Pages

Thursday, March 6, 2014

గులాబీ అనిశ్చితి

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అనిశ్చితి తొలగిపోయింది గాని తెలంగాణా రాష్ట్ర సమితి శ్రేణులలో అనిశ్చితి కొనసాగుతున్నది. కొత్త రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఖరారైనప్పటికీ దానికోసం ఉద్యమంలో ముందున్నామనే టిఆర్‌ఎస్‌లో రాజకీయంగానూ ఎన్నికల వ్యూహం పోటీల రీత్యానూ గందరగోళం వుందనే వాస్తవాన్ని ఆ పార్టీ ముఖ్యులు కొందరు అంగీకరిస్తున్నారు. పన్నెండేళ్ల ఉద్యమ ఫలితం లభించినప్పటికీ వుండాల్సిన సంతోషం విశ్వాసం లేవంటే అందుకు కారణం అధినేత వ్యవహార సరళి మాత్రమేనని కొందరు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు.
కాంగ్రెస్‌ విలీనంపై ఎడతెగని వూహాగానాలకు అవకాశమిచ్చింది తమ అద్యక్షుడేనని విలీనం వుండదని ఆయన చెప్పిన తర్వాత కూడా విశ్వసించడానికి లేదని టిఆర్‌ఎస్‌ అత్యున్నత విధాన సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యులొకరు ప్రజాశక్తితో చెప్పారు. విలీనం లేదని చెప్పడం ప్రతిపక్ష పాత్ర మరొకరికి దక్కకుండా చేయడానికేనని టిఆర్‌ఎస్‌ విమర్శకులు కొందరు వ్యాఖ్యానించారు. అది నిజం కాకపోయినా రెండు పార్టీల అగ్రనేతలు కలిసి ఏదో గూడుపుఠాని నడిపిస్తున్నారు గనకనే దిగ్విజరు సింగ్‌ వంటివారు ఇప్పటికీ పొత్తు గురించి మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్‌ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌తో పొత్తు వుండబోదని అంతర్గత సమావేశంలో తమకు వివరించిన కె.చంద్రశేఖర రావు బహిరంగ వ్యాఖ్యలలో మాత్రం ఆ విధమైన స్పష్టత ఇవ్వలేదన్న మాట నిజమేనని కర్నె ప్రభాకర్‌ ఒక చర్చలో పాల్గొంటూ చెప్పారు. అయితే ఆ అవకాశం దాదాపు లేదనే తాము అనుకుంటున్నామని ఆయన వివరించారు.కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు తమను బెదిరించే ధోరణిలో మాట్లాడ్డం సుహృద్భావాన్ని దెబ్బతీసిందని అయినా ఓర్మి వహించామని ఆయన చెప్పారు. ఇందుకు భిన్నంగా మరో నాయకుడు మాట్లాడుతూ ఏదో ఒక అవగాహన లేకపోతే కాంగ్రెస్‌ నాయకులు అలాటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. జెఎసి నాయకుల్లో కొందరితో కాంగ్రెస్‌ నిరంతర సంబంధాలు పాటిస్తున్నది. టిఆర్‌ఎస్‌ను మళ్లీ దగ్గర చేర్చుకోవద్దని కొందరు స్తానిక కాంగ్రెస్‌ వాదులు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు వినతిపత్రాలు పంపుతున్నారు.
టిఆర్‌ఎస్‌ ఇంతకాలం ఉద్యమానికి నాయకత్వం వహించి వివిధ శక్తులను కూడగట్టినప్పటికీ పార్టీ యంత్రాంగం గానీ, ఎన్నికల్లో పోటీచేసే శక్తి గాని పెంచుకోలేకపోయిందని దాదాపు ఆ పార్టీలో చాలా మంది అంగీకరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలసకు ద్వారాలు తెరవడంలో బలంతో పాటు బలహీనత కూడా వ్యక్తమవుతున్నది. ఇంచుమించు సగం చోట్ల బలమైన అభ్యర్థులు లేరు. అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే వుంటాయి. పైగా ఈ పేరిట బయిటవారినెవరినో ఆహ్వానించడం వల్ల ఎప్పటినుంచో పనిచేసే మా వంటి వారికి అవకాశం లేకుండా పోతుంది. ఈ నిర్ణయాలన్నీ ఎవరు ఖరారు చేస్తారన్నది కూడా తెలియడం లేదు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో వచ్చినట్టే డబ్బులు చేతులు మారుతున్నాయనే భావన మా పార్టీలోనూ కనిపించడం మంచి పరిణామం కాదని టిఆర్‌ఎస్‌ ఆశావహులు అంటున్నారు. సోనియా గాంధీ గనక తెలంగాణా ఏర్పాటు ప్రకటించేందుకు చర్య తీసుకుని వుండకపోతే తమ తరపున ఎవరెవరు పోటీ చేసి వుండేవారో వూహించలేనంత దారుణంగా వుండేదని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఉద్యమ పార్టీ నుంచి ఫక్కా రాజకీయ పార్టీగా మారిపోయినట్టు తమ నాయకుడు ప్రకటించాక ఉద్యమాల్లో ముందున్న తమ భవిష్యత్తు సంధిగ్గంలో పడకుండా ఎలా వుంటుందని ఆయన ప్రశ్నించారు.
సిపిఐ,న్యూ డెమోక్రసీలతో సీట్ల సర్దుబాటుకు చర్చలు జరుగుతున్నట్టు టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కొన్నిసీట్ల గుర్తింపు కూడా జరిగిందని అంటున్నారు. అయితే న్యూ డెమొక్రసీ సూటిగా సర్దుబాటు చేసుకుంటుందా లేక పోటీ నివారణ జరుగుతుందా అనేది చూడాల్సి వుంటుంది. అలాగే మజ్లిస్‌తో టిఆర్‌ఎస్‌ సంబంధాలపై బిజెపి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమతో చేతులు కలిపే అవకాశం వారు పొగొట్టుకుంటారు అని బిజెపి నేత ఒకరు అన్నారు. కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ నిజంగా పోటీ పడి ఓట్లు చీల్చుకుంటే తెలుగుదేశం బిజెపి కూటమికి కొంత మేలు జరుగుతుందనే అంచనాలో వారున్నారు. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బిజెపి టిడిపిలు, నల్గొండ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, ఖమ్మంలో వైసీపీ ప్రభావం కూడా వుంటుందని అన్ని పార్టీలూ అంచనా వేస్తున్నాయి. రాజధాని ఆ పరిసరాలలో ఓటర్ల తీరు మరో విధంగా వుండొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఏకపక్షంగా దూసుకుపోగల మన్నధీమా టిఆర్‌ఎస్‌లో కనిపించకపోగా ఏం జరుగుతుందన్న దానిపైనా కొంత అనిశ్చితి నెలకొన్నది. తమకు తెలంగాణాలో యాభై సీట్లు వస్తాయని కొందరు 70 వరకూ వస్తాయని మరికొందరు అంచనాలు చెబుతున్నారు.అదే సమయంలో తెలుగుదేశం ఎంఎల్‌ఎలను మీరెప్పుడొస్తారంటే మీరు ఎప్పుడు అని సరదాగానూ నిజంగానూ అడుగుతున్న స్తితి ఆశ్చర్యం కలిగిస్తుంది.

No comments:

Post a Comment