Pages

Thursday, July 14, 2011

ఆజాద్‌ వ్యాఖ్యలు- అనంతరం....

ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించి కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అనిశ్చితిని అధికారికంగా కొనసాగించదల్చుకున్నట్టు స్పష్టం చేశాయి. ఇంచుమించు గత రెండేళ్లనుంచి ప్రజల మనోభావాలతో దాగుడు మూతలాడుతున్న కేంద్ర బాధ్యతా రాహిత్యానికి ఆజాద్‌ వ్యాఖ్యలు పరాకాష్ట అని చెప్పాలి. అయితే తాము సృష్టించిన సంక్షోభాలకు బాధ్యతను రాష్ట్రంలో రాజకీయ పార్టీలపైన, భిన్న ప్రాంతాలలో ప్రజలపైన మోపడానికి కూడా ఆజాద్‌ ప్రయత్నించిన తీరు హాస్యాస్పదమైందీ హానికరమైందీ కూడా. పనిలో పనిగా శ్రీకృష్ణ కమిటీని కూడా ఆయన తప్పు పట్టారు. ఆ కమిటీ ఏదో పరిష్కారం చూపిస్తుందనుకుంటే చూపించకపోవడం వల్లనే నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు మాట్లాడ్డం ఇంగిత జ్ఞానాన్ని పరిహసించడమే. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ తన దృష్టిలో ఏది ఉత్తమ పరిష్కారమో
చెప్పింది. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా సూచించింది.వాటిలో ఏదైనా ఎంచుకోవడానికి లేదా మరో మార్గం అనుసరించడానికి కేంద్రానికి అవకాశం వుంది. కాని కేంద్రం అవేవీ చేయకుండా ి్ట తన ప్రయోజనాల పాకులాటను కొనసాగిస్తూ ఇతరులపై నెపం పెడుతున్నది.
ఆజాద్‌ ప్రకటనకు ముందునుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణా సమస్య సున్నితమైందని, జటిలమైందని సమయం పడుతుందని చెప్పడం మొదలు పెట్టారు. రాష్ట్ర విభజన లేదా సమైక్యత అన్నది క్లిష్టమైన సమస్య అనడంలో సందేహం లేదు. కాని ఆ సంగతి చెప్పడానికి కేంద్రం ఇంత వ్యవధి తీసుకోవలసిన అవసరముందా? లోగడ పదే పదే పలు ప్రకటనలు చేసినప్పుడు కమిటీలు వేసినప్పుడు తెలియదా? డిసెంబర్‌ 9, డిసెంబర్‌ 23 ప్రకటనలు జనవరి 5 అఖిలపక్ష సమావేశం ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఈ మాట చెప్పడం బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనక కట్టిన చందంగా లేదా? ఎందుకంటే ఈ కొద్ది వారాలలో కేంద్ర నాయకులందరూ ఇంచుమించుగా కాంగ్రెస్‌ వైఖరి ఇంకా తేలలేదనే చెప్పారు. కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి ఈ సమస్యను క్యాబినెట్‌లో చర్చకు రాలేదని చెప్పారు. డిసెంబరు 9 ప్రకటన ప్రభుత్వం తరపున చేసినప్పటికీ కాంగ్రెస్‌ వైఖరి ఇంకా నిర్ణయం కాలేదని చిదంబరం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తెలుగు దేశం వైఖరి చెప్పకుండా ఈ సమస్య పరిష్కారం కాదని, అన్ని పార్టీలూ వస్తేనే అఖిలపక్ష సమావేశం జరుపుతామని కూడా ఆయనన్నారు. వివిధ ప్రాంతాల కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు బృందాలుగా కేంద్ర నాయకులను కలుస్తూ పరిస్తితి తమకు అనుకూలంగా వుందని ప్రజలకు చెబుతూ వచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీని, చిదంబరాన్ని