చేగువేరా బొమ్మతో కనిపిస్తారుగనక.. ఆవేశపూరితంగా మాట్లాడతారు గనక.. పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తారనిఆయన అభిమానులైన లౌకిక ప్రజానీకం భావిస్తే వారందరికీ ఆశాభంగం కలిగిస్తూ తన జనసేనను నరేంద్ర మోడీ భజన సేనగా మార్చేశారు. జెండా తప్ప ఇంకా స్పష్టమైన ఎజెండా కూడా లేని ఈ పార్టీ వ్యవస్థాపకుడితో చర్చలు జరపడం ద్వారా మోడీ కూడా మిత్రుల కోసం ఎంతగా తహతహలాడుతున్నదీ బయిటపెట్టుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిపోయాక ఎన్నికల ప్రకటన కూడా వెలువడ్డాక నాటకీయంగా తెరమీదకు వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ పేరును జెండాను మాత్రం ఆవిష్కరించి విధానాలు తర్వాత చెబుతామన్నారు. తొలి ప్రసంగంలో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్నప్పుడు దాని సారాంశం బిజెపి ఉఠావో అన్న చందంగా మారుతుందని అందరికీ ఆర్థం కావడానికి వారం కూడా పట్టలేదు! అన్నగారైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌లో లీనం చేయడానికి ఇంచుమించు రెండేళ్లు తీసుకుంటే తమ్ముడు అసలు పూర్తిగా పార్టీని ఏర్పాటు చేయకుండానే కాషాయ సేనతో కలుపుతున్నారు! స్వప్న సుందరి హేమమాలిని నుంచి బుల్లితెర నటీమణి సృతిఇరానీ వరకూ శతృఘ్న సిన్హా నుంచి కోట శ్రీనివాసరావు వరకూ బిజెపిలో కలసిన నటీనటులు వున్నారు గాని పవన్ కళ్యాణ్ వ్యవహారం మరింత దారుణం. జనాకర్షక పదాడంబరంతో కృత్రిమ ఆగ్రహావేశాలతో యువతను లక్ష్యంగా పెట్టుకుని బయిలుదేరిన ఈ నటుడు నేరుగా వెళ్లి నరేంద్ర మోడి ముందు మోకరిల్లడం ఆ విశ్వాసాన్ని వమ్ము చేయడం తప్ప మరొకటి కాదు. విభజనకు ప్రధానంగా సహకరించిన బిజెపిని ఆ అంశంపైనే ఆశ్రయించడం ఎంత విచిత్రం?
కాంగ్రెస్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకోవడం వరకూ ఓకే. కాని అవినీతితో సహా ఎందులోనూ దానికంటే
భిన్నం కాకపోగా అదనంగా మతతత్వం అనే అనర్థానికి కూడా ప్రాతినిధ్యం వహించి ప్రజ్వలింపచేస్తున్న బిజెపి నేత అంతకన్నా ఎలా మెరుగవుతాడు? నారాజు కాకుండా మత సామరస్యాన్ని కాపాడుదామని ఒక చిత్రంలో సందేశమిచ్చిన పవన్ కళ్యాణ్‌కు గుజరాత్ మారణహౌమం సూత్రధారులూ పాత్రధారులూ ఎవరో తెలియదా? ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతర ప్రభావాలు దేశ సమగ్రతకు ముప్పు కావచ్చంటున్న ఆయనకు అసలు మతమారణహౌమం ఈ దేశ మూలాలనే తొలిచేస్తున్న సంగతి అర్థం కాలేదా? పార్టీ విధాన ప్రకటనకు ముందే ఓటు బ్యాంకు రాజకీయాలన్న మాటతో ప్రకటన విడుదలైనప్పుడే అందులో సంఘ పరివార్ వాదనలు ప్రతిధ్వనించాయి. మరోసారి మతతత్వ చెలిమి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు కితాబులు ఇవ్వడంలోనూ ఈ చాయలు కనిపించాయి. అవి పూర్తిగా వాస్తవమేనని తాజా పరిణామాలు నిరూపించాయి. పైగా లోక్‌సత్తాతో కలసి నాలుగు పార్టీల మహాకూటమి ఏర్పడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రమాణాలు అత్యున్నత ఆదర్శాల గురించి ఊదరగొట్టిన వారికి మతోన్మాద మోడీలో అవన్నీ సాక్షాత్కరించడం దిగ్భ్రాంతికరం. లోక్‌సత్తా ప్రమాణాలతో పొసిగేది బిజెపి మాత్రమేనని జయప్రకాశ్‌నారాయణ్ లేఖ సుదీర్ఘంగా ఇచ్చిన వివరణ చూస్తే అసలా ప్రాతిపదికలు ఎంత అధ్వాన్యమైనవో బూటకమైనవో ఇట్టే తేలిపోతుంది. అణుఒప్పందాన్ని బలపర్చినప్పుడూ, చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలకు వంతపాడినప్పుడూ, సంక్షేమ పథకాలను బిచ్చంగా వర్ణిస్తూ సబ్సిడీలపై దాడిచేసినప్పుడూ లోక్‌సత్తా ధోరణి విపరీతంగా కనిపించి విమర్శలకు గురైంది. అది నేరుగా బిజెపి కూటమిలో చేరిపోతుందని కూడా అర్థమవుతున్నా అనేక మంది గ్రహించలేదు.
ఇక ఈ మొత్తం శక్తులను ముందు పెట్టుకుని తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ తంత్రం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే వుంది. సీట్ల లెక్కలు సిఎం పదవిపై పేచీల వంటివి కొలిక్కి రాకపోయినా కమలాన్ని సైకిలెక్కించుకోవడం ఖాయమని అర్థమవుతూనే వుంది. ఎందుకంటే ఉభయులదీ అన్యధా శరణం నాస్తి అన్న స్థితి. ఈ ప్రహసనంలో తాజా చేరిక నాటకీయ కలయిక పవన్ కళ్యాణ్ జనసేన! స్వంత పార్టీలో పితామహుడి వంటి అద్వానీనే గౌరవించకుండా ఆయన స్థానానికి ఎసరు పెట్టిన మోడీ తమను బతకనిస్తారని కొన్ని ప్రాంతీయ పార్టీలూ కొత్త సేనలూ కలలు కనడం అర్థరహితం. భిóన్న మతాలకు జాతులకు నిలయమైన ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య ప్రాథమిక అవసరం. తక్షణ అవసరాలకోసం కొందరు వాటి విషయంలో తప్పుచేసినా విజ్ఞులైన ప్రజానీకం తప్పనిసరిగా పాఠం చెబుతారు.
No comments:
Post a Comment