Pages

Monday, September 10, 2012

సంకేతాలు తలకిందులు?



సెప్టెంబరు 10 వ తేదీలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరుగుతుందనే సంకేతాలు వున్నాయని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ గతంలో ప్రకటించారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఢిల్లీకి కూడా వెళ్లారు. జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌తో సహా అందరూ సంకేతాలు లేవని అంటే సన్నాసులకు ఎందుకొస్తాయి నాకే వస్తాయని ఎగతాళి చేశారు. అయితే 9వ తేదీన హైదరాబాదులోనే గులాం నబీ ఆజాద్‌ మరిన్ని సంప్రదింపుల తర్వాత గాని ఏమీ తేలదని స్పష్టంగా చెప్పారు. అంతకు ముందే ప్రధాని ఏకాభిప్రాయం లేదన్న పాత పాట వినిపించారు.తాజాగా హౌం మంత్రి షిండే మావోయిస్టుల కోణంలో సందేహాలు ప్రకటించారు. ఇవన్నీ జరుగుతుండగానే కాంగ్రెస్‌ ఎంపి మధు యాష్కి కూడా ఈ నెలలో ప్రకటన వచ్చే అవకాశం కనిపించడం లేదంటూ అందుకు ఇతర ప్రాంతాల ఎంపిలను తప్పు పట్టారు. సమస్య కేంద్ర దగ్గర అధిష్టానం దగ్గర పెట్టుకుని అందుకు ఇతరులను తప్పు పట్టడం ఒక విచిత్రమైతే వారిమీద ఆశలను కొనసాగించే సంకేత భాష మరీ విపరీతం.(దీని ఆధారంగా ఆ పార్టీకి సన్నిహిత భావన కలిగించడం మరింత విడ్డూరం) ఉద్యమ పార్టీలుగా ఇవన్నీ చెయ్యడం తమ ధర్మమన్నట్టు మాట్లాడేవారు ఉత్తుత్తిఆశలతో వూరించడం ఉద్యమ కారుల లక్షణం కాదని అంగీకరించరు. అంతేగాక కొత్త ఆశలను అల్లుతుంటారు. మామూలు విషయాలైతే అదో రీతి గాని ప్రజల ప్రాంతాల మనోభావాలతో మనో వేదనలతో ముడిపడిన సమస్యపై ఇదొక తంతుగా మార్చుకోవడం మాత్రం అసహజం, అవాంఛనీయం.ఇంతకూ కెసిఆర్‌ కంటే కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతల వైఖరి మరింత ఆందోళన కలిగిస్తుంది.

1 comment:

  1. కెసిఆర్ గారికి మాత్రమె కనిపిస్తున్నట్టుగా చెప్పబడుతున్న సంకేతాలను ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణా మార్చు కోసం జరుగుతున్న భారీ సమీకరణ ఇందుకు నిదర్శనం.

    ReplyDelete