ఆఖరుకు ప్రధానిని కూడా కలసి వచ్చారు. కలసిన ప్రతిసారి ప్రతివారూ ఆశావహంగా మాట్లాడుతున్నప్పటకి పై వారు మాత్రం వీరి వ్యాఖ్యలను ఆమోదించింది లేదు. ఇటీవలి కాలంలో క్రమేణా ఢిల్లీ పెద్దల మాటలు మారిన తర్వాత అనివార్యంగా తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఎలు అత్యధికులు రాజినామాలకు సిద్ధమైనారు. ఆ నిర్ణయం తీసుకున్న రోజున హైదరాబాదులో వున్న గులాం నబీ ఆజాద్‌ ఈ సమస్య ఇప్పట్లో తేలేది కాదని వ్యాఖ్యానించారు. కాని అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలైనట్టు ఇక్కడి కాంగ్రెస్‌ వాదులు భాష్యం చెప్పారు. అయితే ఆ భాష్యం సరైంది కాదని ఆ మాటలే మరో సారి బలంగా చెప్పడాన్ని బట్టి తేలిపోయింది. ఇదంతా కేంద్ర కాంగ్రెస్‌ బృహత్‌ వ్యూహంలో భాగమేనని అర్థమవుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభలో 'ఏకగ్రీవ' తీర్మానం లేకుండా విభజన సాద్యం కాదన్నది ఆజాద్‌ మాటల సారాంశం. అయితే రెండు ప్రాంతాలలో భిన్నాభిప్రాయాలు బలంగా వున్నందున తెలంగాణా రాష్ట్రం కోరేవారి కాంక్ష ముందుకు కదిలే అవకాశం లేదని కూడా సూటిగానే చెప్పారు. రాజ్యాంగం 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర సరిహద్దుల మార్పు విలీనం విభజన పేరు మార్పు ఏది జరగాలన్నా పార్లమెంటులో బిల్లు ఆమోదించాలి. అయితే ఆ బిల్లు ప్రవేశానికి రాష్ట్రపతి సిఫార్సు చేయాలి. దానికన్నా ముందు సంబందిత శాసనసభ అభిప్రాయం( ఆమోదం కాదు. అనుకూలంగా లేక ప్రతికూలంగా ఏదైనా సరే) తెలుసుకున్నాకే రాష్ట్రపతి సిఫార్సు చేయాలి. తర్వాత ఆ బిల్లును కేంద్రం కోరుకున్న రూపంలో ప్రవేశపెట్టవచ్చు. ఇది రాజ్యాంగం చెప్పే మాట. ఇప్పటివరకూ ఏర్పడిన రాష్ట్రాల విషయంలో అనుసరించిన మార్గం కూడా. కనక ఆజాద్‌ చెబుతున్నట్టు ఏకగ్రీవ తీర్మానం అవసరం లేదు గాని చర్చ జరిగి అభిప్రాయాలు తీసుకోవడం మాత్రం తప్పని సరి. డిసెంబరు 9 ప్రకటనలో రెండవ వాక్యంలో చెప్పింది అదే. అయితే ఆ మాట తనకు చెప్పలేదని ఢిల్లీ వెళ్లి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టంగా ప్రకటించారు.తర్వాత రాజీనామాలు వగైరాలతో పరిస్తితి మారిపోయిందని డిసెంబరు 23 ప్రకటనలో చిదంబరం పేర్కొన్నారు. ఈ రెంటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పుడు అంటున్నారు. ఇది మొదటే చెప్పకుండా ఇంతకాలం నాన్చడం ఎందుకు? ఇప్పుడైనా సూటిగా తమ నిర్ణయం చెప్పకపోవడమెందుకు? తద్వారా విభిన్న ప్రాంతాల ప్రజల మద్య స్పర్థను పెంచడం తప్ప మరో కారణమేలేదు.
