Pages

Monday, March 3, 2014

ఊహించిన మలుపు






టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయబోవడం లేదని కె.చంద్రశేఖర రావు చేసిన ప్రకటన గత కొద్ది రోజులుగా వస్తున్న కథనాలకు అనుగుణంగానే వుంది. గత వారమంతా చర్చల్లో అదే చెబుతూ వచ్చాను. కెసిఆర్‌ సకుటుంబంగా సోనియా గాంధీని కలిసిన రోజు వరకూ కూడా విలీనంపై విస్పష్టమైన ప్రకటన గాని సూచనలు గాని చేయకుండా జాగ్రత్త పడ్డారు. దీనిపై మా వంటి వారి అభిప్రాయాలు కూడా ఆ కారణంగానే మార్చుకోవడం కూడా సంభవించింది. ఇప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగేలా చేసిందంటున్నారు గాని అందుకు వారు సిద్ధమైనట్టే కనిపిస్తుంది.కాంగ్రెస్‌ ఇప్పటికే దారుణంగా దెబ్బతినిపోయి వుంది గనక ఏ మాత్రం మేలు జరిగినా లాభం కింద లెక్కవేసుకునే పరిస్థితి. టిఆర్‌ఎస్‌ విలీనం కాకుండా విడిగా వుండటాన్ని బహుళపక్ష ప్రజాస్వామ్యం కోరేవారు సాధారణంగా ఆహ్వానిస్తారు. అయితే అస్తిత్వం నిలబెట్టుకోవాలని చేసిన ఈ నిర్ణయం గొప్ప వ్యూహాత్మక దెబ్బ అని చెప్పడం కూడా అతిశయోక్తి అవుతుంది. విలీనం వద్దే వద్దనుకుంటే ఇంతకాలం తమ శ్రేణులను కూడా అనిశ్చితికి గురి చేయడమెందుకు? టిఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలలో తప్ప మరే సందర్భంలోనూ గొప్ప బలనిరూపణ చేసుకున్నది లేదు. ఇప్పటి స్థితి ఏమిటో భవిష్యత్తు చెప్పాలి. పొత్తులపై కమిటీ అంటూనే ఏమి ఆలోచిస్తున్నది చెప్పకుండా దాటవేశారు ఇక ముందు కూడా వూహాగానాలు కొనసాగడం, వూగిసలాటలు కనిపించడం అనివార్యం. పొత్తులకు ప్రాతిపదిక ఏమిటనేది కూడా చెప్పలేదు గనక ఇది ఎప్పుడు ఎలాగైనా వుండొచ్చన్న మాట. చివరి నిముషం ప్రకటనలతో మలుపులతో కిక్‌ వుండొచ్చేమో గాని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు మాత్రం అయోమయం వుంటుందని కెసిఆర్‌ గ్రహిస్తున్నట్టు కనిపించదు. తమ కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పుకునే అవకాశం ఇక్కడ, టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నది మేమేనని అక్కడ ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ వ్యూహ రచన చేయొచ్చు. తెలంగాణా వరకైనా దీని ప్రభావం ఎంత వుంటుందనేది చూడాల్సిన విషయం. 

No comments:

Post a Comment