాతపతిని ఒక పుస్తకంగా ప్రచురించడం నా జీవితంలో ప్రధానమైన ఘట్టం. ఆ పుస్తకాన్ని ఆయన శతజయంతి సందర్భంగా 2009 లో, సరోజా శ్రీశ్రీ గారి ముందుమాటతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున పున:ప్రచురించాం. మీ వ్యాసం చదవగానే ఆ నాటి విషయాలన్నీ మళ్ళీ, మళ్ళీ గుర్తుకొచ్చాయి. నా ధన్యవాదాలు.
---వంగూరి చిట్టెన్ రాజు
హ్యూస్టన్, టెక్సస్
రాజు గారూ,
ReplyDeleteమీ గురించి వినడం, చదవడం జరుగుతున్నది గాని కలవలేదు. శ్రీశ్రీ సాహిత్యం సమకాలీనత అన్న 64 పేజీల పుస్తకం వొకటి గతంలో రాశాను. అది పలు ముద్రణలు పొందింది. గత డిసెంబర్‌లో 'శ్రీశ్రీ జయభేరి' జీవితం సాహిత్యం రాజకీయాలు పేరుతో 350 పేజీల పుస్తకం రాశాను. ఇది కూడా త్వరలో పునర్ముద్రణ రావచ్చు. ఇందులో శ్రీశ్రీకి సంబంధించిన వివిధాంశాలు క్రమ పద్దతిలో ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇండియా టుడేలోనూ ఈనాడులోనూ మంచి సమీక్షలు కూడా వచ్చాయి. ఈ పుస్తకంలో ఆయన చికాగో ప్రసంగం కూడా వుంటుంది. మేము సాహితీ స్రవంతి పక్షాన గత తొమ్మిదేళ్లుగా నడుపుతున్న సాహిత్య పత్రిక ప్రస్థానం వెబ్‌సైట్‌లో మీకు దీనిపై మరిన్ని వివరాలు తెలుస్తాయి. మీ ఆసక్తికి అభినందనలకు ధన్యవాదాలు.
రవిగారూ,
ReplyDeleteప్రపంచములో విమర్శ చేయటం అంత తేలికపని మరొకటి లేదని నమ్ముతాను. నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధిస్తే క్షంతవ్యుడను.
ప్రత్యేక తెలంగాణ విషయలో తెలుగుజాతికి ప్రచార మాధ్యమాలు చేసినంత హాని మరెవ్వరూ చేయలేదని నా అభిప్రాయం. తమ విధిని, పరిధిని ఏనాడయితే విస్మరించారో ఆనాడే జాతికి గ్రహణం పట్టింది. మేధావులుగా ప్రకటించేసుకుని తమ సొంత విధానాలను ప్రజలపై రుద్దితే ఏమి జరుగుతుందో అదే జరిగింది విగ్రహాల ధ్వంసకాండలో..
తాము పెంచిన వట వృక్షం తమ మీదకే తెగబడేసరికి ఈ మధ్య ఆంధ్రజ్యోతి సంపాదకవర్గం ఏవిధంగా వగచిందీ, ఎందరో చీకటి బ్రతుకులనిబయటపెట్టిన ఓ పేరు గొప్ప పత్రిక సంపాదకుడు సాటి పాత్రికేయులపై ఏ విధంగా దాడికి తెగబడిందీ తెలుగు ప్రేక్షకులంతా తనివితీరా వీక్షించారు.
ఓ పెట్టకథ చెబుతాను. వెనుకటికి పోటెత్తిన గోదారమ్మ తనతో ఓ కుక్కని తీసుకెళుతోదంట. జాలిపడ్డ ఓ బాపనయ్య బయటకి తీయబోతే పళ్ళన్నీ దిగబడేలా కరిచిందంట. తెలంగాణ విషయములో పాత్రికేయులుగా చలామణి అవుతున్న ప్రతిఒక్కరికి వర్తిస్తుంది.
నరంలేని నాలుక తెలుగుతల్లిని పట్టుకుని ఎవని తల్లి? ఎవనికి తల్లి అని వాగిన నాడు ఏకి వదిలి ఉంటే ఈనాడు తెలుగుజాతికి ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు.
అచంగ, ప్రెస్టన్, యు.కె.