వైఎస్‌రాజశేఖరరెడ్డి మరణానంతరం పార్టీలో ఏర్పడిన కల్లోలాన్ని అధిగమించేందుకు అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే అధిష్టానం ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోసింది. తనే సంక్షోభాన్ని సృష్టించి ఉపయోగించుకుంది. రాష్ట్రాన్ని అనిశ్చితికి గురి చేసి అధికారం కాపాడుకుంది. అందులో భాగంగా రకరకాల రాజకీయ ప్రహసనాలు నడిపింది. ఈ క్రమంలో తమ వారే రెండు చోట్ల రెండు విధాల మాట్లాడటాన్ని అనుమతించింది. మరో పాలకపక్షమైన తెలుగు దేశంకూడా అదే వ్యూహాన్ని అనుసరించి ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ సందర్బంలో టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ కన్నా తెలుగుదేశంపై ఎక్కువగా దాడి కేంద్రీకరించి పునాది విస్తరించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చింది. విభజనకు అనుకూలంగా వ్యతిరేకంగా సాగిన ఆందోళనల స్వభావంలోనూ తీవ్రతలోనూ తేడాలున్నప్పటికీ ఇరువైపులా పాలక పక్షాల ద్వంద్వ భాషణంలో మాత్రం తేడాలు లేవు. పైగా కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా వుందన్న భావన బలపడటానికి దోహదం చేశారే తప్ప పాలక వర్గాల కుటిల నీతిని ప్రజలకు తెలియజెప్పడానికి సిద్దం కాలేదు. అధికార కేంద్రీకరణ అత్యధికంగా వున్న భారత దేశంలో రాష్ట్రాల ప్రజలతో చెలగాటమాడే అఖిల భారత పాలక పక్షాల నిజ స్వరూపాన్ని గమనించకుండా ఇది తెలంగాణా సీమాంధ్ర అన్న ప్రాంతీయ రేఖల చుట్టూ పరిభ్రమింపజేశారు. అనేక సార్లు అవాంఛనీయమైన ఉద్రిక్తతలు వివాదాలతో అభద్రత తలెత్తడానికి కూడా ఇది కారణమైంది. ఏ ఘట్టంలో ఎవరు ఏ మేరకు పాత్రధారులన్నది పక్కనబెడితే ఈ ప్రాంతీయ ప్రజ్వలనాల ప్రధాన సూత్రధారి మాత్రం కేంద్రమేనన్నది నిర్వివాదాంశం.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ తెలుగుదేశం, కొత్తగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మినహాయిస్తే మిగిలిన పార్టీలన్ని తమ విధానాలను స్పష్టంగా చెప్పాయి. ఈ పార్టీలు మాత్రం రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతున్నాయి. రాజీనామాలు చేస్తే వెంటనే రాజకీయ పరిష్కారం వచ్చేస్తుందని అంచనాలు చెప్పిన వారు కేంద్రం వ్యూహాలను తక్కువ అంచనా వేశారని గతంలోనే ఈ శీర్షికలో చెప్పుకున్నాము. బిజెపి,సిపిఐ ఎంఎల్‌ఎలు కూడా రాజీనామా చేసి పరిస్తితి వేడెక్కడానికి కారణమైనారు. ఆ రాజీనామాల తర్వాతనే ఆజాద్‌ ఇలా వ్యాఖ్యానించడం యాదృచ్చికమేమీ కాదు. అలాగే తెలుగు దేశం ఈ ఘట్టాన్ని ఉపయోగించుకుని తెలంగాణాలో తన ఇబ్బందిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటే మరో వైపున ఆ పార్టీ నేతలు ఇతర చోట్ల చాలా తీవ్రభాషలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణా కోసం ఇక్కడ నిరాహారదీక్షలు చేస్తుంటే ఇతర చోట్ల నేతలు కవ్వించే ధోరణిలో మాట్లాడి వివాదాలు పెంచుతున్నారు. బిజెపి నేతలైతే ఈ సమస్యను ఉపయోగించుకుని ఇక్కడ బలపడాలనే ఆశతో సుష్మా స్వరాజ్‌ను కూడా రంగంలోకి తీసుకొస్తున్నారు. ఈ సమస్యపై మావోయిస్టులతో కూడా కలసి పనిచేయడానికి ఇబ్బంది లేదని కిషన్‌ రెడ్డి ప్రకటించడం గమనించదగ్గది. ఇరు ప్రాంతాలలో ఎవరి ఉద్యమం నిజమైంది ఎవరిది బూటకం అని పరస్పరం నిరంతరం నిందారోపణలు చేసుకోవడం జరుగుతున్నది.ఒకే ప్రాంతంలోని భిన్న పార్టీల ఎత్తుగడలు ఆధిపత్య వ్యూహాలు ఘర్షణ పడుతున్న స్తితి కూడా పెరుగుతున్నది. నిరాహార దీక్షలలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజీనామాల తర్వాత కాంగ్రెస్‌ స్వంత వేదికనుంచి ముందుకుపోయే సూచనలు కనిపిస్తుంటే పరిపాలన పూర్తిగా ప్రతిష్టంభనలో పడి పోయి అనిశ్చితి తాండవిస్తున్నది.
దేశమంతటికీ బాధ్యత వహించవలసిన కేంద్రం ఇలాటి సమయంలో రాష్ట్రంపై పరిష్కార భారం వేసి చేతులు దులుపుకోవడం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ముందు తన ఆలోచన చెప్పకుండా ప్రతిపాదన చేయకుండా ఇతరులను నిందిస్తే చెల్లుబాటు కాదు. రాజకీయ స్వార్థానికి రక్షా కవచంగా రాజ్యాంగ నిబంధనలను ఉటంకించి తప్పుకోవడమూ కుదరదు. అలాగే కేంద్రంపై భ్రమలు పెంచిన వారు, దాని పాచికలు పారడానికి కారకులైన వారు కూడా ఈ పరిణామానికి బాధ్యత వహించక తప్పదు. అందువల్లనే టిఆర్‌ఎస్‌ శిబిరంలోనూ ఆలోచనా పరులైన వారు అంతర్మధనానికి లోనవుతున్నారు. కేంద్రం ఇచ్చిన మాటలను అతిగా నమ్మామా అని ప్రశ్నించుకుంటున్నారు. అసంఖ్యాకమైన ప్రజా సమస్యలనుంచి దృష్టి మళ్లించేవిధంగా కేవలం ఒక్క అంశానికే పరిమితమై పోవడం సమర్థనీయం కూడా కాదు. ఆజాద్‌ వ్యాఖ్యలతో కేంద్రం పోకడ స్పష్టమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలే ప్రాంతీయ క్రీడల పరమార్థమేమిటో అర్థం చేసుకోవాలి. తమ భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు పాలకవర్గాలకు లేదని చాటి చెప్పాలి. ఈ మాటల లోతుపాతులను ఒక పరిణామ క్రమంలో చూడగలిగితేనే ఎవరైనా సరైన అంచనాకు రాగలుగుతారు. ఆజాద్‌ వ్యాఖ్యలను బట్టి పరస్పరం అపార్థాలు అగాధాలు పెంచేవారి ప్రచారాలకు లోనైతే మాత్రం అందరికీ నష్టమే కలుగుతుంది.
రాజీనామాలపై స్పీకర్‌ పరిశీలన, ప్రతిస్పందన, నిర్ణయం ఇవన్నీ కొన్ని వారాలు తీసుకోవచ్చు. పైగా సామూహికంగా ఇందరి రాజీనామాలను సులభంగా ఆమోదించడమూ తేలిగ్గా జరక్కపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య సుహృద్బావాన్ని కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. విజ్ఞులైన తెలుగు ప్రజానీకం గతంలో అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని చైతన్యం చాటారు. ఇప్పుడు రాష్ట్రంతో కేంద్రం ఆడుతున్న రాజకీయ చెలగాటానికి కూడా అదే విధంగా సమాధానమిస్తారని విశ్వసించవచ్చు. అందుకు కృషి చేయడమే ప్రజల శ్రేయస్సు కోరే వారందరి కర్తవ్యం.

3 comments:

 1. yes sir,
  really u says correct. telugu people face's more problems nd solved in previous history....
  also this problem will solved without any problem....

  ReplyDelete
 2. Ravi gaaru,

  I do not think it is proper to allow irrelevant comments like above on fellow journalists in your blog.
  Regards.

  ReplyDelete